ఆంధ్రదేశ చరిత్రలో దేవాలయాలు కేవలం పూజా కేంద్రాలుగా మాత్రమే కాకుండా, ఒక సమగ్ర సామాజిక–ఆర్థిక సాంస్కృతిక వ్యవస్థగా పనిచేసినవని శాసనాలు స్పష్టంగా తెలియజేస్తున్నాయి. అటువంటి మహత్తర వ్యవస్థకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన క్షేత్రమే అద్దంకి సమీపంలోని సింగరకొండ శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం.
ఈ క్షేత్రం విజయనగర సామ్రాజ్య కాలం నుంచీ ఆధునిక యుగం వరకు నిరవధికంగా కొనసాగుతున్న భక్తి, ఉత్సవ, సంగీత పరంపరకు కేంద్రంగా నిలిచింది.

సింగరకొండ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం –
శాసనాధారిత చరిత్ర.
క్రీ.శ. 1443లో, సింగరకొండపై ఉన్న శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో ఒక ముఖ్యమైన శాసనం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆ శాసనం ప్రత్యక్షంగా కనిపించకపోయినా, నెల్లూరు జిల్లా శాసనాల విభాగం ఈ శాసనాన్ని నమోదు చేసింది. ఆ కాలంలో అద్దంకి ప్రాంతం పరిపాలనా పరంగా నెల్లూరు జిల్లాలో భాగంగా ఉండటం గమనార్హం.
ఈ శాసనం విజయనగర సామ్రాజ్య పరిపాలకుడు రెండవ దేవరాయల (క్రీ.శ. 1424–1446) కాలానికి చెందింది. శాసనంలో ఆయనను వీరప్రతాప దేవరాయలుగా పేర్కొన్నారు. ఇది రాజు పుణ్యంకోసం వేయించిన ధర్మశాసనమని స్పష్టంగా తెలుస్తోంది.

రెండవ దేవరాయలు – రాజకీయ నేపథ్యం.
రెడ్డిరాజుల పాలన 1325లో ప్రారంభమై 1424 నాటికి క్షీణించింది. ఈ సమయంలో విజయనగర సామ్రాజ్యాన్ని రెండవ దేవరాయలు పరిపాలిస్తున్నారు.
వారు తీరాంధ్రంపై దండయాత్ర చేసి—
నర్సరావుపేట,అద్దంకి,
పొదిలి ప్రాంతాలను జయించారు.
1428లో కొండవీడును స్వాధీనం చేసుకుని తన రాజ్యాన్ని సింహాచలం దాకా విస్తరించారు.
సింహళదేశం నుండి గుల్బర్గా వరకు, ఓడ్రదేశం నుండి మలబారు తీరం వరకు రెండవ దేవరాయల సామ్రాజ్యం విస్తరించింది.
1444లో కపిలేశ్వర గజపతి దేవరాయలు తీరాంధ్రపై దండయాత్ర చేసినప్పుడు, రెండవ దేవరాయలు పంపిన మల్లపవడయ చమూపతి (దేవరాజయ వడయులు) అనే దళవాయి ఈ దురాక్రమణను సమర్థంగా త్రిప్పికొట్టాడు.
శాసనంలో పేర్కొన్న ధర్మకార్యాలు.
విజయయాత్రలో భాగంగా అద్దంకికి వచ్చిన దళవాయి, సింగరకొండ శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించి, తన ప్రభువు రెండవ దేవరాయల పుణ్యం కొరకు ధర్మం చేశాడు. ఈ ధర్మకార్యాల నిర్వహణకు సంబంధించిన వివరాలు మనూరి దేవళ చేత నిర్వహించబడినట్లు శాసనం తెలియజేస్తుంది.

శాసనం ద్వారా తెలిసిన ముఖ్య విషయాలు—
వసంతపున్నమి,తిరునాళ్ళు,18 శాఖల వైష్ణవులు
56 దేశాల నుండి వచ్చిన భక్తులు స్వామివారి మహోత్సవాలకు హాజరవుతుండేవారని స్పష్టమవుతుంది.
