నవయుగ కవి చక్రవర్తి, కవి కోకిల, కవితా విశారద, మధుర శ్రీనాథ వంటి బిరుదులతో అలరారిన జాషువా అచ్చమైన జాతీయ భావాలు కలిగిన గొప్ప దేశభక్తుడు. గుర్రం జాషువా 1895 సెప్టెంబర్ 28 న గుంటూరు జిల్లా వినుకొండలో గుర్రం వీరయ్య లింగమాంబ దంపతులకు జన్మించాడు. తల్లిదండ్రులు క్రైస్తవ మతావళంబికులైనప్పటికీ జాషువా మాత్రం అచ్చమైన జాతీయవాదిగా ఈ దేశ సాంస్కృతిక వారసత్వాన్ని అందిపుచ్చుకొని మహాకవిగా ఎదిగాడు.
దేశమంటే ఎనలేని ప్రేమ. ఈ దేశ సంస్కృతి పై అచంచలమైన విశ్వాసం, అంతులేని గౌరవం వెరసి జాషువా విశ్వనరుడైనాడు.
ఆయన సాహిత్య తాత్విక భూమిక ఏమిటంటే విశ్వ మానవ కల్యాణం, సమాజపు అసమానతలు తొలగి మానవులంతా సమానం అనే భావనను పాదుకొల్పడం.తెలుగు నుడికారాన్ని, సీస పద్యాల చమత్కారాన్ని,ప్రాచీన పద్యపు ఇంపును, తెలుగు భాషా ఆధునిక సొంపును అక్షరక్షరంలో ఒంటబట్టించుకున్న కవి జాషువా. పదలాలిత్యంతో పాఠకులనందరిని ఆకట్టుకున్న కళా ప్రపూర్ణులు వారు.నాటి సామాజిక అసమానతలు, కుల పట్టింపులు, కులవివక్ష జాషువా హృదయాన్ని కలసివేశాయి. జాషువా ఎదుర్కొన్న కుల వివక్ష,ఎదురైన తిరస్కారాల అనుభవాలు ఆయనలో భావావేశ తీవ్రతను పెంచి కవిత్వ రూపంలో ఆవిష్కృతం చేశారు. అసమ సమాజం బాకులు గుమ్మినప్పుడు, అంటరానితనం విషాజ్ఞులు చిమ్మినప్పుడు, దుర్భర దారిద్యం వెన్నాడినప్పుడు,దురంతవేదన గుండెల్లో తుకతుక ఉడికినప్పుడు జాషువా గుర్తుకొస్తాడన్న సినారే మాటలు అక్షర సత్యాలు. అంతమాత్రాన జాషువా ఈ సంస్కృతిని, ఈ దేశాన్ని ఏనాడు తులనాడలేదు. ఈ దేశంలో ఉన్న వివక్షను ఏకిపారేశాడే కానీ తన రాతల ద్వారా ఈ దేశంపై, ఈ సంస్కృతిపై, ఈ ధర్మంపై ద్వేషాన్ని నింపలేదు.
తన ఆవేదనను తన ఆక్రోశాన్ని వెల్లడించాడే తప్ప ఈ సంస్కృతి మీద అక్కసు వెళ్ళగక్కలేదు. ఈ సమాజంలో తన రచనల ద్వారా అశాంతిని నింపలేదు.వేర్పాటు వాదాన్ని, విభజన సిద్ధాంతాన్ని ప్రోత్సహించలేదు. పైపెచ్చు ద్విగుణీకృతమైన జాతీయ భావజాలాన్ని, తన గుండెల నిండా నింపుకొని దేశమాతను కీర్తించిన గొప్ప దేశభక్తుడు జాషువా..తన మొదటి ఖండకావ్యంలోనే మొట్టమొదటి ఖండికలో భరతమాతను కీర్తించడంతోనే తన ఖండకావ్యాల రచన ప్రారంభించడం వారికి గల దేశభక్తి నిదర్శనం.
సగరమాంధాత్రాది షట్చక్రవర్తుల
యంకసీమల నిల్చినట్టి సాధ్వి,
కమలనాభుని వేణుగానసుధాంబుధి
మునిఁగి తేలిన పరిపూత దేహ,
కాళిదాసాది సత్కవికుమారులఁ గాంచి
కీర్తినందిన పెద్ద గేస్తురాలు,
బుద్ధాదిమునిజనంబుల తపంబున మోద
బాష్పము ల్విడిచిన భక్తురాలు.
సింధుగంగానదీజలక్షీర మెపుడుఁ
గురిసి బిడ్డలఁ బోషించుకొనుచు నున్న
పచ్చి బాలెంతరాలు మా భరతమాత
మాతలకు మాత, సకలసంపత్సమేత.
