ధీరన్ చిన్నమలై

– రామకృష్ణ వెల్లంకి

ధీరన్ చిన్నమలై అసలు పేరుతీయాగరాజ చెట్టిగౌండర్. ఆయన 1756లో ఏప్రిల్ నెల 17 తేదీన  తమిళనాడులోని ఎరోడ్ జిల్లాలోని మేలపాళయంలొ జన్మించారు. ఆయన గౌండర్ తెగకు చెందినవాడు. చిన్నతనంలోనే ఆయన మంచి విద్యాభ్యాసం చేశాడు, ప్రత్యేకించి సాంప్రదాయ యుద్ధకళలలో ప్రావీణ్యం సంపాదించాడు.

టిప్పూ సుల్తాన్ బ్రిటిష్ వారిపై పోరాటం చేసినప్పుడు, ధీరన్ చిన్నమలై కూడా బ్రిటిష్ వ్యతిరేక సైనిక కార్యకలాపాల్లో పాల్గొన్నాడు. 1799లో టిప్పూ సుల్తాన్ మృతి చెందిన తర్వాత, ధీరన్ చిన్నమలై స్వతంత్రంగా బ్రిటిష్ వ్యతిరేక పోరాటాన్ని కొనసాగించాడు. చిన్నమలై తన అనుచరులతో కలిసి బ్రిటిష్ సైన్యాన్ని ఓడించాడు. ఇది బ్రిటిష్ పాలకులకు పెద్ద ఎదురుదెబ్బగా మారింది.

బ్రిటిష్‌ వారితో జరిగిన మరో యుద్ధంలో కూడా  ధీరన్ చిన్నమలై విజయం సాధించాడు. విజయాలతో చిన్నమలై పేరు తమిళనాడులో శత్రువులకు భయంకరంగా మారింది.

బలగాలను సమీకరించుకున్న బ్రిటీషు వారు ధీరన్ చిన్నమలై ను వెంబడించారు. ధీరన్ చిన్నమలై భద్రత కోసం కొంతకాలం అడవులు, కొండ  ప్రాంతాల్లో దాక్కున్నాడు. కానీ, తనవారిలోని ఒక వ్యక్తి ద్రోహం చేయడంతో ఆయనను బ్రిటిష్ సైన్యం పట్టుకొని 1805లో పట్టిక్కరనపాళయంలో ఉరితీశారు.

ధీరన్ చిన్నమలై స్మారక భవనంతమిళనాడులో ఎరోడ్ జిల్లాలో ఆయన జ్ఞాపకార్థం నిర్మించబడింది. తమిళనాడులోని పలు ప్రదేశాల్లో ఆయన విగ్రహాలను ఏర్పాటు చేశారు. ధీరన్ చిన్నమలై పేరుతో రహదారులు, స్టేడియంలు నిర్మించితమిళ ప్రజలు ఆయన త్యాగాలను మరువకుండా ప్రభుత్వం పలు రకాలుగా గుర్తింపునిచ్చింది.

ధీరన్ చిన్నమలై బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన గొప్ప యోధుడు. ఆయన భారత స్వాతంత్ర్య పోరాటంలో కీలక పాత్ర పోషించాడు. 1805లో బ్రిటిష్ వారిచే ఉరితీయబడినప్పటికీ, ఆయన వీరోచిత పోరాట గాధలు తమిళ ప్రజల గుండెల్లో సజీవంగా ఉన్నాయి.

ధీరుడైన చిన్నమలై త్యాగం ఎప్పటికీ మరువలేనిది!”