మల్లంపల్లి సోమశేఖరశర్మ గారు రచించిన చారిత్రక వ్యాసమంజరి నుండి సేకరణ
మానవ హృదయమును రంజింపజేయు ఋతురాజములలో వసంత శరదృతువులు పేర్కొనదగినవి. ఒకటి అసమానపుష్పశోభ చేత నుద్దీపితమగునది. మఱియొకటి దివ్యజ్యోత్స్నావైభవముచేత భాసురమగునది. వసంతకాల వైభవము ఎంత రాగోద్దీపకమో శరచ్చంద్ర చంద్రికా వైభవమంత యానందప్రదాయకము. కాని యత్యంత సుఖప్రదములైనవే మానవుని కెక్కువ యరిష్టప్రదములని భగవన్నిర్ణయము కాబోలు!
అరయ సర్వజనౌఘ నాశకములై యత్యంత ఘోరమ్ములై
పరమవ్యాధి కరమ్ములయ్యు గడు శోభాస్ఫూర్తి నొప్పారి శాం
కరికిన్ బ్రీతికరమ్ములై మిగుల వేడ్కల్సేయు లోకాళికిన్
శరదారంభ వసంతముల్ శమన దంష్టాపాయముల్ భూవరా!
అని యీ రెండు ఋతురాజములును వర్ణింపబడినవి. దానం జేసియే యీ ఋతువుల యారంభమున నరిష్ట నివారణమునకై దేవీ పూజలు నిర్వర్తింతురు. ఈ పూజ లీరెండు ఋతువులందు దొమ్మిది దివసములు ప్రవర్తిల్లుటం జేసి నవరాత్రములు నాబరగుచున్నవి. వసంతనవరాత్రము శ్రీరామనవమి యుత్సవములుగను, శరన్నవరాత్రములు దేవీ నవరాత్రములు లేక దశరాయుత్సవములుగను బేరుకెక్కినవి.
ఇది యాశ్వయుజమాన మగుటచే నివి శరన్నవరాత్రములు. దేవీ పూజాదివసములు. దేవీపూజ ఆశ్విన శుక్ల ప్రతిపతిథి 1 మొదలు నవమిపర్యంతము జరుగుచుండును. పూజా విధానము దేవీ భాగవతములోను, స్కాందము, మాత్స్యము, పాద్మము మొదలగు పురాణములలోను వివరముగ వర్ణింవబడినది. ఇరువది నాలుగడుగుల చతురముగల యొక మండపమును నిర్మించి దానిని కేతనములు మొదలగు వానితో నలంకరింపవలెను. తెల్లమట్టి, గోమయము కలిపి మండపము నలుకవలెను. మండప మధ్యమున నాఱడుగులు చతురముగల యొక వేదిక నేర్పఱచి దానిలో నాగ్నేయ దిశగా మొక హోమ కుండమును త్రిభుజాకారమున నిర్మింపవలెను. అంబికా మూల మంత్రమును జపించుటకు బ్రాహ్మణుల నేర్పఱుచ వలెను. మొట్టమొదట విఘ్నేశ్వర పూజ పూర్తియైన పిదప దేవీ పూజ ప్రారంభమగును. క్షౌమవస్త్ర సమన్వితమగు సింహాసనము స్థాపించి యందు జతుర్హస్తయు, నాయుధసమంచితయు, రత్నాలంకార విరాజితయు, ముక్తాహారభాసురయు, దివ్యాంబర ధారిణియు, సౌమ్యము, సర్వలక్షణసంయుతయు, శంఖచక్రగదా పద్మాన్వితయు, సింహవాహనయునగు జగదంబిక నాగమోక్త విధానంబున స్థాపించి యథాశక్తి బూజింపవలయును. నవరాత్రములందు నడుపవలసిన కార్యములను శాస్త్రములీ విధమున బేర్కొనుచున్నవి.
-
-
-
-
- కలశ స్థాపనము
- దేవతా పూజనము
- సప్తశత్యాది జపము,
- అఖండదీపము
- మాలాబంధనము.
- ఉపవాసనక్షైక భుక్తాదినియమము
- సువాసినీ భోజనము
- కుమారీ భోజనము,
- స్తోత్ర మంత్ర హోమాదులు.
-
-
-
శాంతి నిమిత్తము పూజాతత్పరులు తమ శక్తికిం దగిన రీతిని కన్యకలకు భోజనము పెట్టుచుండవలయును. ఈ కుమారీ నిర్ణయమును గుఱించి పురాణములందిట్లు తెలుపబడినది.
“ఏకవర్షాతు యా కన్యా పూజార్థేతాం వివర్ణయేత్! గంధ పుష్ప ఫలాదీనాం ప్రీతిస్తస్యా నవిద్యతే“.
