
వాల్మీకి మహర్షి జయంతి సందర్భంగా వక్తల సందేశం
దక్షిణాపథ స్టడీస్ వారు ఈ నెల 17 వ తేదీ, ఆశ్వీయుజ పౌర్ణమిన ఆదికావ్యం రామాయణాన్ని రచించిన వాల్మీకి మహర్షి జయంతిని సికిందరాబాద్ బొల్లారం ప్రాంతంలోని లాల్ దాస్ మఠంలో నిర్వహించారు. సరస్వతీ దేవి, వాల్మీకి మహర్షి చిత్రపటాలకు పుష్పాలంకరణ, జ్యోతి ప్రజ్వలనతో సమావేశం ప్రారంభమైనది. కార్యక్రమాన్ని దక్షిణాపథ తెలంగాణా ప్రాంత సంయోజకులు శ్రీ కళ్యాణ్ చక్రవర్తి గారు తమ స్వాగతోపన్యాసంతో ప్రారంభించారు.
కార్యక్రమానికి సంస్కృతి ఫౌండేషన్ నిర్వాహకులు శ్రీ సోమనాథ్ గారు ముఖ్య అతిథిగా మరియు వక్తగా విచ్చేశారు. రామాయణం-సమరసత అనే అంశంపైన సాగిన శ్రీ సోమనాథ్ గారి ప్రసంగం ఎంతో విశ్లేషణాత్మకంగా సాగింది. వేద సంహిత, పురాణ సంహిత మరియు కావ్య సంహితలుగా మన హిందూ వాఙ్మయం పేర్కొనబడినదనీ, కావ్య సంహితలో రామాయణం ఆది కావ్యమనీ, ఇది యుగాయగాలుగా మానవ మేధస్సుకి, నడవడికీ మార్గదర్శనం చేస్తోందని వారు పేర్కొన్నారు. సనాతన ధర్మంలో ఏనాడూ జన్మతః కుల విభజన జరుగలేదనీ, వేల ఏండ్లుగా ఈ దేశంలో వ్యక్తి తన ఆచరణ ద్వారా, కృషిచే గుర్తించబడినాడనీ, దానికి వాల్మీకి మహార్షియే గొప్ప ఉదాహరణనీ శ్రీ సోమనాథ్ గారు శ్లాఘించారు. రామాయణంలో వనవాసీలుగా నిషాదరాజు గుహుడు, మాత శబరి తమ తమ ఆచరణ ద్వారా నేటికీ ఆదర్శప్రాయులుగా నిలిచారన్నారు. నాడు వన ప్రాంతాలకు రాజులూ, గ్రామీణ ప్రాంతాలకు ఏలికలూ, రాజ్యాలకు ప్రభువులూ ఎవరికి వారే ప్రాముఖ్యత కలిగి ఉండేవారనీ, నాటి సమాజం ఎవరినీ తక్కువ చేసి చూడలేదని శ్రీ సోమనాథ్ గారు సశాస్త్రీయంగా వివరించారు. హిందూ సమాజాన్ని బాలహీనపరిచే అనేక కుతంత్రాలలో భాగంగా విదేశీ దూరాక్రమణదారులూ, వారికి వంతపాడే వారూ మనలో కుల విభేదాలు సృష్టించినారనీ, మనం అందరమూ జాగారూకులై సమరసతా భావంతో మెలుగుతూ, మన ధర్మాన్ని రక్షించుకోవాల్సిన తరుణమిదని శ్రీ సోమనాథ్ గారు సభికులను జాగృత పరిచారు.
పిమ్మట ప్రసంగించిన సంవిత్ ప్రకాశం డైరెక్టర్ శ్రీమతి శైలజ గారు, మన దేశంలోనూ, ప్రపంచంలోనూ వివిధ భాషలలొ రచించిన రామాయణ కావ్యాలను ఉటంకించారు. ముఖ్యంగా తెలుగు భాషలో రచించబడిన శ్రీ రంగనాథ రామాయణం, మొల్ల రామాయణం వైశిష్ట్యాన్ని గురించి ప్రస్తావించారు. సంత్ తులసీదాస్ రచించిన రామచరిత మానస్ వివిధ దేశాలలో ఎలా పరాచర్యం పొందినదీ సోదాహరణంగా వివరించారు.
ఈ సమావేశానికి వాల్మీకి సమాజానికి చెందిన ఆల్వాల్ ప్రాంత ప్రముఖులు విచ్చేసి, శ్రీ సోమనాథ్ గారిని, శ్రీమతి శైలజ గారినీ శాలువలతో సత్కరించారు. దక్షిణాపథ నిర్వహించిన ఈ సమావేశం ఎంతో ప్రేరణదాయకంగా ఉందని వారు తెలిపారు.
ఈ ఉత్సవ కార్యక్రమంలో అనేకమంది పురప్రముఖులూ, దక్షిణాపథకి చెందిన పరిశోధకులూ పాల్గొన్నారు. ఇటువంటి కార్యక్రమం తమ ప్రాంగణంలో జరిపినందుకు, లాల్ దాస్ మఠం నిర్వాహకులు అభినందించినారు.
సమావేశానంతరం, సభికులందరికీ తీర్థ, ప్రసాద వితరణ జరిగినది.
More Stories
స్వామి సహజానంద
కోనసీమలో సంక్రాంతి ప్రభల సంబరాలు
శ్రీ అయ్యప్పస్వామి – మకరజ్యోతి