మల్లంపల్లి సోమశేఖరశర్మ గారు రచించిన చారిత్రక వ్యాసమంజరి నుండి సేకరణ
పూర్వము వేదములు, శాస్త్రములు మొదలగు వైదిక విద్యలన్నియు బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులను ద్విజుల 1 ణెములు చేయుట, ఇండ్లు, మిద్దెలు, మేడలు కట్టుట, వంతెనలు కట్టుట, చెఱువులు త్రవ్వుట, దేవాలయములు, గోపురములు నిర్మించుట, రథములు, బండ్లు చేయుట – ఈ మొదలగున వన్నియు ద్విజేతయధీనములో నుండెను. మిగిలిన విద్యలు, అనగా కమ్మరము, కుమ్మరము, కంచరము, నగలు, నారుల యధీనమున నుండి, వారీ పారిశ్రామిక విద్యల కధికారులుగ నుండిరి.
వృత్తివిద్య, కులములు
ఒక్కొక్క వృత్తి నవలంబించువారు కుల మను పేర నొక్కొక్క సంఘముగా నేర్పడిరి. ఇప్పటి కులములు సాధారణముగ వృత్తుల ననుసరించి యేర్పడినవే. ఒక్కొక్క కులము వారు ఒక్కొక్క విద్యను కాపాడి పోషించుచు వచ్చిరి. అందువలన నీ విద్యలకు కులవిద్యలనియు, వేఱు వేఱు వృత్తులకు సంబంధించిన వగుట చేత వృత్తి విద్యలనియు పేరు. ఈ విధమైన విద్యనే ఇప్పుడు సాంకేతిక విద్య (Technical Education) అనుచున్నారు.
వృత్తి విద్య నేర్పుటకు పూర్వము మన దేశమున నిప్పటి వలె కళాశాలలు, విద్యాలయములు కాని యుండెడివి కావు. నిపుణులైన వృద్ధులు తమ కర్మశాల (Workshop) లందే తమ తమ కులములందలి బాలురకు విద్యా ప్రదానము గావించువారు. అందువలన నట్టి బాలురు నేర్చు విద్య స్వానుభవముతో గూడినదగుట వారికిని, ప్రపంచముకును నుపయోగపడునట్టిదిగ నుండెను. వృత్తివిద్య నేర్చుకొను విద్యార్థి తన వినయ విధేయతల వలనను, వృత్తియందలి భక్తి శ్రద్ధల వలనను తన గురువు మనస్సు రంజించి అతనిని మెప్పించినచో అతని వివేకమును, శ్రద్ధను, ఆసక్తిని పరీక్షించి అతడా విద్యార్థికి ఆ వృత్తి విజ్ఞాన రహస్యముల నుపదేశము చేయువాడు. అందువలన వృత్తివిద్యాభిమాని దీక్ష వహించి యొడలు వంచి వినయ విధేయతలతో పనిచేసి తన గురువును మెప్పింప జూచువాడు. విద్యార్థి ఏ మాత్రము విద్య నేర్చుకొనినను అది స్వానుభవపూర్వకముగ పడసిన దగుట చేత తన జీవయాత్ర సుఖముగ గడపుకొనుట కతనికి తోడ్పడుచుండెను. ఏ వృత్తి యందైనను సరే నిపుణులైన వారెచ్చట నున్న నచ్చటి కేగి విద్యార్థులు విద్య నేర్చుకొనుచుండు వారు. తండ్రి యొద్ద కొడుకు విద్య నేర్చుకొనినను, అన్నయొద్ద తమ్ముడు నేర్చుకొనినను, నేర్చుకొనునంత కాలము బంధుభావముతో గాక గురుశిష్య భావముతోనే వారు కాలము గడుపువారు. అందువలన కర్మశాలలో పనిచేసినందులకు తండ్రి కొడుకునకు గాని, అన్న తమ్మునికి గాని జీత మొసంగువాడు. కాని శాల విడిచి యింటికి వచ్చినచో గురుశిష్య సంబంధము వదలి బంధుసరళిని మెలగువారు. హిందువులది సమష్టి కుటుంబము గనుక కర్మశాలలో తండ్రి యిచ్చిన జీతము కొడుకును, అన్న యిచ్చిన వేతనము తమ్ముడును ఇంటికి వచ్చిన పిదప కుటుంబ ధర్మము ననుసరించి వారి వారికి నిచ్చి వేయువారు. ఈ విధమున వృత్తివిద్యలన్నియు పూర్వము తండ్రి వలన నుండి కొడుకునకు, అన్న వలన నుండి తమ్మునకు వంశ పారంపర్యముగ వచ్చు చుండెడివి. ఒక్కొక్క కులము వారు తమ కులవిద్యనే కాని యితరములను నేర్చుకొన రాదని కట్టుబాటుండెడిది. తన కులవిద్యను విడిచి ఇతర కులవిద్యను చేపట్టుట కులద్రోహముగ పరిగణింపబడుచు వచ్చెను. స్వధర్మమే శ్రేయోదాయకము, పరధర్మము భయావహము; ఆచరణాయోగ్యము. ఇట్టి నమ్మకము ప్రబలముగా వ్యాపించి యుండుటయే
వెలివిద్య లెన్నియైనను
గులవిద్యకు సాటిరావు కుంభినిలోనన్ వెలకాంత లెంద ఱున్నను
గులకాంతకు సాటిరారు గువ్వల చెన్నా !
