మల్లంపల్లి సోమశేఖరశర్మ గారు రచించిన చారిత్రక వ్యాసమంజరి నుండి సేకరణ
మన పూర్వపు విద్యాపద్ధతి ఇప్పటి విద్యాపద్ధతి కంటే నుత్తమమైన దయినను కాకపోయినను అశోక, కృష్ణదేవరాయ, శివాజీల వంటి ప్రభుపుంగవులును, యుగంధర, తిమ్మరసాదుల వంటి మంత్రివరేణ్యులును, కాళిదాస, భవభూత్యాదుల వంటి కవివతంసులను, నాగార్జున, శంకరాచార్యాదుల వంటి మత సంస్కర్తలును విలసిల్లుటకు కారణభూతమై, జాతీయాభ్యుదయమునకును, వాఙ్మయ వికాసమునకును, దేశీయ పురోభివృద్ధికిని దోడ్పడి, హైందవవిజ్ఞాన కాంతి కిరణములను నలదెసల బ్రసరింపజేసి, భారతజాతి కఖండ గౌరవప్రతిష్ఠలను సముపార్జించి పెట్టినదగుట చేత నది సంస్తుతి పాత్రమును; చిరస్మరణీయార్హమును గాకపోదు. అందువలన రమారమి రెండవేలయేండ్లు మన జాతీయ హృదయమును పూర్తిగ వశపఱచుకొని, ఐహికాముష్మిక సుఖములకు దారిచూపిన మన పూర్వకాలపు విద్య ఎచ్చటెచ్చట నెట్లెట్లు వర్ధిల్లినదియు తెలిసికొనుట యుక్తము.
మన దేశచారిత్రము బౌద్ధ యుగమున ఆరంభ మగుచున్నది‘. బౌద్ధ యుగమునకు పూర్వము విద్యాసంస్థలను గుణించి మనకు బాగుగ తెలియదు; కాని వేదకాలమున పరిషత్తు లుండెడి వనియు, అచ్చటికి బహుశాస్త్రవేత్తలు, వేద వేదాంగ విదులు అయిన విద్వత్ప్రకాండులు చేరువారనియు, గురువు శిష్యునికి వాగ్రూపముననే విద్య నేర్పుచుండె ననియు, గురువు నేర్పినదానిని శిష్యుడు కంఠస్థము చేయువాడనియు మాత్రము మనకు తెలియును. అదియునుంగాక ద్విజులు మాత్రమే విద్య నభ్యసించువారని కూడ మన మెఱుంగుదుము.
బౌద్ధయుగము
కాని సర్వవర్ణముల వారికి అందుపాటులో నుండని యా విద్యాపద్ధతికి బౌద్ధ యుగమున గొంత మార్పు కలిగెను. ఈ వర్ణ మావర్ణ మనక యెల్ల వర్ణముల వారును బౌద్ధ మతమున చేరుట కవకాశము కలిగినట్లే బౌద్ధ విద్యాపీఠములలో విద్య నేర్చుకొనుటకు గూడ యవకాశము లేర్పడినవి. ఈ కాలముననే గొప్ప గొప్ప విద్యాపీఠములు వెలసినవి. ఆ విద్యాపీఠములలో భరతఖండములనందలి సర్వ వర్ణముల వారు మాత్రమే కాక దేశాంతర వాసులు కూడ వచ్చి విద్యనభ్యసింపజొచ్చిరి. ఉత్తర హిందూస్థానమున బేర్వడిన తక్షశిల, నాలంద, ఓదంతపురి మున్నగు గొప్ప విద్యాపీఠములు ఈ బౌద్ధయుగమున విరాజిల్లినవియే.
దక్షిణాపథమున గూడ బౌద్ధయుగమే సమస్త కళలకు నుత్తేజన మిచ్చిన కాలము. అయినను అచ్చట నీ కాలమున విలసిల్లిన విద్యాపీఠముల గుఱించి మనకు ఎక్కువగ దెలియరాలేదు. అజంతా గుహలలోని చిత్తరువులు, అమరావతి, జగ్గయ్యపేట, నాగార్జునుని కొండలందలి స్తూప నిర్మాణములు ఈ మొదలగునవి దక్షిణాపథమున బౌద్ధకాలపు కళాభిరుచిని దెలుపు గొప్ప యుదాహరణములుగ నిలిచి యున్నవి. ధాన్యకటకము, వేగి, కాంచీపురము, శ్రీశైలము – ఇవి యా కాలమున పేరొందిన విద్యాపీఠములని తెలియవచ్చుచున్నది.
శాతవాహనవంశజు లాంధ్రదేశమును పరిపాలించుచుండిన కాలమున కృష్ణానదీ తీరస్థమయిన ధాన్యకటకము దక్షిణాపథ నగర రాజముల కవతంసమై యలరారినది. ఇప్పుడు దానిని ధరణికోట యందురు. ధాన్యకటకము ప్రతిష్ఠ యంతయు బౌద్ధయుగము నాటిదే. అది బౌద్ధ సంఘారామములతో విలసిల్లుచు బౌద్ధులకు క్రీ.శ. మొదటి శతాబ్దులందు పవిత్రమయిన మతపీఠముగ నుండెను. బౌద్ధ మతస్థులు రెండవ బుద్ధునిగ పరిగణించు నాగార్జునుని కాలమున ఈ ధాన్యకటకము విద్యాపీఠము మిగుల ప్రసిద్ధికెక్కెను. ఇది బ్రాహ్మణ విద్యకును, బౌద్ధ విద్యకును కూడ నిలయమై యుండెడిది. 7,700ల బౌద్ధ భిక్షువులతోను, ఆఱు కళాశాలలతోను కూడిన యొక విశ్వవిద్యాలయముతోను విలసిల్లు టిబెట్టు (త్రివిష్టపము) నందలి ‘లాసా‘ నగరము సమీపమునున్న ‘డాపంగ్‘ సంఘారామము ఈ ధాన్యకటక సంఘారామము నాదర్శముగ గైకొనియే నిర్మింపబడినదని టిబెట్టు చరిత్రకారులు తెలుపుచున్నారు. ధాన్యకటక సంఘారామ విశ్వవిద్యాలయములను
గుఱించి వర్ణనములు నాలంద, విక్రమశిల విహారముల యందలి పుస్తక భాండాగారములలో పదిలపఱుపబడి యుండెడివట. క్రీస్తు శకము ఏడవ శతాబ్ది యందు దక్షిణాపథమునకు వచ్చిన యువాన్దిన్చాంగ్ అను చీనాదేశపు బౌద్ధ యాత్రికుడిచట మిక్కిలి రమ్యములైన బౌద్ధ నిర్మాణము లనేకములను తాను చూచినట్లు తెలిపియున్నాడు.
ఇట్లే వేగి లేక వేంగి కూడ బౌద్ధ యుగమున గొప్ప సంఘారామములతో విరాజిల్లి గొప్ప విద్యాపీఠముగ బ్రసిద్ధి కెక్కినది. అచ్చటి సంఘారామమున పెక్కు ‘అంతస్తులు గల హర్మ్యములును, సొగసుగ చెక్కుబడిన స్తంభములచే నలంకరింపబడిన యితర గృహములును‘ ఉండినట్లును, ‘ఈ యారామము మ్రోల నూఱడుగుల యెత్తు గల యొక స్తూప‘ ముండినట్లును, ‘ఇచ్చటి బుద్ద విగ్రహమును శిల్చి తన నేర్చంతయు జూపి కళలూరునట్లు చెక్కినట్లును” తెలియుచున్నది. ఈ వేంగీ విద్యాపీఠమునకు శ్రీ దిఙ్నాగాచార్యులను వారు అధ్యక్షులుగ నుండిరి.
