వ్యాసకర్త : తంగెళ్ళశ్రీదేవిరెడ్డి
కార్తికమాసం బ్రహ్మోత్సవాలతో శ్రీ కురుమూర్తి జాతర ఆరంభమవుతుంది.. జాతర మొదటి రోజు నుండి ముగిసే వరకు స్వామివారి భక్తులకు ప్రతిరోజు పండుగే ..! జాతర. వచ్చిందంటే పల్లెల నుండి ఎద్దుల బండ్లల్లో వచ్చి వచ్చి నాలుగైదు రోజులు అక్కడే మకాం వేసుకునే వాళ్ళు. ఇప్పటికీ ఇలాంటి వాళ్ళు ఉన్నారు. కాకపోతే ఇప్పుడు ఎద్దులబండ్లతో పాటుగా సొంత లేదా ప్రయివేటు వాహనాల్లో వస్తున్నారు. ఈ భక్తులు స్వామివారికి సంబంధించిన ఆ ఏడు గుట్టల పొడవునా గుడారాలు వేసుకుని జాతర ఆనందాన్ని ఆస్వాదిస్తుంటారు.
జాతరలో ప్రధాన ఘట్టం. ” ఉద్దాలోత్సవం ” ఈ ఉద్దాల ఉత్సవంలో స్వామివారి పాదుకలను కొత్త చాటలో ఉంచి ఉద్దాల మండపం వద్దకు తీసుకు వస్తారు. స్వామివారికి ఉద్దేశించిన పాదుకలను ఉద్దాలు అనడం ఆనవాయితీ.
▪️ఉద్దాలు వివరణ
బ్రౌణ్య తెలుగు-ఇంగ్లీష్ నిఘంటువు (1903 ),
బహుజనపల్లి సీతారామాచార్యులు గారి శబ్దరత్నాకరము (1912 ) ,
శంకరనారాయణ గారి తెలుగు-ఇంగ్లీష్ నిఘంటువు ( 1953),
కొట్ర శ్యామలకామశాస్త్రి గారి ఆంధ్ర వాచస్పత్యము (1953 ),
ఆంధ్రవిశ్వకళాపరిషత్తు వారి తెలుగు వ్యుత్పత్తి కోశం (1978 )
రవ్వా శ్రీహరి గారి శ్రీహరి నిఘంటువు తెలుగు-తెలుగు ( 2004 )
ప్రకారం ఉద్దాలు లేదా ఉద్దములు అనగా పాదరక్షలు, పాదరక్షణము, జోళ్ళు అని చెప్పబడింది.
పాదములు కిర్రుకిర్రని పలుకుచుండి కుచ్చుటుద్దాలు చేపట్టుకోలయమర
▪️ ఉద్దాల తయారీలో గిరిజన , దళితుల వర్ణాల ప్రాముఖ్యత :
కురుమూర్తి ఆలయంతో ఎరుకల మేదరి కులస్థులకు , దళితులకు, విడదీయరాని అనుబంధం ఉన్నది.
వివరాలు గమనిస్తే…
పల్లమర్రికి చెందిన మేదర కులస్తులు ప్రత్యేకంగా చాటను తయారు చేస్తారు. దీపావళి అమావాస్య రోజు చాట తయారీ ప్రారంభించి ఉత్సవం నాటికి పూర్తి చేసి దళితులకు భక్తి శ్రద్దలతో అందజేస్తారు.
చిన్న వడ్డెమాన్ గ్రామంలో దళితుల సమక్షంలో ఆవు చర్మంతో స్వామి వారి పాదుకలను దళితులే తయారు చేస్తారు. సమీప నల్లమల అడవుల్లో తిరిగే ఆవులను పులులు చంపుతుంటాయి. పులి వేటలో చనిపోయిన ఆవుల చర్మాన్ని సేకరించి ప్రతి ఏడాది కురుమూర్తికి కొత్త చెప్పులు కుడతారు.
దీపావళి అమావాస్య రోజు నుంచి వారం రోజుల పాటు నియమ నిష్ఠలతో ఉపావాస దీక్షలతో ఉద్ధాలు తయారు చేస్తారు.
