ముగ్గురు ఒడిశా మూలాలు గల రచయితలు (వీరిలో ఇద్దరు మహిళలు) పల్లవి దాస్, సందీప్ దాస్, ఆల్కా జెనా అందించిన ‘ది ఒరిస్సన్’ పుస్తకం భారత్ లోని ఒడిశా ప్రాంత సంస్కృతిని ప్రపంచానికి కొత్త కోణంలో పరిచయం చేసింది.

ఈ పుస్తకం సహరచయిత్రి పల్లవీ దాస్ కు ‘ది ఒరిస్సన్’ తొలుత తన మూలాలను తెలుసుకునే వ్యక్తిగత అన్వేషణగా ప్రారంభమైంది. క్రమంగా అది ఒడిశా చరిత్ర, ఆహార సంస్కృతి, సంప్రదాయాలు, ఆచారాలపై లోతైన పరిశోధనగా మారింది. కథలు, జ్ఞాపకాలు, పరిశోధనలను సమ్మిళితం చేస్తూ ఒడిశాలోని మరో కోణాన్ని ఈ 376 పేజీల పుస్తకం ఆవిష్కరిస్తుంది.
మొఘలులు భారతదేశ ఆహారసంస్కృతిని ప్రభావితం చేయడానికి చాలా కాలం ముందే కళింగ తన ప్రత్యేకతను చాటుకుంది. కొలంబస్ సముద్రయానం చేయడానికి శతాబ్దాల ముందే కళింగ నావికులు బాలి దీవులకు ప్రయాణించారు. ఇక్కడి ఆలయాలలో దేవతలకు వైభవంగా నైవేద్యాలు సమర్పించేవారు. ఒడిశాకు సంబంధించిన అనేక కథలు, చరిత్రకు సంబంధించిన ఆనవాళ్ళు కేవలం కట్టడాల్లోనే కాకుండా, ఆహారం, ఆచారాలు, తరతరాలుగా అందిన జ్ఞాపకాల రూపంలోనూ నిలిచిపోయాయి.
పరిశోధకురాలైన పల్లవి దాస్ కు ఒడిశాను తెలుసుకోవడమంటే తన మూలాలను అన్వేషించుకోవడమే. ఒడియా కుటుంబంలో జన్మించిన ఆమె ముంబై, మలేసియా, నూయార్క్ లలొ పెరిగారు. కుటుంబం ద్వారా ఒడిశాతో అనుబంధం ఉన్నప్పటికీ, ఆ రాష్ట్రంలో పెరగలేదు. ఈ దూరమే తన వారసత్వంగా వచ్చిన చరిత్ర, సంప్రదాయాలు, సంస్కృతిపై ఆమెకు మరింత ఆసక్తిని కలిగించింది. తాను ఎక్కడి నుంచి వచ్చాను, తన కుటుంబాన్ని ప్రభావితం చేసిన అంశాలేమిటనే విషయాలను ఆమె లోతుగా పరిశీలించడం ప్రారంభించారు.
“తన గుర్తింపును వెతుక్కుంటూ “నేనెవరు? ఎక్కడి నుంచి వచ్చాను?” అనే ప్రశ్నలకు సమాధానాలు అన్వేషించే ప్రతి ఒక్కరి కోసం ‘ది ఒరిస్సన్’ రూపొందింది అని దాస్ తెలిపారు. వివిధ సంస్కృతుల మధ్య పెరగడంవల్ల ఈ ప్రశ్నలు తనకు మాత్రమే పరిమితం కాలేదని ఆమె గుర్తించారు. నా వారసత్వం గురించి నేనే ఈ ప్రశ్నలు వేసుకుంటున్నానంటే, మరెంతో మందిలో కూడా ఇవే ప్రశ్నలు ఉండొచ్చని అనిపించిదన్నారు.
పల్లవి, ఆమె తండ్రి సందీప్ దాస్, ఒడియా వంటకాల నిపుణురాలు చెఫ్ ఆల్కాజెనా ఈ ప్రాజెక్టులో కలిసి పనిచేశారు. ఈ ముగ్గురికీ ఒడిశాతో భిన్నమైన అనుబంధం ఉంది. సందీప్ దాస్ చారిత్రక పరిశోధన, కళాత్మక దృష్టిని అందించగా, ఆల్కాజెనా ఒడియా ఆహారం, వంటపద్ధతులు, ఆచారాలు, వంటలపై తన లోతైన పరిజ్ఞానాన్ని అందించారు.