ఈ కాలముననే దక్షిణాపథమున విలసిల్లిన మఱియొక విద్యాపీఠము కాంచీపురము. ఇదికూడ ధాన్యకటక విద్యాపీఠము వలె బ్రాహ్మణ బౌద్ధ విద్యలు రెంటికి నిలయముగ నుండెను. పెక్కు సంఘారామములతో శోభిల్లిన యీ నగర రాజము బౌద్ధమతము క్షీణించిన పిదప గూడ బ్రాహ్మణ మతమునకు పట్టుగొమ్మయై కీర్తి వహించినది. కాంచీపురము రాజధానిగ పరిపాలించిన పల్లవరాజులు విద్యలను, కళలను గూడ పోషించి శిల్పుల నెక్కువగా నాదరించియున్నారు. ఎంతవఱకు సత్యమో కాని, క్రీస్తుశకము మూడవ శతాబ్ది యందు కాశీప్రాంతముల నుండి బౌద్ధులనేకు లిచ్చటికి వచ్చినట్లే కాక ఈ పల్లవ రాజ్యమున నుండియే బౌద్ధ భిక్షువులు విజ్ఞానజ్యోతిని గొనిపోయి సింహళమును గూడ ప్రకాశవంతముగ చేసినట్లు చెప్పెదరు. క్రీస్తుశక మేడవశతాబ్ది యందు దక్షిణాపథమునకు వచ్చిన యువాన్్చంగ్ ధాన్యకటకము మొదలు కాంచీపురము వఱకు ననల్పశిల్ప కళాకౌశలముతో నలరారు పెక్కు దేవాలయములను, బౌద్ధ నిర్మాణములను జూచినట్లు తెలిపియున్నాడు. ఇట్లు బౌద్ధ యుగమునను, పల్లవరాజుల పరిపాలనమునను కాంచీపురమున విద్యలు చక్కగా వర్ధిల్లినట్లు మన కనేక నిదర్శనముల వలన తెలియుచున్నది. బ్రాహ్మణమతము పునరుద్ధరింపబడిన కాలమున గూడ కాంచీపురము గొప్ప విద్యాపీఠముగ నుండి గొప్ప ‘ఘటికాస్థాన” మని పేర్వడసెను.
బౌద్ధయుగము నందలి గొప్ప సంఘారామములలో శ్రీశైలమొకటి. ఇచ్చటి సంఘారామమును గుఱించి వ్రాయుచు డాక్టర్ బర్గెస్ దొరగా రిట్లు వ్రాసియున్నారు:
“ఇచ్చటికి వచ్చి నివసింపవలసినదని ఆర్య నాగార్జునుడు బౌద్ధ భిక్షువుల నాహ్వానించి ఈ సంఘారామమున బౌద్ధమతమునకు సంబంధించిన ముఖ్యగ్రంథములను, వాని వ్యాఖ్యానములను సంపాదించి యుంచెను”. ఈ విధమున శ్రీపర్వత సంఘారామము పెద్ద పుస్తక భాండారముతో విలసిల్లిన గొప్ప విద్యాపీఠము. చరమదశలో నాగార్జునా చార్యునకు నివాసమై యిది పేరుకెక్కినది. బౌద్ధయుగము కడచిన పిదప ఇది కదంబ రాజపుంగవులకు వశమై, కాలక్రమమున బ్రాహ్మణ క్షేత్రమయి పేరెన్నిక గాంచెను.
ఈ పైసంగతులను గమనించినచో బౌద్ధయుగమున సంఘారామములు విద్యానిలయములుగ నుండినట్లు మనకు బోధపడును. బౌద్ధ సన్న్యాసు లీ సంఘా రామములందు నివసించుచు విద్యాపిపాసార్దితులకు విద్యాప్రదానము గావించుచుండు వారు.
హిందూ యుగము
బౌద్ధయుగము వదలి తదనంతర హిందూయుగమునకు వచ్చినచో మనకు గొప్ప మార్పు గోచరమగును. బౌద్ధయుగము నందువలె తక్షశిల, నాలందల వంటి విశ్వ విద్యాలయములు మనకు గాన్పింపవు. విద్య యంతయు బౌద్ధయుగమున బౌద్ధ భిక్షువుల యధీనమునం దున్నట్లుగానే యీ యుగమున బ్రాహ్మణుల యధీనము నందుండెను. బౌద్ధమతము నందలి సర్వమత సమాదరణీయములయిన సిద్దాంతములను, సర్వజనాదర పాత్రములయిన యాకర్షణములను అన్నిటిని దన మతమున పొందుపఱిచి దానికి జనరంజకముగ నూతనత్వము నాపాదించి బ్రాహ్మణుడు మరల విజృంభించిన తన మతముతోపాటు తన్మతావరణములోనికి వచ్చిన హిందూ సంఘమునకంతకు మతగురువేకాక విద్యాగురువునై యాచార్యత్వము వహించెను. బ్రాహ్మణుడాచార్యుడై నేర్పిన ఈ బ్రాహ్మణ విద్య కారంభకాల మేదియో, ఎప్పుడెప్పుడేయే విధమున విద్య నభ్యసింపవలయునో ఈ మొదలగు విషయములన్నియు సంస్కృత ధర్మశాస్త్ర వాఙ్మయము వలన విశదమగుచున్నది.
గురుకులములు
వేదవేదాంతవిదులైన బ్రాహ్మణు లెచ్చట నున్న నచ్చటి కరిగి విద్యార్థులు గురుకుల వాసము చేసి విద్యనార్జించు వారు. గురువు శిష్యుని కుమారునిగ భావించి యాదరించువాడు. శిష్యుడు తన వినయవిధేయతల చేతను, భక్తిశ్రద్ధల చేతను, సపర్యల చేతను గురువును మెప్పించి అతని మన్ననలను పాత్రుడగువాడు. చంద్రుని వెన్నెల వలె గురువును శిష్యుడెల్లప్పుడు ననుసరించి యుండువాడు. గురుజన పూజనము, అధ్యయనము తక్క అతనికి వేఱుచింతలు లేవు. ఈ విధమున నిల్లు వదలి, తల్లిదండ్రులను వదలి గురుకులవాసము చేసి విద్య పరిపూర్తిగా నేర్వవలయ నన్న పండ్రెండేండ్లు మొదలు నలువది యెనిమిదేండ్ల వఱకు పట్టుచుండెడిది. కొందలు కులపతుల యెద్ద విద్యాభ్యాసము పదునాటేండ్లతోనే ముగించువారు.
విద్యపూర్తియైన ‘స్నాతకు‘లకు కులపతి సదుపదేశము చేసి వారిని దీవించి స్వగృహమునకు బంపువాడు. విద్య పూర్తి యగునంత వఱకు ఆర్యవిద్యార్థి బ్రహ్మచర్య వ్రతమునే పరిపాలించుచుండవలెను. విద్య పూర్తి గావించుకొని శిష్యుడు స్వగృహమును గూర్చి వెడలిపోవునప్పుడు గృహస్థుడగువాడు ఆతనిని గౌరవ మర్యాదలతో తన గృహమున కాహ్వానించి తన కూతురినిచ్చి పరిణయము గావించి కన్యాప్రదాన ఫలమును సంపాదించుకొని చరితార్థుడగువాడు. ఇప్పటివలె వరశుల్క కన్యాశుల్కములు కాని, కన్యాప్రదాతలకు కష్టములు కాని యుండెడివి కావు. ఈ పూర్వ విద్యాపద్ధతి యంతయు మాఱిపోయినను, గురుకులవాసశ్రమ కాని, కులపతి సంపూజన బాధ కాని యిప్పుడు తప్పిపోయినను, తుదకు వేదాధ్యయనమే ఆకాశ పుష్పమగు చున్నను బ్రాహ్మణ సంఘమున వివాహ కాలమున ‘స్నాతకము‘, ‘కాశీప్రయాణము, వరుని బ్రతిమాలి తోడ్కొని వచ్చి కన్య నొసంగి పెండ్లి చేయుట – అను నీయాచారములు మాత్రము పూర్వపు విద్యాపద్ధతిని జ్ఞాపకము చేయు పరిశిష్టములై నిలిచియున్నవి.
బ్రాహ్మణ విద్య
బౌద్ధయుగానంతరము వర్ధిల్లిన విద్యయంతయు బ్రాహ్మణ విద్య, యనగా కేవలము వేదశాస్త్రములకు సంబంధించిన విద్య. సాంకేతిక విద్య అనగా వాస్తు శిల్పాది పరిశ్రమలకు సంబంధించిన విద్యను బ్రాహ్మణు డితరులకు వదలిపెట్టెను. హేతు, ఆధ్యాత్మిక జ్ఞానములకు దోడ్పడు విద్య కంతకు దానధికారియై ప్రభుపుంగవుల గౌరవ సమ్మానములకు పాత్రు డయ్యెను.
చతుర్దశ విద్యలు
ఋగ్యజుస్సామాథర్వము లనియెడు నాలుగు వేదములు; శిక్షా, వ్యాకరణ, కల్ప, నిరుక్త, జ్యోతిశ్శాస్త్ర, ఛందశ్శాస్త్రము లనబడు నాఱు వేదాంగములు; మీమాంస న్యాయము అను దర్శనములు, పురాణములు, ధర్మశాస్త్రములు– ఇవి ఆర్యకుమారుడు విద్యార్థియై చదువ వలసిన విద్యలు, పదునాలుగు.
