ఆచార్య బిరుదురాజు రామరాజు

– రామకృష్ణ వెల్లంకి

కష్టపడే వాళ్లని సాధారణ మానవులుగా

కష్ట పెట్టే వాళ్లని రాక్షసులుగా

కష్టమెరుగని వాళ్లని దేవతలుగా

సర్వ సంగపరిత్యాగులను యోగులుగా…..

లెక్కించవచ్చు. అలాంటి యోగుల జీవిత చరిత్రలను తెలుసుకోవడం, అన్వేషించడం అలాగే వారి చరిత్రలను గ్రంధస్తం చేయడం అనేది ఒక సత్కారమేనని  చెప్పవచ్చు. అంతటి మహాపురుషుల జీవితాలను సంకలనం చేసిన ధన్యజీవి బిరుదురాజు రామరాజు గారు. రామరాజు గారు వరంగల్ జిల్లా దేవనూరు గ్రామంలో 16-04-1925 లో జన్మించారు

మనం మట్టి తీసుకుంటే మట్టి పాత్ర తయారువుతుంది. వెండి తీసుకుంటే వెండిగిన్నె, బంగారం తీసుకుంటే బంగారు పాత్ర తయారువుతుంది. అలా సాహిత్యం ను తీసుకుని జన హితం కై రచనలు చేసిన వ్యక్తి రామరాజు గారు.

మనిషి బుద్ది జీవి . ఎప్పుడు నిత్యాన్వేషిగానే వుండాలి. ఇలాంటి సూత్రం  ఆచరించిన రచయిత రామరాజు గారు.  అందుకే తెలుగు సాహిత్యం  60 దశకంలో వున్నపుడు అప్పటి వరకు తెలుగు సాహిత్యంలో స్పృశించని అంశం – జానపదంపై పరిశోధనకు పూనుకున్నారు. అస్సలు జానపదంనే సాహిత్యంగా అంగీకారించలేని రోజులలో వారి పర్యవేక్షకులు ఖండవల్లి గారి ప్రోత్సాహంతో తెలుగు జానపద గేయ సాహిత్యం అనే గ్రంధం  17 ప్రకరణలతో తీసుకునివచ్చారు. ఇదీ 1972 లో M.A చదివే విద్యార్థులకు పాఠ్యాంశం గా ఉండేది. ఇప్పటికి కూడా  జానపదం పై పరిశోధనలు చేసే విద్యార్ధులకు ఇదే  ప్రామాణిక గ్రంధం

తెలుగు సాహిత్యంలోనే కాదు ప్రపంచ సాహిత్యంలోనే యోగుల పై ఏకమొత్తంగా ఒక గ్రంధం రావడం అరుదైన విషయమేరామరాజు గారు యోగుల జీవిత చరిత్రలను ఒక్కటి కాదు రెండు కాదు 7సంపుటాలుగా వందలాది యోగుల జీవితాలను సంకలనం చేసి మనకు అందించారు. ఒక క్షుద్రుడిలా జీవించడం వీరికి ఇష్టం వుండదు. అందుకే జీవితానికి ఆధ్యాత్మికతను జోడించి ఆంధ్ర యోగులు అనే చక్కని మంచి గ్రంధాలను తేగలిగారు. వీరి ప్రతిభకు సకాలంలో సరియైన పదవులు దక్కకపోయినా,  వీరు కృంగిపోలేదు. భగవదిష్టమే తన ఇష్టం గా మలుచుకొని ముందుకి  సాగారు

మహా పరిశోధకులు వేటూరి ప్రభాకరశాస్త్రి గారి ఒక పొరపాటును వీరు సవరించారు. వేటూరి తన చాటు పద్య మంజరి లో రాయలు వారిని మెప్పించిన బొడ్డుచర్ల తిమ్మన అనే వ్యక్తీ,   ప్రసన్న రాఘవ నాట్య ప్రబంధం రాసిన తిమ్మన ఒక్కరే అనీ ప్రతిపాదన చేసారు. కానీ రామరాజు గారు పై గ్రంధాలను సంపాదించి 1962 లో పరిష్కారం చేసి ప్రరోచన అనే ముందుమాట రాస్తూ వీరిద్దరూ వేర్వేరు అనీ ఖచ్చితత్వంతో నిరూపణ చేసారు. గ్రంధ పరిష్కరణ అనేది కవికో రచయితకో సాధ్యమయ్యేది  కాదు,  కేవలం సాహిత్యంలో ఉద్దండ పండితులు మాత్రమే చేయగలిగేది. అలాంటి పండితులే రామరాజు గారు.

అంతేకాదు వెయ్యి స్తంభాల శాసనంజిన వల్లభుని శాసనం మరియు  గంగాధర శాసనం వంటివి వెలుగు చూడడానికి రామరాజు గారే ప్రధాన పాత్ర పోషించారు.

అంతే కాకుండా జానపద సాహిత్యం పై ఎన్నో విలువైన వ్యాసాలు రాసారు. తెలుగులో జానపద రామాయణం అని  రాసినా,  వీర గాధలను సేకరించినా, పిల్లల పాటల గురించి చెప్పినా అన్నీ కూడా సాహిత్యం లో ఉత్తమ గ్రంధాలుగా నిలిచాయితెలుగు వారికి జానపద సాహిత్యం ను కుప్పలు తెప్పలుగా పోసి వాగ్దేవిని  అభిషేకించి జానపద వాజ్మయ బ్రహ్మగా పేరును పొందారు,  బిరుదురాజు రామరాజు గారు. చివరిగా వీరు సేకరించిన జానపద తత్త్వ గేయం తోనే ముగిస్తూ……

దారి వచ్చితివో

దారినే పోవ

ఇక జన్మమే లేదా చిలుకా

నీకిష్టమగు నామ

మైదియైనను కాని

నిత్యమనుచుండవే చిలుకా

అనగనగా నామమే

మనకుండినను గూడ

అన్నయట్లే యుండు చిలుకా

కాలంబు గడువగా గడువగా

అదీ విశ్వగానమైపోవునే చిలుకా….