మకరజ్యోతి, మకరవిళక్కులకు శబరిమలతో అనుబంధం ఉంది. మకరజ్యోతి, మకరవిళక్కు రెండూ ఒకటేనని చాలా మంది భక్తులు నమ్ముతారు. ఇది కొంతమందిలో ఒక సాధారణ అపోహ.
మకరవిలక్కు అనేది పొన్నంబలమేడు వద్ద నిర్వహించే కర్పూర ఆరాధన. ప్రతి సంవత్సరం మకర సంక్రాంతి అంటే ఇంచుమించు జనవరి 14-15 తేదీల్లో మకరవిలక్కు రోజు వస్తుంది. పురాణాల ప్రకారం, పొన్నంబలమేడులో కర్పూర ఆరాధనను దేవతలు, తరువాత మహర్షులు, ఆ తరువాత మలయాళరాయలు నిర్వహించారని నమ్ముతారు. మకర సంక్రాంతి రోజున అయ్యప్పస్వామి దేవస్వం బోర్డు ఉద్యోగులు, అయ్యప్ప భక్తులు పొన్నంబళమేడుకు సురక్షితంగా చేరుకుని కర్పూరం వెలిగిస్తారు. దీనిని అలంకారాత్మకంగా మూడుసార్లు వెలిగిస్తారు.
మకరజ్యోతి అంటే ఆకాశంలో కనిపించే నక్షత్రం అని అర్థం. మకర మాసం మొదటి రోజున ఒక్క క్షణం మాత్రమే నిలిచే నక్షత్రాన్ని మకరజ్యోతి అంటారు. సూర్యాస్తమయం తర్వాత ఈ నక్షత్రం ఎక్కువగా కనిపిస్తుంది. కానీ అది కొద్దికాలంలోనే మాయమైపోతుంది. ఇది ఆ స్థల భౌగోళిక స్థితిని బట్టి జరుగుతుంది. కానీ విశ్వాసం ప్రకారం, పందళం నుండి శబరిమలకు తిరువాభరణం (దేవతల పవిత్ర ఆభరణాలు) తీసుకువచ్చిన రోజున ఈ నక్షత్రం కనిపిస్తుంది.
పొన్నంబళమేడు: ఆచారాలు, నమ్మకాలు
మకరవిలక్కును చూసేందుకు లక్షలాది మంది శబరిమలకు వెళ్తుంటారు. కేరళ అటవీ శాఖ పరిధిలోని పొన్నంబళమేడు వద్ద మకర దీపం వెలిగిస్తారు. ఈ రోజున, అంటే మకరజ్యోతి దర్శనమిచ్చినప్పుడు, పొన్నంబలమేడు వద్ద కర్పూర హారతి నిర్వహిస్తారు. దీనిని మకరవిలక్కు అని పిలుస్తారు. ఇది స్పష్టంగా మానవ సంకల్పం. శబరిమల ఆలయంలో మాదిరిగానే, విగ్రహం వద్ద ఉండే హారతి జ్వాలల వలనే ఈ మకారవిలక్కును వెలిగిస్తారు. అయ్యప్పస్వామి పట్ల భక్తికి ప్రతీకాత్మకంగా మకరవిలక్కును మూడుసార్లు వెలిగిస్తారు. అయితే ఇదే సమయంలో ఉదయించే నక్షత్రాన్ని మకరజ్యోతి అనీ, పొన్నంబళమేడు వద్ద చేసే హారతిని మకరవిలక్కు అనీ పిలుస్తారు.