మున్నగు పద్యములు పుట్టుటకు కారణ మయినది. ఇట్లు ఆయా కులముల వారు తమ తమ కులముల కేర్పడిన విద్యలను ప్రాణతుల్యముగ నెంచి పోషించుచు వచ్చిరి. అట్టి పారిశ్రామిక కులజుల కుటీరములే వృత్తివిద్యాలయములుగ నేర్పడినవి. అవి గొప్ప పారిశ్రామిక నిలయములై పేరు గాంచి దేశైశ్వర్యమును పెంపొందించినవి. నేటి వలె భౌతిక శాస్త్ర విజ్ఞానము వికసింపని ఆ ‘మోటు‘ దినములలోనే ప్రపంచ మంతట బేరుపడిన వస్తుజాలమును తయారు చేసి హిందూ పారిశ్రామికుడు ఖండాంతరుల వలన గూడ సంస్తుతులను బొంది. పల్లెటూరి యందలి తన చిన్న కుటీరము ముందు తన వృత్తి విద్యా నైపుణ్యమునకు దర్శసూచకముగ విజయ స్తంభమును పాతి కీర్తి పతాకమును లేవనెత్తినాడు.
వృత్తు లెన్నో మన దేశమున సాధారణముగ కుటీర పరిశ్రమలన్ని కలవు. వీటిని నడుపునది జీవము లేని యంత్రములు గాక బుద్ధి వైభవమును, ప్రతిభా సంపదయు గల దివ్య చైతన్యాంశా సంభవుడగు మానవు డగుట వలన అవి పారిశ్రామిక కళలై పరిఢవిల్లినవి. హిందూదేశ పరిశ్రమలను గుణించి యిచట వ్రాయుట అనవసరము.
కులసభలు, విధులు
స్వధర్మ సంరక్షణమునకై ఈ కులములకు కులసభలును, పంచాయతులు నుండెడివి. హిందూ ధర్మశాస్త్రములు కూడ ఆయా కులములకు సంబంధించిన వివాదములను పరిష్కరించు పద్ధతి కులసభలకే వదలిపెట్టి వానిని గౌరవించినవి. పూర్వపు ధర్మశాస్త్రకారులకు ఈ వృత్తులయం దెంతటి గౌరవము కలదో ఈ విధమైన ధర్మశాస్త్ర నిబంధనములను గాంచిన దెలియగలదు. కులసభలు మాత్రమే కాక ప్రత్యేకము ఇప్పటి ‘బ్యాంకు‘ల వంటి కొన్ని నిధులుండెడివి. రాజులు మొదలగు ధనాఢ్యులాయా కులముల వారు తయారు చేసిన పారిశ్రామిక సంపద కొని యెవరికైన దానము చేయదలచినప్పుడు ఆ దాన మనువర్షము నాచంద్రార్క స్థాయిగ సాగుచుండుట కయి తాము దానము చేయదలచిన దాని విలువకు సరిపోయిన వడ్డీ నొసంగు మూలధనమును ఆ కులము వారి నిధి కొసంగువారు. ఈ పద్ధతి వలన రెండు లాభములు కలుగుచుండెను. (1) ధర్మము ఆచంద్రార్కస్థాయి నుండుట, (2) మూలధనము వలన నా పరిశ్రమ అభివృద్ధి గాంచుట, ఈ విధమైన నిధులు, నిబంధనలను క్రీస్తు శకారంభ కాలమునకే, అనగా ఆంధ్రరాజులు పాలించునాటికే కలవు. అప్పటికే ఆయా వృత్తి సంఘములు (Trade unions) చక్కని వికాసము నొంది అభివృద్ధి గాంచినవి.
