భారతదేశ చరిత్రలో కొన్ని యుద్ధాలు కేవలం రెండు సైన్యాల మధ్య జరిగిన ఘర్షణలు కావు. అవి ఒక సమాజం తన ఆత్మవిశ్వాసాన్ని తిరిగి పొందిన సందర్భాలు. ఒక రాజకీయ శక్తి తన పతనం అంతిమం కాదని నిరూపించిన తార్కాణాలు. ఒక తరం ఎదుర్కొన్న పరాజయానికి తరువాతి తరం సమాధానం చెప్పిన సాహసగాథలు. 1763 రాక్షసభువన్ యుద్ధం అలాంటి చారిత్రక ఘట్టం.
పానిపట్ మూడవ యుద్ధం (1761) లో ఎదురైన ఘోర పరాజయం తరువాత మరాఠా సామ్రాజ్యం తీవ్ర సంక్షోభంలో పడింది. రాజకీయ విభేదాలు, బాహ్య శత్రువుల ఒత్తిడి, ఆర్థిక సమస్యలు, సైనిక పునర్వ్యవస్థీకరణ అవసరం – ఇవన్నీ ఒకేసారి ఎదురయ్యాయి. ఈ పరిస్థితిని ఉపయోగించుకుని హైదరాబాద్ నిజాం అలీ ఖాన్ మరాఠా శక్తిని శాశ్వతంగా బలహీనపరచాలని ప్రయత్నించాడు. కానీ అతని అంచనా తప్పింది.
1763 ఆగస్టు 10న గోదావరి తీరంలోని రాక్షసభువన్ వద్ద మరాఠా సేనలు నిజాం సేనలను నిర్ణాయకంగా ఓడించాయి. ఈ యుద్ధంలో మరాఠా సేనలకు పీష్వా మాధవరావు మరియు ఆయన మామ రఘునాథరావు నాయకత్వం వహించారు. నిజాం సేనకు అతని మంత్రి విఠల్ సుందర్ నాయకత్వం వహించాడు. ఈ విజయం ఒక సైనిక విజయమే కాదు. ఇది పానిపట్ తరువాత మరాఠా పునరుజ్జీవనానికి ప్రతీక.
1761 పానిపట్ యుద్ధం మరాఠా సామ్రాజ్య చరిత్రలో అత్యంత విషాదకరమైన ఘట్టాలలో ఒకటి. ఆ యుద్ధంలో మరాఠాలకు భారీ ప్రాణనష్టం జరిగింది. సామ్రాజ్యానికి రాజకీయ, ఆర్థిక, మానసిక దెబ్బ తగిలింది. పీష్వా బాలాజీ బాజీరావు కూడా పానిపట్ విషాదం తరువాత తీవ్రంగా కుంగిపోయి మరణించాడు. ఈ పరిస్థితిలో మరాఠా సామ్రాజ్యం ఇకపై తిరిగి బలపడలేదని ప్రత్యర్థులు భావించారు. ముఖ్యంగా నిజాం అలీ ఖాన్, మరాఠాల బలహీనతను ఉపయోగించుకోవాలని చూశాడు.
ఒక సమాజం తన పరాజయాన్ని ఎలా ఎదుర్కొంటుందో అన్నది తదనంతర భవిష్యత్తును నిర్ణయిస్తుంది. పానిపట్ తరువాత మరాఠాలు ఆత్మవిశ్వాసాన్ని పూర్తిగా కోల్పోలేదు. కొత్త నాయకత్వం ఎదిగింది. ఆ నాయకత్వంలో అత్యంత ముఖ్యమైన వ్యక్తి మాధవరావు పీష్వా.
1761 జూలైలో మాధవరావు పీష్వా బాధ్యతలు స్వీకరించినప్పుడు అతను చాలా పిన్న వేయస్కుడు. కానీ అతని ముందున్న బాధ్యత అపారమైనది. మరాఠా రాజ్యాన్ని తిరిగి నిలబెట్టాలి. శత్రువులను ఎదుర్కోవాలి. ఆర్థిక వ్యవస్థను పునర్నిర్మించాలి. సైన్యాన్ని బలోపేతం చేయాలి. అంతర్గత రాజకీయ విభేదాలను నియంత్రించాలి. ముఖ్యంగా, పానిపట్ తరువాత కోల్పోయిన మరాఠా రాజకీయ ప్రతిష్ఠను తిరిగి సాధించాలి.
మహారాష్ట్ర ప్రభుత్వ గెజిటీర్లు మాధవరావును పానిపట్ తరువాత మరాఠాల కోల్పోయిన వైభవాన్ని తిరిగి సాధించాల్సిన నాయకుడిగా చిత్రిస్తాయి. అయితే ఇక్కడే రఘునాథరావు పాత్రను కూడా విస్మరించకూడదు.
