నిరంకుశత్వం ప్రజలపై కత్తులు దూస్తే అక్షరమే ఆయుధమై ఎదిరించింది.సిరా చుక్క అక్షర రూపం దాల్చి లక్షలాది మెదళ్ళలో తిరుగుబాటుకు బీజాలు నాటింది. నిప్పు కణిక లాంటి అక్షరాలతో నిజాం వెన్నులో వణకు పుట్టించిన యోధుడు..
ఆ ధీరుడే.. హైదరాబాద్ విముక్తి కోసం ప్రాణాలనే పణంగా పెట్టిన తెలంగాణ నిప్పురవ్వ షోయబుల్లాఖాన్. అక్షరాన్ని అగ్నికణంలా మార్చి హైదరాబాద్ సంస్థానంలోని రజాకార్ల ఆగాడాలను ఎలుగెత్తి చాటుతూ నిజాం నిరంకుశ పాలనను షోయబుల్లా ఖాన్ సవాల్ చేశాడు.
1920లో జాతీయోద్యమం భారతీయులను ఉర్రూతలూగిస్తుంది. ఆ సమయంలో మహాత్మా గాంధీ దేశవ్యాప్త పర్యటన చేపట్టారు. ఆయన ప్రయాణిస్తున్న రైలు మహబూబాబాద్ రైల్వేస్టేషన్ మీదుగా సాగుతోంది. అక్కడ డ్యూటీలో ఉన్న రైల్వే కానిస్టేబుల్ హబీబుల్లా ఖాన్‌కి జాతిపిత దర్శన భాగ్యం కలిగింది. ఆ ఆనందంతో హబీబుల్లా ఖాన్ ఇల్లు చేరుకోగానే కుమారుడు పుట్టాడన్న శుభవార్త అందింది. ఆ రోజు 1920 అక్టోబరు17. సంతోషంతో బిడ్డను చూసిన ఆయన ‘అరే వీడు అచ్చం గాంధీజీ లాగే ఉన్నాడే …అవే కళ్ళు…అదే నుదురు..’అంటూ మరింత సంబరపడిపోయాడు. ఆ బిడ్డకు షోయాబుల్లా ఖాన్ అని నామకరణం చేసినప్పటికీ హబీబుల్లా ఖాన్ మాత్రం తన కుమారుడిని ప్రేమగా “షోయాబుల్లా గాంధీ” అని పిలిచేవారు.
షోయాబుల్లా బొంబాయిలో ఇంటర్మీడియట్ వరకు చదివి హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ నుండి బి.ఏ. డిగ్రీతో పాటు జర్నలిజంలో గ్రాడ్యుయేషన్ పూర్తిచేశారు.
హైదరాబాద్ సంస్థానంలో రజాకారుల రాక్షసత్వాన్ని ఎదురిస్తూ సామాన్యుడు మొదలుకొని ప్రతి పౌరుడూ సమరం సాగిస్తున్న రోజులవి. సరిగ్గా అప్పుడే ప్రజాస్వామ్య కాంక్షతో, జాతీయోద్యమ భావనతో, నిరంకుశ పాలనను ఎదురించే లక్ష్యంతో షోయాబుల్లా ఖాన్ ఉస్మానియా క్యాంపస్ నుంచి డిగ్రీ పట్టా చేతపట్టుకొని బయటకొచ్చాడు.
నైజాం సంస్థానంలో మంచి హోదా గల ఉద్యోగం లభించే అవకాశం ఉన్నా కూడా, నిరంకుశ పాలనని ప్రశ్నించడానికి జర్నలిజాన్ని ప్రధాన వృత్తిగా షోయబుల్లా ఖాన్ ఎంచుకున్నారు. నిజాం దురాగతాలకి వ్యతిరేకంగా, జాతీయోద్యమానికి చేయూతగా అక్షరాన్ని ఆయుధంగా మలిచి ప్రజల పక్షాన సమరం చేయాలనుకున్నారు. జాతీయ భావాలను ప్రోత్సహిస్తున్న ‘తేజ్ ‘ఉర్దూ వారపత్రికలో సబ్ ఎడిటర్ గా చేరాడు. నిజాం నిరంకుశత్యం గురించి, వారి తాబేదార్లు అయిన భూస్వాములు, రజాకారులు ప్రజలపై సాగిస్తున్న అమానుష కృత్యాలను విమర్శిస్తూ వ్యాసాలు రాయడం ప్రారంభించారు.
సహజంగానే తమ పాలనని ఎండగడుతున్న షోయాబుల్లాఖాన్ వ్యాసాలు నైజాం పాలకులకు రుచించలేదు. పాలకుల ఆగ్రహానికి గురైన ‘తేజ్ ‘ పత్రిక నిషేధించబడింది. ఆ తర్వాత ఆయన మందుముల నరశింగరావు ఆధ్వర్యంలో నడుస్తున్న ‘రయ్యత్’ ఉర్దూ పత్రికలో చేరి తన అక్షరానికి మరింత పదును పెంచి రచనలు కొనసాగించారు. ఆ కారణంగా, ఆయనకు అజ్ఞాత వ్యక్తుల నుండి బెదిరింపు లేఖలు వచ్చినప్పటికీ ఏ మాత్రం ఖాతరు చేయలేదు. చివరకు రయ్యత్ పత్రిక కూడా నిజాం ఆగ్రహానికి గురై మూతపడింది. అయినా అధైర్యపడని షోయాబుల్లాఖాన్ ప్రజల పక్షంగా నిరంకుశ పాలకుల మీద పోరాటం కొనసాగాలని ధృఢంగా సంకల్పించాడు.