సకల సంపత్సమేత అనడంతో బంకించంద్రుని వందేమాతరం గుర్తుకు రావడం ఖాయం. నేడు ఈ దేశాన్ని వ్యంగ్యంగా చిత్రిస్తూ భారత్ ను మాత అనడమేమిటంటూ వెకసక్కాలాడుతూ హేళన చేస్తున్న ముష్కర మూకలకు జాషువా ఈ పద్యం సమాధానం చెబుతుంది. విభజన వాదుల నోళ్లకు తాళం వేసే విధంగా అమ్మ భారతిని అద్భుతంగా, మరింకెవరు గుర్తించలేనంత గొప్పగా భరతమాతను పచ్చి బాలింతరాలు అనడం
మా భరతమాత మాతలకు మాత సకల సంపత్సమేత
అంటూ పేర్కోవడం జాషువా దేశభక్తికి నిదర్శనం.
జాషువా కలం నుండి జాలువారిన ప్రతి అక్షరం ఆలోచనత్మకమైనదే అది ఒక్కొక్కసారి అగ్నిని రగిలిస్తే మరొక్కసారి కరుణాంబుధులను కురిపిస్తుంది ఒకసారి సమాజంలోని ఆ సమానతపై ఎప్పుడు పెట్టిన ఇల్లు అవుతుంది. మరొకసారి దేశమాతను కీర్తించే మంత్రమే సాగుతుంది . వారి కవిత్వం మానవజాతి శ్రేయస్సు కోసం వాడినా ఇంద్రుని వజ్రాయుధం.అది విశ్వ కల్యాణమే పరమావధిగా సాగి జాతీయ భావజాల చైతన్య స్రవంతిగా మారి నిరంతరం ఈనాటికి ప్రతి దేశభక్తుని గుండెను తడుతూనే ఉంది.
భరత ఖండంబు నా పాఠశాల
భాగవతంబు నా బాలశిక్ష
అంటూ ఈ దేశ సంస్కృతి సంప్రదాయాల పట్ల ఎంతో గౌరవాన్ని,భక్తిని ప్రదర్శిస్తాడు. అనూచానంగా వస్తున్న సంప్రదాయాన్ని గౌరవిస్తూనే సమాజంలో నెలకొన్న వైషమ్యాలను,తారతమ్యాలను, హెచ్చుతగ్గులను నిరసిస్తూ, నిలదీస్తూ తన కవిత్వాన్ని ఝలిపిస్తాడు.
ఆనందంబున నీ సహోదరులు విద్యాస్వీకృతిం జెందినా
రీనా డల్లదె శుభ్రవస్త్రములతో నేతెంచుచున్నారు నీ
తో నిత్యోచిత దైవపూజకని; సంతోషంబునన్ జేర నీ వేని న్నీ వొక రాక్షసాకృతిని సుమ్మీ భారతీనందనా :
అంటరానితనం కూడదని వెనుకబడిన వారంతా నీతో కలిసి నడవడానికి వస్తున్నారని వారిని మీతో కలుపుకోవాలని కలుపుకుపోవాలని చెప్తూ రాక్షస ప్రవృత్తి సరైనది కాదని నిరసిస్తాడు ఇలా జాషువా తన కవిత్వం అంత ప్రజలు భేదాభిప్రాయాలు మర్చిపోయి అందరూ ఒకటే అని భావనతో భరతమాతను సేవించాలని కాంక్షించాడు
భరతమాత భారత వీరుడు తెలుగు తల్లి ఆంధ్రుడు శిశువు గిజిగాడు శిల్పి కృష్ణానది అఖండ గౌతమి శ్రద్ధాంజలి రాష్ట్ర పూజ నేతాజీ బాపూజీ శివాజీ వివేకానందుడు వంటి వివిధ ఖండికల్లో తన ఇతర కావ్యాల్లో దేశభక్తిని జాతీయతను ఉద్దీపింపజేసిన అచ్చమైన జాతీయ కవి జాషువా
నా దేశం బిది, రత్నగర్భ, కవిరాణ్మత్తేభముల్ పూర్ణమ ర్యాదల్ మేలిసువర్ణ వర్షములనభ్యర్చావిధానంబులన్ మోదంబందిన తావు, వీరపురుష స్ఫూర్జత్ ప్రతాపాగ్నికిం బాదంచున్ గళమెత్తిపాడుకొనునీభక్తుండ హిందూరమా
నా రత్నగర్భాని నా దేశ కీర్తిని ఔన్నత్యాన్ని గొంతెత్తి పాడుకుంటానని అమ్మ భారతి భక్తుడనని సగౌరవంగా చాటుకుంటూ దేశమాతను హిందూ రమా అంటాడు జాషువా . ఇంత గొప్పగా జాతీయ భావజాల ప్రకటన చేసిన తెలుగు కవులల్లో జాషువా మొదటి వరుసలో నిలుస్తాడు.ఆవు అనే ఖండికలో
నీ/ విడు సర్వస్వము నారగించుచు కృపా హీనమ్ములై వార్తకం