ప్రతి వృత్తియు చాల గౌరవప్రదమైనదిగ నెన్నబడుచుండెను. ప్రాచీన హిందూ గ్రామ వ్యవస్థను పరికించినచో ప్రతి వృత్తికి నుచితస్థాన ముండినట్లు సువ్యక్తమగును. వ్యవసాయకపు జాతి యగుట చేత హిందువులు ముఖ్యముగ నూటికి తొంబది తొమ్మిది వంతున గ్రామములందే నివసించువారు. హిందూ సంఘ పరిపాలనమున కేమి, మఱి యితర విషయముల కేమి, పూర్వము – పూర్వమే యననేల, ఇప్పటికి గ్రామమే ప్రాతిపదిక. హిందూదేశము నంతను కంపింపజాలు ఏ విద్యుత్సంచలనము కలిగినను అది గ్రామమున నుండియే ప్రాదుర్భవించుచుండెను. ఏ సంస్కర్త కాని, ఏ రాజకీయ తంత్రజ్ఞుడు కాని పూర్వము ప్రకృతి యొడియందలి పాలబుగ్గల పల్లెటూరిని లాలింపగలిగెనా, అతడు హిందూ దేశమునంతను నూటాడింపగల బలము సంపాదించినా డన్నమాటయే. పూర్వమిట్టి మహాసంస్థయు, హిందూ సంఘ మహాదుర్గమునైన గ్రామమున ‘కులపతి‘ యైన పారిశ్రామికు డుచిత స్థానమును సంపాదించెను.
వైదిక విద్య, వృత్తి విద్య
బ్రాహ్మణుడు తన వశమున నున్న వైదిక విజ్ఞానమును ప్రజల కొసంగినను పారిశ్రామికుడు లేనిచో నిలువ నీడ యుండునా? భోజనాదికము లమర్చుకొనుట కుపకరణములును సాధనములు నుండునా? పారిశ్రామిక విజ్ఞానము లేనిచో ఆధ్యాత్మిక విజ్ఞాన ముండియు సంఘ మభివృద్ధి నొందజాలదు. ఆధ్యాత్మిక దృష్టి లేని పారిశ్రామిక విజ్ఞానము అపాయకరము. ఆధ్యాత్మిక, పారిశ్రామిక విజ్ఞానములం దేది కొఱవడినను రెండవ దానికి ప్రశస్తి లేదు పారిశ్రామిక విజ్ఞానము సుందరమును, హృదయాకర్షకమునైన నాగరకతను 1 సృష్టించుచుండు ఆధ్యాత్మిక విజ్ఞానము దానికి తేజస్సు నొసంగి ప్రాణము పోయుచున్నది. హైందవ నాగరకత యంతయు పల్లెటూరి పారిశ్రామికుని చిన్న కుటీరమున నుండియు, నిరాడంబర జీవియు వైదిక విద్యా సంపన్నుడునైన బ్రాహ్మణుని పర్ణశాల నుండియు పెరిగి పెంపుగాంచినది. ఈ రెండు విధములైన జ్ఞాన విభాగములకు గల యన్యోన్య సంబంధమును గుర్తెఱింగినది గనుకనే మన ప్రాచీన గ్రామ మీరెంటికి ప్రధాన స్థాన మొసంగి సఖ్యత సమకూర్చినది.