ఆ కాలంలో “దేశం” అనే పదం సమీప గ్రామ సమూహాలకు ప్రయోగించబడేదని పరిశోధకులు పేర్కొంటారు.
దేవాలయ ఆర్థిక వ్యవస్థ – శాసన పదాల విశ్లేషణ.
ఈ శాసనం ప్రాచీన దేవాలయ వ్యవస్థ ఎంత సమగ్రంగా పనిచేసేదో తెలియజేస్తుంది. అందులోని ముఖ్య పదాలు.
పెండ్లిరూకలు – స్వామివారి కళ్యాణ మహోత్సవానికి కేటాయించిన నిధి.
బండి బానిసలు –
వాహన సేవలు, సరుకుల రవాణా నిర్వహించే సేవకులు.
సుంకపు తలారి –
అమ్మకాలు, రవాణాపై పన్ను వసూలు చేసే అధికారి.
తీరువా / దేవలం.
తీరువా – రాజ్యానికి / దేవాలయానికి చెల్లించే పంట పన్ను.
కమతలారి కట్నం –
రాజ్య భూముల పన్నును దేవాలయానికి కానుకగా సమర్పించడం.
మానిధారాపూర్వక –
అత్యంత పవిత్రంగా ఆచారబద్ధంగా అంకితం చేయడం.
ఈ ఆదాయం ద్వారా—
కళ్యాణ మహోత్సవాలు
వాహన సేవలు
సేవకుల పోషణ
ధాన్యాలు
పట్టుచీరలు, విలువైన వస్త్రాలు
అన్నీ సమృద్ధిగా నిర్వహించబడేవి.

రెడ్డిరాజుల కాలం – దేవాలయ నిర్మాణంపై నిర్ణయం.
రెడ్డిరాజుల తొలి రాజధాని అద్దంకి (1325–1364). ఈ కాలంలో అనేక దేవాలయాలు వైభవంగా వికసించినప్పటికీ, ప్రోలయవేమారెడ్డి కాలంలో సింగరకొండ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం ఉన్నట్లు ఆధారాలు లేవు. వీరు అహోబిల నరసింహస్వామికి, శ్రీశైలానికి, పాతాళగంగకు మెట్లుకట్టారని తెలుస్తుంది.వారి ఆస్థాన కవి కవిత్రయంలో ఒకరైన ఎర్రాప్రెగ్గడ కూడా అహోబలనరసింహునిపై స్థుతించాడే తప్ప సింగరకొండ నృసింహస్వామి స్థుతించ లేదు .మీదుమిక్కిలి తన కావ్యాల్లో ఎక్కడా సింగరకొండ నృసింహ స్వామిని ప్రస్తావించలేదు.
రెడ్డిరాజుల శాసనాలలో
సింగరకొండ నరసింహుని ప్రస్తావన కనిపించలేదు కాబట్టి ఈ దేవాలయం విజయనగర కాలంలోనే నిర్మితమై ఉండవచ్చునని భావించవచ్చు..
గుహ, గుళ్ళకమ్మ, సంగమేశ్వర క్షేత్రం.
స్థానిక కథనాల ప్రకారం, దేవాలయం వెనుక గుహ ఒకప్పుడు గుళ్ళకమ్మ తీరంలోని సంగమేశ్వర దేవాలయానికి చేరే మార్గంగా ఉండేది. మునులు ఈ మార్గంలో స్నానమాచరించి స్వామిని సేవించేవారని చెబుతారు.
ఈ గుహలోనే నారాయణ తీర్థుల వారు 12 ఏళ్ళ పాటు తపస్సు చేసినట్లు గ్రంథాధారాలు పేర్కొంటున్నాయి.
శ్రీకృష్ణలీలా తరంగిణి – అద్దంకి పాత్ర.
