
డాక్టర్ తంగెళ్ళ శ్రీదేవి రెడ్డి గారి ముఖపుస్తకం నుండీ సేకరణ
ప్రతి పండుగ వెనుక ఒక ప్రాశస్త్యం ఉంటుంది…
ఒక అనాది ఆచారం ఉంటుంది. జరుపుకునే ప్రతి పండుగలో ఆధ్యాత్మిక కారణం కూడా ఉంటుంది. అంతేకాదు, పండుగ సందర్బంగా పాటించే సంప్రదాయంలోనూ , ప్రసాదం పేరుతో స్వీకరించే ఆహారంలోనూ, నివేదించే షోడశోపచార నియమంలోనూ, సామాజిక, ఆరోగ్య , వైజ్ఞానికాంశాలు, కచ్చితంగా నెలకొని ఉంటాయి.
కొన్ని పండుగలు కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితం అవుతాయి. ఇట్లా జాతీయ పండుగలు….ప్రాంతీయ పండుగలు…. జరుపుకుంటూ ఉంటాము. పండుగ ఏదైనా లోక కళ్యాణం పరమార్థం ఒక్కటే.. ఈ క్రమంలో పండుగ వెనుక వివిధ కథల రూపంలో ఉన్న ఆంతర్యాన్ని గ్రహించి పండుగ జరుపుకోవడంలో ప్రత్యేక ఆనందం ఉంటుందని చెప్పవచ్చు.
ఉగాది పండుగ గురించి చెప్పుకుంటే… ఉగాది రోజు నుండే తెలుగు సంవత్సరం ఆరంభం అవుతుంది.. కాబట్టి ఇది తెలుగువారికి మాత్రమే సంబందించిన పండుగగా భావించుకుంటాము. కానీ వివిధ రాష్టాల్లోను , బాలి – మారిషస్ వంటి దేశాల్లోను సంవత్సరాది పండుగను వివిధ పేర్లతో జరుపుకుంటారు. తెలుగు ప్రాంతాల్లో
మాత్రం ” ఉగాది ” పేరుతో జరుపుకుంటారు.
▪️ఉగాది వైశిష్ట్యం
యుగానికి ఆది యుగాది. యుగాది అనే పదం ఉగాది రెండు వేర్వేరు పదాల నుండి ఉద్భవించింది. ” యుగం ~ ఆది ” పదాల కలయిక యుగాది. ఇదే కాలక్రమంలో ఉగాది అయ్యింది. ”ఉగ” అనగా నక్షత్ర గమనం.చైత్ర శుద్ధ పాడ్యమి నాడు ఉగాది ప్రారంభం అవుతుంది .
ఉగాది పండుగ జరుపుకోవడానికి ముఖ్యంగా మూడు కారణాలని తెలుగు ప్రజలు విశ్వసిస్తుంటారు. ఇవి పురాణ చారిత్రక కారణాలు. వీటిలో పురాణ కారణాలను ఇతర రాష్టాల్లో కూడా
విశ్వసిస్తుంటారు.
|| పురాణ కథనాలు ||
1. సోమకుడు అనే రాక్షసుడు వేదాలను హరించి సృష్టిలో కల్లోలం సృష్టించాలనుకుంటాడు. ఈ సమయంలో విష్ణువు మత్స్యవతారం ధరించి, సోమకుడిని వధించి, వేదాలను బ్రహ్మకు అందజేస్తాడు. ఈ శుభతరుణాన్ని పురస్కరించుకుని
యుగాది / ఉగాది ప్రారంభం అయ్యిందని పురాణ కథనం ..
2. చైత్రశుక్లపాడ్యమినాడు బ్రహ్మదేవుడు విశ్వాన్ని సృష్టించాడు కాబట్టి ఆరోజే ఉగాది అని పురాణ కథనం .
|| చారిత్రక కథనం ||
1.. శాలివాహన చక్రవర్తి చైత్రశుద్ద పాడ్యమినాడు పట్టాభిషిక్తుడై జనరంజకంగా పాలించాడని, ఆ
శుభ సందర్బమే ఉగాది చారిత్రక కథనం .