విద్యలెన్నియను విషయమున కొన్ని మతభేదములు కలవు. కొందఱు పదునాలు గనిరి, మఱికొందఱు పదునెనిమి దనిరి. ఇంక గొందఱు ముప్పది రెం దనిరి. పై నుడివిన పదునాలుగు విద్యలకు నుపవేదములైన యాయుర్వేద, గాంధర్వ వేద, ధనుర్వేద, స్థాపత్యములు (శిల్పము మొదలగు సాంకేతిక విద్యలు నాల్గింటిని జేర్చిన పదునెనిమిది విద్యలగుచున్నవి. కాలము గడిచిన కొలది వీని సంఖ్య పెరుగుచు వచ్చినది. శుక్రుడు మొదలగువారు విద్యలను కళలను విడదీసినను కాలక్రమమున కొన్ని విద్యలు కళలలో గలిసిపోయినవి. అయినను చతుష్షష్టి కళలు వేఱు, వేద వేదాంగాది విద్యలు వేఱు అను ప్రాచీన విభాగము మాత్ర మంతరింపలేదు. ఈ విధమగు బ్రాహ్మణవిద్య ముఖ్యముగ (1) ఘటికాస్థానములు, (2) అగ్రహారములు, (3) దేవాలయములు, (4) మఠములు అను నాలుగు విధములగు సంస్థలలో పెరిగి పెంపుగాంచినది.
ఘటికాస్థానములు
ఘటికాస్థానములు విద్యాపీఠములని తెలిసినను వీనిని గుణించిన వివరములు మాత్రము మనకు తెలియవచ్చుటలేదు. ఘటికాస్థానములు ముఖ్యముగ దక్షిణా పథమునందలి శాసనములందు మాత్రమే పేర్కొనబడినవి. వేంగీచాళుక్య వంశజుడైన మొదటి జయసింహవల్లభుని నిడమఱ్ఱు శాసనమున నిట్టి ఘటికాస్థానమొకటి పేర్కొనబడినది. ఈ శాసనము ననుసరించి వేంగీచాళుక్య రాజ్యమున నీ జయసింహ వల్లభుని కాలమున (క్రీ.శ. 633-666) ఆసనపురమునం దొక ఘటికాస్థాన ముండెననియు అందు జయసింహ వల్లభ మహారాజు వలన నుండి నిడమఱ్ఱు గ్రామమును దానముగ ప్రతిగ్రహించిన కాటిశర్మ పితామహుడయిన మండశర్మ ‘ఘటికా సామాన్యు’డనియు తెలియుచున్నది. ఘటికాసామాన్యుడగా ఘటికాస్థానము నందలి యొక యధ్యాపకుడనియో సభ్యుడనియో తలంపవలసి యుండును. కాంచీపురము కూడ బ్రాహ్మణ విద్య ప్రబలిన దినములలో పేరుమోసిన ఘటికాస్థానముగ నుండెనని యిదివఱకే చెప్పబడినది. కదంబవంశ ప్రభువులకు మూలపురుషుడైన మయూరశర్మ తన గురువగు వీరశర్మతో పల్లవరాజుల రాజధానియైన కాంచీపురమునకు బైలుదేఱి వెళ్లె ననియు, అతడు ప్రవచనమున గొప్ప పండితుడు కావలెనను కోర్కెతో అన్ని ఘటికలకును వెళ్లి గొప్ప ఆశుతర్కకుడు (Debator or disputant) అయ్యె ననియు నౌక శాసనము తెలుపుచున్నది. కాంచీపురము నేలిన (రెండవ) నరసింహవర్మయను పల్లవరాజు బ్రాప బ్రాహ్మణుల ఘటికాస్థానమును నిర్మించెనని వేదొక శాసనమున గలదు. భరతక్షేత్రమున కలంకార ప్రాయమైన కర్ణాటక సీమయందలి కుంతలదేశము ‘ధర్మక్కె నెర్మముం భోగ కాగరముమాద ఘటికాస్థానము‘ మని ధర్మమునకు సహకారకములును, భోగముల కాకరములునగు ఘటికాస్థానములకు నెల వని మఱియొక శాసనము నుడువుచున్నది. ఈ యుదాహరణముల వలన ఘటికాస్థానమనగా విద్యకును, ధర్మమునకును ఆలవాలమైన విద్యాపీఠమనియు, నది రాజపోషణమున వర్ధిల్లుట చేత భోగముల కాకర మనియు నూహింప వీలగుచున్నది. ఘటికాశ్రమ మెట్లు నిర్మింపవలసినదియు ఉత్తంకుడు సామవేదమున చెప్పినట్లు శాసనములందు వ్రాయబడినది. ఇంతకంటే నీ సంస్థను గుఱించిన వివరములు మనకు తెలియవు.
అగ్రహారములు
ఘటికాస్థానముల మాట యెటు లున్నను అగ్రహారము పూర్వకాలమున సుప్రసిద్ధమైన విద్యాసంస్థగ నుండె ననుట నిర్వివాదాంశము. మానసారమను సుప్రసిద్ధ పురాతన శిల్ప శాస్త్రమున, విన్యాసరీతుల ననుసరించి పండ్రెండు విధములైన గ్రామభేదములు పేర్కొనబడినవి. అందు అగ్రహారమనునది యొకటి. అది విద్వాంసులైన విప్రవరులకు స్థానము. కామికాగమము 27వ పటలమున నిది మంగలమని కూడ వర్ణింపబడినది దని మానసార మిట్లు తెలుపుచున్నది.
విప్రై ర్విద్వద్భి రాభోగ్యం మంగలం చేతి కీర్తితం
అగ్రహారస్తదే వోక్తం విప్రె౦ద్రైః కామికాహ్వయే
కన్నడ దేశమునను, ఆంధ్రదేశమునను అగ్రహార మగ్రహారమే కాని ద్రవిడ దేశమున దానికి మంగల మనియు, చతుర్వేది మంగల మనియు పేర్లు కలవు. చాళుక్య చోళు లాంధ్రదేశమును పరిపాలించుచుండిన కాలమున గలిగిన ద్రావిడ సంపర్కము వలన నాడు మన తెలుగుదేశమున గూడ నచ్చటచ్చట నరుదుగనైన నొకటి రెండు చతుర్వేది మంగలముల పేరులు వినబడుచున్నవి. ప్రోలునాటి యందలి వీరచోడచతుర్వేది మంగల మిట్టిదే. కాకినాడ, పిఠాపుర ప్రాంతములకు ప్రాచీన కాలమున ప్రోలునాడని పేరు.
అగ్రహారము లన్నియు వైదికవిద్య వ్యాపింపజేయుటకై తద్విద్యాభిమానులైన రాజులు, నాయకులు, జమీందారులు మొదలగువారు బ్రాహ్మణుల కొసంగినవియే.
నపదక్రమాను క్రమాధీత వేదద్వయులు, సకలోపనిషత్పురాణేతిహాసానేక ధర్మశాస్త్రవిదులు, అగ్నిష్టోమయాజులు, యజ్ఞాగమమంత్రార్థ తత్వజ్ఞులు, యజన యాజన అధ్యయన అధ్యాపనాది షట్కర్మ నిరతులు అయిన బ్రాహ్మణులకు రాజులు ఉత్తరాయణ పుణ్యకాలముననో, సూర్య చంద్రగ్రహణముల నిమిత్తముననో, ఇతర పర్వదినముల సందర్భముననో లేక పట్టబంధ సమయముననో గ్రామముల నగ్రహారములను జేసి సర్వకరపరిహారముగ నొసంగువారు. ఆయగ్రహారముల వలన వచ్చు రాబడి ననుభవించుచు, విద్యార్థులై వచ్చిన బాలురకు విద్యాప్రదానము గావించుచు, జీవనోపాధి నిమిత్తము వేఱుచింతలు లేక బ్రాహ్మణులు సుఖముగా కాలక్షేపము చేయువారు. కొన్ని కొన్ని యగ్రహారములందు ప్రత్యేక మిట్టిట్టి విద్యలు నేర్పు నధ్యాపకుల కిన్నిన్ని వృత్తులని కూడ నేర్పాటు లుండెడివి. వీరచోడ చతుర్వేది మంగలమున నట్లే. విద్యాదివృత్తులను గుఱించి తెలుపు వీరచోడ చతుర్వేది మంగళ శాసనము నందలి భాగమీ క్రింద పొందుపఱచబడుచున్నది.