ఈ క్రమంలో మొదట చాటను పల్లమర్రిలో గ్రామంలో ఊరేగిస్తారు. తర్వాత పొరుగు గ్రామాలైన లాల్ కోట ,నెల్లికొండి,పెద్ద వడ్డేమాన్ గ్రామాల మీదుగా ఊరేగింపుగా తెచ్చి చిన్న వడ్డేమాన్ గ్రామానికి వస్తారు. ఈ క్రమంలో చాట ఊరేగింపును పురస్కరించుకుని భక్త జనులు గ్రామ గ్రామాన చాట ఆశీర్వాదం కోసం బారులు తీరుతారు. వరుసలుకట్టి కూర్చున్న జనాల మీదనుండి చాటను తీసుకువెళ్తూ
ఉమ్మడిగా ఆశీర్వాదం అందిస్తుంటారు.
చాట వడ్డేమాన్ గ్రామాన్ని చేరుకునే సమయానికి… అక్కడ ఉద్దాలను (పాదుకలను) సిద్ధం చేసి , చాట కోసం భక్తజన సందోహం ఎదురుచూస్తూ ఉండి ఉంటుంది.
తయారుచేసి ఉంచిన స్వామి వారి పాదుకలను
ఆ చాటలో వుంచి ఆనవాయితీగా పూజలు నిర్వహిస్తారు. తర్వాత అప్పంపల్లె శివారు నుండి ఊకచెట్టు వాగులో చాటతో సహా స్వామి వారి పాదుకలను మోస్తూ తిర్మలాపూరం గ్రామానికి చేరుతారు. ఈ ఊరేగింపులో భక్తజనులు ఆశీర్వాదం కోసం బారులు తీరుతారు. ఇక్కడ భక్తజనుల సంఖ్య రెట్టింపు అవుతుంది.
తిరుమలాపురం పూలతో అలంకరించిన వాహనంలో పాదుకలను అంగరంగవైభవంగా ఊరేగిస్తూ కురుమూర్తిస్వామి గుట్టలో ఉన్న ఉద్ధాల మండపానికి చేరుస్తారు. రాజుల కాలంలో ఏనుగులను, తరువాత కాలంలో ఊరేగింపుకు ఎద్దుల బండి ఉపయోగించేవారు.
ఊరేగింపు తర్వాత పాదుకలను మండపంలో ఉంచుతారు. ఈ ఉద్దాల మండపాన్ని
1878లో రాజా శ్రీరాం భూపాల్
నిర్మించగా, 1999లో మరమ్మత్తులు చేశారు. కొండమీద ఉద్దాల మండపంలో దళితులే అర్చకులుగా కొనసాగుతుంటారు
ఉద్దాలు చిన్నవి పెద్దవి ఉంటాయి. పెద్ద ఉద్దాలను మంటపంలో భక్తుల దర్శనానికి ఉంచుతారు. చిన్న ఉద్దాలతో భక్తుల వీపులపై చరుస్తూ ఆశీర్వదిస్తుంటారు. పాదుకలతో వీపులను కొట్టడమే ఇక్కడి ఆశీర్వాదం. వీపుపై పాదుకలతో కొట్టించుకుంటే పాపాలు సమస్యలు కష్టాలు రోగాలు అడ్డంకులు తొలగి పోతాయని భక్తుల తరతరాల నమ్మకం.
▪️స్వామి వారి ఉద్దాలు – నిజానిజాలు
//అసత్య ప్రచారం//
కురుమూర్తి స్వామీ వారి పాదరక్షలు తయారీ గురించి అసత్య ప్రచారం జరుగుతున్నది. ఆ వార్త ఈ కింది విధంగా ఉన్నది
” గోమాతను చంపి ఆ తల్లి చర్మంతో చెప్పులు తయ్యారు చేయడం ఎంతవరకు సమంజసం ఒక్కసారి ఆలోచించండి.శ్రీ కురుమూర్తి స్వామి వారికి గోమాత చర్మంతో చేసిన చెప్పులు కాకుండా వెండితో చేయించండి, ఇంకా వీలైతే బంగారుతో చేయించండి”
గోమాతను వారు చంపుతున్నారు, వీరు చంపుతున్నారు అని కాదు ముందు మనం ఎంతవరకు అచరిస్తున్నాం ఒక్కక్షణం ఆలోచించండి.
