అయ్యంకి వెంకట రమణయ్య ( 24 జూలై 1890 – 7 మార్చి 1979 ) ప్రముఖ గ్రంథాలయ ఉద్యమకారుడు. ఆయుర్వేదం, ప్రకృతి వైద్యంలో సిద్దహస్తులు. పత్రికా సంపాదకులు. దేశంలో పౌర గ్రంథాలయ ఉద్యమ నిర్మాత. “గ్రంథాలయ సర్వస్వము” అనే పత్రికను నిర్వహించారు. ఈయన గ్రంథాలయ ఉద్యమంలో జీవితాంతం విశేష కృషి సల్పి ‘గ్రంథాలయ పితామహుడు’గా పేరుగాంచారు. గ్రంథాలయాల అభివృద్ధికి కృషి చేసిన వారికి ఇచ్చే కౌలా బంగారు పతకం పొందిన మొదటి భారతీయుడు. పద్మశ్రీ అవార్డు గ్రహీత. లైబ్రరీ సైన్సు పితామహుడు SR రంగనాథన్ గారు రమణయ్య గారి సమకాలికుడు, గురువు. రమణయ్య సహకార ఉద్యమానికి కూడా తోడ్పాటును ఇచ్చారు.
అయ్యంకి వెంకట రమణయ్య 1890 జూలై 24 న ఆంధ్ర ప్రదేశ్‌లోని కొంకుదురు గ్రామంలో జన్మించారు , 1903లో పాఠశాల విద్యను పూర్తి చేసిన తర్వాత జాతీయ ఉద్యమంలో చేరారు. జాతీయోద్యమంలో చేరిన తర్వాత భారతదేశ సామాజిక, ఆర్థిక వెనుకబాటుకు నిరక్షరాస్యత కారణమని గ్రహించారు. ఈ దురవస్థ నుండి ప్రజలను వెలికి తీయడానికి లైబ్రరీలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని ఆయన భావించారు. ఇది భారతదేశంలో గ్రంథాలయ ఉద్యమాన్ని ప్రారంభించేలా చేసింది.
ఆయన 19 సంవత్సరాల వయస్సులో భారతదేశంలో మొదటి రాష్ట్ర గ్రంథాలయ సంఘాన్ని ప్రారంభించారు. ఆయన 1925లో ఆంధ్రదేశ లైబ్రరీ అసోసియేషన్, బెంగాల్ లైబ్రరీ అసోసియేషన్‌ను ప్రారంభించారు. రాష్ట్ర స్థాయిలో మద్రాస్ లైబ్రరీ అసోసియేషన్ (1928) మరియు పంజాబ్ లైబ్రరీ అసోసియేషన్ (1929) స్థాపనకు కూడా వారు సహకరించారు. ప్రజలలో ఆసక్తిని పెంపొందించడానికి, ఆయన గ్రంథాలయాల ప్రాముఖ్యతకు సంబంధించి జాతీయ మరియు రాష్ట్ర స్థాయిలో వందలాది సమావేశాలు నిర్వహించారు. అయ్యంకి కృషి వల్ల 1919లో మద్రాసులో మొదటి ఆల్ ఇండియా పబ్లిక్ లైబ్రరీ కాన్ఫరెన్స్ జరిగింది. డిసెంబరు 1923లో జరిగిన AIPLC రెండవ సమావేశంలో ఆల్ ఇండియా పబ్లిక్ లైబ్రరీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిగా కూడా వారు ఎంపికయ్యారు.
ఆయన గ్రామీణ గ్రంథాలయాలను స్థాపించడానికి చొరవ తీసుకున్నారు. ఇందునిమిత్తం ఆయన 1910లో “ఆంధ్రభారతి” (తెలుగు) వంటి సాహిత్య పత్రికను కూడా స్థాపించాడు. 1916లో ఆయన తెలుగులో మొదటి గ్రంధాలయ జర్నల్ “గ్రంథాలయ సర్వస్వము” ను కూడా తీసుకువచ్చారు. గ్రంథాలయ వృత్తిని ప్రోత్సహించడానికి తన స్వంత ఖర్చుతో విజయవాడ నుండి సైన్స్ పత్రిక మరియు 1924 సంవత్సరంలో ఇండియన్ లైబ్రరీ జర్నల్ పత్రికలను ప్రారంభించారు. ఆయన 1924 నుండి 1936 వరకు ఇండియన్ లైబ్రరీ జర్నల్‌కు సంపాదకుడు కూడా.
భారతదేశంలో పబ్లిక్ లైబ్రరీ వ్యవస్థ అభివృద్ధికి ఆయన చేసిన కృషి ప్రశంసించదగినది. అందుకే ఆయన “భారతదేశంలో పౌర గ్రంథాలయ ఉద్యమ మూలపురుషుడు” గా గుర్తించబడ్డారు. బరోడా మహారాజా ఆయనను “గ్రంథాలయ పితామహ” అవార్డుతో సత్కరించారు. కౌలా గోల్డ్ మెడల్ పొందిన మొదటి భారతీయుడు కూడా అయ్యంకి వారే. 1972 వ సంవత్సరంలో భారత ప్రభుత్వం వారిని పద్మశ్రీతో గౌరవించింది. ఆయనా తన జీవితమంతా గ్రంథాలయాల విస్తరణ మరియు అభివృద్ధికి అంకితం చేశారు.
అయ్యంకి వెంకట రమణయ్య గారు 1979లో తన 89వ ఏట మరణించాడు. పౌర గ్రంథాలయ వ్యవస్థ స్థాపనలో ఆయన చేసిన కృషి ఎప్పటికీ గుర్తుండిపోతుంది.
More Stories
శ్రీ చంపక్ రామన్ పిళ్లై
జాతీయకవి శ్రీ సుబ్రహ్మణ్య భారతి (1882 డిసెంబరు 11 – 1921 సెప్టెంబరు 12)
సమరసత కు సాధనం రామాయణ అనుసరణే