వి ఓ చిదంబరం పిళ్లై

1915లో మహాత్మాగాంధీ చెన్నైలో పర్యటిస్తున్న సమయంలో, తిరునల్వేలికి చెందిన ఓ వ్యక్తి ఆయన్ను కలవాలని ఉవ్విళ్లూరాడు. మహాత్ముడికి మొదట్లో అనుమానం వచ్చినప్పటికీ చివరకు అంగీకరించాడు.  నిజానికి ఆ వ్యక్తి ఒకప్పుడు చాలా సంపన్న వ్యాపారి. అయితే  తన సంపదనంతా జాతి గౌరవం నిలబెట్టడం కోసం చేసిన పోరాటంలో పోగొట్టుకున్నాడు.  సౌతాఫ్రికాలో కొందరు అతని కోసం డబ్బు సేకరించి గాంధీ ద్వారా పంపారు.  అయితే, ఆ మొత్తాన్ని అతనికి అందించడానికి గాంధీ అంగీకరించినప్పటికీ, ఎందుకనో ఆలస్యం చేస్తూ వచ్చారు.   చివరకు ఏడాది తర్వాత రూ.347 చెల్లించి అతని అప్పులు తీర్చగలిగేందుకు అంగీకరించాడు. 

ఆ వ్యక్తి మరెవరో కాదు వలియప్పన్ ఒలగనాథన్ చిదంబరం పిళ్లై, లేదా వి.ఓ.సి గా సుప్రసిద్ధుడు.   తమిళనాడుకు చెందిన ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులలో ఒకరైన అతనిని ‘కపలోతియ తమిళన్ అని కూడా పిలిచేవారు. రూ.347 కోసం గాంధీని ఉత్తరాలతో వెంటాడి, భారత్ తొలి స్వదేశీ షిప్పింగ్ సర్వీసును ప్రారంభించిన వ్యక్తి,  ఒకప్పుడు విజయవంతమైన వ్యాపారవేత్త కావడం విడ్డూరం.

ఒట్టపిడారం టుటికోరిన్ జిల్లాలోని ఒక చిన్న పట్టణం.  ఇది అమ్మన్ ఆలయానికి ప్రసిద్ధి చెందింది.   ఇక్కడికి కేవలం మూడు కిలోమీటర్ల దూరంలో పాంచాలంకురిచ్చి వద్ద పురాణ తమిళ యోధుడు వీర పాండ్య కట్టబొమ్మన్ కోట  ఉంది.   ఈ ఒట్టపిడారం పట్టణంలో,  1872  సెప్టెంబర్ 5న వి.ఓ. చిదంబరం పిళ్లై ఒలగనేరహతన్ పిళ్లై, పరమయి అన్నల్ దంపతులకు జన్మించారు.  అమ్మమ్మ దగ్గర శివుని గురించి, తాత దగ్గర రామాయణం నేర్చుకుంటూ పెరిగాడు. అతనికి గురువు సుబ్రమణ్య పిళ్ళై.  ఈయన చిదంబరానికి  మహాభారతం  బోధించాడు.  తన వయస్సులోని ఇతర పిల్లల మాదిరిగానే, ఇతను కూడా గోలి, కబడ్డీ, సిలంబట్టం వంటి ఆరుబయట ఆటలు ఆడటానికి ఇష్టపడేవాడు. చదరంగం క్రీడలో కూడా  ఆరితేరాడు. 

చిదంబరం పిళ్లై, తన 14వ యేట తూత్తుకుడి వెళ్లి, కాల్డ్ వెల్ హైస్కూల్ లో, ఆ తర్వాత తిరునల్వేలిలోని హిందూ కాలేజ్ హైస్కూల్ లో విద్యాభ్యాసం కొనసాగించారు. తండ్రి న్యాయశాస్త్రం చదవడానికి తిరుచ్చికి పంపడానికి ముందు అతను కొంతకాలం గుమస్తాగా పనిచేశాడు. అతను 1894 లో న్యాయ పరీక్షలో ఉత్తీర్ణుడయ్యాడు.  మరుసటి సంవత్సరం ప్లీడర్ గా ప్రాక్టీస్ చేయడానికి ఒట్టపిడారానికి తిరిగి వచ్చాడు. భారతదేశానికి ఏదైనా చేయాలనే స్వామి వివేకానంద భావజాలంతో ప్రభావితుడైన ఆయన, రామకృష్ణ మఠంలో మహాకవి భారతీయర్ ను కలుసుకున్నారు.

స్వాతంత్రోద్యమంలో మునిగిపోయిన వి.ఒ.సి,  తిలక్ భావజాలానికి ప్రభావితుడై ఆయన అనుయాయులలో ఒకరిగా మారాడు.  సుబ్రమణ్య శివ, భారతీయార్ లతో కలిసి మద్రాసు ప్రెసిడెన్సీలో స్వాతంత్ర్యోద్యమ ప్రముఖుల్లో ఒకరిగా ఎదిగారు.  1905 లో బెంగాల్ విభజన తరువాత, అతను భారత జాతీయ కాంగ్రెస్ లో చేరి, లాల్ బాల్ పాల్ త్రయం నేతృత్వంలోని అతివాద వర్గంలో భాగమయ్యాడుచిదంబరం పిళ్లై, యువనేష్ ప్రచార సభ, దేశీభామన సంఘం, మద్రాసు ఆంగ్లో ఇండస్ట్రియల్ సొసైటీ లిమిటెడ్ వంటి అనేక సంస్థలను స్థాపించారు. భారత్ తొలి స్వదేశీ షిప్పింగ్ సర్వీసును ఏర్పాటు చేయడమే ఆయన సాధించిన అతిపెద్ద విజయం.

