మల్లంపల్లి సోమశేఖరశర్మ గారు రచించిన చారిత్రక వ్యాసమంజరి నుండి సేకరణ
శ్లో॥ కేచి ద్దేశాధిపత్యం కతిచన శిబికాచామరచ్ఛత్రశోభాం
కేచిద్రాజ్యం స్వకీయం కతిచిన విభవై రగ్రహారా సుదారాన్
విదంతే లోకరక్షావిధిమహితమహాభాగ ధేయేఽన్న వేమ
క్షోణీపాలే సభాయాం సకల గుణనిధౌ రత్న సింహాసనస్థే
ఈ పైశ్లోకము అనవేమారెడ్డిగారి వానపల్లి శాసనములోనిది. ఇది శాలివాహనశకము 1300 నాటిది. “సకలగుణములకు నిధియైనటువంటియు, లోకరక్షణము నిమిత్తము గొప్పదైన తన మహాభాగధేయమునంతయు వినియోగించు చున్నటువంటియు అనవేమ మహారాజులుంగారు కొలువుకూటములో రత్నసింహాసనము మీద కూర్చుండి ప్రజాపరిపాలనము చేయుచుండగా కొందఱు దేశాధిపత్యమును బడయుచుందురు; మఱికొందరు పల్లకులు, చామరములు, ఛత్రములు – ఈ విధమగు గౌరవసమ్మానములను బడయుచుందురు; వేరొక కొందరు తాము గోల్పోయిన తమ రాజ్యమును బడయుచుందురు; ఇంక కొందఱు భాగ్యవంతములైన యగ్రహారములను బడయుచుందురు.” అని పై శ్లోకమున కర్థము. ఈ శ్లోకము అనవేమారెడ్డిగారి యాస్థానమున నిత్యము జరుగు కార్యక్రమమును దెలుపుచున్నది: అనగా శాలివాహన శకము 1300 ల ప్రాంతముల నాంధ్ర దేశములోని సంస్థానములలో అదియే పరిపాటియైన దైనిక కార్యక్రమమని నిశ్చయింప వచ్చును.
హిందూరాజ్యతంత్రము మనువు నుండి మహమ్మదీయ పరిపాలనము వఱకు ఎచ్చటనో స్వల్ప విషయములలో దక్క, సాధారణముగ నన్ని ముఖ్య విషయములలోను ఒక్కరీతి నుండుటచేత హిందువుల పరిపాలనమున గొంచె మించుమించుగ ప్రతి శతాబ్దిలోను రాజాస్థానముల నడచుచువచ్చిన కార్యక్రమ మదియేనని కూడ నుడువవచ్చును. అందువలన రెడ్డిరాజులు పరిపాలించుచుండిన తణి పరిపాలన మేరీతినుండెనో పల్లవులనాడును, చాళుక్యులనాడును, చోళులనాడును తుదకు కర్ణాటాధీశుల కాలమునను గూడ అట్లే యుండునని నిశ్చయింపవచ్చును. ఈ విధమైన పరిపాలనములో ప్రధానముగ ప్రజలను శాసించువాడు రాజు; దేశమును పాలించువాడు రాజు; రాజు రాజ్యపాలనమును నడుపుటకొఱకు దేశమును రాజకీయముగా ఇప్పుడు ఫిర్కాలు, తాలూకాలు, జిల్లాలకువలెనే పూర్వకాలమున నాడులక్రిందను, స్థలములక్రిందను, సీమలక్రిందను, ఇంక ననేకములైన విభాగములుగ చేయువాడు. ఈ విధమైన రాజకీయ విభాగములు కాలక్రమమున రాజ్యతంత్రము వికసించినకొలదియు వచ్చినవేకాని మొట్టమొదటినుండియు అనగా నత్యంత ప్రాచీనకాలమునుండియు వచ్చినవి కావు. మొట్టమొదట నేర్పడిన గొప్ప రాజ్యవిభాగమున కుండిన పేరు ‘ఆహార’మని, క్రమముగా నాపేరు మారిపోయెను. మారిపోవుటతో ఆపేర బరగు రాజ్యవిభాగమునకుండు విస్తీర్ణతయు సంకుచిత మయ్యెను. పిదప నేర్పబడిన రాజ్యవిభాగమునకు వచ్చిన పేరు ‘విషయ‘మని విషయమునకే ‘నాడు‘ అనియు పేరు. ఇదియే కాలక్రమమున స్థిరమైపోమెను. ఇది బ్రాహ్మణ్యమునకు పటుత్వమును, బలమును వచ్చిననాటికి స్థిరమైన పేరగుటచేత ఆయా నాడులలోని బ్రాహ్మణుల కాయా‘నాటి‘ వారని పేరు కలిగెను; ఎట్లన వేగినాటిలోనివారు వేగినాట్లు, వెలనాటిలోనివారు