
మహబూబాబాద్ జిల్లా కేంద్రమునకు 9కి.మీ. దూరమున పూర్వపు వరంగల్ జిల్లా కేంద్రమునకు 70కి.మీ. రైలు మార్గమున, మహబూబాబాద్– మరిపెడ 365 జాతీయ రహదారి మార్గములో పెద్ద తటాకమునానుకొని కురవి మండల కేంద్రము నందు క్రీ.శ. 850 ప్రాంతములో వేంగిరాజధానిగా చేసుకొని పాలించు చాళుక్యుల సామంతులైన రాష్ట్రకూట రాజైన భీమరాజు ఈ కురవి (కురవి అనగా గోరింటాకు లేదా ఎరుపు అని అర్ధము) నగరమును రాజధానిగా చేసికొని పాలించుచున్న కాలములో శ్రీ వీరభద్రస్వామివారి ఆలయము నిర్మించినట్లుగా చారిత్రక ప్రతీతి. తదనంతరము కాకతీయ తొలి స్వతంత్ర రాజైన ఒకటవ బేతరాజు జీర్ణోద్ధరణగావించినట్లు ఆ తర్వాత రెండవ బేతరాజు ఈ కురవి నగరమునకు ఆనుకొనియున్న పెద్ద తటాకమును త్రవ్వించినట్లు తెలియుచున్నది.
సకలశక్తిమూర్తి, వరాల ప్రదాత అయిన శ్రీ వీరభద్రస్వామివారు పడమటముఖుడై దశహస్తుడై త్రినేత్రుడై రౌద్రపరాక్రమములతో విలసిల్లుతూ దక్షిణహస్తములలో ఒకటవ హస్తములో ఖడ్గము, రెండవ హస్తములో త్రిశూలము మూడవ హస్తములో పుష్పము, నాల్గువ హస్తములో గద, ఐదవ హస్తములో దండము, వామ హస్తములందు ఒకటవ హస్తములో ఢమరుకము, రెండవ హస్తములో సర్పము, మూడవ హస్తములో విల్లు, నాల్గువ హస్తములో బాణము, ఐదవ హస్తములో ముద్గరము ధరించి భక్తుల పాలిట కల్పతరువుగా, పిలిచిన పలికే దైవముగా వెలుగొందుచున్నాడు. సమస్తములైన భూత, ప్రేత, పిశాచ, గణాలు, శాకినీ, ఢాకినీ, కామినీ వంటి ప్రమధ గణ పిశాచాలు ఈయన అధీనము. రుద్రగణాలు ఈయనను సేవిస్తాయి. భక్తులకు విపత్కర సమయంలో దిక్కుతోచని పరిస్థితిలో భక్తులను ఆదుకొనే పరమభోళామూర్తి. సమస్త క్షుద్రగణాలకు వీరభద్రుడంటే పరమ భయం. స్వామిని తలంచిన వారికి, సేవించిన వారికి పిశాచ బాధలు, సర్వదోషాలు, క్షుద్ర శక్తులు దరిజేరవు. శ్రీ స్వామివారి కుడివైపు కొద్ది సమీపములో విజయగణపతి వెలసియున్నాడు. శ్రీ స్వామివారి పాదముల క్రింద నందీశ్వరుడు శ్రీ స్వామివారి వాహనముగా వెలసియున్నారు. శ్రీ వీరభద్రస్వామివారి ఆయుధం పేరు పట్టేశం.
శ్రీ స్వామివారికి ఎడమవైపు చతుర్భుజములు కలిగి శ్రీ భద్రకాళీ అమ్మవారు వెలసియున్నారు. శ్రీ భద్రకాళీ అమ్మవారికి కుడివైపు మొదటి హస్తమున త్రిశూలం, రెండవ హస్తములో స్వల్పసిద్ధితో హృదయాన్ని స్పందింపచేయునట్లుగా సదా అభయమిస్తూ వామహస్తములలో మొదటి హస్తములో పద్మము, రెండవ హస్తముతో భువిని శాశ్వతముగా నిలుపుమని ఆశీర్వదించినట్లు దర్శినమిచ్చుచున్నది. శ్రీ స్వామివారి మండపములో సమాంతరముగా ఇరువైపుల పరమశివుడు (లింగాకారములో) వెలసియున్నాడు. మండపములో దక్షిణ భాగమున సప్తమాతృకలు వెలసియున్నారు.
ఈ ఆలయమునకు దక్షిణ దిశలో ప్రాకారము బయట శ్రీ భద్రకాళీ అమ్మవారు. స్వయంవ్యక్తమూర్తిగా వెలసి భక్తుల కోర్కెలను తీర్చి అనేక పూజలందుకొనుచున్నది.
ఈ దేవాలయ వార్షిక జాత్ర బ్రహ్మోత్సవాలు మహాశివరాత్రి పండుగ సందర్భంగా జరుపుకుంటారు.
More Stories
శ్రీకూర్మం దేవాలయము
ఒంటిమిట్ట రామాలయం
ఐనవోలు మల్లన్న దేవాలయం