తెలుగు సాహిత్య చరిత్రలో అతి ప్రాచీనమైన పద్యశాసనంగా ప్రసిద్ధి పొందినది Addankiలో వెలుగుచూసిన పండరంగని అద్దంకి పద్యశాసనం.
ఇది కేవలం శాసనం కాదు—ఒక యుగచరిత్ర, ఒక భాషా వైభవం, ఒక సామ్రాజ్య శౌర్యగాథ.
తూర్పు చాళుక్యుల వైభవం –
విజయాదిత్యులు
తూర్పు చాళుక్య వంశంలో “నరేంద్ర మృగరాజు” అనే బిరుదు గల మహావీరుడు రెండవ విజయాదిత్యుడు. కళలను పోషించిన, కవులను–గాయకులను ఆదరించిన రాజు. ఆయన కాలంలోనే బెజవాడకు ప్రాముఖ్యత పెరిగి, ఆ నగరం విజయసూచకంగా నిలిచింది.
ఇప్పటి Vijayawada అనే పేరుకూ విజయాదిత్యుల ప్రభావమే మూలమని చరిత్రసూచనలు తెలియజేస్తాయి.
ఈ వంశంలో మహోన్నతుడైన రాజు Gunaga Vijayaditya (క్రీ.శ. 848 ప్రాంతం) పట్టాభిషిక్తుడయ్యాడు. రెండవ విజయాదిత్యుని మనవడు అయిన ఈ గుణగ విజయాదిత్యుడు గుణగణాలవల్ల ప్రసిద్ధి పొందాడు. అందుకే “గుణగ” అనే విశేషణం చేర్చబడ్డది. వీరత్వం, దానశీలం, ధర్మనిరతితనం—ఈ మూడు గుణాలు ఆయన పాలనకు మూలాధారాలు.

కడియరాజు కుటుంబం – పండరంగడి పరాక్రమం.
గుణగ విజయాదిత్యుని వద్ద కడియరాజు అనే బ్రాహ్మణ సేనాని ఉండేవాడు. ఆయన కుమారులు – పండరంగడు, వినయడిశర్మ, రాజాదిత్యుడు. వీరంతా యుద్ధవీరులు, సేనాధిపతులు.
కడియరాజు కుమారుడైన పండరంగడే అద్దంకిలో ఈ పద్యశాసనాన్ని ప్రతిష్ఠించాడు. రాజు తన పట్టాభిషేకం పొందిన మొదటి సంవత్సరంలోనే పండరంగడిని సైన్యాధిపతిగా నియమించి, సామంతులతో కూడిన సైన్యాన్ని దక్షిణాపథంపై దండయాత్రకు పంపాడు.
బోయకొట్టాల దండయాత్ర
దక్షిణాపథంలో కొరకరాని కొయ్యలుగా ఉన్న బోయలపై యుద్ధం జరిగింది. పండరంగడు
బోయల పన్నెండు కొట్టములను (సైనిక స్థావరాలు) జయించాడు.
మహావీరులైన బోయలను మట్టికరిపించాడు.
తిరిగి తలెత్తకుండా ఉండేందుకు కొట్టములను దగ్ధం చేశాడు.
ప్రధాన స్థావరమైన “కట్టెపు దుర్గం”ను బయలు చేశాడు (మైదానంగా మార్చాడు).
కిరణపురం, అచలపురం వంటి పట్టణాలను జయించి దహనం చేశాడు.
ఈ విజయాల వల్ల “త్రిపుర మర్ధ్యపుర మహేశ్వర” బిరుదు పొందాడు.
ఇలా వేంగి రాజ్యాన్ని సుస్థిరపరచి స్వామి భక్తిని ప్రదర్శించాడు.
కందుకూరు – బెజవాడ సమానీకరణ
శాసనంలో “కందుకూరును బెజవాడంత చేశాడు” అని చెప్పబడింది.
అంటే కందుకూరును కూడా రాజధాని స్థాయిలో అభివృద్ధి చేసి సైనిక–రాజకీయ కేంద్రముగా తీర్చిదిద్దాడు. ఇది భవిష్యత్ రాజకీయ వ్యూహానికి సంకేతం.