తానే స్వయంగా జాతీయ పత్రికను ప్రారంభించడానికి షోయాబుల్లాఖాన్ పూనుకున్నాడు. తల్లి, భార్య నగలు అమ్మి బూర్గుల రామకృష్ణారావు ఇళ్ళు అద్దెకు తీసుకుని “ఇమ్రోజ్” అనే ఉర్దూ దినపత్రికను ప్రారంభించాడు. ఇమ్రోజ్ ప్రథమ సంచిక 1947 నవంబరు 15న వెలువడింది. ఆర్థిక ఇబ్బందులు చుట్టుముడుతున్న ఇమ్రోజ్‌ను ప్రజల పత్రికగా తీర్చిదిద్దాడు. నిజాం నిరంకుశత్వం, రజాకారుల మతదురహంకారం మీద అలుపెరగని పోరాటం చేశారు.
దేశానికి స్వాతంత్రం సిద్ధించి, సంస్థానాలన్నీ ఇండియన్ యూనియన్‌లో విలీనమయ్యాయి. కానీ జునాఘడ్, రాంపూర్, కాశ్మీర్ సంస్థానాలతో పాటుగా బ్రిటీష్ పాలకులతో స్నేహం నెరపిన నిజాం ఇండియన్ యూనియన్‌లో విలీనం కావడానికి నిరాకరించాడు. ఈ పరిస్థితుల్లో ఇమ్రోజ్ పత్రికా సంపాదకునిగా షోయాబుల్లా ఖాన్ హైదరాబాద్ సంస్థానాన్ని ఇండియన్ యూనియన్‌లో విలీనం చేయాలని కోరుతూ సంపాదకీయాలు రాశారు. జాతీయ ప్రయోజనాల దృష్ట్యా విలీన ఆవశ్యకతను వివరిస్తూ నిజాం నిరాకరణ వెనుక గల స్వార్ధ రాజకీయ ప్రయోజనాలను తూర్పార పడుతూ వ్యాసాలు ప్రచురించారు.
ఏడుగురు ముస్లిం మేధావులు విలీనానికి మద్దతుగా చేసిన తీర్మానాన్ని యధాతథంగా ప్రచురించి నిజాం గుండెలో రైళ్లు పరిగెత్తించాడు. హైదరాబాద్ సంస్థానం పరిధిలోని ప్రజలలో ఎక్కువ మంది ఉర్దూ చదువుకున్న వారు కావడంతో ఇమ్రోజ్ రాతల ప్రభావంతో రోజు రోజుకి విలీనానికి అనుకూలంగా మేధావులు, ప్రజలు స్పందించసాగారు.
1948 జనవరి 29 నాటి ఇమ్రోజ్ సంచికలో ‘పగటి ప్రభుత్వం-రాత్రి ప్రభుత్వం’ అను శీర్షికతో షోయాబుల్లా రాసిన సంపాదకీయం ధైర్యసాహసాలకు ఒక మచ్చుతునక. …”ఈనాడు గ్రామస్థులు ప్రభుత్వ తిరుగలిలో పిండి చేయబడుతున్నారు. ఇంత వరకు జరిగిన సంఘటనలు ప్రజల ఎదుట ఉన్నాయి. అరాచకం ఏవిధంగా రాజ్యం చేస్తోందో అందరికి తెలుసు. రజాకార్లు పగలు గాంధీ టోపీలు ధరించి గాంధీజీకి జై అనే నినాదాలు చేస్తూ, రాత్రి గ్రామాలను దోచుకుంటున్నారు. ఒక గ్రామీణుడు బాధతో ‘పగటిపూట ఒక ప్రభుత్వం, రాత్రి మరొక ప్రభుత్వం రాజ్యం చేస్తున్నది’ ఆన్న మాట సత్యదూరమేమీ కాదు..ఇతైహాదుల్ ముస్లిమీన్ కార్యకలాపాలపై ప్రభుత్వం ఆంక్షలు ఎందుకు విధించరాదు..?” అని ఆ సంపాదకీయంలో నిజాం పాలకుడిని ప్రశ్నించారు.