మకరసంక్రమణం రోజున మకరజ్యోతి దర్శనమిస్తుంది. ఇది హిందువులకు పవిత్రమైన రోజు. సూర్యుడు దక్షిణాయణం (శీతాకాలం) నుండి ఉత్తరాయణానికి (వేసవి) ప్రవేశించే రోజు ఇది. ఈ రోజున ప్రపంచంలోని కొన్ని ప్రాంతాలలో మకరజ్యోతిని చూడవచ్చు. అంతేకాక ఇది భూగోళ దృగ్విషయం. ఆ విధంగా శబరిమల సన్నిధానం అనేది మకరజ్యోతిని చూడదగిన ప్రాంతం. కాలక్రమేణా దట్టమైన అడవుల్లో నివసిస్తున్న గిరిజనులు పొన్నంబలమేడు వద్ద ఈ పరివర్తన సమయంలో నిప్పులు వెలిగించి పూజలు చేశారు. అంటే మానవులు తమ విశ్వాసం, ఆరాధనలో భాగంగా వెలిగించిన అగ్ని మకరవిలక్కుగా పిలువబడే మకరజ్యోతి భూలోక స్వరూపం. శబరిమల నుండి ఈ మకరజ్యోతిని చూడదగిన భూభాగం పొన్నాంబలమేడు. ఒకప్పుడు పొన్నంబళమేడు వద్దనే ఆలయం ఉండేదని పూర్వీకులు చెప్పేవారు. ఇప్పటికీ అక్కడ ఒక పురాతన ఆలయ అవశేషాలు ఉన్నాయి. అంతేకాక అక్కడ శ్రీచక్రంతో చెక్కిన రాతి పీఠం ఉందని కూడా చెబుతారు.
ఉత్తరాయణం మకరసంక్రమణం (సూర్యుడు శీతాకాలం నుండి వేసవి సంక్రాంతికి పరివర్తన చెందే రోజు) తో ప్రారంభమవుతుంది. హిందూ విశ్వాసం ప్రకారం, మకరసంక్రమణాన్ని దేవతల బ్రహ్మ ముహూర్తంగా భావిస్తారు. కాబట్టి, ఇది కూడా అనేక విశిష్ట లక్షణాలతో కూడిన సమయం. మకరజ్యోతిని కొన్ని సెకన్లు మాత్రమే చూడగలం. ఇది ఓ నక్షత్రం లాగే కనిపిస్తుంది. అయితే, ఈ ప్రదేశం యొక్క భౌగోళిక లక్షణాల కారణంగా, ఇది మన దృష్టి నుండి త్వరగా అదృశ్యమవుతుంది.
చరిత్ర మరియు విశ్వాసాలు
శబరిమలకు, పందళం రాజకుటుంబానికి ఉన్న సంబంధాన్ని పరిశీలిద్దాం. అయ్యప్పన్, పందళం రాజకుటుంబానికి చెందినవాడు. అసాధారణ యుద్ధ నైపుణ్యం ఉండి ఆత్మశక్తి ద్వారా తపశ్శక్తిని పొందిన ఆ యువకుడు తరువాత కాననవిహార సమయంలో శబరిమల ప్రాముఖ్యతను తెలుసుకున్నాడు. రాజకుటుంబంలోని అంతర్గత సమస్యల కారణంగా ఇంటిని విడిచిపెట్టి, పులి పాలను వెతుక్కుంటూ అడవి గుండా ప్రయాణించి రాణి కోరిక మేరకు పులిపాలను పొందడం, తన యోగశక్తితో శత్రువులను ఓడించి మహిషి విగ్రహంగా మారడం వంటి కథలు పురాణాల రూపంలో నేటికీ లభ్యమవుతున్నాయి. పందళం అప్పుడు పాండ్య రాజవంశంతో సంబంధం కలిగి ఉంది. పందళం ప్రాంతంలోని కొందరు తిరుమల నాయకన్ కు భయపడి పాండ్య భూమి నుండి వచ్చారు. పందళం రాజవంశానికి ట్రావెన్కోర్ తో మంచి సంబంధాలు ఉన్నాయి. అయ్యప్పన్ గా పేరొందిన మణికందన్ ఆ దేశాన్ని అభివృద్ధి చేశాడు. అనేక శత్రురాజులను ఓడించిన తరువాత, అయ్యప్ప తన రాజ్యాధికారాన్ని, విలాసాలను విడిచిపెట్టి, తీక్షణమైన ధ్యానం మరియు కఠినమైన ఆధ్యాత్మిక శోధనలో అడవికి వెళ్ళాడు. తపసంపన్నుడైన ఆయన ఆ తరువాత నేటి శబరిమలలో ఉన్న ఆలయంలోని విగ్రహంలో ఐక్యమయినాడు. మకరజ్యోతి దర్శనమిచ్చే పద్దెనిమిది పర్వతాల మధ్య ఉన్న ఈ భూమి ఎంతో పవిత్రమైనది. పూర్వం ఆ ప్రాంతంలోనే దట్టమైన అడవిలో ఆలయం ఉండి ఉంటుందని భావిస్తున్నారు.
