దక్షిణాపథ స్టడీ సర్కిల్ వారు సికిందరాబాద్ లోని కాప్రాలో గల తమ కార్యాలయములో జూన్ 26 వ తేదీన భారతీయ భాషలు – సంస్కృత భాష విశిష్టతపై ప్రసంగ కార్యక్రమాన్ని నిర్వహించినారు.
జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమం ప్రారంభమైనది. కార్యక్రమంలో ముందుగా, దక్షిణాపథస్టడీ సర్కిల్ తెలంగాణ ప్రాంత సంయోజకులు శ్రీ కళ్యాణ్ చక్రవర్తి గారు తమ సంస్థ ఆశయాలూ, చేపట్టిన వివిధ కార్యక్రమాల గురించి సభికులకు వివరించారు.

సభకు ముఖ్య వక్తగా విచ్చేసిన జాతీయ సాహిత్య పరిషత్తు తెలంగాణా ప్రాంత కార్యదర్శి, బహు భాషా కోవిదులూ శ్రీ మావుడూరి సూర్యనారాయణ గారు సంస్కృత భాషా వైభవం గురించి ప్రసంగించారు.

తమ ప్రసంగంలో శ్రీ సూర్యనారాయణ గారు సంస్కృతం భారతీయ భాషాలన్నీటికీ ఉచ్ఛ్వాస నిశ్వాసలని ఇచ్చిందనీ అంతేకాక ప్రపంచంలో అనేక భాషాలకి సంస్కృతం మూలమనీ సోదాహరణంగా వివరించారు.
మానవ వికాసం అగ్నితో ఆరంభమైనదనీ, భారతీయ భాషాలన్నీ కూడా అగ్ని పదంతోనే ఆరంభమైనాయి, వేదములు సహితం ఇందుకు మినహాయింపు కాదనీ శ్రీ సూర్యనారాయణ గారు తెలిపారు. వైదిక సంస్కృతిని భాషతో లౌకికం చేసినవారు వాల్మీకి మహర్షి అనీ, వారు రచించిన రామాయణం ఆదికావ్యమైనదనీ వివరించారు. పాణిని సంస్కృత భాష నిర్మాణం చేసి ఓ దారి చూపిస్తే, కాళిదాసు మహాకవి ఆ భాషకు రససృష్టి చేశారనీ శ్రీ సూర్యనారాయణ గారు విశదీకరించారు. సంస్కృత భాషలో సమస్త విజ్ఞానం నిక్షిప్తమై ఉన్నదనీ, మన దేశంలో ఈ భాషకు విలువ కొరవడినా, జర్మనీలో ఏకంగా ఓ విశ్వవిద్యాలయాన్నే, గోథే యూనివర్సిటీ, స్థాపించి అనేక పరిశోధనలు సాగిస్తున్నారనీ వారు చెప్పారు. రాజ్యాంగ నిర్మాత లు జాతీయభాష ఏమి ఉండాలీ అని చాలా చర్చ జరిపారని. అంబేద్కర్ మహాశయుడు సంస్క్రుతం వైపు మొగ్గు చూపారని అయితే ఒక పది పదిహేను సంవత్సరాలు సంస్క్రుతం అధ్యయనం కోసం మౌలిక వసతులు కల్పించాలని అప్పుడు జాతీయభాష విషయంలో నిర్ణయం తీసుకోవాలని అన్నారని కానీ నెహ్రూ గారి తొందరపాటు, కీర్తి పొందాలీ అన్న కోరిక వల్ల ఇబ్బంది ఏర్పడిందని, రాజ్యాంగ సభ చర్చలు చూస్తే ఈ విషయం అర్థం అవుతుందని అన్నారు.
ఇంతటి అమూల్యమైన సంస్కృత భాషను కాపాడుకోవాలంటే మనంఅందరమూ ఆ భాషలోనే సంభాషించే ప్రయత్నం చేయడాన్ని మించిన తరుణోపాయం లేదనే సూచనతో శ్రీ సూర్యనారాయణ గారు తమ వాణిని విరమించారు.
ఎన్నో శ్లోకాలతో, సూక్తులతో సాగిన శ్రీ మావుడూరి సూర్యనారాయణ గారి ప్రసంగం సభికులను ఆకట్టుకుంది.
వందన సమర్పణ అనంతరం సభికులకు ప్రసాద వితరణ చేయడమైనది.
More Stories
ఒంటిమిట్ట రామాలయం
సమరసత కు సాధనం రామాయణ అనుసరణే
ఛాయా సోమేశ్వరాలయం