
కిట్టూరు చెన్నమ్మ (1778 అక్టోబరు 23 – 1829 ఫిబ్రవరి 21) బ్రిటిషు ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనాకాలంలో, కన్నడ దేశానికి చెందిన కిట్టూరు అనే చిన్నరాజ్యానికి రాణి. మధ్యప్రదేశ్ లోని ఝాన్సికి చెందిన లక్ష్మీబాయి కన్న 56 సంవత్సరముల ముందే పుట్టి, తన రాజ్య స్వాతంత్ర్యానికై బ్రిటిషు కంపెనీతో పోరాటం చేసిన మొదటి భారతీయ వీరవనిత. కిట్టూరు అనేది బెల్గాము రాజ్యానికి సమీపమున ఉన్న చిన్నరాజ్యం. ఆమె బ్రిటిషు ఈస్టు ఇండియా కంపెనీకి వ్యతిరేకంగా తన గళమెత్తి, వారి అఘాయిత్యాలను నిరసిస్తూ 1824లో బ్రిటిషువారి అపారసైన్యానికి బెదరక, మొక్కవోని ధైర్యంతో పోరుసల్పినది. కాని మొదట విజయం అమే వైపే ఉన్ననూ, చివరకు బ్రిటిషు ఈస్టు ఇండియా కంపెనికి బందీగా చిక్కి, చెరసాలలోనే కన్ను మూసింది. కన్నడదేశానికి చెందిన నాటి వీరవనితలైన అబ్బక్కరాణి, కెలారి చెన్నమ్మ, ఒనక ఒబవ్వ చిత్రదుర్గల సరసన అగ్రస్థానములో పేరెక్కిన సాహసి కిట్టూరు చెన్నమ్మ.
చెన్నమ్మ బెల్గాం పట్టణానికి 5 కి.మీ.దూరంలో ఉన్న కిట్టూరు రాజ్యంలో సా.శ.1778 లో అక్టోబరు 23వ తేదిన జన్మించింది. చెన్నమ్మ చిన్నతనముననే గుర్రపుస్వారి, విలువిద్యలలో శిక్షణపొంది, యుద్ధవిద్యలలో ఆరితేరినది. చెన్నమ్మ తండ్రి కాకతీయ దేశాయి కుంటుంబానికి చెందిన ధూళప్పగౌడరు.
చెన్నమ్మకు కిట్టూరు పాలకుడయిన దేశాయిరాజ కుటుంబీకుడైన మల్ల సర్జన తో వివాహం జరిగింది. ఆమె కిట్టూరు రాజ్యమునకు రాణి అయ్యింది. ఆమె మల్ల సర్జనకు రెండవ భార్య, రెండో రాణి. వారికి ఒక కుమారుడు జన్మించాడు కానీ అనారోగ్యంతో మరణించాడు. అప్పుడు చెన్నమ్మ శివలింగరుద్రప్ప అనే బాలుడిని తన కుమారునిగా దత్తత తీసుకున్నది. అతనిని తన వారసునికిగా ప్రకటించింది. కిట్టూరు రాజ్యచరిత్ర 1586 నుండి ప్రారంభమైనది. మలెనాడుకు చెందిన మల్ల అనే పేరున్న అన్నదమ్ములు బిజాపుర సంస్థానము పాలకుడు, ఆదిలశాహి సైన్యములో పనిచేసేవారు. వారి వీరత్వానికి మెచ్చి వారికి శంశేర్జంగ్ బహుదూరు అనే బిరుదు, హుబ్లి ప్రాంతంలో పాలనాధికారము ఇచ్చెను. బిజాపూరు రాజ్యం పతనమైన తరువాత వీరి వంశీకులు కిట్టూరు దేశపాలనను స్వయంగా చేసుకొనేవారు. బ్రిటిషు ఈస్టు ఇండియా వారు పాలనా పగ్గాలు చేపట్టేసమయానికి దక్షిణభారతంలో తమ అస్తిత్వాన్ని నిలుపుకొనుటకు దేశాయిలు అటు హైదరాబాదు నిజాంషాహి, ఇటు మైసూరు హైదరు ఆలీ నడుమ పోరుసల్పుచున్న రోజులలో, హైదరుఅలితో జరిగిన యుద్ధంలో మల్లసర్జన బందీ అయ్యి, ఉపాయంతో తప్పించుకు వచ్చి, 1803లో అప్పటి బ్రీటిషు ఈస్టు ఇండియాకు చెందిన వెల్లెస్లీతో ఒప్పందం చేసుకొనెను. 