ధర్మవరం భూదానం .
స్వామి భక్తి
విజయసూచకంగా ఆదిత్య భట్టారకునికి అద్దంకి సమీపంలోని Dharmavaramలో ఎనుబది పుట్ల అడ్లు పండే నేలను దానంగా ఇచ్చాడు.
ఈ దానవిషయమే శాసనరూపం దాల్చింది.
ధర్మవరం ప్రాచీన శివాలయం, విస్తారమైన శివలింగం, కొండల నడుమ ఉన్న ప్రకృతి—ఈ శాసనానికి భౌగోళిక సాక్ష్యాలుగా నిలుస్తాయి.
పండరంగడి స్వామిభక్తి, ధర్మనిరతి, దానగుణం ఈ శాసనంలో స్పష్టంగా వ్యక్తమవుతాయి.
శాసనపాఠం
“పట్టంబు గట్టిన ప్రథమంబు నేడు
బలగర్వ మొప్పగ బైలేచి సేన
పట్టంబు గట్టించి ప్రభు బండరంగు
బంచిన సామంత పదువతో బోయ
కొట్టము ల్వండ్రెండు గొని వేంగినాటి
గొఱల్చియ త్రిభువనాంకుశ బాణ నిల్చి
కట్టెపు దుర్గంబు గడు బయల్సేసి
కందుకూర్బెజవాడ గవించె మెచ్చి.”
శాసనంలోని పదాలు- వివరణ
బలగర్వమొప్పగ – సేనాధిపత్య గర్వంతో
పదువ – సమూహం
కొట్టం – సైనిక స్థావరం
గొఱల్చియ – విజయభేరి మ్రోగించి
త్రిభువనాంకుశ బాణ – బిరుదు నామం
నిల్చి – స్థాపించి
కట్టెపు దుర్గం – బోయల ప్రధాన స్థావరం
బయల్సేసి – మైదానంగా చేసి, ధ్వంసం చేసి
బెజవాడ – ప్రస్తుత విజయవాడ
శాసన ప్రాముఖ్యం.
ఇది తెలుగులో లభించిన తొలి పద్యశాసనం.
“తరువోజ” వృత్తంలో రచించబడింది.
9వ శతాబ్దానికే తెలుగు పద్య ఛందస్సు అభివృద్ధి చెందినట్లు నిరూపిస్తుంది.
1200 ఏళ్ల తెలుగు కవితా సంపదకు మూలస్తంభం.
చారిత్రక, భౌగోళిక, సాంస్కృతిక, భాషా పునాదిగా నిలిచింది.
ఈ శాసనాన్ని వెలుగులోకి తీసుకువచ్చేందుకు అలెన్ బటర్ వర్త్, వేణుగోపాలచెట్టి, కొమర్రాజు లక్ష్మణరావు, వేటూరి ప్రభాకర శాస్త్రి, బూదరాజు రాధాకృష్ణ, జయంతి రామయ్య పంతులు, ఆరుద్ర వంటి పండితులు కృషి చేశారు.
చరిత్ర నడిచిన నేల
గుళ్ళకమ్మ తీరం.
అద్దంకి కోట, దానాలు, యుద్ధాలు—
ఇవన్నీ ఈ శాసనంలో సజీవంగా నిలిచాయి.
“ఇది కేవలం శాసనం కాదు—
ఒక యుగం పలికిన భాష.
రక్తమాంసాలు గల మనుషుల చరిత్ర.”
పండరంగని అద్దంకి పద్యశాసనం
తెలుగు భాషకు ఓనమాలు దిద్దిన గడ్డగా అద్దంకిని చరిత్రలో చిరస్థాయిగా నిలబెట్టింది.
-పుట్టంరాజు శ్రీరామచంద్రమూర్తి
More Stories
వనపర్తి సంస్థానంలోని ప్రత్యేక మైన నీటిపారుదల ప్రాజెక్టు
గద్వాల్ రాణి ఆదిలక్ష్మీ దేవమ్మ అద్భుత పోరాటం
ప్రాచీన రాజ్యపాలనము