ఆ రోజుల్లో బ్రిటీష్ వారికి షిప్పింగ్ సేవలపై గుత్తాధిపత్యం ఉండేది.  ముఖ్యంగా భారతదేశం నుండి అన్ని సేవలను బ్రిటిష్ ఇండియా స్టీమ్ నావిగేషన్ కంపెనీ నడిపేది.  భారతదేశ షిప్పింగ్ రంగంపై బ్రిటీష్ వారి పట్టును విచ్ఛిన్నం చేయడానికి అతను 1906 లో భారతదేశం యొక్క మొట్టమొదటి స్వదేశీ షిప్పింగ్ కంపెనీని ప్రారంభించాడు. 10 లక్షల రూపాయల పెట్టుబడితో, విఓసి,  అక్టోబర్ 1906 లో స్వదేశీ షిప్పింగ్ కంపనీని రిజిస్టర్ చేసాడు.  దీనికి డైరెక్టర్ ఈ ప్రాంతానికి చెందిన ప్రభావవంతమైన జమీందారు మరియు మదురై తమిళ సంఘం వ్యవస్థాపకుడు పాండి తురై తేవర్. కంపెనీకి మొదట్లో సొంత నౌకలు లేకపోవడంతో వాటిని షాలిన్ స్టీమర్స్ నుంచి లీజుకు తీసుకోవాల్సి వచ్చింది. లీజును రద్దు చేయాలని బ్రిటీష్ ఇండియా స్టీమ్, షాలిన్ పై ఒత్తిడి తెచ్చినప్పుడు, చిదంబరం మనకంటూ స్వంత నౌకాదళం ఏర్పాటు చేసుకోవాలన్న నిర్ణయానికి వచ్చాడు. 

వి ఓ చిదంబరం పిళ్లై భారతదేశం అంతటా ప్రయాణించి, కంపెనీ వాటాలను విక్రయించడం ద్వారా నౌకల కోసం డబ్బును సేకరించాడు.  “నేను ఓడలతో తిరిగి వస్తాను, లేకపోతే  సముద్రంలో నశిస్తాను” అని ప్రమాణం చేసి చివరకు ఫ్రాన్స్ నుండి ఎస్ఎస్ గలియా, తరువాత ఎస్ఎస్ లావో రెండింటినీ కొనుగోలు చేయగలిగాడు.  బ్రిటీష్ ఇండియా స్టీమ్, తన సంస్థను కొనుగోలు చేసి వ్యాపారంలో పిళ్లై ని దెబ్బతీసేందుకు ప్రయత్నించగా, ఒప్పందాన్ని సున్నితంగా తిరస్కరించాడు.  పిళ్లై,  తూత్తుకుడి మరియు కొలంబో మధ్య మొట్టమొదటి భారతీయ షిప్పింగ్ సేవ ప్రారంభినచ్చాడు. 

1908 ఫిబ్రవరి 23న తూత్తుకుడిలోని కోరల్ మిల్లులో కార్మికులు సమ్మెకు దిగినప్పుడు, సుబ్రహ్మణ్య శివతో కలిసి, వీవోసీ వారికి మద్దతుగా ప్రసంగించి, అధిక వేతనాలు, మెరుగైన పని పరిస్థితులను డిమాండ్ చేస్తూ సమ్మెకు నాయకత్వం వహించారు. యాజమాన్యం చివరకు వీరి డిమాండ్లను అంగీకరించింది.  శ్రీ అరబిందో తన వందేమాతరం దినపత్రికలో చిదంబరం మరియు శివ ఇద్దరినీ ప్రశంసించాడు. దీనితో  వి.ఒ.సి.కి పెరుగుతున్న ప్రజాదరణ గురించి బ్రిటిష్ వారు ఆందోళన చెందారు.  ఒక బ్రిటిష్ అధికారి, వించ్, ఎటువంటి రాజకీయ తిరుగుబాటులో పాల్గొనబోనని హామీ ఇవ్వమని చిదంబరం పిళ్లై ని కోరాడు.  వి.ఒ.సి నిరాకరించడంతో, 1908 మార్చి 12 న, శివతో పాటు అతన్ని అరెస్టు చేసి నిర్బంధంలో ఉంచారు.