▪️ తెలుగు వారి ఉగాది
వసంత రాత్రులు….కోయిల పాటలు…. తెలుగువారి ఉగాదిని ప్రత్యేకంగా నిర్వచిస్తాయి. తెలుగు ప్రజలు చంద్రమానం అనుసరిస్తారు పండుగ సంప్రదాయంగా ఉగాది పచ్చడి తయారు చేస్తారు. ఈరోజు ప్రత్యేకంగా మగవాళ్ళు పంచకట్టు ధరించి తెలుగుదనానికి ప్రతీకగా కనిపిస్తారు. కవి సమ్మేళనాలు నిర్వహిస్తారు. కవులు కళాకారులను సన్మానిస్తారు. ఆలయాల్లో పంచాంగ శ్రవణం వినిపిస్తారు.
|| చైత్ర నవరాత్రులు ||
శక్తిమాతను వివిధ రూపాల్లో ఆరాధించే చైత్ర నవరాత్రులు ఉగాది నుండి ప్రారంభమవుతాయి . ఈ వేడుకల్ని చైత్ర నవదుర్గలు అని కూడా పిలుస్తారు. శైల పుత్రి, బ్రహ్మచారిణి, చంద్రఘంట, కూష్మాండ, స్కందమాత, కాత్యాయణి, కాళరాత్రి, మహాగౌరి సిద్ధిదాత్రి రూపాల్లో శక్తిమాతగా దుర్గాదేవిని ఆరాధిస్తారు.. చైత్ర నవరాత్రుల తొమ్మిదవ రోజు రామ నవమి , ఇది శ్రీరాముని పుట్టినరోజు.
|| తిరుమలలో ఉగాది ఆస్థానం ||
సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు శ్రీ వేంకటేశ్వరుని రూపంలో
తిరుమలలో కొలువై ఉన్నాడు అని భక్త కోటి విశ్వసిస్తుంటారు. తిరుమలలో ఉగాది వేడుకలు ఉగాది ఆస్థానం పేరుతో ప్రారంభమవుతాయి.
సాధారణంగా ప్రతిరోజూ శ్రీవారి సుప్రభాతసేవ తర్వాత తోమాలసేవ జరుగుతుంది. తర్వాత కొలువు జరుగుతుంది. ఉగాది పర్వదినం రోజు మాత్రం తోమాలసేవ తర్వాత కొలువు సేవ ఉండదు. స్వామివారి ఉత్సవమూర్తులు శ్రీభూదేవీసమేత శ్రీమలయప్పస్వామివారికీ సేనాధిపతి విష్వక్సేనులవారికీ ఏకాంతంగా తిరుమంజనం జరుగుతుంది. తర్వాత సర్వభూపాల వాహనంలో దేవేరులతో ఉత్సవమూర్తి వెంచేసి ఉంటాడు..
యోగనరసింహస్వామి ఆలయం ప్రక్కన నున్న ‘పరిమళపు అరి నుండి పెద్ద-జియ్యంగారు ఆరు పట్టు వస్త్రాలను మంగళ వాయిద్యాలతో వేద పారాయణాలతో తీసుకువస్తారు. ఆరు పట్టువస్తాల్లో నాలుగు వస్త్రాలను స్వామివారికి అలంకరిస్తారు. ఈ సంప్రదాయంలో ఒక వస్తాన్ని కిరీటానికీ, రెండవ వస్త్రాన్ని నందక ఖడ్గానికి , మూడవ వస్త్రాన్ని ఆదితోమాలగానూ, నాల్గవదాన్ని ఉత్తరీయంగానూ అలంకరిస్తారు.
మిగిలిన రెండు వస్త్రాలలో ఒక వస్త్రాన్ని ఉత్సవమూర్తి మలయప్ప స్వామికి, మరొక వస్త్రాన్ని సేనాధిపతి విశ్వక్సేనుల వారికి అలంకరిస్తారు. ఇదంతా ఉగాది అస్థానపూర్వరంగం.
