ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు (మే 20 – వర్ధంతి)
తెలుగునాట పుట్టిన భారత స్వాతంత్ర సంగ్రామ యోధులలో మొదటగా చెప్పుకోవలసిన పేరు శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు గారి పేరే. ఆయన ఏ రంగములో ప్రవేశించినా ప్రథమ స్థానమే ఆక్రమించేవారు. ఆయన ఒంగోలుకు సమీపాన గల వినోదరాయుని పాలెము గ్రామములో ఒక పేద బ్రాహ్మణ కుటుంబములో సుబ్బమ్మ, గోపాలకృష్ణయ్య దంపతులకు ఆగస్టు 23, 1872లో జన్మించారు. పదకొండేళ్ల వయస్సులో తండ్రి మరణించగా తన గురువు హనుమంతరావు నాయుడు గారి వెంట రాజమండ్రి చేరారు. అక్కడ చదువుకుంటూ గురువుగారితో పాటు గయోపాఖ్యానం వంటి పౌరాణిక నాటకాలలో వేషాలు వేసేవారు. నాటకాలాడిన కాలము లో సమర్ధ నటుడని పేరు తెచ్చుకున్నారు. చిన్నప్పటినుంచే లాయరుగా స్థిరపడాలని బలమైన కోరిక ఉండేది. కానీ మొదట్లో మెట్రిక్యులేషన్ పరీక్ష తప్పి, ఆ తరువాత మద్రాస్ వెళ్లి చదువు కొనసాగించి రాజమండ్రి వచ్చి ఒక చిన్న లాయర్ గా వృత్తి ప్రారంభించి అనతికాలము లోనే ఒక విజయవంతమైన లాయర్ గా స్థిరపడ్డారు. 31 ఏళ్ల వయస్సుకే 1904లో గట్టి పోటీని తట్టుకొని రాజమండ్రి మునిసిపల్ అధ్యక్షుడిగా ఎన్నుకోబడ్డారు.
ప్రకాశం గారు ఒకసారి కోర్ట్ పని నిమిత్తము మద్రాస్ హైకోర్టు కు వెళ్ళవలసి వచ్చింది. అక్కడ ఈయన ప్రతిభాపాటవాలను గుర్తించిన ఒక బారిస్టర్, బారిస్టర్ చదువు చదవమని సలహా ఇచ్చాడు. ఎందుకంటే కొన్ని పెద్ద కేసులు హైకోర్టు లో వాదించాలి అంటే అప్పట్లో బారిస్టర్ పట్టా ఉండాలి. గాంధీ గారి లాగానే ప్రకాశము గారు అయన తల్లికి మాంసము, మద్యము ముట్టనని ప్రమాణము చేసి 1904లో బారిస్టర్ చదవటానికి ఇంగ్లండ్ వెళ్ళారు. ఇంగ్లాండ్ లో ఉండగానే దాదాభాయి నౌరోజీ, హౌస్ అఫ్ కామన్స్ కు ఎన్నిక అవటానికి ప్రకాశం పంతులు గారు కృషి చేశారు. బారిస్టర్ పట్టా పుచ్చుకొని మద్రాస్ వచ్చి అప్పటివరకు ఉన్న యూరోపియన్, తమిళ బారిస్టర్ల అధిపత్యానికి గండి కొట్టారు. న్యాయవాద వృత్తిలో దేశము మొత్తములో ఈయనకు సాటిగా నిలవ గలిగిన న్యాయవాదులు ఇద్దరే. ఒకరు చిత్తరంజన్ దాస్, రెండవవాడు మోతిలాల్ నెహ్రు. జాతీయ ఉద్యమాన్ని నడిపించే బిపిన్ చంద్ర పాల్ మద్రాస్ వచ్చినప్పుడు అయన సభలకు ఏమాత్రము జంకు లేకుండా ప్రకాశం గారు అధ్యక్షత వహించేవారు. అప్పటినుంచి కోట్లు సంపాదించిపెట్టే న్యాయవాద వృత్తిని వదిలి స్వాతంత్ర్యోద్యమము చురుకుగా పాల్గొన్నారు, మన ప్రకాశం పంతులు గారు. స్వరాజ్ పత్రికను ఇంగ్లిష్ తెలుగు, తమిళములలో ప్రచురించేవారు. 1921లో అహమ్మదాబాద్ లో జరిగిన కాంగ్రెస్ పార్టీ సభలకు ప్రకాశం పంతులు జనరల్ సెక్రటరీగా ఎన్నుకోబడ్డారు. స్వాతంత్ర్యోద్యమములో దేశము అంతా పర్యటించి ప్రజలను ఉత్తేజితులను చేసేవారు.