1809 లో, వెళ్ళేస్లీ కి 1,75,000 రూపాయలిచ్చి, స్థానిక బ్రిటిషు ఖర్చులు భరించేలా ఒప్పందం చేసుకొనెను. కానీ, వెళ్లేస్లీ విశ్వాస ఘాతుతకమునకు ఒడిగట్టి, మల్లసర్జనను 3 సంవత్సరములు పూణెలో బందీగా ఉంచెను. సా. శ .1816లో విడుదలై తిరిగివచ్చుచు, మార్గమధ్యలో సా. శ. 1817లో మరణించెను. చెన్నమ్మ, తమ దత్తపుత్రుడు శివలింగ సర్జను రక్షణకై బ్రిటిషు ఇండియాతో ఒడంబడిక చేసుకొనెను. సంవత్సరానికి 1,70,000 రూపాయల కప్పం చెల్లించుటకు కుదిరిన వీరి ఒప్పందం 1824 వరకు కొనసాగింది . 1824 సెప్టెంబరు 11లో శివలింగ రుద్ర సర్జన వారసుడు లేకుండగానే మరణిస్తాడు. అతని మరణసమయానికి అతని భార్య వీరమ్మ వయస్సు 11 సంవత్సరాలు. మరణించుటకు ముందే మాస్తమరడి గౌడర కుమారుడు శివలింగప్పను దత్తత తీసికొనడం జరిగింది. దీనిని అదునుగా తీసికొని అప్పటి ధార్వాడ్ కలెక్టరు థ్యాకరే ఈ దత్తతను నిరాకరించి, 1824 సెప్టెంబరు 13 న కిట్టూరు వచ్చి, మల్లప్పసెట్టి, హవేరి వెంకటరావులను అధికారులుగా నియమించి, ధనకోశమునకు తాళము వేసాడు. దీనిని చెన్నమ్మ ఎదిరిస్తుంది. ఈ విషయమై చెన్నమ్మ థ్యాకరెకు, మన్రోకు, చాప్లినుకు శివగంగప్ప వారసత్వాన్ని అంగీకరించి పాలనాధికార మిప్పించమని విన్నపము చేస్తుంది,. కాని వారు నిరాకరించగా సమీపమున ఉన్న కోలాపుర సంస్థానంతోనూ, మిగతా బ్రిటిషు వ్యవహారం యెడ కోపంగా ఉన్న వారితో సహకారానికై సంప్రదింపులు జరుపుతుంది .
ధారవాడ కలెక్టరు సైన్యసమేతంగా 21 అక్టోబరు 1824 న కిట్టూరు వచ్చి యుద్ధము ప్రకటించి, ఫిరంగులను పేల్చుటకు సిద్ధమవ్వగా, కోట ముఖద్వారం తెరుచుకొని బయటికివచ్చిన చెన్నమ్మ సైన్యం ఒక్కుమ్మడిగా బ్రిటిషు సైన్యంపై, గురుసిద్దప్ప అను సైన్యాధిపతి నేత్రుత్వంలో ఊపిరిసల్పనివ్వకుండా దాడిచేసింది. చెన్నమ్మ అంగరక్షకుని తుపాకి గుండుకు కలెక్టరు మరణించగా, స్టివన్సను, ఈలియట్ అను బ్రిటిషువాళ్లు బందీలుగా చిక్కారు. దేశద్రోహనికి ఒడికట్టి, బ్రిటిషువారికి సహకరించిన కన్నూరు వీరప్ప, సర్దార్ మల్లప్ప కిట్టూరు సైన్యంచేతిలో ప్రాణాలు పోగొట్టుకుంటారు. అటు పిమ్మట, బ్రిటిషువారు, కుటిలనీతితో ఒప్పందానికి వచ్చినట్లు నటించి, బందీలైన తమ ఇద్దరు బ్రిటిషు అధికారులను1824, డిసెంబరు 2న విడిపించుకెళ్తారు. అయితే మాట తప్పి, బ్రిటిషువారు మళ్లీ డిసెంబరు 3 వ తేదిన అపారసైన్యంతో కిట్టూరు మీద దాడి చేస్తారు. ఫిరంగులతో కోటగోడలను బద్దలుకోట్టి లోనికి ప్రవేశిస్తారు. కిట్టూరు సైన్యం వీరోచితంగా పోరాడినా, చివరకు లొంగిపోక తప్పలేదు. చివరకు డిసెంబరు 5, 1824 న చెన్నమ్మ, తన కోడలైన వీరమ్మ, జానకిబాయిలతోపాటు బ్రిటిషువారికి బందీగా చిక్కుతుంది. వీరిని బందీలుగా బైలహొంగలకు తీసుకెళ్తారు బ్రిటిషు వారు. చెన్నమ్మ 4 సంవత్సరాలు బైలహొంగలలో ఖైదీగా ఉండి, చివరకు ఫిబ్రవరి 2, 1829 న స్వర్గస్థురాలైనది.
More Stories
స్వామి సహజానంద
పళస్సీ రాజా కేరళ వర్మ
వేలు నాచియార్ (జన్మతిథి, జనవరి 03)