ప్రాచీన గ్రామ వ్యవస్థయందు వైదిక విద్యా సంపన్నుడైన బ్రాహ్మణున కెట్టి ప్రాముఖ్యము గలదో వృత్తి విద్యా నిపుణుడైన పారిశ్రామికునికి నట్టి ప్రాముఖ్యమే కలదు. ప్రాచీన గ్రామ మీ రెండు విధములైన విజ్ఞానమును సమన్వయము చేసి నేటి పారిశ్రామిక సమస్యను, దానికి సంబంధించిన యితరములైన చిక్కులను ‘ఆధునిక నాగరకత‘ కన్నులు తెఱవకమునుపే చక్కగ పరిష్కరించినది. పారిశ్రామికునికి గ్రామ వ్యవస్థలో ‘వృత్తి‘ రూపమున స్థాన ముండుటచే వృత్తి విద్యకెట్టి యాదరణ ముండెడిదో తెలియగలదు. పూర్వము బ్రాహ్మణుడు, పారిశ్రామికుడు వీరిరువురును హిందూ సంఘమునకు రెండు కన్నుల వలె నుండి పరస్పరము సహానుభూతిని గలిగి యుండుట నేర్చుకొని, ఆధ్యాత్మిక విద్య కధికారులై ఉన్నతాదర్శములను జూపి మానవుని యందలి దివ్యసంపదను దోహదము చేసి యొక్కరును, ఆధిభౌతిక విద్యకాచార్యులై సౌందర్య రసపరివుతములగు కళారచనములను గావించి జీవితమును సౌఖ్యానంద సంభరితము గావించి మఱియొక్కరును సంఘమును నడిపించి దేశమును పరిపాలించువారు.
‘భటవృత్తి‘ మాన్యములు, గ్రామవ్యవస్థ
ప్రతి గ్రామమునకు కమ్మరి, వడ్రంగి, కంసాలి మొదలగు వారి కందఱకు ‘వృత్తు‘లను పేర వృత్తి మాన్యము లుండినవి. గ్రామము ఏర్పాటగునప్పుడే ఈ వృత్తు లేర్పడుచుండెడివి. గ్రామ జీవనము పరిపూర్ణమయి సరళముగ నడచి పోవుట కవసరమైన యన్ని వృత్తుల వారు నుండుట వలననే పూర్వ మొక గ్రామ మింకొక గ్రామము మీద నాధార పడవలసిన యావశ్యకము లేకపోయెను. గ్రామమున కాయా వృత్తుల వారు భటులుగ నుండి సంఘశరీరమును కాపాడువారు. కావుననే వారి కేర్పడిన మాన్యములను ‘భటవృత్తి మాన్యము‘ లనియు, ‘జాతికట్టు మాన్యము‘ లనియు పేరు కలిగెను. పూర్వము గ్రామమే కాక యందలి దేవస్థానము కూడ వారికి మాన్యము లిచ్చి గౌరవించి పోషించుచుండెడిది. దక్షిణ దేశమున నేమాత్రము ప్రసిద్ధికెక్కిన దేవాలయమున నైనను కమ్మరి, కుమ్మరి, కాసె(తాపీపని)వాడు, వడ్రంగి, స్వర్ణ కారుడు మొదలగువార లెల్లరు నుండు వారు. ఇట్లు మహాసంస్థయైన గ్రామమును, అందలి ఉపసంస్థయైన దేవస్థానమును గూడ గొప్ప పారిశ్రామికశాలలుగ నుండుటయే కాక ఆయా వృత్తుల వారికి తమ తమ విద్యలలో నారితేరుటకు, చేయి తిరుగుటకును ప్రాథమికాభ్యాసశాలలుగ గూడ నుండెడివి. ఆయా వృత్తుల వారు వారి వారి వృత్తి విద్యలయందు నిపుణులగుటకు గ్రామ వ్యవస్థ ఈ విధమున నవకాశ మిచ్చుచుండ ధనికులు, సామoత మండలేశ్వరులు, రాజులు మొదలగువారు నూతులు త్రవ్వించియు, చెఱువులు కట్టించియు, గుళ్లు గోపురములు నిర్మించియు పనివాండ్రకు తమ పనితనము జూపుట కవకాశ మిచ్చి ఆదరించువారు. పనివాడు తన పనితనము జూపి తన కృతిప్రేరకని మెప్పించినచో అతడు తద్వృత్తి విద్యావిశారదునకు కొంతభూమి దానమొసగువాడు. ఇట్లు పూర్వము పారిశ్రామిక కళాకుశలులైన విద్యావంతులకు కళాభిరుచిగలవారు భూమి రూపమున నొసంగిన బహుమానదాన శాసనము లనేకములు కాన్పించు చున్నవి. ఇట్లు మాన్యముల నొసంగి యాదరించుటయే కాక వారి పనితనమును మెచ్చుకొని కళాప్రియులైన ప్రభువులు సాంఘికముగ వెనుకబడియుండు వారికి కొన్ని కొన్ని స్వాతంత్య్ర మర్యాదలు గూడ నొసంగి క్రమక్రమముగా సంఘమున వారి పరపతియు, గౌరవ మర్యాదలును హెచ్చునట్లు చేయువారు. ప్రాచీన శాసనావళిని గాంచినచో మన కట్టి శాసనములు కొన్ని కానబడును. ఇట్లు వృత్తి విద్యావిశారదుల వలన ఆయా కులములకు హిందూ సంఘమున గౌరవము హెచ్చుచు వచ్చెను. ఆయా కులములకు ప్రాణరక్ష వలె నుండి విద్యావంతులు దేశమును సౌభాగ్యవంతముగ దిద్దుటకై తమ మేధాశక్తిని, ప్రతిభాసంపదను వినియోగించువారు.
