ఆయన మహా కవి, సాహితీవేత్త, గొప్ప ఉపన్యాసకుడు, దేశభక్తుడు. తెలంగాణ ప్రజల కన్నీళ్లను అగ్నిధారగా మలిచి నిజాం పాలన మీదికి ఎక్కుపెట్టిన మహాకవి, దాశరథి కృష్ణమాచార్యులు. తన పద్యాన్ని పదునైన ఆయుధంగా చేసుకొని తెలంగాణ విముక్తి కోసం ఉద్యమించిన మహాకవి. ‘నా తెలంగాణ, కోటి రతనాల వీణ’ అని గర్వంగా ప్రకటించి ఉద్యమానికి ప్రేరణ అందించిన మహాకవి దాశరధి. నాటి నిజామును పిశాచి గా వర్ణిస్తూ తెలంగాణ ప్రజానీకాన్ని మేల్కొల్పిన కలం దీరుడు దాశరధి. తన రచనల్లో నవరసాలను పలికించి తెలుగు జన హృదయాలను గెలుచుకున్న ధీరశాలి దాశరథి. పిల్లల కోసం పల్లవులు రాశాడు. పెద్దల కోసం వ్యాసాలు రాశాడు. తెలంగాణను తన కలం బలం ద్వారా ఉర్రూతలూగించిన వైతాళికుడు దాశరధి. తన పద్యాల ద్వారా గర్జించి కవిత్వాన్ని అగ్ని ధారలుగా కురిపించిన అచ్చమైన మధురకవి దాశరధి. ప్రాచీన, ఆధునిక కవితా కాల వారధిగా పేరుగాంచిన వ్యక్తి దాశరథి. నన్ను గని పెంచిన కరుణామయి నా తెలంగాణ అని గర్వంగా ప్రకటించిన అసలుసిసలైన తెలంగాణవాది మన మన దాశరధి కృష్ణమాచార్యులు. దాశరధి కృష్ణమాచార్యులు ఒక సామాన్య మధ్యతరగతి వైష్ణవ కుటుంబంలో 1925 జూలై 22 న వరంగల్ జిల్లా మానుకోట తాలూకా లోని చిన్నగూడూరు గ్రామం లో వెంకటాచార్యులు, వెంకటమ్మ దంపతులకు జన్మించినారు.
సాంప్రదాయ కుటుంబంలో జన్మించిన దాశరథి అనేక భాషలలో నిష్ణాతులుగా పేరు ప్రఖ్యాతులు పొందారు. ఖమ్మం లో చదువుకునే రోజుల్లో ఆంధ్ర మహాసభ కార్యకర్తగా పని చేశారు ఆ సమయంలోనే ఆయనపై కందుకూరి వీరేశలింగం, మహాత్మాగాంధీ, రఘుపతి వెంకటరత్నం వంటి ఎందరో మహనీయుల ప్రభావం పడింది. భారతదేశ స్వాతంత్రం పోరాట చివరి ఘట్టాల అనుభవముతో పాటు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాల అనుభవాలను గడించిన దాశరధి తన రక్తంలో అణువణువునా తెలంగాణవాదాన్ని జీర్ణించుకున్న మహాకవి, దాశరథి. అసలు వీరి కుటుంబమే సాహిత్య సేవకు అంకితం అయ్యింది. దాశరధి రంగాచార్యులు వీరికి స్వయానా తమ్ముడు. అగర్భ శ్రీమంతునికి అనాధకీ మధ్య చిరకాలం నుండి జరుగుతున్న సంఘర్షణ మే దాశరథికి కవితా వస్తువు అయ్యింది. 1949 సంవత్సరంలో దాశరథి మొట్టమొదట పుస్తకం, అగ్నిధార. నల్లగొండ జిల్లా చండూరు లో సాహితీ మేధావుల పక్షాన అచ్చు కాబడిన ఆ పుస్తకాన్ని, అదే జిల్లాకు చెందిన గొప్ప మేధావి రచయిత వట్టికోట ఆళ్వారుస్వామికి అంకితం మిచ్చి ధన్యులు అయినట్టు దాశరధి స్వయంగా చెప్పాడు.
