శ్రీకూర్మం దేవాలయము

శ్రీ మహావిష్ణువు దశావతారాలలో రెండవ అవతారము శ్రీకూర్మ అవతారం. కూర్మ అవతారం లో స్వామికి ప్రపంచంలోనే ఉన్న ఏకైక ఆలయం శ్రీకూర్మం.

ఇక్కడ స్వామి వారిని దర్శించుకున్నవారికి శని గ్రహ దోషాలు, కుజ గ్రహ దోషాల తో పాటుగా, రాహు కేతు గ్రహ దోషాలు కూడా తొలుగుతాయి. ఇక్కడున్న శ్వేత పుష్కరిణిలో పితృకార్యం చేస్తే, వారికి మోక్షము కలుగుతుంది అని పురాణాలు చెప్తున్నాయి.

క్షేత్రంలో మన్ని ఆశ్చర్యపరచే ఎన్నో ప్రత్యేకత లు వున్నా యి. 108 దివ్య దేశాల లో ఒకటైన క్షేత్రంలో, స్వామి కూర్మనాధుకునిగా, శ్రీమహాలక్ష్మి కూర్మనాయకి గా వెలిశారు.దేవతలు, రాక్షసులు, అమృతం కోసం పాల సముద్రంలో మందర పర్వతాన్ని చిలకభోగా, పర్వతం  పాలసముద్రం మధ్య లో పడిపోయింది.

దానితో దేవతలు విష్ణు మూర్తిని ప్రార్ధించారు. ఆయన కూర్మరూపంలో అంటే తాబేలు గా మారి తన  వీపు మీద పర్వతాన్ని భరించి, అమృతోత్పాదనలో సహాయం చేసారు. అవతారాన్ని స్వామి జ్యేష్ఠ బహుళ ద్వాదశి నాడు స్వీకరించారని పద్మపురాణం చెబుతుంది. ఇలా శ్రీ మహావిష్ణు తీసుకున్న రెండవ అవతారమే కూర్మావతారం.

శ్వేత మహా రాజు తపస్సు కు మెచ్చిన శ్రీహరి ఇక్కడ కూర్మనాధునిగా, స్వయంభువుగా వెలిసారు. అలాగే ఆయన సుదర్శన చక్రం ద్వారా ఇక్కడ శ్వేత పుష్కరిణి ఏర్పడింది. పుష్కరిణి బిలం లోని మార్గం నుండి, లక్ష్మి దేవి కూర్మనాయకి గా వచ్చి ఇక్కడ వెలసినది.

ఆలయం లో స్వయంగా చతుర్ముఖ బ్రహ్మ గారు గోపాల యంత్రాన్ని స్థాపించారు. విషయము మనకు పద్మపురాణం ఆధారంగా తెలుస్తోంది.సాధారణంగా ప్రతి ఆలయానికి కేవలం ఒక్క ధ్వజస్థంభం మాత్రమే ఉంటుంది. కానీ ఆలయానికి రెండు ధ్వజ స్థంబాలు ఉంటాయి. దీనికి కారణం 11 శతాబ్దం లో భగవత్ శ్రీ

రామానుజాచార్యులు ఆలయం పశ్చిమ వైపు కూర్చొని కూర్మనాధుని ధ్యానించారు. ఆయన భక్తి కి మెచ్చిన స్వామి వారి మూలమూర్తి, కుడి వైపు నుండి పశ్చిమ ముఖంగా తిరిగిందిఅందు చేత రామానుజాచార్యులు పశ్చిమ వైపు మరియొక ధ్వజ స్థంబాన్ని ప్రతిష్టించారు.

ఇప్పటికీ మనకు ఇక్కడ స్వామి పశ్చిమ ముఖంగా తిరిగి, కూర్మ రూపంలో, సాలగ్రామ శిలగా దర్శనం ఇస్తారు.స్వామి ఆలయంలో ఎన్నో లక్షల సంవత్సరాల క్రితం వెలిశారని, అందుకే ఇక్కడ స్వామిని ఆది కూర్మ స్వామిగా పిలుస్తారని మనకు పురాణాలు చెబుతున్నాయి.

శ్రీమహావిష్ణువు సుదర్శన చక్రం ద్వారా శ్వేత పుష్కరిణి ఏర్పడిందిప్రతి సంవత్సరం మాఘ శుద్ధ చవితి నాడు, వారణాసి నుండి అంతర్వాహినిగా గంగాదేవి, పుష్కరిణి కి వచ్చిభక్తుల పాపాలను కడుగుతుంది.కూర్మనాధుకుని ని దర్శించడానికి లవకుశులు, బలరాముడు, దూర్వాసమహర్షి, ఆదిశంకరాచార్య, భగవత్ రామానుజాచార్యులు ఇక్కడికి వచ్చార ని స్థలపురాణం చెబుతుంది.

శ్రీకూర్మం ఆలయం ఎన్నో విశేషాలతో నిండివున్నది.

ఆలయ గర్భగుడి ప్రవేశము తూర్పు లేదా దక్షిణ ద్వారము ద్వారా చేయవచ్చు. ఆలయంలో ఎంతో అద్భుతమైన శిల్పకళతో 108 స్థంబాలు వున్నాయి. స్తంభము కూడా ఇంకొకదానిలా ఉండకపోవటమే వీటి ప్రత్యేకత. స్తంభాల మీద మనకి, పాలిలిపిలో రాయబడిన విషయాలు ఇప్పటికి కనబడతాయి.

అలాగే మరి ఇతర ఆలయాలలో లేని విధంగా, ఆలయంలో రెండు ధ్వజ స్థంబాలు ఉంటాయి. జమ్మూలోని శ్రీవైష్ణవదేవి ఆలయం మరియు శ్రీ కూర్మం ఆలయం లోనే విధంగా రెండు ధ్వజస్తంభాలు ఉన్నవి. ఆలయం లో ఉన్న రహస్య సొరంగ  మార్గం ద్వారా కాశికి చేరుకోవచ్చని ప్రతీతి.  

ఆలయంలో పెద్ద జీయర్స్వామి వారిచే నిర్మింపబడిన రామకోటి స్తూపం వున్నది.ఆలయంలో తాబేళ్ళకోసం నిర్మించిన పార్కుని కూడా చూడవచ్చు. స్వామి వారి దశావతారాల ఆయిల్ పెయింటింగ్ మరియు శిల్పాలు భక్తులను ఆకట్టుకుంటాయి. ఇక్కడ వున్న శ్వేత పుష్కరిణి లో పితృతర్పణం చేస్తే, అస్థికలు నీటిలో కొన్నాళ్లకు రాళ్ళ గా మారుతాయి.

భక్తుల కోసం శ్రీకూర్మం దేవస్థానం వారు నిత్యాన్నదానం నిర్వహిస్తున్నారు.