శ్రీకృష్ణలీలా తరంగిణీ కీర్తనలను బహుళప్రచారం చేసిన పుణ్యభూమి అద్దంకి.
నారాయణ తీర్థుల వారి తరంగకాలక్షేపంతో పన్నెండేళ్ల పాటు అద్దంకిసీమ భక్తిరసంతో పులకించింది.
వారి శిష్యపరంపల నోట శృతిలయాన్వితంగా తరంగాలు నినదించాయి. ప్రభాత, సంధ్యా సమయాల్లో చుట్టుపక్కల అరవై గ్రామాల్లో ఇంటింటా కృష్ణలీలాతత్త్వం మార్మోగింది. అద్దంకి సాక్షాత్తు పండరీనాథక్షేత్రంగా, మరో బృందావనంగా ఖ్యాతి గడించింది.
నృసింహభక్తుల పరంపర – సింగరకొండ.
మహానుభావులు
పాలపర్తి నృసింహదాసులు.
1844లో పాలపర్రులో జన్మించిన ఈ మహానుభావుడు సింగరకొండలో నలభై రోజుల మహామంత్ర దీక్ష చేసి, లక్ష్మీనరసింహ స్వామి దర్శనం పొందారు. వాగ్గేయకారుడిగా ‘శ్రీ నృసింహ కీర్తనలు’ గ్రంథాన్ని రచించారు. 76వ ఏట భీష్మనిర్యాణంలా పరమపదించారు.
కామరాజు సింగరిదాసు.
భక్తిశిఖామణి కామరాజు సింగరిదాసు గారు లక్షీనృసింహనామస్మరణతో, కీర్తనలతో సింగరకొండ మహిమను ప్రజల హృదయాల్లో నిలిపిన మహానుభావుడు.
గ్రామజీవితంలో భక్తి సంగీతాన్ని నిత్యజీవనంగా మార్చిన సేవకుడిగా వీరి పాత్ర విశేషమైనది.
అద్దంకి వెంకటరాయుడు
నారాయణ తీర్థుల వారి తరంగ సంప్రదాయానికి అద్దంకిలో జీవస్వరూపమైనవారు అద్దంకి వెంకటరాయుడు. వీరి గొంతులో నినదించిన తరంగాలు అద్దంకి గ్రామాన్ని ఒక ఆధ్యాత్మిక గ్రామంగా మలిచాయి.
ఆధునిక కాల విశేషాలు.
లక్ష్మీనృసింహస్వామి వారి నూతన ధ్వజ ప్రతిష్ఠ సమయంలో దర్శించిన మహావెలుగు, ఆ వెలుగులో కనిపించిన మహాపురుష దర్శనం, ఉత్తరదిక్కున ప్రసన్నాంజనేయ స్వామి అవిర్భావం వంటి సంఘటనలు ఈ క్షేత్ర మహిమను మరింత ప్రతిష్ఠించాయి.
నేడు శ్రీ లక్ష్మీనరసింహస్వామి, శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయాలు భక్తుల కోర్కెలు నెరవేర్చే దివ్యక్షేత్రాలుగా విరాజిల్లుతున్నాయి.
సింగరకొండ శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం— శాసనాలు, రాజధర్మాలు, భక్తుల తపస్సులు, తరంగాల గానం—అన్నీ కలసి రూపుదిద్దుకున్నగొప్ప చారిత్రక, మహిమాన్విత చరిత్ర గల స్థలం సింగరకొండ.
ఇది కేవలం ఒక ఆలయం కాదు—
ఒక సజీవనాగరికతకు సాక్ష్యం.
-పుట్టంరాజు శ్రీరామచంద్రమూర్తి.
More Stories
గుడిమాన్యాన్ని కాపాడిన ‘సుదర్శనచక్రం’
శ్రీ అనంత పద్మనాభ స్వామి వారి దేవాలయం, వికారాబాద్
శ్రీకూర్మం దేవాలయము