1922లో గుంటూరు లో జరిగిన సహాయ నిరాకరణ ఉద్యమాన్ని టంగుటూరి ప్రకాశం గారు 30,000 వేల కార్యకర్తలతో నిర్వహించారు. ఈయన రాజకీయ రంగ ప్రవేశముతో అంతవరకూ ముందు వరుసలో ఉన్న కొండా వెంకటప్పయ్య గారు, ఉన్నవ లక్ష్మీనారాయణ గారు, అయ్యదేవర కాళేశ్వర రావు గారు ప్రభృతులు వెనుక వరుసలోకి వెళ్లారు. 1928 ఫిబ్రవరి 3 న సైమన్ కమీషన్ మద్రాస్ వచ్చినప్పుడు సైమన్ గో బ్యాక్ అని పెద్ద ఎత్తున ఉద్యమము నడిచింది. అప్పుడు పోలీసులు ఉద్యమాలకు, ప్రదర్సనలకు అనుమతి ఇవ్వలేదు. మద్రాస్ హైకోర్టు వద్ద అధిక సంఖ్యలో గుమికూడిన ప్రదర్శకులను అదుపు చేయటానికి పోలీసులు కాల్పులు జరపగా పార్ధసారధి అనే యువకుడు మరణించాడు. అప్పుడు ఉగ్రుడైన ప్రకాశం గారు చొక్కా చించుకొని తన ఛాతీ
చూపిస్తూ తనని కాల్చమని పోలీసులను సవాలు చేశారు. ఆయన వెనక ఉన్న అశేష జనవాహినిని చూసి పోలీసులే వెనక్కు తగ్గారు. ఆ సంఘటనతో ఆయనకు ఆంధ్ర కేసరి అనే పేరు వచ్చింది.
1930 గుంటూరులో ఉప్పు సత్యా గ్రహము ప్రతిజ్ఞా పత్రము పై సంతకాలు చేసేటప్పుడు కొండా వెంకటప్పయ్య గారు మొదటిస్థానము ప్రకాశము గారి కోసము వదిలి రెండవ సంతకము చేశారుట. ఢిల్లీ నుండి వచ్చిన ప్రకాశం గారు మొదటి సంతకము చేశారు. 1930 లోనే లెజిస్లేటర్ పదవిని త్యాగము చేసి పన్నుల నిరాకరణ ఉద్యమాన్ని ముందుండి నడిపించారు. 1937లో జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ విజయము సాధించింది. తాను ముఖ్య మంత్రి అయ్యే అవకాశము ఉన్నప్పటికీ రాజాజీ కోసము పోటీ నుండి తప్పుకొని రాజాజీని ముఖ్యమంత్రి ని చేసి ప్రకాశము గారు మళ్ళా స్వాతంత్ర్యోద్యమములో చురుకుగా పాల్గొన్నారు. 1942లో జరిగిన క్విట్ ఇండియా ఉద్యమములో మూడుసార్లు అరెస్ట్ అయినారు. 1946 లో మద్రాస్ ప్రెసిడెన్సీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గెలవటము వల్ల ఏప్రిల్, 30, 1946లో ముఖ్య మంత్రి అయినారు. కానీ రాజాజి రాజకీయాల వల్ల 11నెలల మించి ముఖ్యమంత్రి పదవిలో ఉండలేకపోయినారు. చాలా సందర్భాలలో గాంధీతో కూడా ప్రకాశము గారు విభేదించేవారు. స్వాతంత్రము తరువాత 1948లో ప్రకాశముగారు నెహ్రు ఆదేశాలను కూడా ఖాతరుచేయకుండా నిజాం పాలనలో ఉన్న హైదరాబాద్ వెళ్లి, వ్యక్తిగత భద్రతను కూడా లెక్కచేయకుండా రజాకార్ నాయకుడు ఖాసీం రిజ్వీ ని కలిసి రజాకార్ ఉద్యమము ఆపకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయి అని హెచ్చరించి వచ్చిన ధైర్యశాలి ప్రకాశం గారు.