పంచాణము వారు, వారి పనితనము
లలితములైన పారిశ్రామిక కళలను పోషించి, కాపాడి దేశమునకు సౌభాగ్య సౌందర్యముల నొడగూర్చిన వారు ఈ పారిశ్రామిక జాతుల వారే. వీరిలో ‘పంచాణము’ వారు అనబడు విశ్వకర్మ వంశజులు ముఖ్యులు. బ్రహ్మకుమారుడైన విశ్వకర్మకు అయిదుగురు కొడుకులు కలరు. వారైదుగురు (1) కమ్మరము, (2) వడ్రంగము, (3) కంచరము, (4) శిల్పము, (5) స్వర్ణకారకము (కుందనపుపని)యను నయిదు వృత్తులకు కారకులైరి. ఈ యైదు వృత్తుల వారికి ‘ఐద్దాయు’లనియు పేరు. వీరు తమ పేర్ల చివర ‘ఆచారి’ పదము నేర్చుకొందురు. వల్లభోజు, బసవోజు, వేమోజు అని ‘ఓజు’ పదాంచిత నామములు పూర్వకాలపు శాసనములలో వీరికి తఱచుగ గన్పట్టును. తామ్రశాసనములను గూడ వీరే చెక్కువారు. కళింగగాంగుడగు మూడవ వజ్రహస్తుని దానశాసనముల యుత్కీర్ణకులలో మహాక్షశాలులు మేంటోజు, నూకమోజు, వల్లేనోజు ననువారు కలరు. ఉపాధ్యాయుడని యర్థమిచ్చు నొజ్జ రూపాంతరమైన ఓజపదమే ఓజుగా మాఱినది.
గుంటూరు మండలము నందలి పల్నాటి తాలూకా మాచెర్ల గ్రామమున ఆదిత్యేశ్వరాలయము ‘ నందున్న శాసనములలో గొన్ని యీ విశ్వకర్మ కులజుల ప్రశస్తిని

తెలుపుచున్నవి. ఆ శాసనములందు పేరెన్నికగన్న విశ్వకర్మ వంశోద్భవులైన కొండ ఱచార్యులు పేర్కొనబడియున్నారు. వారు శివలింగములను మలచుటలోను, విగ్రహములను చెక్కుటలోను, చతుర్విధ ప్రాసాదాదులను నిర్మించుటలోను, వాస్తు శాస్త్రమునకు సంబంధించిన జ్ఞానము నందును ప్రజ్ఞావంతులని సంస్తుతింపబడిరి. మఱియొక శాసనము వీరిని ‘దశక్రియా‘ పరిజ్ఞాతలని పొగడుచున్నది. నగర, గ్రామ, దుర్గ, నిర్మాణములు, జల నిర్గమనాగమనాది నిర్మాణములు, దేవాలయ గోపుర తటాకాది నిర్మాణములు మొదలగు వానియందు వీరు ప్రవీణులై దేశము యొక్క కళాసంపదను పెంపొందింపజేసిరి. ఎల్లోరా గుహలలోని కైలాస సౌధాదులు, మామళ్లపురము నందలి ధర్మరాజాదుల శిల్పరథాదులు, సాంచీ మున్నగు స్తూపరాజములు ఇవియవి యననేల, పోయినది పోను ఇప్పటివఱకు దేశము నందు నిలిచియున్న శిల్పకళా సంపద యంతయు ఈ ‘పంచాణము‘ వారు తమ పోషణ రక్షణముల క్రింద వచ్చిన శిల్పకళ నెంత భద్రముగ కాపాడి, దానినెంత చక్కగ వినియోగమునకు తెచ్చిరో వెల్లడించు మహోత్కృష్ట నిదర్శనముగ నున్నది. ఇప్పటికి నీపైనుడివిన నిర్మాణములందలి శిల్పకళా కౌశలమును జూచి, యానందించి తలయూపనివాడు లేడు. అట్టిది ప్రాచీనార్య సంప్రదాయమున పెరిగి కులవిద్యా

పారంగతులయిన విశ్వకర్మజుల యద్భుత కళాకౌశలము!