ఇటువంటి గోమాత హత్య చేసి చేసే సంబురాలు ధర్మ విరుద్ధం.అందులో పాలుపంచుకోవడం ధర్మ విరుద్ధం. మన గోమాతను మనం కాపాడుకుందాం.గోమాత రక్షణే సర్వ జగత్ రక్ష ”
//వాస్తవం//
వాస్తవాలు గమనిస్తే….స్వామి వారి ఉద్దాలు తయారీ కోసం ఆలయ కమిటీ గోమాతను చంపడం లేదు.
నల్లమల అడవుల్లో ఆవులు సంచరిస్తుంటాయి.ఈ క్రమంలో తరుచూ చిరుతపులుల భారిన పడుతుంటాయి. ఇట్లా కేవలం పులిచేత చంపబడిన ఆవు చర్మంతో మాత్రమే స్వామివారి ఉద్దాలు తయారు అవుతాయి. ఇటువంటి ఆవు కోసం తయారీదారులు సంవత్సరం పొడవునా వేచిచూస్తుంటారు.
▪️సిగాలు / పూనకాలు…
ఉద్దాలోత్సవంలో ఉద్దాల ఊరేగింపు పవిత్రమైన గొప్ప వేడుక. ఈ సందర్బంగా భక్తుల సిగాలు / పూనకాలు… నృత్యాలు… పరవశిస్తూ తన్మయత్వంతో పెట్టే కేకలు… కన్నుల పండుగై కనిపిస్తాయి…..వినిపిస్తాయి.
కొందరు తడి బట్టలతో పూనకంతో ఊగిపోతుంటారు.
బంతి పూలమాలలతో , నెమలీక కట్టలతో, మరికొందరు ఎగిరిదుంకుతుంటారు. స్త్రీ పురుష వయోభేదం లేకుండా ఊగిపోయే పూనకాలను చూస్తే గ్రామదేవతల గణాలు ఒక చోట చేరినట్టుగా ఉంటుంది.
▪️ఉద్దాల ఉత్సవం పై ” పాదుకా పట్టాభిషేకం ”
ఆత్మకూరు సంస్థానం చరిత్ర విస్తృతమైనది. సంస్థానాదీషుల కాలంలో ఆలయాల నిర్మాణాలు సంరక్షణలతో ఆధ్యాత్మికత పరిడవిల్లింది. ఇందుకు సంబందించిన సాహిత్యం విరాజిల్లింది.
శ్రీమాన్ ధన్నవాడ కిడాంబి/కిళాంబి రాఘవాచార్యస్వామి వారు … ఆత్మకూరు సంస్థానాన్ని పాలించిన రాజా శ్రీరామభూపాలుగారి ఆశ్రయం పొందారు. ఈ సమయంలో కురుమూర్తి స్వామి వారి ఉద్దాల ఉత్సవాన్ని గురించి సంస్కృతంలో ” పాదుకార్పణం ” నాటక ప్రబంధం రచించినారు.
ఈ నాటకం రాజాగారి కాలంలోనే ముద్రించబడింది. తర్వాత మహారాణి భాగ్యలక్ష్మీదేవమ్మ కాలంలో ద్వితీయ ముద్రణ పొందింది.
సంస్కృత ” పాదుకాదర్పణం ” నాటకాన్ని ఆచార్యులవారే ” మణివిద్రుమహారము “పేరుతో తెలుగులోకి అనువదించారు. అనువాదం కూడా రెండుపర్యాయాలు ముద్రితం.
సరస్వతీపుత్ర బిరుదాంకితుడు పుట్టపర్తినారాయణాచార్యులుగారి అర్దాంగి కనకమ్మ
గారు రాఘవాచార్యస్వామి వారి కూతురే.
Source : Facebook
More Stories
శరన్నవరాత్రములు
వివిధ ప్రాంతాల్లో ఉగాది
కోనసీమలో సంక్రాంతి ప్రభల సంబరాలు