వీవోసీ అరెస్టుకు నిరసనగా తిరునల్వేలిలో పాఠశాలలు, దుకాణాలు, కళాశాలలు మూతపడగా, తూత్తుకుడిలో భారీ సమ్మె జరిగింది. పోలీసుల కాల్పుల్లో నలుగురు మృతి చెందగా, వీవోసీ అరెస్టును ఖండిస్తూ ర్యాలీలు నిర్వహించారు. రాజద్రోహం నేరం మోపి 1908 జూలై నుంచి 1910 డిసెంబరు వరకు కోయంబత్తూరులోని కేంద్ర కారాగారంలో నిర్బంధించారు. ఈ తీర్పును దేశ నాయకులందరూ విస్తృతంగా ఖండించారు.  బ్రిటిష్ మీడియా కూడా ఇది అన్యాయమని పేర్కొంది.  తదుపరి అప్పీలుపై, శిక్షను 4 సంవత్సరాల జైలు శిక్ష మరియు 6 సంవత్సరాల ప్రవాసానికి మార్చారు.

కోయంబత్తూరు, ఆ తర్వాత కన్ననూరులో నిర్బంధంలో ఉన్న వీవోసీని రాజకీయ ఖైదీగా పరిగణించకుండా, దోషిగా పరిగణించి, కష్టపడి పనిచేసేలా చేశారు. ఎద్దులకు బదులుగా, ఈయనను  పెట్టి,  ఎండలో నూనె గానుగను త్రిప్పించేవారు, కొట్టేవారు.  జైలులో అతను అనుభవించిన శ్రమ మరియు చిత్రహింసలు అతని ఆరోగ్యాన్ని దెబ్బతీశాయి.

1912 డిసెంబరులో విడుదలైన వీవోసీ జీవితం పూర్తిగా నాశనమైంది. అతని షిప్పింగ్ కంపెనీని బ్రిటీష్ వారు రద్దు చేశారు.  వారు అతని నౌకలను కూడా స్వాధీనం చేసుకున్నారు. అతని లా లైసెన్స్ ను రద్దు చేశారు. చిదంబరం పిళ్లైని   తిరునల్వేలికి తిరిగి వెళ్ళడానికి అనుమతించలేదు.  బతుకుదెరువు కోసం భార్య, ఇద్దరు కుమారులతో కలిసి చెన్నైకి మకాం మార్చి అక్కడ చిన్నపాటి నిత్యావసరాల దుకాణం నడిపాడు.  ఆ సమయంలోనే గాంధీజీతో తనకు అత్యంత అవసరమైన డబ్బు గురించి సుదీర్ఘంగా వాగ్వివాదం జరిగింది.

గాంధీజీతో సైద్ధాంతిక విభేదాల కారణంగా, 1920లో కాంగ్రెస్ కు రాజీనామా చేసి, రచనా వ్యాసంగానికి  ఎక్కువ సమయం కేటాయించి కార్మిక సంఘాలను స్థాపించారు. కొద్దిపాటి ఆదాయంతో మళ్లీ లా ప్రాక్టీస్ చేసేందుకు అనుమతి ఇవ్వాలని కోర్టును ఆశ్రయించగా, ఎట్టకేలకు అనుమతి లభించింది.  1927లో కోవిల్పట్టిలో న్యాయవాద వృత్తిని ప్రారంభించి సేలంలో తిరిగి కాంగ్రెస్ లో చేరారు. అయితే కాంగ్రెసు వారి తీరుతో విసిగిపోయి మరోసారి ఆయన పార్టీని వీడారు.  అతను 1932 లో తూత్తుకుడికి తిరిగి వెళ్ళాడు, అక్కడ అతను తన మిగిలిన సమయాన్ని పూర్తిగా రచనా వ్యాసంగంలో గడిపాడు.  వీరి రచనలలో,  తిరుక్కురళ్ మరియు టోల్కాపియంపై వ్యాఖ్యానం కూడా ఉంది. ఆయన రచించిన మరో ప్రసిద్ధ గ్రంథం మెయ్యారమ్.  ఇందులో  అతను తన స్వీయచరిత్ర నేపథ్యంలో నీతివంతమైన జీవితం, ప్రవర్తన  రచించాడు. 

చివరకు 1936 నవంబర్ 18న వి.ఓ. చిదంబరం పిళ్లై కన్నుమూశారు. బ్రిటీష్ వారిని ఎదిరించి, భారత్ తొలి షిప్పింగ్ సర్వీసును ప్రారంభించిన వ్యక్తి కనుమరుగైపోయారు. అయినప్పటికీ, తన ప్రజల కోసం నూనె గానుగ కూడా లాగిన మహానుభావుడు  కపలోతియ తమిళన్ గా,  చెక్కిలుత్త చెమ్మల్ గా తమిళ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. ఆయన గౌరవార్థం టుటికోరిన్ పోర్టుకు చిదంబరం పిళ్లై పేరు పెట్టగా, ఆయన విగ్రహాలు చెన్నై, తిరునల్వేలి, తూత్తుకుడిలో ఉన్నాయి. స్వాతంత్ర్య సమరయోధుడు, ఆలోచనాపరుడు, జాతీయవాది, రచయిత, పారిశ్రామికవేత్త వి.ఒ.చిదంబరం పిళ్లై స్వాతంత్ర్యోద్యమ పోరాటంలో పాల్గొన్న వారిలో  మొదటి వరుసలో నిలుస్తారు.