అత్ర వ్యాకరణం వ్యాచక్షాణస్య వృత్యర్థం భాగ ఏకః
మీమాంసా వ్యాఖ్యాత్రే ద్వౌ
వేదాంతం వాఖ్యాతు రేకః
ఋగ్వేద మధ్యాపయితు రేకః
యజుర్వేద మధ్యాపయితు రేకః
సామాని గాపయితు రేకః
రూపావతారం వ్యాచక్షాణ స్యైకః
పురాణం వాచయితు రేకః
వైద్య స్యైకః
అంబష్ట స్యైకః
విషవాదిన ఏకః
జ్యోతిర్విద ఏకః
ఈ విధమున ఋగ్వేద, యజుర్వేద, సామవేదములను, మీమాంసా, వేదాంత, వ్యాకరణ, రూపావతారములను బోధించు వారికి మాత్రమే కాక పురాణము చెప్పు వానికిని, వైద్యునికిని, ప్రణవైద్యము మొదలగువానిని జేయు మంగలికిని, విష వైద్యునికిని, జ్యోతిష్కునికి గూడ నగ్రహారములందు వృత్తు లుండెడివి. పూర్వము గ్రామములు కాని, అగ్రహారములు కాని ఇతర గ్రామముల మీదను, ఇతర పట్టణముల మీదను ఆధారపడకుండ తమ జీవనమును తాము స్వయముగ గడపుకొనుట కేయే వృత్తుల వా రావశ్యకమో అట్టి వారి కందఱికి వృత్తు లుండెడివి.
అగ్రహారముల నొకవిధమగు విద్యాపీఠములు (Chartered Universities) అని నుడువ వచ్చును. రాజొసంగిన యగ్రహారమునో, వృత్తులనో యనుభవించుచు గురువు చదువు చెప్పువాడు, శిష్యుడు గురుకులమున చేరి మాధుకర వృత్తిని జీవించుచు విద్య నేర్చుకొనుచుండు వాడు. గురువునకు జీవనోపాధి గుణించిన విచార ముండెడిది కాదు. శిష్యునికి భోజనము కొఱకు వెదకికొనవలసిన ప్రయాసముండెడిది కాదు.
ఏకభోగ, బహుభోగములు :
అగ్రహారములు సాధారణముగ ఏకభోగములుగను, బహుభోగములుగాను ఉండెడివి. ప్రత్యేకమొక్కని హక్కు భుక్తములలో నుండు నగ్రహారము నేకభోగమందురు.
ఒక్క యగ్రహారముననే పెక్కుమంది బ్రాహ్మణులకు వృత్తు లుండి యది గణభోగ్య మయినచో నట్టి దానిని బహుభోగ మందురు. ఏకభోగ మయినను బహుభోగ మయినను అగ్రహారము ప్రత్యేకము బ్రాహ్మణుల యాశ్రమవాటిక యగుట చేత నందు బ్రాహ్మణేతరులు నివసించుట కవకాశ ముండెడిది కాదు. అధ్యయన అధ్యాపనాది షట్కర్మనిరతు లయిన బ్రాహ్మణు లెప్పుడును వ్యవసాయము చేయువారు కాకపోవుట వలన అగ్రహారపు భూములను సేద్యము చేయుటకు కొంతమంది రైతులు కావలసి వచ్చువారు. వీరు నివసించుట కగ్రహారముల నంటి చిన్నపల్లె లుండెడివి. వీనికి పూళ్లని పేరు. పూడి పదాంతములయిన యిప్పటి గ్రామములలో నన్నియు గాకపోయినను చాలభాగము కొంచెమించు మించుగ నిట్టివే యని నుడువవచ్చును. అగ్రహారమునకు కావలసిన కూరగాయలన్నియు పూడి నామాంకితములయిన పల్లెలలో పండింపబడును. ఈ పూళ్లకే సంస్కృతమున గ్రామగ్రాసపు బల్లె లనియు, గ్రామోపహారము లనియుగూడ పేర్లు కలవు. సాధారణముగ రాజు లగ్రహారదానము గావించునప్పుడే వానితో నిట్టి పూళ్లను గూడ నేర్పఱిచి యిచ్చువారు.
‘సర్వకర పరిహారము‘ గను, గ్రామగ్రాస సహితముగను మాత్రమే కాక దాతయైన భూతలపతి ‘సధాన్య హిరణ్యాదేయము‘గను, ‘సదండదశాపరాధము’గను, ‘సోత్పద్యమాన విష్టికము‘గను, ‘చాటభటదూత రాజపురుషాప్రవేశనీయము’గను అగ్రహారములను దాన మొసంగు వాడు; అనగా దాన మొసంగిన యగ్రహారమునకు పన్ను పర్యాయము లుండెడివి కావు. అగ్రహారమున నుండి రాజునకు చెల్లవలసిన ధాన్యరూపమైనట్టి, ధనరూపమైనట్టియు రాబడి ప్రతిగ్రహీతలది. రాజు దానము నొసంగు నప్పుడే అగ్రహారమున ప్రజలు చేయు దశాపరాధములను విచారించి దండము (జరిమానా) విధించుటకును, దండించుటకును అధికార స్వామ్యముల నగ్రహారీకులకే వదలివేయువాడు. రాజునకు చేయబడవలసిన వెట్టివేములు సయితము దానముతో నగ్రహారీకులకే చెందుచుండెను. విద్యార్థుల విద్యాభ్యాసమునకు గాని, అగ్రహార శాంతికి గాని భంగము కలుగకుండుటకై సైనికులు (చాటభటులు Regular or Irregular troops) గాని, దూతలు (messengers) కాని రాజపురుషులు (King’s Servants) కాని అగ్రహారములలో ప్రవేశింపరాదను నిబంధనముతోనే రాజు అగ్రహారమును దానమొసంగువాడు. అగ్రహార దాన నిబంధనములలో నెల్ల ఈ నియమమే కడు ముఖ్యమైనది. వ్యవహార, దోష (సివిలు, క్రిమినలు) విచారణముల కగు సర్వాధికార స్వామ్యములందును ప్రభుత్వముతో నెట్టి సంబంధము లేక సర్వతంత్ర స్వతంత్రమై యుండు నాయగ్రహారమున విద్యావిధాన నిర్ణయమున గాని, అగ్రహార కార్యనిర్వహణమున గాని, దోష వ్యవహార విచారణమున గాని బ్రాహ్మణేతరుల కెవ్వరికి నధికారము లేకపోవుటయే కాక వారి కెవ్వరికి బ్రాహ్మణుని యనుమతి మీద తక్క నాయగ్రహారమున ప్రవేశించుటకై హక్కుండెడిది కాదు. ఈ కారణముననే కావచ్చు. ముఖ్యముగ పంచమవర్ణమువా రగ్రహారపు వీథులందు నడవరా దను నిబంధనము కలిగినది. పూర్వపు విద్యాపద్ధతి యంతరించినను పాశ్చాత్య నాగరకతాఘాతమున ప్రాచీన బ్రాహ్మణాచార దుర్గములు శిథిలము లయినను ఆ నిబంధనము మాత్రమిప్పటికి నిలిచిపోయినది. ఈ నియమములను నిబంధనములను బరిశీలించినచో రాజుల కగ్రహారములన్న నెట్టి గౌరవ ప్రపత్తులుండెడివో, విద్యార్థుల విద్యాభ్యాసమునకు భంగము కలుగకుండ రాజెట్టి జాగ్రత్త తీసికొని, బ్రాహ్మణుని కెట్టి స్వేచ్ఛ నొసంగుచు వచ్చెనో తెలియగలదు. ఈ విధమున నగ్రహారమొక చిన్న సంస్థానముగ నుండెను. బ్రాహ్మణుడు దానికధిపతియై రాగల సంతతి వారి భావిభాగ్యోదయము నాకాంక్షించి సంస్కృతి సూత్రములను పురివెట్టుచుండువాడు. ఈ కారణముననే ప్రాచీన కాలమున హిందూ దేశమున నేయుధ్యమము బయలుదేఱినను అది యెల్ల సంస్కృతికి సంబంధించినదిగనో, మతమునకు సంబంధించినదిగనో యుండుచు వచ్చెను. అట్టి యుద్యమములన్నియు పల్లెటూరి నుండియే ప్రభవించి దేశము నంతయు కంపింపజేయుచుండెడివి.