ఆల్కాజెనాతో కలిసి పనిచేయడం ద్వారా మహిళలు, సోదరీభావం, వంటగది వంటి అంశాలపై కూడా చర్చలు జరిగాయని తెలిపారు. “వంటగది, పొయ్యి అనేవి అద్భుతమైన ప్రదేశాలని భావించి వాటిని తిరిగి సొంతం చేసుకోవాలనుకున్న ఇద్దరు మహిళలం మేము” ఆని ఆమె అన్నారు. తన తండ్రి సందీప్ దాస్ ఈ ప్రాజెక్టులో భాగం కావడం దీనిని మరింత వ్యక్తిగత అనుభూతిగా మార్చిందని చెప్పారు.
సాధారణంగా ప్రజలకు తెలిసిన ఒడిశా ఆలయాలు, చారిత్రక కట్టడాలు, శాస్త్రీయ కళలకే పరిమితం కాకుండా, వాటి వెనుక ఉన్న కథలను వెలికితీయడమే తమ లక్ష్యమని రచయితలు తెలిపారు. జానపద కథలు, కుటుంబ జ్ఞాపకాలు, పురాణాలు, ఆచారాలు, ఇతిహాసాలు, తరతరాలుగా కొనసాగుతున్న సంప్రదాయాలను వారు అన్వేషించారు.
“అందరికీ తెలిసిన ప్రదేశాలు, చారిత్రక కట్టడాలను దాటి, ఒడిశాను తీర్చిదిద్దిన మరింత సన్నిహితమైన కథలను పాఠకులకు పరిచయంచేయడం లక్ష్యాలలో ఒకటి” అని చెప్పారు. ఈ క్రమంలో పరిశోధన కీలకంగా మారింది. చారిత్రక గ్రంథాలు, శాస్త్రీయ పరిశోధనలు, ఆర్కైవ్ లలోని సమాచారంతో పాటు మౌఖిక కథనాలను కూడా పరిశీలించారు. ఈ సంప్రదాయాలను ఇప్పటికీ ఆచరిస్తూ, పరిరక్షిస్తున్న పలువురితో మాట్లాడారు. “ఒడిశా దేనికి ప్రసిద్ధి చెందిందో మాత్రమే కాకుండా, ఆ సంప్రదాయాలు ఎందుకు ఏర్పడ్డాయి, కాలక్రమంలో అవి ఎలా పరిణామం చెందాయో కూడా పాఠకులు తెలుసుకోవాలని మేము కోరుకొన్నాం” అని రచయితలు చెప్పారు.
ఈ చరిత్రను అర్థం చేసుకోవడానికి ఆహారం ఒక ముఖ్యమైన మార్గంగా మారింది. దాస్ దృష్టిలో వంటకాలు కేవలం వంటపద్ధతులు, రుచులకే పరిమితం కావు. ప్రజలు ఎలా జీవించారు, ఎలా పూజలు నిర్వహించారు, తమ జ్ఞాపకాలను ఎలా కాపాడుకున్నారు, ఎలా వేడుకలు చేసుకున్నారు అనే విషయాలను కూడా ఆహారం ద్వారా తెలుసుకోవచ్చని ఆమె భావిస్తున్నారు.
“ఒడిశాను కేవలం ఒక ప్రదేశంగా కాకుండా, నిరంతరం పరిణామం చెందుతున్న జీవన సంస్కృతిగా పాఠకులు అనుభూతి చెందేలా చరిత్రను ఆహారం, జ్ఞాపకాలు, ఆచారాలు, వ్యక్తిగత కథనాలతో అనుసంధానించడమే మా లక్ష్యం” అని పల్లవి వివరించారు. భారత్ వెలుపల గడిపిన సంవత్సరాలు కూడా పుస్తకాన్ని రూపొందించే విధానంపై ప్రభావం చూపాయి. సాంస్కృతిక కథలను అర్థం చేసుకోవాలంటే వాటి నేపథ్యాన్ని తెలుసుకోవడం ఎంతో అవసరమని ఆమె అభిప్రాయపడ్డారు. నేపథ్య సమాచారం లేకపోవడం వల్లే చాలామందికి ఒడిశా ఇప్పటికీ అంతగా పరిచయం కాలేదని అభిప్రాయపడ్డారు.
