-రామకృష్ణ వెల్లంకి
‘మకర సంక్రాంతి‘ పండుగ అందమైన ముగ్గులకు, గొబ్బెమ్మలకు, హరిదాసు పాటలకు, బసవన్నల ఆటలకు, నువ్వుల మిఠాయిలకు, గాలిపటాలు ఎగురవేయటానికి, మరెన్నో సంబరాలకు ప్రసిద్ధి చెందింది. ఈ పండుగను ‘పంటల‘ పండుగ అని, మార్పు తెచ్చే పండుగ అనీ కూడా అంటారు.
మకర సంక్రాంతి యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే ఈ రోజు ‘గ్రహ రాశి‘లో, అంటే సూర్యుడి చుట్టూ భూమి తిరిగే కక్ష్యలో ఒక ముఖ్యమైన కదలిక, అంటే మార్పు ఉంటుంది. ఒక సంవత్సరంలో ఎన్నో సంక్రాంతులు ఉంటాయి; వీటిలోని రెండు ముఖ్యమైనవి. వాటిలో ఒకటి మకర సంక్రాంతి, రెండవది దీనికి సరిగ్గా ఆరు నెలల కాలంలో, వేసవి కాలపు ఆయనం తర్వాత వచ్చే కర్క సంక్రాంతి. ఈ రెంటి మధ్యా చాలా సంక్రాంతులు ఉన్నాయి – రాశి మారిన ప్రతిసారి దాన్ని సంక్రాంతి అనే అంటారు. ఎందుకంటే అది గ్రహగమనంలో మార్పుని సూచిస్తుంది. ఈ మార్పు కారణంగానే మన జీవితాల పాలన, పోషణలు జరుగుతున్నాయని అర్థం చేసుకోవాలని సంక్రాంతి తెలియజేస్తుంది. ఈ కదలిక లేదా మార్పు ఆగిపోతే ‘మనం’ అనేది కూడా ఆగిపోతుంది. 22డిసెంబరు రోజున శీతకాలపు ఆయనం వచ్చింది, అంటే సూర్యుని పరంగా చూస్తే ఈ గ్రహం యొక్క వంపు గరిష్టస్థాయికి చేరింది. ఈ రోజు నుంచి ఉత్తర గమనం చాలా బలంగా ఉంటుంది. మనము దీనిని ఉత్తరాయణ పుణ్యకాలం అని కూడా కీర్తిస్తాము. భూమి మీద అన్నీ మారటం మొదలు పెడతాయి. మకర సంక్రాంతి నుంచి శీతాకాలం కొద్ది కొద్దిగా తగ్గుముఖం పడుతుంది.
మకర సంక్రాంతి ‘పంటకోతల లేదా పంట నూర్పిడుల‘ పండుగగా కూడా పిలువబడుతుంది. ఎందుకంటే ఈ సమయానికల్లా పంట నూర్పిడులు అయిపోయి, ప్రజలు పెద్ద ఉత్సవాలు జరుపుకుంటారు. ఈ రోజున, పంటలలో వారికి సహాయపడిన వారికి కృతజ్ఞత తెలుపుతారు. పంటలలో పశువులు చాలా పెద్ద పాత్ర పోషిస్తాయి. మొదటి రోజు భూమికి భోగి, రెండొవ రోజు మనకు సంక్రాంతి, మూడవ రోజు పాడి పశువులకు కనుమ. అవి మనకంటే ఉన్నత స్థాయిలో ఉంచబడ్డాయి.
ఈ పండుగలనేవి మన వర్తమాన, భవిష్యత్తులను స్పృహతో మలచుకోవాలి అనే దాన్ని గుర్తుచేస్తాయి. ఇప్పుడు మనం గత సంవత్సరపు పంటను కోసుకున్నాము. తరువాత పంటను సృష్టించడానికి కావలిసిన ప్రణాళికను స్పృహతో, జంతువులను కూడా పరిగణనలోకి తీసుకుని సిద్ధం చేయాలి. అందువల్ల ఈ మకర సంక్రాంతి పండుగ ‘పంటల పండుగ‘ అయ్యింది. కానీ దీనికి ఖగోళ పరమైన, ఆధ్యాత్మిక పరమైన అర్ధాలు కూడా ఉన్నాయి. ఒక నిర్దిష్ట యోగ ప్రక్రియ నుంచి ఈ పండగ ఆవిర్భవించింది, కానీ సాధారణ ప్రజలు వారికి అనువైన పద్ధతుల్లో దీనిని జరుపుకుంటున్నారు. యోగులు కొత్తగా, నూతనోత్తేజంతో తమ ఆధ్యాత్మిక ప్రక్రియను కొనసాగించడానికి ఈ సమయం చాలా ముఖ్యమైనది. అలాగే సంసారిక జీవనంలో ఉన్నవారు కూడా తాము అనుకున్నవి సాధించడానికి ఒక సరికొత్త ప్రయత్నం చేస్తారు. భూమి సూర్యుని చుట్టూ 27 నక్షత్రాల లేదా 108పాదాల పరిభ్రమణ పూర్తిచేసి, కొత్త ఆవృతాన్ని మొదలు పెట్టటాన్ని ఈ సంక్రాంతి తెలియజేస్తుంది.
More Stories
శ్రీ అయ్యప్పస్వామి – మకరజ్యోతి
సమరసత కు సాధనం రామాయణ అనుసరణే