శిల్పకళాగౌరవము, చారిత్రకోదాహరణములు
సిద్ధహస్తులైన యిట్టి శిల్పాచార్యులను స్వమతస్థులే కాక మతాంతరులయిన శత్రువులు కూడ గౌరవించి యాదరించుచుండువారు. హిందూ దేశైశ్వర్యము నపహరించుటకై పెక్కు తడవలు దండయాత్రలు సలిపిన సుల్తాను ఘజనీ మహమ్మదు హిందూ విగ్రహములను అసహ్యించుకొనినను వానిని, వాని కొఱకు ఆలయములను తయారు చేయుటలో హిందూ శిల్పులు చూపిన కళానైపుణ్యమునకు ఆశ్చర్యవిముగ్ధు డగుచుండువాడు. మధురానగరమును ముట్టడించిన పిదప, ఆ నగరము నందలి భవనముల యొక్కయు, నగరము యొక్కయు ఘనతను పొగడుచు సుల్తాను ఘజనీ నగరమునందలి తన ప్రతినిధి కుత్తరము వ్రాసినట్లు మహమ్మదీయ చరిత్రకారుడైన ఫెరిష్టా తెలిపియున్నాడు : “మహమ్మదుల వారి మతము వలెనే సుస్థిరమైన వేలకొలది దివ్యభవనములిచట కలవు. ఎన్నియో లక్షల కొలది, కోట్ల కొలది దీనారములను వ్యయపఱిచిననే కాని యీ నగర మింతటి మహోన్నత స్థితికి వచ్చియుండుట యసంభవము. అంతే కాదు, ఇంకొక రెండువందల సంవత్సరములలో నైనను మరల నిట్టి నగరమును నిర్మించుటకు గాదు“ అని సుల్తాన్ మహమ్మదు వ్రాసెనట. సుల్తాను ఘజినీకి మఱలి వెళ్లినప్పుడు, 5300ల మంది హిందువులను ఖైదీలుగు గొనిపోయెను. వీరిలో చాలమంది శిల్పులు, వృత్తి విద్యా నిపుణులు నుండి యుందు రనుటకు సందియము లేదు. ఏలయన. గాంధార దేశమునందలి సుల్తాన్ మహమ్మదు రాజధానియైన ఘజనీయం దున్నన్ని ప్రాసాదములు, దివ్య భవనములు, జలాశయములు, కేళీగృహములు, మండపములు మొదలగునవి ప్రాగేశ నగర రాజములందు వేనియందును గానరా వనియు. వీని నన్నిటిని నిర్మించిన వారు హైందవ శిల్పులే యనియు తెలియుచున్నది.