వెలనాట్లు. ఈ విధమున రాజకీయముగ నేర్పడిన నాటి విభాగము బ్రాహ్మణులలో అంతశ్శాఖా ప్రాదుర్భావమునకు మూలకందమయ్యెను. ఈ నాటి విభాగమున ‘స్థల‘మను మఱియొక విభాగము వచ్చెను. కాలము గడిచిన కొలది ఈనాటి విభాగము కొన్ని కొన్నిపట్ల సంతరించియు, మఱికొన్నిపట్ల నుండియుగూడ సీమావిభాగమునకు తావొసంగెను. కర్ణాటక రాజుల కాలముననే సీమావిభాగము మొట్టమొదట ఏర్పడినట్లు తెలియవచ్చుచున్నది. సీమావిభాగములో ‘నాటి‘ విభాగ మంతస్థ్సితమయ్యెను. కొన్ని కొన్ని యెడల నాడులలోనే సీమావిభాగము నుండుటయు గలదు. కాని పైనుడివినదే సాధారణపద్ధతి. ఇదికాక చావడులు, వళితములు, కంపనములు – ఈ విధములైన విభాగములును ఏర్పడినవి. కాని యీ రాజకీయ విభాగములకు ఇప్పటి ఫిర్కా, తాలూకా, జిల్లాయను రాజకీయ విభాగములకు నొక గొప్ప విభేదము కలదు; అది యేదనగా నిప్పటి రాజకీయ విభాగములు పరిపాలనా సౌకర్యములను మాత్రమే యాలోచించి చేయబడినవి. పూర్వపు రాజకీయ విభాగము లట్లుకాక రాజ్యమునకు వచ్చు వరుంబడి‘ ననుసరించి యేర్పాటు చేయబడుచుండెడివి.
ఈ విధమున నొక్కొక్క విభాగమునకు నిర్ణీతమైన రాబడి యుండెడిది. అంత రాబడివచ్చు నారాజ్య విభాగముతోపాటు కొన్ని సంఖ్యలు కూడ పేర్కొనంబడు చుండెడివి. ఎట్లనగా వేంగినాడు పదహారువేలు, కొండపడమటినాడు దెబ్బది మూడు. కొండపల్లినాడు మూడువందలు, పాకనాడు ఇరువదియొక్కవేయి. కొన్ని కొన్ని చోట్ల చిన్న చిన్న స్థల విభాగములకు నిట్టి సంఖ్యలు కలవు. (ఉదా: బెల్వోల 12) ఒక్కు శాసనములే కాదు! గ్రంథములును ఇటువంటి సంఖ్యలను పొందుపఱిచి యుంచినవి. పాల్కురికి సోమనాథుడు తన పండితారాధ్య చరిత్రమున సాధారణముగ సుప్రసిద్ధమైన భరతఖండ దేశములను పండితారాధ్య చరిత్రమున శ్రీశైలప్రకరణమున నీక్రిందిరీతిని చెప్పియున్నాడు.
ఎంతెంత బరుసదా నేతెంచి చొచ్చు, నంతంత విస్తీర్ణమగు శివాలయమున
ఎంతెంత బరుసతా నేతెంచి కాంచు, నంతంత యున్నతంబగు లింగమూర్తి లక్షింపగ సపాదలక్షనేపాళ, మీక్షింపగ సపాద లక్ష సంజనిత (?)
లక్షింపగ సపాద లక్ష కేదార, మీక్షింపగ సపాద లక్ష దిర్హీర్తి
లక్షింపగ సపాద లక్ష కాశ్మీర, మీక్షింపగ లక్ష కన్నోజ
లక్షింపగ సపాద లక్ష కొంకణము, నీక్షింప శిరహట్ట మిల సప్తలక్ష
క్రమమొంద సాళ్వాధరం బది లక్ష, ప్రమితియౌ దశలక్ష బంగాళ భూమి
గుఱి సప్తతి సహస్ర గుజరాష్ట్రభూమి, మఱి యట దశలక్ష మాళవభూమి
జానొంద నివలి పంచద్రావిళముల, లో నవలక్ష తెలుంగు దీనికిని
ఇమ్మడి ముమ్మడి యితరదేశములు, నిమ్మహి దేశంబు లెన్నంగ నేల– పర్వతప్రకరణము
ఈ సంఖ్య దేనిని తెలుపునో, ప్రాచీన శాసన పరిశోధకులు చాలవఱకు చర్చించియున్నారు. ఒకటి రెండు కన్నడ శాసనముల యాధారమున ఇది ఆ రాజ్యవిభాగమునకు వచ్చు నిష్కాదాయమును, మఱికొందఱిది ఆ విభాగపు జనసంఖ్యను, వేరొక కొందఱిది గ్రామసంఖ్యను సూచించు ననిరి. ఒక విధముగ ఈ కడపటిదే సరియైన యూహయని తెలియును. మంచెన కవి తన కేయూరబాహు చరిత్రమునందు.