కొన్ని కొన్ని చోట్ల అగ్రహారములను చేసి బ్రాహ్మణులకు దానమొసంగునప్పుడు అమిత విద్యాభిమానులైన రాజులు నాయకులు మొదలగువారు కొంద ఱగ్రహారము లందలి నొక్కొక్క గృహమునకు కావలసిన సర్వవిధములైన పరికరములను, 54 సంబారములను గూడ నిచ్చుచు వచ్చినట్లును శాసన నిదర్శనములు కొన్ని కలవు ఈ క్రింద నుదాహృతమైన శాసన భాగమట్టిదే.
గృహాన్ విధాయ విపులాన్ వృత్తివృత్తి విభాగతః
శయ్యోపధానపర్యంక విచిత్రాస్తరణాసనై:
దేవోపకరణై ర్గోభి ర్గృహోపకరణై స్తథా
శాలితండులముఖ్యైశ్చ ధనధాన్యైర్గుడై ర్ఘృతైః
తిలాదిసర్వసంభారై స్సంభృతాంస్తాన్ గృహోత్తమాన్
ప్రవేశ్య ద్విజవర్యాంశ్చ పత్నీ పుత్రయుతాన్ ముదా
వస్త్రయుగ్మంచ సోప్లీషం కౌశేయం రత్నకుండలే
అంగుళీయక ముఖ్యాని కల్పయిత్వా పృథక్ పృథక్
వస్త్రాభరణతాటంక కంఠసూత్రాది భూషణై:
బ్రాహ్మణాంశ్చ సపత్నీకాన్ పూజయిత్వాతిభక్తితః
సహిరణ్యపయోధారాపూర్వకం ప్రదదౌ నృపః
ఈ రీతి నగ్రహారము లన్నియు విద్యానిలయములుగ ప్రసిద్ధి వహించినట్లును, మన ప్రాచీన విద్యాసంస్థలలో అగ్రహార మగ్రగణ్యముగ నుండినట్లును అంగీకరింప తీరదు.
మహాసభలు, పంచాయతీలు :
అగ్రహారముల కైననేమి, గ్రామములకైననేమి మహాసభ లుండెడివి. ఈ సభలే ఆయా యగ్రహార, గ్రామ వ్యవహారములను చక్కబెట్టు చుండెడివి. అగ్రహార వ్యవహారములను చక్కబెట్టు కేర్పడిన వారికి మహాసభ వారనియు, సభవారనియు, మహాజనులనియు పేర్లుండెడివి. ఒక్కొక్క యగ్రహారము వైశాల్యమును బట్టియు, వ్యవహారమున జూపవలసిన దక్షతను బట్టియు సభవారి సంఖ్య కొన్ని కొన్ని చోట్ల తక్కువగను, కొన్ని కొన్ని చోట్ల నెక్కువగను ఉండెడిది. ఇట్లే గ్రామ వ్యవహారములను చక్కబెట్టుట కేర్పడిన సభకు పంచాయతీ సభయని పేరు. అగ్రహార మహాసభలకును, గ్రామపంచాయతీ సభలకును గల భేదమును గుఱించి యిచట వ్రాయుట యప్రస్తుతము.
ప్రత్యేకము విద్యాప్రదానము నిమిత్తము గాని, లేక దేవస్థానముల నిమిత్తము కాని చేయబడు దానధర్మముల కీ సభవారు ధర్మకర్తృత్వము వహించువారు. విద్యా విషయమైనట్టి కాని, మఱి యితర ధర్మకార్యములకు సంబంధించినట్టి కాని దానధర్మములు కొన్ని కొన్ని చోట్ల ఈ సభవారి పరముగనే చేయబడుచుండెడివి. అట్టి సందర్భములలో సభవారే దాత యాశయముల కనుగుణ్యముగ నాయా ధర్మకార్యముల నాచరణమునకు తెచ్చుటకు తగిన కట్టుబాటులు చేయుచుందు వారు. దక్షిణహిందూ దేశమున మనకీ విధమయిన శాసనము లనేకములు కానవచ్చును.
పుదుచ్చేరి సమీపమున గల బాహుగ్రామమున నిట్టి శాసన మొకటి కలదు. అది కాంచీపురము రాజధానిగ నేలిన నందివర్మకుమారుడగు నృపతుంగదేవుని కాలము నాటిది; అనగా క్రీస్తుశకము తొమ్మిదవ శతాబ్ది యందలిది. నృపతుంగ దేవుని ప్రధాని – కురుకులోద్భవుడును, బశాలివంశ మార్తాండుడు నగువాడు తన ప్రభువు ననుమతితో బాహుగ్రామ విద్యాస్థానమునకు మూడు గ్రామములను దాన మొసంగి వానిని ఆ గ్రామసభవారి వశము చేసెను. ఊర్మివంశ సమాకులమై క్రిందికి దిగు మందాకినీ నది నే విధముగా ధూర్జటి తన జటలో నిలిపి వహించెనో అట్లే సభవారు కూడ పదునాలుగు గణములతోడం గూడిన విద్యానదిని వశము చేసికొని కాపాడిరి.
దేవాలయములు
అగ్రహారములకు పిదప పరిగణింపదగిన ప్రాచీన విద్యాసంస్థ దేవాలయము. పూర్వకాలమున దేవాలయముతో సరిపోల్చదగిన మహాసంస్థ ఇంచుమించుగ లేదనియే చెప్పవచ్చును. అది మతధర్మముల నుద్బోధించు గురుపీఠము; వేదచోదిత విద్యాప్రదానము గావించు విద్యానిలయము; మతబోధకు లుపన్యాసములు చేయు నుపన్యాసవేదిక; శాస్త్రజ్ఞులు వాక్యార్ధములు గావించు సభాభవనము; పౌరాణికు లితిహాసములు వినిపించు సత్రశాల; భాగవతోత్తములు పరమేశ్వరారాధనము గావించు పూజా మండపము. అట్టిది పూర్వకాలపు దేవాలయము. సాధ్యమైనంత వఱకు ప్రాచీన గ్రామ జీవనము కలక బాఱకుండ జాగ్రత్తగ కాపాడుచు వచ్చిన మహాసంస్థ యదియే.
దేవాలయము గొప్ప విద్యాసంస్థయై వైదిక విద్యకు గొప్ప యాలంబముగ నుండినట్లు ముఖ్యముగ దక్షిణాపథము నందలి ప్రాచీన శాసనముల ననుసరించి తెలియవచ్చుచున్నది. పూర్వకాలమున దేవస్థానములకు జేయబడుచుండిన దాన ధర్మములలో విద్యాప్రదానమునకుగూడ నేర్పాటు లుండెడివి. మండలేశ్వరులు, సైన్యాధిపతులు, రాజులు, చక్రవర్తుల విద్యాభిమానమును, మతాభిమానమును గలిగి యొకప్పుడు కాకపోయిన మఱియొకప్పుడైన తాము దేవస్థానములకు చేయు దానధర్మములలో విద్యాప్రదానమునకు గూడ నేర్పాటులు చేయువారు. దానంజేసియే దేవస్థానము కూడ విద్యానిలయమై పేరొందగలిగెను. ఇట్టి విద్యా విషయకపుటేర్పాటులు కలిగిన యొక దానశాసనము దక్షిణార్కాడు
మండలమునందలి త్రిభువణి గ్రామమున గానవచ్చుచున్నది. ఇది చోళ దేశమును పరిపాలించిన రాజకేసరి వర్మాభిధానుడగు (మొదటి) రాజాధిరాజు కాలము నాటిది. ((క్రీ.శ. -1018-1050). ఈ రాజుయొక్క ముప్పదవయేట రాజేంద్రచోళుని కారోగ్యాభివృద్ధి యగునట్లుగా సేనాపతియైన రాజేంద్ర చోళ మహాబలి బాణరాయ రనునతడు ‘రాజేంద్రచోళనుత్తమాగ్ర‘ మను పేరణరగు ధర్మము గావించెను. తద్దర్మమునకు సంబంధించిన కార్యవివరముల నాచరణమునకు దెచ్చుటకై ఆ గ్రామమునందలి మహాసభ వా రచ్చటి సభా మండపమున సమావేశమై సంవత్సరమునకు 12,000ల కలముల ధాన్యము వచ్చు 72 వేలీల భూమి కొని, దేవరల హవిర్భల్యర్చనాదులకును, ఉత్సవాదులకును, శ్రీవైష్ణవ సంతర్పణములకును తిరువాయిమొష్టి‘ పఠనమునకును సంవత్సరమునకు 2,475 కలముల ధాన్యమును నేర్పాటు చేసి, మిగిలిన ధాన్యము నీక్రింద విధమున వినియోగించిరి :
(1) ఋగ్వేదాధ్యాపకులు ముగ్గురు, యజుర్వే దాధ్యాపకులు ముగ్గురు, ఛందోగ సామాధ్యాపకు డొక్కడు, తలవకార సామాధ్యాపకు డొక్కడు, అపూర్వ, వాజసనేయ, బోధాయనీయ, సత్యాషాఢ” సూత్రాధ్యాపకు లొక్కరొక్కరు మొత్తము పండ్రెండుగురికి దినమునకు నాలుగు కలముల ధాన్యము;
(2) వేదాంతము, వ్యాకరణము, రూపావతారము, శ్రీభారతము, రామాయణము, మనుశాస్త్రము, వైఖానస శాస్త్రము – వీనిని బోధించు నధ్యాపకు లొక్కరొక్కరు,
(3) ఋగ్వేదాధ్యయనపరు లఱువదిమంది, యజుర్వేదాధ్యయనపరు లఱువదిమంది, ఛందోగ సామాధ్యయనపరు లిరువదిమంది, ఇతర శాస్త్రాధ్యయనపరు లేబదిమంది – మొత్తము నూటతొంబదిమందికి దినమునకు పదనొకండు కలముల, పదికురుణీల, నాలుగు నాళీల ధాన్యమును;
(4) వేదాంతము, వ్యాకరణము, రూపావతారము – వీనినభ్యసించు నితర విద్యార్థులు డెబ్బది మందికిని ఏర్పాటు కావింపబడెను. పైవిధమున చేయబడిన యేర్పాటులను బట్టి అధ్యాపకులకును, విద్యార్థులకును భోజనాదికములకై వినియోగింపబడిన ధాన్యము మొత్తము 9525 కలములు. ఈ పైని చేయబడిన యేర్పాటుల వలన నా విద్యాస్థానమున గఱపబడుచుండిన విద్య లేవియో, యేయే విద్య నెంద ఱిందఱు విద్యార్థులు నేర్చుకొనుచుండిరో, యేయే విద్య నేర్పుట కెంద అందరధ్యాపకులుండిరో మనకు వివరముగ తెలియుచున్నది. విద్యార్థులకు భోజన వసతి గృహములతో నేర్పాటైన చిన్న విశ్వవిద్యాలయము వంటిది కాదా యీ త్రిభువణి దేవస్థాన విద్యాపీఠము!