క్రీస్తుశకము పదునాలుగవ శతాబ్ది కడపట, టైమూరు హిందూదేశముపై దండెత్తి వచ్చి ఢిల్లీ నగరమున లక్షల కొలది జనులను దారుణవధపాలు చేసి. పిదప చాలమందిని ఖైదీలుగ పట్టుకొనెను. వారిలో శిల్పులు మొదలగు కళాకుశలు లెందఱుండిరో లెక్క వేయించి, వారిని తన రాజధాని యైన ‘సమర్కాండు‘ నకు గొనిపోయి, వారిలో చాల ప్రవీణులైన వారిని కొందఱి నచ్చట నొక మసీదు కట్టించుటకు తన యాస్థానమున దన యాశ్రయమున నుంచుకొని మిగిలిన వారిని తన సామంతరాజులకు, అమీరులకు నొప్పగించి వారి పోషణ భారము వారిపై మోపెనట. ఈ విధమున నెన్ని యుదాహరణములనైన నొసంగ వచ్చును. మహమ్మదీయులు హిందువులకు కడుంగడు శత్రువులై, మత విషయమున దృష్టిని పగబూని హిందూ విగ్రహములను, హిందూ దేవాలయములను భగ్నము చేయుచు వచ్చినను కళాకుశలుల శిల్ప కౌశలమును మెచ్చకపోలేదు, మెచ్చి వారి నాదరింపక పోలేదు. ఇంతయేల, శత్రు రాజులు హిందూ దేశముపై దండెత్తి వచ్చినపుడు వారి శిల్పకళా రచనములను జూచి ముగ్ధులై గొనిపోయి గౌరవ సమ్మానము లొసంగి వారి శిల్పకళా రచనములకు ప్రోత్సాహమిచ్చియున్నారు. అందువలన హైందవ శిల్పకళ దేశ దేశములకు ప్రాకి అచ్చటచ్చట వలసల నేర్పాటు చేసి కొనెను. తుదకు అత్యంత రమణీయమైనదని పేర్వడసిన బాగ్దాదు నగరమును కట్టినది కూడ హైందవ శిల్పులే యని కొందఱు చరిత్ర పరిశోధకులు యభిప్రాయము.
దేశీయ ప్రభువుల కళాభిమానము
శత్రురాజుల మాట యటులుండ దేశీయులైన రాజాధిరాజులు కూడ కళల నాదరించి యుండిరనుటకు పెక్కు నిదర్శనములు కలవు. అట్టి వొకటి రెండు నుడివిన జాలును: “అశోక వర్ధనుని కాలమున శిల్పు లొకవిధముగ రాజు కొలువులోని వారుగనే పరిగణింపబడుచుండిరి. చేతులు పోగొట్టి కాని, కళ్లు పోగొట్టి కాని….. వృత్తి విద్యా విశారదుని శక్తి సామర్థ్యములను కుంటుపఱచిన వారికి శిక్ష శిరః ఖండనమే. నౌకానిర్మాతలు, కవచ నిర్మాతలు వేతనములను బడయు రాజసేవకులుగ నుండిరి; వారు రాజుకే కాని యితరులకు పనిచేయగూడదను నిర్బంధముండినట్లు చెప్పుదురు. వడ్రంగులు, కమ్మరులు మొదలగువారిని రాజే ప్రత్యేకము కనుగొనుచు వారి పని పరిశీలించుచుండువాడు“. ఢిల్లీ పాదుషాయైన అక్బరు కొలువులో పెక్కురు కళాకుశలులు, వృత్తి విద్యానిపుణులు నుండువారనియు, వారి రచనములలో అత్యుత్తమములైన వానికి ప్రత్యేక బహుమానముల నొసంగి పాదుషా వారిని గౌరవించుచుండువాడనియు అతని మంత్రియయిన ‘అబుల్ ఫాజల్‘, ‘అయిని అక్బరీ’ అను గ్రంథమున వ్రాసియున్నాడు.
కర్ణాట సార్వభౌముడైన కృష్ణదేవరాయలు ఉదయగిరి దుర్గముపై దండెత్తి వెళ్లి దానిని పరిపాలించుచుండిన గజపతిరాజులను‘ జయించి యాకోటయందలి² యొక దేవాలయమున నున్న యత్యంత సుందరమైన బాలకృష్ణ విగ్రహమును పెల్లగించి నిజరాజధానియైన విజయనగరమునకు గొనిపోయినట్లు చారిత్రక ప్రమాణము కలదు.