కన్నడసీమలోని గదగ్, అజ్జిగెర, కుర్తకోట, నర్గుండు, బెల్గాము జిల్లాలోని హుళి, తెలంగాణలోని కుక్కనూరు కలిపి బెల్వలనాడు అని ప్రాచీనాంధ్ర చారిత్రక భూగోళములో పేర్కొనబడినది.
..……………ఏకవింశతి సహస్ర గ్రామసంఖ్యాకమై
ధరణిం బేర్చిన పాకనాడు….
అని పాకనాడు ఏకవింశతి సహస్ర గ్రామ సంఖ్యాకమని చెప్పియున్నాడు. అనగా పాకనాటిలో ఇరువది యొక్క వేయి గ్రామములు కలవని తెలియుచున్నది. కాని ఇది సరిగా గ్రామములే యన్న యెడల ఇప్పటి లెక్కల ప్రకారము చూచినచో నిది యసంబద్ధముగ కాన్పించును; కావున ఈ సంఖ్య విస్తీర్ణతను దెలుపునని యూహించుట సమంజసము. నాడులకు జేర్పబడు ఇట్టి సంఖ్యలకు గ్రామము అన్నమాట చేర్చినను చేర్చకపోయినను మంచనకవి కేమూర బాహు చరిత్రమును బట్టియు, పండితారాధ్య చరిత్రమును బట్టి అది విస్తీర్ణతనే తెలుపునని నిశ్చయముగ నమ్మదగును. అందువలన వేంగి పదాఱు వేలు అనగా వేంగి పదహాఱు వేల గ్రామముల విస్తీర్ణత కలది అని అర్థము. ఇట్లే ఇతర నాడులను దెలిసికొనునది.
ఇందువలన ఆ సంఖ్య విస్తీర్ణతను దెలుపునని మనకు దెలిసినది. అందువలన గ్రామమన్ననేమో తెలిసికొనవలెను. గ్రామమనగా మనము నివసించు గ్రామమని కాదు. ఇక్కడ తీసికొనదగినది, దానిని కొలత కొలుచుటలో నుపయోగపడు కొలమానముగనే గ్రహించవలెను. అనగా నిప్పుడు భూమిని కొలుచుటలో చతురపు మైళ్ల నెట్లు వినియోగించుచున్నారో పూర్వము దేశమును కొలుచుటలో గ్రామము అను కొలత నుపయోగించువారు. అనగా ఇప్పుడు చతురపు మైలు భూమి కొలతకు ‘యూనిట్‘ ప్రధానమానము. అప్పుడు గ్రామము ప్రధానమానముగ నుండెను. పరిపాలనా విధానమున కంతకు గ్రామమే యెట్లు పునాదిగ నుండెడిదో అట్లే దేశపు కొలతకు గ్రామమే పునాదిగా నుండెడిది. అట్లయిన గ్రామమన్న నెంత కొలత? శుక్రనీతిసారమున పరిమాణములను గుఱించి తెలుపు సందర్భమున గ్రామమన్న క్రోశ విస్తారము లేక వైశాల్యము కలదియని ఈ క్రింది శ్లోకమున నిట్లు తెలుపబడి యున్నది.
భవే త్రోశాత్మక గ్రామో రూప్యకర్ష సహస్రకః
గ్రామార్ధకం పల్లీ సంజ్ఞం పల్యర్ధం కుంభసంజ్ఞకం|| 1
దీనిని బట్టి క్రోశము పొడవును, క్రోశము వెడల్పును గల భూభాగమునకు గ్రామమని పేరు. పాకనాడిరువది యొక్కవేయి గ్రామములనగా ఆ నాటి యొక్క వైశాల్యము గ్రామమునకు చెప్పబడిన వైశాల్యమునకు ఇరువది యొక్క వేయింతల వైశాల్యము కలది అని మన మర్థము చేసికొనవలెను. (ఇందు క్రోశపరిమాణమెంతో తెలుసుకొనవలసి యున్నది.)