తర్వాత ప్రధాన ఉగాది ఆస్థానం మొదలవుతుంది.
ఈ ప్రకారం స్వామివారి పాదాల దగ్గర పెట్టి ఉన్న పంచాంగాన్ని ఆస్థాన సిద్ధాంతి స్వీకరించి స్వామి వారి సన్నిధిలో పంచాంగ శ్రవణం వినిపిస్తాడు.
ఉగాదిరోజు కళ్యాణోత్సవం , ఆర్జిత సేవలు, ఉండవు. సాయంకాలం తిరుమల మాడవీధుల్లో శ్రీభూదేవీసమేతంగా శ్రీమలయప్పస్వామివారు
ఊరేగించబడతాడు.
ఉగాదినాడు ప్రారంభమైన ఉత్సవం 40 రోజులు “నిత్యోత్సవం” పేరుతో . వైశాఖశుద్ధదశమి వరకు కొనసాగుతాయి.
▪️ కర్ణాటకలో ఉగాది
కన్నడిగులు చంద్రమానం అనుసరిస్తారు. చైత్ర శుద్ద పాడ్యమి రోజునే ఉగాది జరుపుకుంటారు. వర్షాన్ని కురిపించడానికి ఉద్దేశించిన “‘ ఇంద్ర ధ్వజ ” తయారు చేసి పూజిస్తారు. ఉగాది పచ్చడిని ” బేవు బెల్ల ” అంటారు. ,
▪️ తమిళనాడులో ఉగాది
తమిళ ప్రజలు సౌరమానాన్ని పాటిస్తారు..ఉగాది పర్వదినాన్ని ” పుత్తాండు లేదా పుతండు ” అంటారు. ” చిత్తిరై తిరునాళ్ ” అని కూడా అంటారు.కొన్ని ప్రాంతాలలో ” చిత్తిరై విషు ” అని కూడా పిలుస్తారు. తమిళుల క్యాలెండర్లో చిత్తిరై సంవత్సరంలో మొదటి నెల. ఇది ప్రతి ఏప్రిల్ 14న వస్తుంది. నెల ఆరంభం రోజు పండుగ జరుపుకుంటారు. వసంత విషువత్తు తర్వాత చిత్తిరై వస్తుంది.
|| శ్రీలంక తమిళులు ||
శ్రీలంక తమిళలు ఉగాది పండుగను ” కై-విశేషం ” అంటారు ఏప్రిల్‌లో సాంప్రదాయ నూతన సంవత్సరాన్ని జరుపుకుంటారు. సంవత్సరంలో కొత్త వ్యవసాయానికి సిద్ధం కావడానికి ‘అర్పుడు’ లేదా భూమిని దున్నడంతో పండుగ ప్రారంభిస్తారు.
▪️కేరళలో ఉగాది
మలయాళం ప్రజలు ఉగాది పండుగను ” విషు ” అంటారు. వీళ్ళు సౌరమానాన్ని పాటిస్తారు.విషు పర్వదినం సందర్బంగా బాణసంచా కాలుస్తారు.
కనికనుం నేమ్ కమలనేత్రంటే
నిరమేరు మంచత్తుకిల్ చార్తీ
కనకకింగిణి వలకల్ మోతిరం
ఆణించు కనేనం భగవానే
అనే ది విషు పర్వదినానికి సంబందించిన ప్రాచుర్యం పొందిన భక్తి గీతం. ఓ కమల కన్నులారా, కాణి దర్శన సమయంలో, పెరుగుతున్న పసుపు రంగు దుస్తులు బంగారు గాజులు, గంటలు ఉంగరాలతో అలంకరించబడిన నిన్ను చూడనిమ్ము అని ఈ గీతం అర్థం. ఈ ప్రకారం మలయాళం ప్రజలు ” కాణి ” ఆచారం పాటిస్తారు. కాణి అంటే మొదట కనిపించేది లేదా మొదట చూసేది అని అర్థం. పండుగ రోజు మొదట చూసే దాన్ని విషుక్కాణి అంటారు. పిల్లలు పెద్దలు విష్ యు పండగ రోజు పొద్దుటే లేచి శుభప్రదమైన వస్తువులను లేదా భగవంతుడి ప్రతిమలను లేదా తమ .మొదట ఎవర్ని చూశారో ఆ సంవత్సరం మొత్తం అంతే శుభప్రదంగా ఉంటుందనేది వీరి నమ్మకం.