ఈ కుమారికల సంఖ్య దినమున కొక్కొక్కటి చొప్పున హెచ్చించుచుండవలెను. అనగా మొదటిదినమున ఒకరైన రెండవదినమున నిరువురు, మూడవదినముస మూవురు, నాలవదినమున నలువురు; ఈ విధమున కుమారికా సంఖ్య వృద్ధి పఱుచుచుండవలెను. ఈ కుమారిక లందఱు పదిసంవత్సరములు లోపు వారై యుండవలెను. ఏడాది పిల్ల ఇట్టి దానికి బనికిరాదు. రెండేండ్లు మొదలు పదేండ్ల వఱకు గల కుమారికలకు వారివారి వయస్సును బట్టి వేఱు వేఱు నామములు గలవు. రెండేండ్లున్న గుమారికయనియు, మూడేండ్లున్న ద్రిమూర్తియనియు, నాలుగేండ్లున్న గల్యాణియనియు, నయిదేండ్లున్న రోహిణి యనియు, నాణేండ్లున్న కాళియనియు, నేడేండ్లున్న జండికయనియు, నెనిమిదేండ్లున్న శాంభవియనియు, దొమ్మిదేండ్లున్న దుర్గయనియు, బదేండ్లున్న సుభద్రయనియు నా కుమారికలకు బేళ్లు. ఈ కుమారికలకు పూజా భోజనాదికంబులు జరుపవలయును. కుమారికా పూజ వ్యాధి నివారకమనియు, త్రిమూర్తిపూజ శత్రుసంహారకమనియు, దుర్గాపూజ యరిష్ట విచ్ఛేదకమనియు, నిట్లే ఆయాయి కుమారికలు పూజా భోజనాదిక నిర్వాహకములవలనం దొలంగు నమంగళములను, కలుగు ఫలములును పురాణములందు వివరముగ బేర్కొనబడినవి. మూడేసి దినములకు దేవి నొక్కొక్క పేరున మూడుపేళ్లతో నీతొమ్మిది దినములు పూజింపవలయును. మొదటి మూడు దినములు మహాకాళీ పేరను, దరువాతి మూడు దినములు మహాలక్ష్మి పేరను, దక్కిన మూడు దినములు మహాసరస్వతి పేరను బూజలు జరుపవలెను. మహాకాళివూజ దుఃఖదారిద్య్రం వీడానివారకమనియు, మహాలక్ష్మీ పూజ భాగ్యైశ్వర్యప్రదమనియు, మహాసరస్వతీ పూజ విద్యావివేక హృదయ పారిశుద్ధ్య సౌఖ్య ప్రదమనియుం దెలుపబడినది. ఈ పైన తెలిపిన మూడుశక్తి స్వరూపములలో మొదటిది శైవశక్తి. రెండవది వైష్ణవ శక్తి. మూడవది బ్రాహ్మీశక్తి.
పదవనాటి యుత్సవముతో నీనవరాత్రదీక్ష ముగియుచున్నది. పదవనాడు అపరాజితా పూజనము, సీమోల్లంఘనము, శమీపూజనము మొదలగునవి విధి విహితములు. పైన దెలిపిన అపరాజితకు జయవిజయలు పార్శ్వ దేవతలగుటం జేసి యీ దశమి విజయదశమి యను పేర జరుగుచున్నదని కొందఱిమతము.
‘జమ్మినవారి‘ అను తెలుగు పేర బరగు నీ పదవనాటి యుత్సవమున శమీ ప్రదక్షిణ సందర్భమున బఠించునట్టియు, శమీవృక్షమునకు వ్రేలాడగట్టుటకై తాటి యాకులమీద వ్రాయబడునట్టియు నీ క్రింది శ్లోకము లాంధ్ర లోకమునకంతకు శ్రుతపూర్వములు.
అమంగలానాం శమనీం శమనిం దుష్కృతస్యచ
దుస్స్వప్న నాశినీ ధన్యాం ప్రపద్యే. హంశమీమ్ శుభామ్॥
శమీ శమయతే పాపం శమీ శత్రువినాశినీ
అర్జునస్య ధనుర్థారీ రామస్య ప్రియవాదినీ॥
భక్తితత్పరులగు చతుర్వర్ణముల వారికి శరన్నవరాత్రములు పూజాదివసములు, ఏ యేవర్ణములవారీ పూజ నిర్వర్తించిన నెట్టెట్టి ఫలమును బడయగలరో పురాణములు వివరముగ దెలుపుచున్నవి. బ్రాహ్మణులకు, క్షత్రియులకు నీ పూజ ముఖ్యము. క్షత్రియులు ముఖ్యముగ విజయార్థులై దేవిని బూజింతురు. విజయదశమినాడు క్షత్రియుల కర్తవ్యమిట్లు నిర్దేశింపబడినది.