బడరందూలు నిన్ను వధించెడు మనుష్య వ్యాఘ్రముల్ క్రూరముల్
అంటూ ఆవును వధించే వారిని క్రూర జంతువులైన పులులతో పోల్చడం చూస్తే జాషువాకు ఈ సంస్కృతిలో భాగమైన ఆవు పైన భక్తి ఎంత ఉందో మనం ఊహించవచ్చు. ఈ దేశ సంస్కృతి పై ఎంత మమకారాన్ని చూపించాడో అంతకంటే తీవ్రంగా ఇక్కడ ఉన్నటువంటి ఆ సమానతలపై స్పందించాడు అంతేకాకుండా క్రైస్తవంలో కూడా కులం ఆధారంగానే వ్యక్తుల గుర్తింపు జరుగుతుందనే బాధతో ఆ విషయంపై కూడా ఘాటుగా స్పందిస్తాడు ఇంటిగుట్టు అనే ఖండికలో
మాల యేసుక్రీస్తు మాదిగలకు గాడు
మాదిగేసుక్రీస్తు మాకు గాడు
ఒకడు చిలువరించు నొకడు స్నానం బిచ్చు
నిరువు రేక మగుట కేది దారి
అని తన ఆవేదనను వెలిబుచ్చుతాడు. అంతేకాకుండా క్రైస్తవులు హిందువులను చూసి ఎగతాళి చేస్తున్నారు ఇతరుల తప్పులను ఓర్చుకునే సహృదయత మనకు లేకపోవడం దారుణం అని చెప్తూ
హిందువులను చూసి యెగతాళి చేసెద
మింటనున్న మురికి కేవగింపు!
మొరుల తప్పిదంబు లోరుచుకొనలేము
సొంత తప్పు మాకు చురుకు లేదు !!
అంటూ ఇతరులను చూసి ఎగతాళి చేసే వారికి గట్టిగా చెరుకు పెడతాడు. జాషువా లోని దేశభక్తి, సాంస్కృతిక అనురక్తి విదేశి మత ప్రేరితులకు నచ్చలేదేమో అందుకే క్రైస్తవ సమాజం వీరిని దూరం పెట్టింది.
జాషువా రాసిన ఖండకావ్యాలల్లో చాలా వాటిలో ఈ దేశం పట్ల ఈ సంస్కృతి పట్ల అవ్యాజమైన ప్రేమ అచంచలమైన దేశభక్తి అడుగడుగునా కనబడతాయి వీరి వివేకానంద అనే ఖండికలో
తెలవార్వేళఁగషాయదీధితుల నుత్తీర్ణత్వముంజెందువె ల్గులఱేనింగనుశ్వేతజాతులకు,మాగోసాయి కాషాయ కాం
తుల భ్రాంతు ల్తలయెత్త, ‘నల్లదె: నరేంద్రుల్ పండితుల్ గేలుమోడ్పులమన్నించిన భారతీయముని, చూడుం’ డండ్రుషస్సంధ్యలన్
ఈ దేశ ప్రతీక అయిన కాషాయ వస్త్రాలు ధరించిన నరేంద్రని దివ్యకాంతులు శ్వేత జాతీయులకు భయానకమైన భ్రాంతులను కలుగజేస్తున్నాయని గొప్పతాత్విక నేపథ్యాన్ని చిత్రీకరిస్తాడు. అలాగే తన వీరపూజ అనే ఖండికలో
నెఱికురులమీఁద బంగారునీలమణులు
వెలయు చందాన నెమిలి కన్నులు రహింప
వెన్నుఁడు రథంబు నడిపిన వీరభూమి
స్వచ్ఛమానస గంగమ్మ సంచరించు!
అంటూ శ్రీకృష్ణుడి గొప్పతనాన్ని గంగమ్మ స్వచ్ఛతను పవిత్రతను అద్భుతంగా చిత్రిస్తాడు.
జాషువా ప్రతి రచన ఒక గొప్ప కళాఖండం. వారి కవిత్వం అంతా వేదన చెందిన జీవుని ఆవేదననే, అంతరంగా ఆవిష్కరణనే.. తన జీవితమంతా భారత జాతి సమైక్యత కోసం దేశ ప్రజలందరినీ సమానంగా చూడడం కోసం పడిన తాపత్రయంగా చెప్పవచ్చు. ఇందుకోసం భారతీయ సాంస్కృతిక మూలాలను కీర్తిస్తూ తన కవిత్వ భూమికను తాత్విక నేపథ్యంగా ఎంచుకొని సామాజిక చైతన్యం కోసం నిరంతరం తపించిన తాపసి జాషువా. అందుకే జాషువా అచ్చమైన స్వచ్ఛమైన జాతీయ కవి విశ్వమంతా నిండిన విశ్వ నరుడు.
జైహింద్.
గాజుల రవీంద్ర
More Stories
పళస్సీ రాజా కేరళ వర్మ
వేలు నాచియార్ (జన్మతిథి, జనవరి 03)
వి ఓ చిదంబరం పిళ్లై