ఇట్టిదే మఱియొక శాసనము ఎణ్ణాయిరము గ్రామమున వచ్చినది : చోళదేశము నేలిన మొదటి రాజేంద్ర చోళుని కాలము నాటిది (క్రీ.శ. 1013 – 1045). ఈ యెణ్ణాయిరము గ్రామమునకే రాజరాజచతుర్వేది మంగల మనియు బేరు. రాజునకు విజయాభ్యుదయములు కలుగునట్లు ఈ చతుర్వేది మంగలము మహాసభ వారు ‘రాజరాజవిణ్ణగ‘ రను దేవాలయమున సమావేశమై కొన్ని ధర్మకార్యముల నొనరించిరి. అవి విద్యావిషయకమైనవి. విద్యార్థులకు విద్యా ప్రదానము గావించుటకు వలసిన యేర్పాటులు చేయుటయు, నా విధమున విద్య నేర్చుకొను విద్యార్థుల కొక భోజనశాల నేర్పఱుచుటయు నా సభ యొక్క ముఖ్యోద్దేశము. ఇందును గూర్చిన వివరములను శాసన మీరీతిని దెలుపుచున్నది :
(1) దేవస్థానమున తిరువాయిమొష్టి స్తోత్రమును పఠించుటకు పలువురు నియమితులైరి. వారికొక్కక్కరికి భృతిగ కొంత ధాన్య మేర్పాటు చేయబడి యందుకొఱకు కొంతభూమి యొసంగబడెను.
(2) దేవాలయము నంటియుండు మఠమునం దిరువదియైదుగురు శ్రీవైష్ణవులకు భోజనము పెట్టు నిమిత్తము కొంత భూమి యొసంగబడెను.
(3) సప్తాహము వంటి యొకానొక యుత్సవము సందర్భమున వేయిమంది వైష్ణవులకును, ఆ యుత్సవము చూచుట కేతెంచిన దాసులకును అన్నప్రదానము గావించు కొఱకు 60 కలముల ధాన్యమును, 3 కలంజుల బంగారము నొసంగబడెను.
(4) గంగైకొండ చోళమండపము నందు, ఋగ్వేదాధ్యయనపరులు 75 గురు, యజుర్వేదాధ్యాయన పరులు 75 గురు, ఛందోగసామాధ్యయన పరులు 20 మంది, తలవకార సామాధ్యయనము చేయువారు 20 మంది, వాజసనేయాధ్యయన పరులు 20 మంది, అథర్వ వేదాధ్యయనపరులు 10 మంది, బౌద్ధాయనీయ గృహ్యకల్ప, గణాధ్యయన పరులు 10 మంది ఈ విద్యార్థులకు భోజనవసతి కల్పింపబడెను.
పై నుడివిన వేదము లభ్యసించు బ్రహ్మచారులు మొత్తం 230 మంది; రూపావతారము నభ్యసించువారు 40 మంది; మొత్తము విద్యార్థుల సంఖ్య 270 : వీరందఱకు నొక్కొక్కరికి దినమునకు ఆఱు నాళీల ధాన్య మేర్పాటు కావింపబడెను.
పై నుడివిన వీరుగాక వ్యాకరణము నభ్యసించువారు 25 గురు, ప్రాభాకరము నభ్యసించు వారు 35 గురు. వేదాంతము నభ్యసించు వారు 10 మంది – వెరసి 70 మంది విద్యార్థులు కలరు. వీరి కందఱ కొక్కొక్కరికి దినమునకు 1 కురుణి, 2 నాళీల ధాన్యము నియమితమయ్యెను. వ్యాకరణాధ్యాపకునికి దినమునకొక్క కలము ధాన్యమును, ప్రాభాకరాధ్యాపకున కొకకలము ధాన్యమును, వేదాంతము చెప్పువానికి దినము కొక్క కలము నొక తూని ధాన్యమును ఏర్పాటు చేయబడెను.
వేదాధ్యయనమునకై పదిమంది అధ్యాపకులు నియమింపబడిరి. ఎట్లన : ఋగ్వేదమునకు ముగ్గురు, యజుర్వేదమునకు ముగ్గురు, ఛందోగసామమున కొకరు, తలవకార సామమున కొకరు, వాజసనేయమున కొకరు, బౌద్ధాయనీయ గృహ్యకల్ప కారకముల కొకరు.
రూపావతారము బోధించు వానికి దినముకు 3 కురుణీల ధ్యానము, దినమున కిట్టు ‘రాజరాజ మరకాల‘తో ముప్పది కలముల ధ్యానము కొలుచువారు. ఈ రీతిని సంవత్సరమున 10506 కలముల ధాన్య మగుచుండెను. అధ్యాయమున కొకకలంజు చొప్పున వ్యాకరణమున నెనిమిది అధ్యాయములకు వ్యాకరణాధ్యాపకుని కెనిమిది కలంజుల బంగారమును, అధ్యాయమున కొక కలంజు చొప్పున పండ్రెండు అధ్యాయములకు ప్రాభాకరాధ్యాపకునికి పండ్రెండు కలంజుల బంగారము కూడ నొసంగబడుచుండెను. వేదాధ్యాపకులు, రూపావతారము బోధించువారు మొత్తము పదముగ్గురు నొక్కొక్కరి కరకలంజు చొప్పున ఆఱున్నర కలంజుల బంగారమును, ఒక్కొక్కరి కరకలంజు చొప్పున వ్యాకరణ, మీమాంసాశాస్త్రము లభ్యసించు డెబ్బది మంది విద్యార్థులకు 35 కలంజుల బంగారమును ఇచ్చుటకు (విద్యార్థి వేతనము) నేర్పాటు కావింపబడెను. ప్రాచీన కాలమున దేశీయ ప్రభువుల పరిపాలనమున నార్యవిద్యల కీరీతిని ప్రోత్సాహ ముండెడిది.
మొత్తము మీద నీ ధర్మనిర్వహణముకు గావలసిన 61/2 కలంజుల బంగారమునకును, ధాన్యమునకును దేవస్థానమునకు 45 వేలీల భూమి యొసంగబడెను. ఈ విధమైన దానశాసనముల నెన్నియైనను చూపవచ్చును. వీరరాజేంద్ర చోళదేవుని (క్రీ.శ. 1062–1067) తిరుముక్కూడల్ శాసనము కూడ నిట్టిదే. ఆ శాసనము ననుసరించి యీ క్రింది సంగతులు తెలియుచున్నవి.