క్షత్రియుడు తూర్పు దిక్కున నున్న జమ్మిచెట్టు దగ్గఱకు మంగళవాద్యములతో బోయి దానిని బూజించి ఆ చెట్టు మొదట నున్న తడిమట్టిని గొంత అక్షతలతో గూడ దీసికొని యింటికి వచ్చి దానిని విధివిహితముగ బూజింపవలెను. పిదప సైన్యమును సన్నద్ధము చేసి తరువాత గ్రామము యొక్క ప్రాగ్ద్వారముగుండ నిరాకులమైన గ్రామబహిఃప్రదేశమునకు వచ్చి, అచ్చట పత్రికాదులతోగాని లేక మనస్సున గాని శత్రుపతి రూపమును జిత్రించుకొని, బంగారు కోలలతో, దద్రూపమును గొట్టి సంప్రీతి జెంది రాత్రివేళ మఱల నింటికి బోవలెను. ఇట్లు జరిపిన పిదప జైత్ర యాత్రకును బైలు వెడలవచ్చును.
విజయ ప్రస్థానమునకు శరత్కాలమే యుక్తసమయము. వర్షకాలము వెనుకబట్టి శరదాకాశము వినిర్మలమై ‘దండుత్రోవ‘ లారి బీటలు తీసిన యాశ్వయుజ
————
1.శర్మగారు తొలుతది వ్యాసాలలో క్షత్రియుడు, తదుపరి వ్యాసాలలో క్షత్రియుడు అనే వర్ణక్రమం (Spelling) ఉపయోగించారు.
మాసదివసంబులు వీర విక్రమ కళాకౌశల ప్రశోభితములు. హిందూ ప్రభువుల రాచణికమున నీశరదృతువు విజయ దుందుభి నిర్దోషమున మాఱు మ్రోగుచుండెడిది. ఈ ఋతువు వీరరసపోషక మగుట చేత వీరరసప్రధాన నాటకములందు నీయదియే గానము చేయబడుచున్నది.
హిందువులగు ప్రభుపుంగవులు రాజ్యము చేయునాటి శరన్నవరాత్ర వైభవమును దెలిసికొనుటకు మన కెక్కు డాధారములు లేవు. ఆంధ్రభోజుడని ప్రసిద్ధిగాంచిన శ్రీకృష్ణదేవరాయలనాటి శరన్నవరాత్రుత్సవములను ఆ కాలమున విజయనగరమునందుండిన ‘పేయస్” 1 అను నాతడు సవిస్తరముగ వర్ణించి యున్నాడు, మేజువాణీలు, మల్లయుద్దము, అగ్నిబాణప్రదర్శనములు, సైనిక పరీక్ష, గొట్టె పొట్టేలు పందెములు, వేడుకలు, ఉత్సవములు, ఊరేగింపులు, గౌరవసమ్మానములు, ఈ మొదలగున వనేకములు యధారూపముగ వర్ణింపబడినవి. ఆ వర్ణనమును జదివి యపరిమితానందము నొంది, జారిపోయిన యా వైభవమును దలంచుకొని యొక్క నిట్టూర్పుబుచ్చి, కన్నీటిచుక్క విడువని యాంధ్రుడుండడు.
నేటికినీ గొన్ని కొన్ని దేశీయప్రభు సంస్థానములలో నీ శరన్నవ రాత్ర్యుత్సవములు జరుగుచున్నను బూర్వపు వైభవము మాత్రము గానబడదు. అయినను ఈ యుత్సవములు జరుపుటలో మైసూరు సంస్థానమే నేడు కడుంగడు పేరుకెక్కినది.
విల్లమ్ములను గేలబూని దిగ్విజయమునకు బైలు వెడలు రాజసైన్యములతో దశ దిశలు నిండి నిబిడీకృతము కావలసిన యీ దినములలో గిలకల బ్రద్దలు పట్టి పప్పు బెల్లముల కొరకు యాచించు బాల విద్యార్థులను, పారితోషిక సమ్మానముల నభ్యర్థించు బడిపంతుళ్లను గాంచవలసివచ్చుట కడుశోచనీయము. శౌర్యము సన్నగిల్లినది; పరాక్రమము పాడువారినది; అస్త్రవిద్య ఆకాశకుసుమమైనది. నాటి దినములవి; నేటి దినములివి. ఎంతటి వ్యత్యాసము, ఎట్టి మార్పు!
(భారతి –అక్టోబర్ ,1924 )
—————
1.దామింగో పేయస్ అనే పోర్చుగీసు యాత్రికుడు క్రీ.శ. 1520లో విజయనగరాన్ని సందర్శించాడు.
More Stories
శ్రీ కురుమూర్తి స్వామి వారి ఉద్దాలోత్సవం
వివిధ ప్రాంతాల్లో ఉగాది
కోనసీమలో సంక్రాంతి ప్రభల సంబరాలు