దట్టమైన అడవిలో ఉన్నందున శబరిమలలోని ఇతర దేవాలయాల మాదిరిగా ప్రతిరోజూ పూజలు చేయడం అసాధ్యం. కాబట్టి, పూజలు చేయడం కొన్ని సమయాల్లో మాత్రమే సాధ్యమవుతుంది. మకరవిళక్కు రోజుతో పాటు కొన్ని ఇతర దినాలలో శబరిమలలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. మకరసంక్రమణం రోజున జరిగే పూజ చాలా ప్రసిద్ధమైనది. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించినప్పుడు మకరసంక్రమణ పూజ చేస్తారు. ఈ ప్రత్యేకమైన రోజున అయ్యప్ప స్వామి విగ్రహాన్ని తిరువాభరణంతో అలంకరిస్తారు. ఇది పూజతో పాటు జరిగే ముఖ్యమైన వేడుక. పందళం రాజు శబరిమల అయ్యప్ప స్వామికి పితామహుడిగా నిలుస్తాడు. రాజకుటుంబంలో అత్యంత పెద్ద వయస్కుడు అయిన వ్యక్తి అయ్యప్ప కోసం పందళం వదిలి, నాటి రాజు చేసిన దేవత యొక్క పవిత్ర ఆభరణాలను (తిరువాభరణం) తీసుకుని ప్రజల వెంట శబరిమలకు వెళ్తాడు. తిరువాభరణం మూడు పేటికల్లో తీసుకెళ్తారు. ఈ రోజున గరుడుడు తిరువాభరణంతో కలిసి నడుస్తాడాని కూడా నమ్ముతారు. మకరవిళక్కు తర్వాత ఈ రోజే అయ్యప్పస్వామిని ఏనుగుపై మణిమండపం నుంచి ఊరేగింపుగా తీసుకెళ్లి పవిత్రమైన పద్దెనిమిది మెట్ల వైపు తీసుకువచ్చి తిరిగి శ్రీకోవిల్ (గర్భగుడి)లో ప్రవేశపెడతారు.
శబరిమల దక్షిణ భారతంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలలో ఒకటి. దక్షిణ భారతదేశంలో హిందూ ధర్మాన్ని, తత్వాన్ని నిర్మించడంలో, బలోపేతం చేయడంలో ఈ ఆలయం కీలక పాత్ర పోషించింది. శబరిమలకు వెళ్ళే ముందు భక్తులు సనాతన ధర్మశాస్త్రం అనుసరించి దీక్ష స్వీకరిస్తారు. ఈ సమయంలో ధ్యానం, స్వీయ నియంత్రణ మరియు ధర్మ బద్ధంగా తన జీవితాన్ని గడపడంలో దీక్షాధారులు కంకణబద్ధులై ఉంటారు. శబరిమలను సందర్శించడానికి దీక్షాబద్ద్ధులై ఉన్నవారి ఇంట్లోని ప్రతి ఒక్కరూ ధ్యానం మరియు భక్తితో కాలం గడుపుతారు. శ్రీ ధర్మశాస్త లేదా శ్రీ అయ్యప్పగా ప్రసిద్ధి చెందిన శబరిమలలోని దేవత భారతీయ విశ్వాస వ్యవస్థలో అంతర్భాగం, ఇది రెండవ అయ్యనార్, అయ్యప్ప, శాస్త వంటి విభిన్న గుర్తింపులతో భక్తులను ఏకం చేస్తుంది. శబరిమల విశ్వాసాలకు ముప్పు మొత్తం హిందూ సంస్కృతికి ముప్పు. శబరిమల హిందూ ఐక్యతకు, తత్వానికి ప్రతీక.
More Stories
మకర సంక్రాంతి (జనవరి 14)
సమరసత కు సాధనం రామాయణ అనుసరణే