తెలంగాణలోని పాలమూరు జిల్లాలో మన్ననూర్ గ్రామంలో శ్రీశైలం రహదారిని ఆనుకొని ఒక పాత భవనం కనిపిస్తుంది. ఈ భవనమే తెలంగాణా కాలాపానీ జైలు ( అడవిలో వర్షం నీరులో మట్టి కలిసి నల్లగా కనిపిస్తుంది ఆ నీటిని కాలాపానీ అని అంటారు జైలులో అలాంటి నీటిని త్రాగటానికి వాడుతారు కాబట్టి కాలాపానీ జైలుగా పేరు) ఈ జైలు నిజాం ప్రభుత్వం ప్రభుత్వ వ్యతిరేకులను శిక్షించడానికి ఉపయోగించిన జైలు. అండమాన్ లోని కాలాపాని జైలు తరహాలో ఇక్కడ కూడా ఇరుకైన గదులలో నించుంటే తల తగులుతూ కూర్చుంటే కాళ్లు జాపు కోలేని పరిస్థితి ఉన్న జైలు గదులలో ఖైదీలను ఉంచేవారు. దట్టమైన నల్లమల అటవీ ప్రాంతంలో అడవి జంతువులకు క్రూర మృగాలకు ఆలవాలమైన ప్రాంతంలో ఈ జైలు నిర్మించబడింది. నిజాం నిరంకుశ ప్రభుత్వం యొక్క క్రూరత్వానికి ఇది ఒక ప్రత్యక్ష సాక్షిగా ఉంది. అనేకమంది చరిత్రకారులు ఈ జైలును ప్రస్తావించారు.
ఈ జైలులో శిక్ష అనుభవించిన వారు నేరాలు ఘోరాలు చేసిన కరడుగట్టిన నేరస్తులేమీ కాదు, నిజాం నిరంకుశత్వాన్ని నిరాయుధులుగా ప్రతిఘటించిన పోరాటయొధులు. నిజాం మతతత్వ వైఖరి అందరికీ తెలుసు. ఆ సమయంలో హిందువుల కు అండగా, అరాచకత్వానికి వ్యతిరేకంగా ఆర్య సమాజం హిందూ మహాసభ ఎన్నో శాంతియుత పోరాటాలు చేసింది. ఎందరో ఆర్య సమాజీలు కేవలం హిందూ మార్గాన్ని బోధిస్తున్నారని ఇస్లాం మతాంతికరణ ప్రయత్నాలను అడ్డుకున్నారని క్రూరంగా చంపబడ్డారు. అటువంటి దుర్భర పరిస్థితులలో కూడా అనేకమంది కార్యకర్తలు తమ ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి పోరాటాన్ని కొనసాగించారు.
పండిత నరేంద్ర జి ఆ కోవకు చెందిన ఆర్య సమాజ కార్యకర్త, నాయకుడు కూడా. ఆయన అనేక సభలలో ప్రసంగాలు చేసి ప్రజలను ఉత్తేజిత పరిచేవారు. అలా ఆయన ఒక సభలో ప్రసంగంలో ” హైదరాబాద్ సంస్థానం హిందువులకు ఒక పెద్ద జైలు లాగా ఉంది” అని అన్నందుకు ఆయనపై రాజద్రోహం నేరం ఆరోపించి ఈ మన్ననూర్ లోని కాలాపాని జైలులో దాదాపు మూడు సంవత్సరాల కు పైగా శిక్ష విధించారు. కఠిన పరిస్థితులకు ఆయన భయపడి లొంగిపోతారు అని నిజాం ప్రభుత్వం భ్రమపడింది, కానీ పండిట్ నరేంద్ర జీ మొక్కవోని దీక్షతో నిరాశ చెందకుండా ఈ నిజాం ఆకృత్యాలను ఎదుర్కొనే శక్తిని కోల్పోలేదు.ఆయన పోరాటానికి గుర్తుగా 1985లో ఆర్య సమాజం వారు ఈ జైలు ప్రాంగణాన్ని ప్రభుత్వం నుంచి తీసుకొని నరేంద్ర జీ కి గుర్తుగా స్మారక స్తూపాన్ని నిర్మించి, అప్పటినుంచి ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 17వ తేదీన భారతీయ జాతీయ పతాకమును ఎగుర వేసి, సభ జరుపుతూ ఉన్నారు.
17 సెప్టెంబర్ 2024 న దక్షిణాపథా అధ్యయన సంస్థ పరిశోధక విభాగం వారు ఈ జైలును సందర్శించి చిరస్మరణీయమైన అప్పటి స్వాతంత్ర్య వీరులను స్మరించుకొని, వారి పోరాటాన్ని వారి త్యాగాలను ఇప్పటి పిల్లలకు యువతకు గుర్తుచేసి ఆ స్మరణీయులను కీర్తించాల్సిన అవసరాన్ని తెలియజెప్పారు.
చంద్రమౌళి కళ్యాణచక్రవర్తి
(వివరములు అందించినవారు శేఖర్, ఆర్యసమాజ్ మన్ననూరు)
More Stories
హైదరాబాద్ సంస్థానంలో రజాకారుల రాక్షసత్వాన్ని ఎదురించిన షోయబుల్లాహ్ ఖాన్ (ఆగష్టు 22, పుణ్యతిథి)
ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు
విద్యారణ్య స్వామి శృంగేరి పీఠాధిపతి, విజయనగర సామ్రాజ్య రాజ గురువు