ఇంతటి వైశాల్యముగల రాజ్యమును ఒక్క రాజు పరిపాలించుట దుర్ఘటము గనుక ఒక్కొక్క పెద్ద విభాగమునకు ఇప్పుడు తహశీల్దారు, సబుకలెక్టరు, కలెక్టరులకు వలెనే రాజు కొంతమంది యాధికారులను నిర్ణయించువాడు. వారందఱు సర్వసామాన్యముగా సామంతులు. అనగా రాజునకు ప్రతి సంవత్సరము కొంత కప్పము కట్టుచు యుద్ధసమయములందు దమ తమ సేనలతో తోడ్పడవలెను. ఇట్టి సామంతులందఱు రాజునకు సేనానాయకులుగను ఆయా విభాగములకు నాయా దిశలకు వారు ఆలోచన చెప్పు మంత్రులుగను పరిగణింపబడుచుండువారు; అనగా రాజు ఆయా విభాగములకు రణరంగకుశలురు, యుద్ధనీతి నిపుణులయిన వారిని నియమించువాడు. వారు కార్యనిర్వహణమునందును; ఖడ్గనిర్వహణమునందును గూడ దక్షులయి యుండువారు. సైన్యాధిపతులే సామంతులై యుండి, సామంతులే సైన్యాధిపతులై యుండి, పరిపాలన మంతయు వారి చేతుల మీదనే సాగుచుండుట వలన మన పూర్వులది సైనికపరిపాలన మనవచ్చును. ఆ పదమునకు ఈ బ్రిటిషు ప్రభుత్వమువారి హయాములనున్న యర్థమును మాత్రము చెప్పరాదు. కాని యొక విధముగ స్వభావమునుబట్టి యది సైనిక పరిపాలనమే. రాజు సర్వసైన్యాధిపతి; యుద్ధాధిష్ఠానదేవత; సామంతులు ఉపగ్రహములు. దీనిని బట్టి మనము గ్రహించవలసిన విషయమిది:- వీరందఱు రాజును – రాజప్రతినిధులును కూడ శిక్షించుటకు‘ యేర్పడినవారలే, వారి అధికారముయొక్క యోగ్యతనుబట్టి వీరందఱు ప్రజలకును రాజునకును మధ్యవారు: ప్రజలను గలుపు లింకులు, సూత్రములు. అందువలన వారిని రాజుయొక్క ఏజెంట్లు, కార్యకర్తలు, ప్రతినిధులు అనవచ్చును. వీరలెల్లరు ఆయా గ్రామముల నుండియు తద్వారా ఆయా రాజ్య విభాగముల నుండియు రాజునకు చెల్లించవలసిన పన్ను వసూలుచేసి రాజునకు ముట్టజెప్పుచు, ధర్మాతిక్రమణశిక్షణము నధికారులై యుండువారు. రాజుయొక్క యుద్యోగులగుటచే తనకు ప్రతినిధులుగ బనిచేయు చున్నందులకు రాజే వారికి గొంత ప్రతిఫలము వేతనమును, రొక్కము రూపమునగాని, లేక రాజునకు వసూలు చేసి యిచ్చు మొత్తములో నింతయని యొక నిర్ణీతమగు రుసుము రూపమునగాని, లేక తన క్రిందనుండు గ్రామములలో గొన్నిటిరూపమునగాని యొసంగువాడు. ఇట్టి ప్రతినిధులను రాజు ఎట్లు ఏర్పాటుచేయవలెనో అట్టి ప్రతినిధుల యొక్క ధర్మములేవో ప్రతిఫలమేదో మానవ ధర్మశాస్త్రమను గ్రంథమున నీ దిగువ రీతిని దెలుపబడినది.