తిరుముక్కూడల్ మహావిష్ణ్వాలయమున ‘జననాథ మండప‘ మను పేర నొకమండపము కలదు. అందు వేద, శాస్త్ర, వ్యాకరణ, రూపావతారములను బోధించు నొక విద్యాస్థానమును, అధ్యయనపరులగు బ్రహ్మచారుల కొక భోజన శాలయు, ఆవశ్యకమైనచో వైద్యము నిమిత్త మొక వైద్యాలయమును ఉండెను. బ్రహ్మచారులకు భోజనమునకును, ప్రతిశనివారము నభ్యంగనమునకై తైలమునకును, రాత్రులు చదువుకొనుటకు దీపములకై చమురునకును ఏర్పాటులుండెడివి. వీరచోళ వైద్యాలయమని ఈ దేవస్థానమునందలి వైద్యాలయమునకు పేరు. అందు వ్యాధి గ్రస్తులుండుటకు పదునైదు మంచము లేర్పాటు చేయబడెను. వైద్యాలయము కొఱకును, రోగగ్రస్తుల సౌఖ్యసౌకర్యముల కొఱకును ప్రత్యేక మీ క్రింది యేర్పాటులు చేయబడినవి. (1) బియ్యము, (2) వంశపారంపర్యముగ వైద్యము నభ్యసించు కుటుంబములోని యొక వైద్యుడు, (3) ఒక శస్త్రవైద్యుడు, (4) మూలికలు తీసుకొని వచ్చుటకు, వంట చెఱకు గొని వచ్చుటకును, వైద్యాలయమునకు సంబంధించిన తక్కిన పనులు చేయుటకును ఇరువురు నవుకరులు, (5) రోగులకు సపర్య చేయు కొఱ కిరువురు దాసీలు, (6) భోజనశాల, వైద్యశాలలు కొక సేవకుడు.
సంవత్సరమునకు సరిపోవు ఈ క్రింది మందులు వైద్యాలయమున నిలువ చేసియుంచువారు : (1) ఆశాహరీతికి – రెండుపళ్లు (2) గోమూత్ర హరీతికి రెండు పళ్లు, (3) దశమూల హరీతికి–ఒక పడి, (4) భల్లాతక హరీతకి – ఒకపడి (5) గండీరము – ఒకపడి (6) బలాకోరండతైలము – ఒకతూని (7) పంచా…. తైలము ఒక తూని (8) లశు….. ండతైలము– ఒక తూని (9) ఉత్తమ కర్ణాది తైలము ఒక తూని (10) ఘృతము – ఒక పదక్కు (11) బిల్వాది ఘృతము –ఒక పదక్కు (12) మండూకర వటకము 2,000, (13) త్రివృత్తి – ఒకనాళి (14) విమలై – 2,000 (15) తామ్రాది – 2,000 (16) వజ్రకల్పము– ఒకనాళి ఒక తూని, ఒక పదక్కు (17) కళ్యాణ లవణము – ఒక తూని, ఒక పదక్కు, (18) ఈ మందుల నుపయోగించుటలో నావశ్యకమైన యితర మూలికలు. పురాణసర్పి తయారు చేయుటకు కావునేతికిని, రాత్రి యంతయు దీపము పెట్టుటకు నూనెకు నేర్పాటు లుండెను.
పై కొలతలలోను, తూనికలలోను వచ్చు పడి చెన్నపురి పడి. నాళి, తూని, పదక్కు అనువానికి గల పరస్పర సంబంధమును నిశ్చయించుటకు తంజావూరు చోళరాజుల శాసనములు మన కుపకరింపగలవు. వాని సాయమున నీ క్రింది
రీతిని మానము కట్టుట కవకాశము కలదు.
2 అళాకులు = 1 ఉళక్కు
2 ఉళక్కులు = 1 ఉరి
2 ఉరులు = 1 నాళి
16 నాళులు = 1 పదక్కు
2 పదక్కులు = 1 తూని
దీని ననుసరించి పదక్కు తూనిలో సగమనియు, ఒక్కొక్క పదక్కునకు 16 నాళు లనియు దేలుచున్నది. పూర్వోక్ష శాసనముల వలన దేవాలయధర్మములు కేవలము హవిర్బల్యర్చనాదుల నిమిత్తమే కాక విద్యా విషయములకు గూడ పూర్వ మెట్లు వినియోగపడుచుండెనో తెలియగలదు. ఇంతటి కట్టుబాటుల మీద, నంతటి యుదారాశయములతో సంస్థాపితములయిన విద్యాస్థానములు ప్రశంసింపదగినవి కదా? గ్రంథవిస్తర భీతి వలన గాని లేనిచో ఇంకను ఇట్టి విషయములు దెలుపు శాసనము లనేకములు చూపవచ్చును.
దేవాలయములకు పిదప పేర్కొనందగిన విద్యాసంస్థలు మఠములు. బౌద్దుల సంఘారామవిహారముల వలెనే జైనమతస్థుల బస్తీలును జినాలయములును, శైవ వైష్ణవాది మతములకు సంబంధించిన మఠములును ఆయా మతముల వ్యాపకమునకు మాత్రమే కాక విద్యాభివృద్ధికిని ఎక్కువగా తోడ్పడి యున్నవి. అగ్రహారములు, దేవాలయములు పూర్వము విద్యావ్యాపనమున కేవిధముగ తోడ్పడుచుండెడివో అట్లే యీ మఠములు కూడ గొప్ప విద్యా వ్యాపక సంస్థలగ ప్రసిద్ధి కెక్కి యమిత ప్రయోజన కారులయ్యెను.
జైనబస్తీలు
బౌద్ధమతము దక్షిణాపథమున రూపుమాయుటకు గల ప్రబల కారణములలో జైనమత విజృంభణ మొకటి. క్రీస్తుశకము రెండవ శతాబ్ది నుండి జైనమతము బాగుగ వర్ధిల్లినది. సామంతభద్రుడు, అకలంకచంద్రుడు, విద్యానందుడు, మాణిక్యనంది, ప్రభాచంద్రుడు, జినసేనుడు, గుణభద్రుడు ఈ మొదలగు విద్వద్వతంసులైన జైనాచార్యులు గొప్ప గొప్ప గ్రంథములు వ్రాసి, రాజాస్థానముల కేగి విమతవాదులతో ప్రతివాదములు చేసి జైనమతమును దేశమున వ్యాపింపజేసిరి. అందువలన దక్షిణ గాంగుల కాలమునను, రాష్ట్రకూటుల కాలమునను, కళచురి ప్రభువుల కాలమునను జైనము రాజమతమై కీర్తి గాంచెను. కన్నడ దేశమున ‘శ్రవణ
బెళగొళ మొదలగు గ్రామములు జైనమత విద్యకు ప్రధాన పీఠములయినవి. తెలుగుదేశమున గూడ జైనమతము వ్యాపించక పోలేదు. ఆంధ్రదేశము నందలి ఆయా గ్రామముల యందు గానవచ్చు జైన విగ్రహములే ఆ మతమొకప్పు డిచట బాగుగ వ్యాపించి యుండె ననుటకు ప్రబల నిదర్శనములుగ నున్నవి. ఆంధ్రదేశము నేలిన పూర్వ చాళుక్య ప్రభువులు జైన, శైవ మతములు రెంటిని గూడ సమానముగ నాదరించినట్లు శాసన ప్రమాణము కలదు. మూడవ విష్ణువర్ధనుడు (క్రీ.శ. 714-751), అమ్మరాజ విజయాదిత్యుడు (క్రీ.శ. 945-970)
విమలాదిత్యుడు (క్రీ.శ. 1015-1022) – ఈ మొదలగు వారందఱు జైనమతము నాదరించి, జినాలయములకు దానములు కావించిరి. జైనమత మాంధ్రదేశమునం దంతట వ్యాపించినట్లు నిదర్శనము లున్నను జైనమత పీఠములు కొన్ని మాత్రమే ప్రధాన విద్యాస్థానములుగ నుండినట్లు కన్పట్టును. బెజవాడ (కృష్ణాజిల్లా), ధర్మవరము (గుంటూరు)’, రామతీర్థము (విశాఖపట్టణము), హనుమకొండ (ఓరుగల్లు), దానవులపాడు (కడప) – ఈ మొదలగునవి ఆంధ్రదేశము నందలి ప్రసిద్ధ జైనమత పీఠములుగ గన్పట్టును. జైనుల ‘పల్లె‘లు, ‘బస్తీ‘లు జైనమత విద్యను వ్యాపింప జేయుటకు నెక్కువగ తోడ్పడినవి. జైన బస్తీ చిన్న చిన్న పేటలతోను, పెక్కు జినాలయములతోను గూడిన బ్రాహ్మణాగ్రహారము వంటి యొక జైనాగ్రహారముగ భావింపవచ్చును. జైనమతస్తులలో యతులకు వలెనే యోగినులకు గూడ ప్రత్యేక మఠము లుండెడివని తెలియుచున్నది. ద్రవిడ దేశమున చోళ రాజధానియైన కావేరిప్పూం బట్టణము నను, కావేరీ తీరమున గల యొక యూరియందును జైన మఠము లుండెడివి. ఇట్టి జైనమఠములను గుణించి కాని, అందలి మతవిద్యా విధానమును గుణించి గాని మనకు వివరములు తెలియవు. కాని ప్రతి ముఖ్య మఠమున నసంఖ్యములయిన మత గ్రంథములు చేర్చబడుచు వచ్చుట చేత నది యొక గొప్ప గ్రంథభాండాగారమయి వెలయుచుండెడిది. ప్రాచీన గ్రంథాన్వేషణకు లనేకులకు తాళపత్ర, భూర్జపత్రాద్యముద్రిత ప్రాచీన జైనమత గ్రంథములనేకములు ఇట్టి మఠముల యందే దొరికినవి.