▪️మహారాష్ట్రలో ఉగాది
మరాఠీలు చంద్రమానం అనుసరిస్తారు. ఉగాది పర్వదినాన్ని ” గుడి పడ్వా ” గా జరుపుకుంటారు. పడ్వా అంటే పాడ్యమి అని అర్థం. చైత్ర శుద్ద పాడ్యమి రోజునే ఉగాది జరుపుకుంటారు. పడ్వా సంప్రదాయంలో మరాఠీలు కూడా ఉగాది పచ్చడి తయారు చేస్తారు.
అట్లాగే బ్రహ్మాదేవుడు సృష్టి ప్రారంభించిన రోజుగా భావిస్తూ ప్రత్యేకంగా “బ్రహ్మధ్వజం ” ఏర్పాటు చేస్తారు. ఈ విధానంలో వెదురుపుల్లలు తెచ్చి కొత్త వస్త్రం చుడుతారు . పువ్వులతో అలంకరిస్తారు. వెదురుపుల్ల పైభాగం నుండి శిరస్సులా వెండి లేదా కంచుపాత్రను బోర్లిస్తారు.
మహారాష్ట్రతో పాటుగా మధ్యప్రదేశ్ , దాద్రా నాగర్ హవేలీ, డామన్ డయ్యూ ప్రాంతాల్లోని హిందువులు గుడి పడ్వా పేరుతోనే సంవత్సరాది పండుగను జరుపుకుంటారు.
▪️మణిపురిల ఉగాది
మణిపురిలు ఉగాది పండుగను ” సాజిబు నోంగ్మా పన్బా ( Sajibu Nongma panba )
అంటారు..చంద్రమానం అనుసరిస్తారు
మొదటి నెల (సాజిబు)
మొదటి తేదీ (నోంగ్మా)
వేడుక (పన్బా) అని అర్థం. పంచాంగ శ్రవణం ఉంటుంది..
కుమ్సన కుమ్లిక్లై, లమ్‌సెన్‌బా తుసేన్‌బా, లమ్మబా తుమాబా అనే ముగ్గురు అమ్మ దేవతలకు సందర్భంగా నైవేద్యం సమర్పిస్తారు. ఇంటి మొదటి సంతానం ఈ నైవేద్యాన్ని సమర్పించడం ఒక ఆచారం. ఇంఫాల్‌లో సాజిబు చీరాబా ఉత్సవాలు ప్రత్యేకంగా జరుపుకుంటారు, జాతరలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించబడతాయి.
మణిపూర్‌లోని మైతీ జాతి ప్రజలు చారిత్రక కారణంతో పన్బా వేడుకలు జరుపుకుంటారు. ఈ క్రమంలో తమ రాజు గారి పుట్టిన రోజును సంవత్సరాదిగా జరుపుకుంటారు. ఇతడి పేరు మాలియా ఫాంబాల్చా. మరొక పేరు కోయి కోయి. మైతీ కాలమానం ప్రకారం కోయి-కోయి పుట్టినరోజును కొత్త సంవత్సరంగా స్వీకరించడం జరిగింది. పండుగ పూట సాంప్రదాయ జానపద నృత్యం ‘తబల్ చోంగ్బా’ ప్రదర్శిస్తారు.
▪️బెంగాళీల ఉగాది
బెంగాళీలు ఉగాది పండుగను “పోయ్ లా బైశాఖ్ “అంటారు. సౌరమానాన్ని పాటిస్తారు.తెలుగు రాష్ట్రాలు, కర్ణాటక, మహారాష్టల్లో చైత్రం సంవత్సరాది కాగా, చైత్రం తర్వాత వచ్చే వైశాఖమాసం నుంచి బెంగాలీల సంవత్సరాది ప్రారంభం అవుతుంది. . బెంగాలీలు చైత్ర మాసాన్ని ఏడాదిలో చివరిమాసంగా పరిగనిస్తారు. ఈ క్రమంలో వైశాఖ శుద్ధ పాడ్యమి రోజున ఉగాది పర్వదినంగా జరుపుకుంటారు.