“భారత్ లో కాకుండా విదేశాల్లోనూ చాలామందికి ఒడిశా గురించి పెద్దగా తెలియదు. వారికి ఆ సంస్కృతిలోకి ప్రవేశించే సరైనమార్గం, పరిచయం లభించకపోవడమే ఇందుకు కారణం” అని రచయితలు అన్నారు. జర్నలిజంలో తన అనుభవం కూడా ఈ పుస్తకాన్ని రోపవండించడంలో తోడ్పడిందని దాస్ చెప్పారు. ప్రాంతీయ సంస్కృతులు, సంప్రదాయాలపై కథానాలకు ప్రస్తుతం మంచి ఆదరణ ఉందని ఆమె అన్నారు. విస్తృతమైన మూస అభిప్రాయాల కంటే ఆహారం, సంప్రదాయాలు, రోజువారీ జీవనచరిత్ర ద్వారా సంస్కృతులను తెలుసుకోవడంపై పాఠకులు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారని తెలిపారు.
‘ది ఒరిసన్’ ను కూడా ఇదే స్ఫూర్తితో రూపొందించాం. ఒక ఒడియా వంటకం గురించి తెలుసుకోవడమే కాకుండా, దాని వెనుక ఉన్న ప్రజలు, కథలు, నాగరికత గురించి తెలుసుకోవాలనే ఆసక్తి పాఠకుల్లో కలిగితే మా ప్రయత్నం సఫలమైనట్లే’ అన్నారు. ప్రతి సంస్కృతి కొత్త తరానికి చెందిన కొత్త గొంతుకలు దానిని తమదైన రీతిలో పునరవ్యాఖ్యానిస్తూ ఉన్నప్పుడే సజీవంగా ఉంటుందన్నారు. ఇదే ‘ది ఒరిసన్’ ద్వారా తాను సాధించాలనుకుంటున్న అసలు లక్ష్యమని దాస్ తెలిపారు. ఇప్పటికే చెప్పబడిన ఒడిశా కథలను కేవలం పరిరక్షించడమే కాకుండా, ఇంతవరకు వెలుగులోకి రాని కథలను చెప్పేందుకు ప్రజలను ప్రోత్సహించడమే తమ ఆకాంక్ష అని రచయితలు పేర్కొన్నారు.
ముగ్గురూ వేరు వేరు మార్గాల ద్వారా ఈ పుస్తకం వద్దకు వచ్చారు. ఇంటికి దూరంగా ఉన్న ఒక కుమార్తె, పాత జ్ఞాపకాలను పడిలాపరుచుకున్న ఒక తండ్రి, చరిత్ర మరిచిపోయిన వంటింట్లో ఏళ్ల తరబడి గడిపిన ఒక మహిళ. ఒడిషా తన ఆలయాలద్వారా ప్రపంచానికే అన్నదానం చేస్తున్నప్పుడు, తన స్వంతచరిత్ర కథలో ఎందుకు ఆకలితో మిగిలిపోవాలని వారు వేసుకున్న ప్రశ్న మేము ప్రశ్నించుకున్నాం. అ ప్రశ్నే తాళపత్ర గ్రంథాలు, రాజభవనాల పాకశాల రికార్డులు, వివిధ సామాజిక వర్గాల వంటింటి సంప్రదాయాలు మరియు ఎనమిదివందల ఏళ్లుగా మారకుండా వస్తున్న పండుగల క్యాలండర్ల గుండా మూడేళ్ళ సుదీర్ఘ ప్రయాణానికి నడిపించింది. పూరీలోని పవిత్రమైన మహాప్రసాదం నుంచి కోరాపుట్ గిరిజన హృదయాభుమి వరకు, కటకలోని ఒక అమ్మమ్మ చేతిగరిటవరకు ఇందులోని కథనాలు విస్తరించాయి. ముందేన్నడూ గ్రంధస్థం కాని విశేషాలను నమోదు చేయడమేకాదు, దాదాపుగా ఆంతర్ధానమైపోతున్న సంస్కృతిని పునరుద్ధరించారు.