రఘునాథరావు, మాధవరావుకు మామ. అతను అప్పటికే యుద్ధ అనుభవం కలిగిన మరాఠా నాయకుడు. మాధవరావు పీష్వాగా బాధ్యతలు చేపట్టిన ప్రారంభ దశలో వాస్తవ అధికార యంత్రాంగంలో రఘునాథరావుకు గణనీయమైన ప్రభావం ఉంది. మహారాష్ట్ర ప్రభుత్వ గెజిటీర్లు కూడా మాధవరావు పీష్వా అయిన ప్రారంభ సంవత్సరాల్లో అధికారం ప్రధానంగా రఘునాథరావు చేతుల్లోనే ఉన్నట్లు పేర్కొంటాయి.
రఘునాథరావును కేవలం “మాధవరావు సహాయకుడు”గా చూడడం కూడా సరికాదు; అలాగే ఆయనను కేవలం “అంతర్గత ప్రత్యర్థి”గా చూపడం కూడా రాక్షసభువన్ సందర్భంలో అసంపూర్ణమైన చరిత్ర. ఎందుకంటే రాక్షసభువన్ యుద్ధానికి వచ్చినప్పుడు రఘునాథరావు ఒక ముఖ్యమైన సైనిక నాయకుడిగా ముందుకు వచ్చాడు. నిజాం అలీ ఖాన్ గోదావరి దాటి వెళ్లిన సమయంలో అతని సైన్యంలోని ఒక ముఖ్యమైన భాగం రాక్షసభువన్ వద్ద మిగిలింది. నిజాం సైనిక నాయకుడు, విఠల్ సుందర్ వద్ద తుపాకీ దళం, సరఫరాలు, సామగ్రి, ఇతర బలగాలు ఉన్నా, జానోజీ భోంస్లే అనే అతి ముఖ్యమైన నిజాం సైనిక నాయకుడు ఆ సమయంలో విఠల్ సుందర్‌ను విడిచిపెట్టడంతో పరిస్థితి జటిలంగా మారింది. ఈ పరిస్థితిని రఘునాథరావు మారాఠాలకు అనుకూలంగా మలచుకున్నాడు. ఈ సందర్భంలో రఘునాథరావు, నిజాం సేనలు గోదావరి దాటకుండా అడ్డుకోవాలని నిర్ణయించి వేగంగా కదిలి విఠల్ సుందర్‌పై దాడి చేశాడు. అదే రాక్షసభువన్ ప్రసిద్ధ యుద్ధానికి దారితీసింది. ఇది రఘునాథరావు సైనిక ప్రతిభను అర్థం చేసుకోవడానికి అత్యంత ముఖ్యమైన అంశం.
రాక్షసభువన్ యుద్ధంలో రఘునాథరావు పాత్రను ఒక వాక్యంలో చెప్పాలంటే: నిజాం సేనలో ఏర్పడిన విభజనను గుర్తించి, దానిని వేగవంతమైన సైనిక చర్యగా మార్చిన నాయకుడు రఘునాథరావు. ప్రత్యర్థి బలహీనంగా ఉన్న క్షణాన్ని గుర్తించడం మాత్రమే కాదు – ఆ క్షణాన్ని నిర్ణాయక చర్యగా మార్చగలగడం నిజమైన నాయకత్వం.
రఘునాథరావు వ్యూహాత్మక దాడికి నాయకత్వం వహిస్తే, మాధవరావు యుద్ధరంగంలో సైనికుల ఆత్మవిశ్వాసాన్ని పెంచిన నాయకుడిగా నిలిచాడు. యువ పీష్వా యుద్ధంలో ప్రముఖ పాత్ర పోషించాడు; అతను సైనికుల మధ్య నిరంతరం సంచరిస్తూ వారిని ప్రోత్సహించాడు. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఒక నాయకుడు యుద్ధాన్ని కేవలం దూరం నుంచి ఆదేశించడం ఒక విధానం. కానీ తన సైనికుల మధ్యకు వెళ్లి వారి ధైర్యాన్ని పెంచడం మరో స్థాయి నాయకత్వం. పానిపట్ వంటి ఘోర పరాజయాన్ని చూసిన మరాఠా సైనికులలో తిరిగి ధైర్యాన్ని నింపడం చిన్న విషయం కాదు.
అందుకే రాక్షసభువన్ విజయాన్ని రఘునాథరావు వ్యూహం, మాధవరావు స్ఫూర్తిదాయక నాయకత్వం మరియు మరాఠా సైనికుల ధైర్యం-ఈ మూడింటి మేలు కలాయికగా పేర్కొనవచ్చు.
Courtesy: Public sources
More Stories
రాయచూర్ యుద్ధం (మే 13)