షోయబుల్లా అక్షరాలు నిజాం గుండెల్లోకి బుల్లెట్టులా దూసుకెళ్లాయి. దొరలకి, రజాకారులకి వాతలు పెట్టాయి. ఖాసిం రజ్వీ నుంచి బెదిరింపు లేఖ వచ్చింది. అయినా కూడా, షోయబుల్లాహ్ జంకు బొంకు లేకుండా అన్యాయం ఎక్కడ జరిగితే అక్కడికి వెళ్లారు. తన మానస పుత్రిక అయిన ఇమ్రోజ్ పత్రికని నిజాం వ్యతిరేక గొంతుకగా మార్చారు. ప్రజలలో మతాలకతీతంగా చైతన్యం పెరగసాగింది. దీంతో నిజాంను వ్యతిరేకిస్తూ వార్తలు రాస్తే చేతులు నరికేస్తామని 1948 ఆగస్టు 19న ఖాసిం రజ్వీ బహిరంగంగానే హెచ్చరించాడు. కానీ షోయబుల్లాఖాన్ వెనకడుగు వేయలేదు. సత్యాన్వేషణలో ప్రాణాలు పోవడం గర్వించదగ్గ విషయం అని సగౌరవంగా ప్రకటించి తన ధీరత్వాన్ని ప్రదర్శించారు.
ఆగస్టు 21 అర్థరాత్రి కాచిగూడ చౌరస్తాలోని ఇమ్రోజ్ పత్రిక ఆఫీసులో పని పూర్తి చేసుకుని తన బావమరిది ఇస్మాయిల్ ఖాన్‌తో కలసి షోయబుల్లాఖాన్ లింగంపల్లి చౌరాస్తాలోని తన ఇంటికి బయలు దేరారు. చప్పల్ బజార్ కు చేరగానే అకస్మాత్తుగా పదిమంది నిజాం ప్రభుత్వ గూండాలు షోయబుల్లా ఖాన్‌పై తుపాకి గుళ్ళ వర్షం కురిపించారు. ఆయన తుపాకి గుండ్లకు గురై, హంతక ముఠా నుండి తప్పించుకోవటానికి ప్రయత్నించారు. కానీ నిజాంకు చెమటలు పట్టించిన ఆ ధీరుని చేతులను నరికేశారు. మతోన్మాద చర్యలను, నిరంకుశత్వాన్ని నిరసిస్తూ సంపాదకీయాలు రాసిన షోయాబుల్లా ఖాన్ చేతులు తెగి హైదరాబాద్ నగరం నడిబొడ్డున పడ్డాయి. ఈ దాడిని అడ్డుకోబోయిన ఆయన బావమరిది ఇస్మాయిల్ ముంజేతిని దుండగులు దారుణంగా నరికేశారు. తుపాకీ చప్పుళ్లు విని ఇళ్లనుండి ప్రజలు బయటకు రావడంతో కిరాతకులు పారిపోయారు.
నెత్తుటి మడుగులో ఉన్న షోయబుల్లాఖాన్ ను ఉస్మానియా హాస్పిటల్ కు తరలించారు. ఆగస్టు 22 న తెల్లవారుజామున స్పృహలోకి వచ్చారు. మరణశయ్య మీద నుండి షోయబుల్లాఖాన్ ”మరణం అనివార్యం, చావునుండి ఎవరు తప్పించుకోలేరు. ఆ మరణం ఒక మంచి లక్ష్యం కోసమైతే గర్వించాలి. నేను దేశం కోసం మరణిస్తున్నందుకు నాతో పాటు మీరూ సంతోషించాలి” అని మనోధైర్యంతో తల్లిదండ్రులకు, భార్యకు ఉద్బోధించారు. నిజాం నిరంకుశత్వాన్ని తన రాతల ద్వారా ఎదురించిన షోయబుల్లాఖాన్ 28 ఏళ్ల యుక్తవయసులోనే ఆగస్టు 22 న అశువులు బాశారు.
తుది శ్వాస వరకు షోయబుల్లాఖాన్ నిజాం తన మతం వాడే కదా అని నిరంకుశ పాలనను సవాల్ చేయడం మానలేదు. రజాకార్లు తన మతస్తులే కదా అని వారి దారుణ కృత్యాలను ఎండగట్టడం ఆపలేదు. తన మత రాజ్యం ఏర్పాటు చేస్తామంటున్నారు కదా అని గుడ్డిగా మతమౌడ్య మాయలో పడలేదు.
హైదరాబాద్ సంస్థానం భారత్ లో విలీనం కావాలని, మతమౌడ్యం లేని ప్రజాస్వామిక పాలన రావాలన్నది షోయబుల్లాఖాన్ కల. దాని కోసం నడిరోడ్డు మీద తన ప్రాణాలనే బలి దానం ఇచ్చారు. లౌకిక, ప్రజాస్వామిక విలువల కోసం మతమౌడ్యంపై షోయబుల్లాఖాన్ సాగించిన వీరోచిత పోరాటాన్ని స్మరించి స్ఫూర్తి పొందుదాం.
సంకలనం శ్రీ రామకృష్ణ వెల్లంకి
More Stories
ఆంధ్ర కళా శిరోరత్న’కీర్తి శేషులువడ్డాది పాపయ్య”
కవి సామ్రాట్ శ్రీ విశ్వనాథ సత్యనారాయణ
ఆదిభట్ల నారాయణదాసు (జన్మతిథి ఆగష్టు 31)