1952లో కాంగ్రెస్ ను వీడి ప్రజాపార్టీ స్థాపించి అప్పటికే పదవిలో ఉన్న కాంగ్రెస్ నాయకులను ఓడించారు. అధికారంలోకి వచ్చినా, అంతర్గత కలహాల వల్ల, అసెంబ్లీలో బల నిరూపణ చేసుకోలేక అధికారాన్నికోల్పోయారు. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడడానికి నెహ్రూ తదితర అనేక మంది కాంగ్రెస్ నాయకులు వ్యతిరేకంగా ఉన్నా, తెలుగు రాష్ట్రం కోసం మొక్కవోని ధైర్యంతో పోరాడిన పొట్టి శ్రీ రాములు గారికి మద్ధతుగా నిలిచారు ఆంధ్ర కేసరి. పొట్టిశ్రీరాములుగారి ఆత్మార్పణము వల్ల ఏర్పడ్డ ఆంధ్ర రాష్ట్రానికి మొదటి ముఖ్య మంత్రి అయినారు. కానీ పదవిలో ఒక సంవత్సరము మించి ఉండలేదు. 1955 నుండీ ఇంచుమించు రాజకీయాలలో క్రియా శీలక పాత్రనుండి తప్పుకున్నారు. పదవుల కోసము ఏ నాడు రాజీ పడలేదు. నిస్వార్ధముగా తన సంపాదనను అంతా ప్రజలకోసము ఖర్చుపెట్టిన మహానుభావుడు ప్రకాశంగారు. జీవితమంతా పోరాటాలతోనే సాగింది.
1956 లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. ఒంగోలులో హరిజనవాడలో పర్యటిస్తూ వడదెబ్బ తగలటం వల్ల హైదరాబాద్ ఆసుపత్రిలో చేరి మే 20, 1957లో మరణించారు. ప్రకాశం పంతులుగారు రాజకీయాలలో నిజాయితీకి, నిర్భీతికి నిదర్శనము. న్యాయవాదిగా ఏంతో సంపాదించినా తన వాళ్ళకంటూ ఏమి మిగల్చకుండా నిస్వార్ధంగా ప్రజాసేవ చేసిన మహనీయుడు ప్రకాశంగారు. ఆయన మనుమడు ఒంగోలు లో చిరుద్యోగిగా జీవనము సాగిస్తున్నారు. ఎదుటి వ్యక్తి ఎంతటి వాడైనా ఆప్యాయముగా ఏరా, ఒరేయ్ అని పిలిచేవారు, ప్రకాశంగారు. కొంతమందికి ఇది నచ్చేదికాదు. అయినా సరే ఆ పిలుపులో ఆప్యాయత ఉంది అని చెప్పేవారు, ప్రకాశం పంతులు గారు. మద్రాసు ప్రొవిన్షియల్ అసెంబ్లీలో తనపైన అవిశ్వాస తీర్మానము ప్రవేశ పెట్టిన బెజవాడ గోపాల రెడ్డిగారిని తన ఉపన్యాసము తరువాత, “ఒరేయ్ గోపాల రెడ్డీ, సోడా కావాలిరా” అని అడిగితే, ఆయన స్కూల్ విద్యార్థిలా సవినయముగా సోడా తెచ్చి ఇచ్చారు. అలాగే ఒకసారి ఆయన మీద పోటీచేస్తున్న నారాయణ స్వామి అనే కమ్యూనిస్టు అభ్యర్థి దారిలో ఎదురు పడితే ఆయననే ఐదువేలు ఎన్నికల ఖర్చు నిమిత్తము అప్పు అడిగారట. ఆయన ఇచ్చాడుకూడా. ఏ ఊరు వెళ్లినా వేసుకున్న బట్టలు తప్ప ఇంకో జత బట్టలు ఉండేవికాదుట. ఆయన శిష్యులు లేదా అభిమానులు ఉదయాన్నే ఆయన లేచేటప్పటికి కొత్త బట్టలు రెడీగా ఉంచేవారుట. అందుకనే ఆయన ప్రజాభిమానాన్నిచూరగొన్నారు. కానీ రాజకీయాలలో ఇమడలేకపోయినారు.
ఆయన తన ఆత్మకథను, “నా జీవిత యాత్ర” అనే పేరుతొ వ్రాసుకున్నారు. ఆయన పొందిన ప్రజాదరణకు నిదర్శనమే ఆయన పేరుతొ వెలసిన జిల్లా, కృష్ణా నదిపై విజయవాడ వద్ద నిర్మించిన ప్రకాశం బ్యారేజ్ మరియు అనేక సంస్థలు కాలేజీలు. ఆంధ్ర రాజకీయాలలో, తెలుగువారి మనస్సులలో శాశ్వత స్థానాన్ని పొందిన మహనీయుడు ప్రకాశము పంతులుగారు.
-రామకృష్ణ
శ్రీ రామకృష్ణ వి గారి సేకరణ
More Stories
ఆంధ్ర కళా శిరోరత్న’కీర్తి శేషులువడ్డాది పాపయ్య”
కవి సామ్రాట్ శ్రీ విశ్వనాథ సత్యనారాయణ
ఆదిభట్ల నారాయణదాసు (జన్మతిథి ఆగష్టు 31)