గ్రామస్యాధిపతిం కుర్యాద్ధశగ్రామపతి తథా
వింశతీశం శతేశంచ సహస్రాధిపతిం తథా॥
గ్రామే దోషాన్ సముత్పత్నాన్ గ్రామిక శ్శనకై స్స్వయం॥
శంసేద్దామ దశేశాయద శేశో వింశతీశినే॥
వింశతీశస్తు తత్సర్వం శతేశాయ నివేదయేత్|
శంసేద్దామశతేశస్తు సహస్రపతయే స్వయం||
యానిరాజప్రదేయాని ప్రత్యహం గ్రామవాసిభిః॥
అన్నపానేంధనాదీని గ్రామికస్తాన్యవాప్నుయాత్॥
దశీకులంతు భుంజీత వింశ పంచకులానిచ|
గ్రామం గ్రామశతాధ్యక్షః సహస్రాధిపతిః పురం||
రాజు గ్రామమునకు, పది గ్రామములకు, ఇరువది గ్రామములకు, నూరు గ్రామములకు, వేయి గ్రామములకు అధిపతుల నేర్పరుపవలెను. గ్రామములో బుట్టు చోరాదిదోషములను గ్రామాధిపతి తాను తీర్చవలెను. అట్లు తీర్చుటకు తనకధికారము చాలనిచో పదిగ్రామముల కధిపతి యైనవానికి తెలియజేయవలెను. ఇటులే ఆయాయధిపతులు ఆయా దోషములు చేసిన వారిని విచారించుటకు చాలనప్పుడు తమ పైవారికి దెలుపుచుండవలెను. ప్రతిదినము ఆయా గ్రామస్థులు రాజకీయ నిర్ణీతమైన అన్నపానేంధనాధికములు, రాజప్రతినిధిగ వ్యవహరించు గ్రామాధిపతి కొసంగుచుండవలెను. పదిగ్రామముల కధిపతియైనవాడు ఒక కులముభూమిని తన జీవితార్థ మనుభవించవలెను. రెండు నాగళ్ల చేత దున్నబడజాలు భూమికి కులమని పేరు. ఇరువది గ్రామముల కధిపతియైనవాడు అయిదుకులముల భూమి ననుభవించవలెను. శతగ్రామముల కధిపతియైన వాడొక గ్రామమును, సహస్రగ్రామముల కధిపతియైన వాడొక పురమును అనుభవింపవలెను. అని పై శ్లోకముల తాత్పర్యము.
రాజప్రతినిధులై ఆయా యధిపతులు విశృంఖలముగ సంచరించి ప్రజా కంటకులుగ ప్రవర్తింతురేమో యని యట్టివారి చర్యలను ప్రజాక్షేమము నిమిత్తము రాజు చారులను నియోగించి తెలిసికొనుచుండవలెనని ధర్మశాస్త్ర విశారదుండైన మను విట్లు చెప్పుచున్నాడు :
సతానను పరిక్రామే త్సర్వానేవ సదా స్వయం,
తేషా వృత్తం పరిణయే త్సమ్యగ్రామేషు తచ్చరైః
దుష్టశిక్షణమునకును, ధర్మరక్షణమునకు మాత్రమే రాజు నియోగింపబడిన వాడనియు, ప్రజలయొక్క క్షేమమే రాజు లక్ష్యమునం దుంచుకొనవలసిన ముఖ్య విషయమనియు పైవిషయములవలన తెలియగలదు. అందువలన రాజుయొక్కగాని, అతని ప్రతినిధియొక్కగాని నిర్వర్తింపవలసిన ధర్మము ద్వివిధమని నిశ్చయింప వచ్చును. (1) దుష్టులను శిక్షించి శిష్టులను రక్షించి ధర్మమును కాపాడుట ప్రజలకు, (2) పరరాజులవలని యుపద్రవములు రాకుండ పరిరక్షించుట. ఇవియే వారి విధులు. ఇది యంతయు ప్రాచీన హిందూరాజధర్మ పరిపాలనాక్రమము.
ఇది యంతయు రాజధర్మ పరిపాలనాక్రమమైన ప్రజాపరిపాలనాక్రమము పూర్వము ఎట్లుండెడిది అనుప్రశ్న కలుగవచ్చును. రాజపరిపాలనమనగా పూర్వము ‘ధర్మ‘ పరిపాలన మనియే మనమర్థము చేసికొనవలసియుండును. అందువలన ప్రాచీన రాజపరిపాలనమున నొకరీతిగ ప్రజాపరిపాలనము లేదనియే నుడువదగును. ప్రాచీన కాలమున రాజపరిపాలనమునకు భిన్నమైన ప్రజాపరిపాలనము నిజముగా ప్రజల చేతులలోనే యుండెడిది.
(జయంతి – 1928)
(“దేశము పట్టనంత కవి” శ్రీ విశ్వనాథ సత్యనారాయణగారి సంపాదకత్వంలో వెలువడేది జయంతి. 1927 నుండి మాసపత్రికగా వెలువడుతూ ఒక్క సంవత్సరంకంటే మనలేదు. ఈ పత్రిక, వ్యావహారిక భాషావాదానికి పెద్దపీట వేసింది.)
More Stories
పండరంగని అద్దంకి పద్యశాసనం – తెలుగుభాషా చరిత్రలో అక్షరజ్యోతి
వనపర్తి సంస్థానంలోని ప్రత్యేక మైన నీటిపారుదల ప్రాజెక్టు
గద్వాల్ రాణి ఆదిలక్ష్మీ దేవమ్మ అద్భుత పోరాటం