రుద్రవీణ, మహాంధ్రోదయం, అమృతాభిషేకం, దాశరధి శతకం, తిమిరంతో సమరం, నవ మంజరి వంటి పుస్తకాలు దాశరథి కలం నుండి జూలువారినవే. ఇతని కవిత్వాలలో తెలుగుదనం ఉట్టిపడుతుంది. ఏది కాకతి ఎవరు రుద్రమదేవి ఎవరు సింగన్న అన్ని నేనే అంత నేనే వెలుగు నేనే తెలుగు నేనే అని అంటూ ఆవేశంతో గర్జించిన సింహం మన దాశరథి. నిజాం నిరంకుశత్వ పాలన పై రజాకార్ల మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాడి జైలు జీవితం అనుభవించిన స్వాతంత్ర సమరయోధుడు మన దాశరధి. తన కలాన్ని, గళాన్ని ప్రజల విముక్తి కోసం సమస్త మానవాళి శ్రేయస్సు కోసం అంకితం చేసిన యోధుడు దాశరథి. ఆయన రచించిన అగ్నిధార వెయ్యి జలపాతాల వేగంతో సాగిపోయింది. ఇంకా ఆయన కలం నుండి పుట్టిన రుద్రవీణ లోని విప్లవ గేయాలు మరువలేనివి. దాశరధి రాసిన కవిత్వంలో మోదుగు పూలు శృంగార, వీర రసాలుగా పేరుగాంచినవి. 1944 సంవత్సరంలో ఓరుగల్లు కోటలో ఆంధ్ర సారస్వత పరిషత్తు ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటుచేసిన కవిసమ్మేళనం వేదిక పందిళ్లను రజాకారు మతోన్మాదులు నిప్పులతో కాల్చి వేశారు. సభికులపై రజాకార్ దుండగులు రాళ్ళు విసిరారు. అయినప్పటికీ ఏమాత్రం బెదరకుండా సురవరం, దేవులపల్లి వంటి వారు ధైర్యంగా నిలిచి కవి సమ్మేళనం కావలసిందేనని నిర్ణయించారు. కూలిన పందిళ్ళ పైనే దాశరధి తన మొదటి పద్యాన్ని వినిపించి కవనంతో సమర శంఖారావం పూరించాడు. 1948 సంవత్సరంలో వరంగల్ జిల్లా జైలు నుండి దాశరధిని నిజాంబాద్ జైలుకు, ఆనాటి నిజాం నవాబు ప్రభుత్వం తరలించింది. అయినా ఏమాత్రం బెదరకుండా జైలు లోపల కలం కాగితం లేకున్నా బొగ్గు తోనే జనచైతన్యం కలిగించే కవితలు రాసిన ధీరుడు దాశరధి. జైలు గోడల పైన బొగ్గు తోనే ఓ నిజాము పిశాచమా కానరాడు నిన్ను బోలిన రాజు మావంటి లేత తీగలను తెంపి అగ్నిలో దింపినావు నా తెలంగాణ కోటి రతనాల వీణ అంటూ రాసి ఒక రాజ్యంలో ఆ రాజు కే ఎదురుతిరిగిన కవుల్లో, పోతన తర్వాత దాశరధికే ఆ ప్రస్థానం దక్కింది. జైలు గోడల మధ్య మా నిజాం రాజు జన్మజన్మల బూజు ముసలి నక్కకు రాజరికము దక్కునే అని నిర్భయంగా గర్జించిన మహాకవి దాశరథి. అదేవిధంగా సాహితీరంగంలో పద్య, గేయ, సినీ గీతం – ఇలా ఏది రాసిన పాఠకుల హృదయాలను రంజింప చేసిన ధీరోదాత్తుడు దాశరధి. అనేక ప్రక్రియల్లో తన వచన రచనా శైలిని చూపడం జరిగింది. 1961 సంవత్సరంలో ఇద్దరు మిత్రులు సినిమాలో ‘ఖుషి ఖుషి గా నవ్వుతూ చలాకి మాటలు రువ్వుతూ’ అనే పాట రాసి ఆయన సినీరంగ ప్రవేశం చేశారు.. దాశరధి గారి ప్రసంగాలు సునీశిత చతురోక్తులతో అనర్గళంగా సాగిపోతూ వినసొంపుగా ఉండేవి.
1967 సంవత్సరంలో ఆంధ్ర ప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు తో పాటు 1974 సంవత్సరంలో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు కూడా పొందాడు. వీటితో పాటుగా ఆంధ్ర విశ్వవిద్యాలయం, ఆగ్రా విశ్వవిద్యాలయం నుండి గౌరవడాక్టరేట్లను కూడా జరిగింది. 1977 నుండి1984 సంవత్సరం వరకు దాశరధి ఆంధ్రప్రదేశ్ ఆస్థానకవిగా పని చేశారు. చివరకు 1987 నవంబర్ 5న తేదీన చనిపోయారు. ఇవాళ దాశరధి కృష్ణమాచార్యులు మనమధ్య భౌతికంగా లేకపోవచ్చు కానీ వారి రచనలు, పాటలు, పద్యాలు నిత్య నూతనంగా భావితరాలకు మార్గదర్శకంగా ఉపయోగపడుతాయి. ఎప్పటికీ తెలంగాణ ప్రజల గుండెల్లో స్వచ్ఛమైన కవిగా నిలిచిపోయిన వ్యక్తి దాశరధి కృష్ణమాచార్యులు. దాశరధి తెలంగాణకే కాదు యావత్ తెలుగు సాహితీ ప్రపంచంలో ఎల్లవేళలా నిలిచి ఉండే మహనీయుడు, మహాకవి.
సేకరణ శ్రీ వెల్లంకి రామకృష్ణ
More Stories
శ్రీ చంపక్ రామన్ పిళ్లై
జాతీయకవి శ్రీ సుబ్రహ్మణ్య భారతి (1882 డిసెంబరు 11 – 1921 సెప్టెంబరు 12)
సమరసత కు సాధనం రామాయణ అనుసరణే