▪️సిక్కుల ఉగాది
సౌరమానాన్ని పాటిస్తారు. చైత్రం తర్వాత వచ్చే వైశాఖమాసం నుంచి సిక్కుల సంవత్సరాది ప్రారంభం అవుతుంది. ఈ క్రమంలో వైశాఖ శుద్ధ పాడ్యమి రోజున ఉగాది పర్వదినంగా జరుపుకుంటారు.
▪️కాశ్మీరులో ఉగాది
కాశ్మీరులో సంవత్సరాది పండుగను ” నవ్రే ” లేదా “నవ్రేహ్”అంటారు . కాశ్మీరీపండిట్లు చాలాకాలం వరకు ఉగాది పండుగ జరుపుకోలేదు. 1990 లో చివరిసారిగా నూతన సంవత్సరాది పండుగ ‘నవ్రే’ జరుపుకున్నారు. దాదాపు 32 సంవత్సరాల తర్వాత 2022 లో జమ్మూకాశ్మీర్ లో దాల్ సరస్సు ఒడ్డున నూతన సంవత్సరాది పండుగ ‘నవ్రే’ వేడుకలు జరుపుకున్నారు. నవ్రేvవేడుకల్లో భాగంగా సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి.
▪️సింధీల ఉగాది
సింధి ప్రజలు సంవత్సరాదిని “‘చేతి చంద్ ” లేదా ” ఛెత్రి చంద్ర ” పేరుతో జరుపుకుంటారు. అంటే చైత్ర చంద్రుడు అని అర్థం.
సింధీ సమాజంలో ఉగాది పండుగ నేపథ్యానికి ఒక కథ ప్రచారంలో ఉన్నది. ఈ కథ ప్రకారం పూర్వం సింధీ ప్రజలను నిరంకుశ ముస్లిం పాలకుడు మిర్ఖ్‌షా హింసిస్తుంటాడు. మిర్ఖ్‌షా నుండి రక్షించమని సింధు నది ఒడ్డున వరుణ దేవుడిని సింధీ ప్రజలు ప్రార్థిస్తారు. వారి మొక్కును ఆలకించి వరుణదేవుడు ఒక యోధుడిగా వస్తాడు. ఆ యోధుడి పేరు ఉడెరోలాల్. జూలేలాల్ అనికూడా అంటారు.
ముస్లింలతో పాటుగా హిందువులు మత స్వేచ్ఛకు అర్హులని ఉడెరోలాల్ మిర్ఖ్‌షాకు బోధిస్తాడు… మిర్ఖ్‌షాలో మార్పు వస్తుంది. , సింధ్‌లోని హిందూ ముస్లిం ప్రజలకు ఉడెరోలాల్ ఆరాధ్యుడు అవుతాడు. ఈ కథనం హిందూ సింధీ కొత్త సంవత్సరాన్ని ఉడెరోలాల్ పుట్టినరోజుగా జరుపుకుంటారు
~~~~~~~~~
ఆధారం
1. ఉగాది
విద్వాన్, డాక్టర్ పమిడికాల్వ చెంచుసుబ్బయ్య, కార్యదర్శి, ధర్మప్రచారపరిషత్, తి.తీ.దేవస్థానములు
&
ఉగాది విశిష్టత తిరుమల తిరుపతి దేవస్థానం
2. వివిధ వార్తాపత్రికల్లో కథనాలు
డాక్టర్ తంగెళ్ళ శ్రీదేవి రెడ్డి గారి ముఖపుస్తకం నుండీ సేకరణ
More Stories
కోనసీమలో సంక్రాంతి ప్రభల సంబరాలు
శ్రీ అయ్యప్పస్వామి – మకరజ్యోతి
మకర సంక్రాంతి (జనవరి 14)