నూయార్క్ లో ఉన్నప్పుడు “జీరోవేస్ట్”, “ఫార్మ్ టు టేబుల్”, “గట్ హెల్త్” అని వంటల్ని, కూరలని పిలవడం నేర్చుకున్నాను. నా అమ్మమ్మ ఏ ప్రత్యేకమైన పేరుపెట్టకుండా, రూపాయి ఖర్చు లేకుండా ప్రతిరోజూ ఉదయం పాటించిన విధానంకోసం నేను అక్కడ బజార్లకు భారీగా డబ్బులు చెల్లించాను.
ఆమె వంటింట్లో నారింజ తొక్కలు పచ్చడిగా మారేవి. గుమ్మడిపూలకు పిండి పట్టించి బజ్జీల్లా వేయించే వారు. అరటిబోదెలు రుచికరమైన కూరగా మారేవి. చేప తలలు కూరగాయల కూరల్లోకి వెళ్లేవి. ఆహారంగా మారే అర్హత ఉన్న ఏ పదార్థం కూడా ఆ వంటింటి నుంచి చెత్తగా బయటకు వెళ్లేది కాదు. ఇది ఆమె పుస్తకాల్లో చదివిన తత్వశాస్త్రం కాదు; ఆమె నేర్చుకున్న ఏకైక వంటవిధానం. రెండువేల ఐదు వందల సంవత్సరాలనాటి ఆ సుదీర్ఘ సంప్రదాయం ఆమె చేతుల్లో జీవించి ఉంది.
ఏదో ఒక రోజు ఆ చేతులు ఆగిపోతాయని, ఈ జ్ఞానాన్ని ఎవ్వరూ అక్షరబద్ధం చేయరేమో అన్న భయంతోనే నేను ఈ పుస్తకాన్ని ప్రారంభించాను అని పల్లవీ దాస్ అన్నారు. పూరీ జగన్నాథ ఆలయ వంటశాల (రోషఘర ) 150 అడుగుల పొడవు, 100 అడుగుల వెడల్పు, 20 అడుగుల ఎత్తు. గంగ, జమున అని పిలిచే రెండు పవిత్ర బావుల నుంచి ఇక్కడికి నీటిని తోడుతారు. రోజూ వేలాది మంది భక్తులకు వడ్డించిన్నప్పటికీ, ఈ వంటగదిలో ఆహారం ఎప్పుడూ తక్కువ కాదు. ఇది జగన్నాథుని లీల అని నమ్ముతారు. కట్టెల పొయ్యిలపై, మట్టి కుండలను ఒకదానిపై ఒకటి అమర్చి వంట చేస్తారు. వండే సమయంలో రుచి చూడటానికి అనుమతి ఉండదు.
చప్పన్ భోగ్ నుంచి కొన్ని ప్రత్యేక ప్రసాదాలు: కనిక (ఖనిక): నెయ్యి, ఎండుద్రాక్షలతో చేసిన తియ్యని అన్నం. ఖేచుడి (ఖేచుది ): పప్పు మరియు బియ్యంతో చేసే కిచిడి.
దధి పఖాల (దహి ఫఖల): పెరుగుతో కలిపి పులియబెట్టిన అన్నం.
రసబలి (ఋఆసబలి): వేయించిన జున్ను (చేనా) బిళ్ళలను, సుగంధద్రవ్యాలు కలిపి మరిగించిన పాలలో నానబెట్టి చేసే తీపి వంటకం.
ఘీ అన్న (ఘీ అన్న): పవిత్రమైన నెయ్యితో అలంకరించిన స్వచ్ఛమైన తెల్లని అన్నం.

పుస్తక సమీక్ష : దీక్షితుల సుబ్రహ్మణ్యం, రాజమహేంద్రవరం
More Stories
విద్యారణ్యస్వామి గురించిన ఉపన్యాసము
రాణి రుద్రమదేవి పైన ఉపన్యాసము
పండరంగని అద్దంకి పద్యశాసనం – తెలుగుభాషా చరిత్రలో అక్షరజ్యోతి