ఈ పైనొసంగిన యుదాహరణములను పరిశీలించినచో దేశీయులైన నేమి, విదేశీయులైన నేమి ప్రభువు లగువారు ఇట్టి విద్యావంతులను ఆదరించి, గౌరవించి, శిల్పములను పోషించు వారనియు, పరరాజులు దేశమును జయించినప్పుడు చతురులైన శిల్పాచార్యులను, తద్విరచితములైన కళాకావ్య రచనములను తమ

దేశమునకు గొనిపోయి తాము జయించిన రాజులను పరాభవించు వారనియు తెలియుచున్నది.
ఉపసంహారము
ఈ పై నుడివిన విషయము లన్నియు హైందవులైన నేమి, హైందవేతరులైన నేమి, పూర్వులకు గల కళాభినిరతిని సహస్ర కంఠముల నుచ్వైస్స్వనమున సుద్దోషించు చున్నవి. ఆరితేరి సిద్ధహస్తులైన శిల్పులు, స్థపతులు మొదలగు కళాకుశలులు దేశమునకు కీర్తి తెచ్చు నలంకారములు. వారే దేశము సంపద. లలిత కళాసంపద, శిల్పకళా విజ్ఞానము లేని దేశము దేశమే కాదని మన పూర్వులు భావించి యుండినట్లు పూర్వోక్త విషయము వలన విశదమగుచున్నది. తుదకు పదునాఱు, పదునేడు, పదునెనిమిది శతాబ్దులందు తంజావూరు, మధురానగరములు రాజధానులుగా పరిపాలించిన నాయకరాజులు కూడ సుప్రసిద్ధులైన శిల్పాచార్యులను పోషించి, కళలను వృత్తివిద్యలను ఆదరించిరనుటకు వారి కాలమున నిర్మింపబడిన గొప్ప గొప్ప దేవాలయాది నిర్మాణములే తార్కాణము. విజయనగరాధిపతుల కాలమునను, తంజావూరు మధుర నాయక రాజుల కాలమునను హిందూ దేవాలయ శిల్పము అత్యంతోన్నత స్థితికి వచ్చినది. ప్రజ్ఞాఢ్యులయిన యా కాలపు శిల్పుల రచనములు నేటికిని చెక్కుచెదరక, చూపఱకు వాని రచనా మాధుర్యమునకు ఆశ్చర్యమును, నేటి కళా క్షైణ్యమునకు విషాదమును గలిగించుచున్నవి.
ఈ సంగతుల నన్నిటిని బట్టి చూడగా పూర్వము ప్రభువరేణ్యులు అగ్రహారముల నొసంగి వైదిక విద్య నెట్లాదరించిరో, బహుకళా కావ్యరచనములు గావించిన వృత్తి విద్యా విశారదులను గూడ నట్లు సమానముగనే బహూకరించిరని స్పష్టపడగలదు. వేదశాస్త్ర పారంగతుడయిన ఛాందస బ్రాహ్మణుని హస్తమున మతవిద్య కెట్టి యాధ్యాత్మిక తీర్పు కలిగెనో అట్లే కుటీరవాసియు, నిరుపేదయు, నమాయకుడునైన పారిశ్రామికుని చేతిలో వృత్తివిద్యయు కళాకుసుమముగ వికసించి దశదిశల దన నెత్తావిని విరజల్లి సర్వజనానంద సంధాయకమై విరాజిల్లెను. అంతటి యౌన్నత్య దశ నందిన యీ రెండు విధములగు విజ్ఞాన వల్లరులకు గ్రామమే యాలవాలము; ప్రాథమిక క్రీడారంగము. పల్లెటూరి పారిశ్రామికుడు తన కర్మశాలలో వెలిగించిన యీ విజ్ఞాన రత్నదీపము దేశాంతరములనుగూడ ప్రకాశవంతము చేసి, సౌందర్య రససృష్టికి పరమావధి యయినది. అట్టిది మన పూర్వపు వృత్తివిద్య. అంతటి నిరాడంబరమైనది తద్ విద్యావిధానము; అంతటి యుత్కృష్టమైనది దాని ఫలితము.
(భారతి – మార్చి 1926)
More Stories
టిప్పు ను మట్టి కరిపించి ఓడించి, మరుగునపడిన హిందూ వీరుడి గాథ: తుకోజీరావు హోల్కర్
వీరాంగన ” నీరా ఆర్య” మొదటి మహిళా గూఢాచారి
ఉద్గిర్ పోరాటం (జనవరి 03)