శైవమఠములు
జైనమతమునకు పిదప దక్షిణాపథమున బాగుగ వర్ధిల్లిన మతము శైవము. శైవమతము చోళ దేశమున ‘ననాది‘గా నుండినను దాని నా దేశముననే కాక దక్షిణా పథమంతట నెక్కువగ వ్యాపింపజేసిన వారు కాలాముఖులు, పాశుపతులు అనబరగు శైవులు. కాలాముఖ, పాశుపతము లనునవి శైవమతమునందలి యంతర్భేదములు.
క్రీస్తు శకము పది, పదునొకండు, పండ్రెండు శతాబ్దులం దీపాత మెక్కువగ విజృంభించెను. అప్పుడు చేది, చోళ, మాళవ దేశాధిపతులును, పశ్చిమ చాళుక్య, పూర్వ చాళుక్య, కాకతీయాది రాజవంశజులునుగూడ ఈ మతము నవలంబించి, దాని కెక్కువ యాదర ప్రోత్సాహముల నొసంగిరి. శైవమత విజృంభణము ప్రథమ దశలో కాలాముఖులే ప్రబలు లయి పెక్కు దేవస్థానములయం దాచార్యపీఠమును సంపాదించి స్థానపతులుగ నుండి మతమును, విద్యను వ్యాపింపజేసిరి. వీరు మొదట కాశ్మీర దేశము నుండి వచ్చిన వారని కొన్ని శాసనములు తెలుపుచున్నవి. గంగాతీరమున నుండి వచ్చిన వారని మఱికొన్ని గాథలు కలవు. ఎట్లయిన నేని వీరు ఆర్యదేశ, మధ్య దేశ, గౌడ దేశవాసు లనియు, నుత్తరాపథమున నుండి వచ్చిన వారనియు స్పష్టమగుచున్నది. సాధారణముగ నీ కాలాముఖ, పాశుపత నామములు పండిత, శివపండిత, శక్తి, శివ, రాసి పదాంతములుగ గానవచ్చును. ఉదా : విశ్వేశ్వర పండిత, ఈశానశివపండిత, వామశక్తి, జ్ఞానశివ, నాగరాసి. సాధారణముగ పాశుపతులు పండిత, శివపదాంచితులు. మంచనపండితుడు,
శ్రీపతిపండితుడు, మల్లికార్జున పండితుడు వీరలెల్లరు పాశుపత శైవులే. ఇందువలననే మల్లికార్జున పండితారాధ్యులు తన ‘శివతత్త్వ సారమున‘ ‘పశుపతి‘ మతమునే యుద్ఘాటించెను. ఆంధ్రదేశమున శైవమతమునకు పూర్వచాళుక్యులును, కాకతీయులును ఎక్కువ ప్రోత్సాహాదరములను చూపి దాని కాలంబమై నిలిచిరి. పూర్వచాళుక్యుల కాలమున, అనగా అమ్మరాజ విజయాదిత్యుని కాలము నుండి కాలాముఖము మొగ్గతొడుగ. కాకతీయుల కాలమున పాశుపతము కాయకాచి పంట పండెను.
ఇంతవఱకు బ్రకటింపబడిన యాంధ్రదేశ శాసనములలో మొట్టమొదటి మాఱు కాలాముఖుల ప్రస్తావనము పూర్వ చాళుక్య ప్రభువైన అమ్మరాజ విజయాదిత్యుని తా(0)డికొండ దానశాసనమున కలదు. అందు వీరు ‘కాళముఖు‘లని పేర్కొనబడి యున్నారు, వీరికి శాసనములందు కాలాముఖులను నామమును గలదు. వీరు వేద వేదాంగాది సర్వవిద్యాసంపన్నులు. విద్యాప్రదానము గావించుటలో దీక్షాకంకణము కట్టిన వారు. వీరిని ‘శిష్యచాతకవర్షాగమము‘లని కన్నడ శాసనములు వర్ణించు చున్నవి. వీరి వక్కణ కన్నడశాసనములం దిట్లు కలదు.
“యమ, నియమ, స్వాధ్యాయ, ధ్యాన, ధారణ, మౌనానుష్ఠాన జపసమాధి శీల గుణసంపన్నురం, విబుధజన ప్రసన్నరుం, సకలసుకవినికురుంబాధారరుం. అన్నదాన సువర్ణ దాన కన్యాదాన గోదాన భూదాన అభయ భైషజ్యానేక దాన వినోదరం, లాకుళాగమాభరణరం, సమస్తశాస్త్రాగమ విచారాచార చతురరుం…”
కాలాముఖులును, పాశుపతులును గూడ మఠముల ద్వారముననే తమ మతమును విద్యను గూడ వ్యాపింప జేసిరి. శైవమత విజృంభణ కాలమున శైవమఠములు దేశము నెల్లెడల వలవలె నల్లుకొనినవి. కన్నడ, ద్రమిళ, ఆంధ్రదేశములందా కాలమున విద్యాప్రదానము గావించు పెక్కు శైవమఠములు మొలకలెత్తెను. ఆంధ్రదేశమున శ్రీశైలము, కాళేశ్వరము, భీమేశ్వరము మొదలగునవి శైవులకు ప్రధానక్షేత్రములుగ నుండెను.
పాశుపత శైవ సంతానమునకు భాగీరథీ, నర్మదా నదులకు మధ్యనుండు డాహల దేశమునందలి గోళకీమఠము ప్రధానమైనది. తెలుగుదేశమున పెక్కు మఠములు కట్టించిన వారీ మఠమునకు సంబంధించిన వారలే. ఈ గోళకీ మఠము యొక్క యుపమఠములు కన్నడదేశమునను, ద్రమిళ దేశమునను గూడ నుండినవి. గోళకీ మఠ శాఖలు తెలుగుదేశమున కడప మండలమున పుష్పగిరియందును,
కర్నూలు మండలమున త్రిపురాంతకమునందును, గుంటూరు మండలమున మందడము నందును వెలసినవి. ఈ గోళకీమఠము క్రీస్తుశకము పదునొకండవ శతాబ్ది నుండి దక్షిణాపథమునం దెల్ల మిక్కిలి ముఖ్యమైన మత విద్యాసంస్థ నుండినట్లు శాసనముల వలన దెలియవచ్చును.
విశ్వేశ్వర గోళకి :
ఆంధ్రదేశమున గుంటూరు మండలము నందలి మందడమునం గల విశ్వేశ్వర గోళకి సుప్రసిద్ధమైనది. దానిని నెలకొల్పిన శివాచార్యుడు కాకతీయ గణపతిదేవ చక్రవర్తికి చిన్మయదీక్ష నొసంగిన రాజగురువగు విశ్వేశ్వర శివ మహాముని. గణపతిదేవ చక్రవర్తి కూతురైన రుద్రమదేవి యాసుకృతికి శాలివాహన శకము 1183-వ దుర్మతి నామ సంవత్సర చైత్ర బహుళ శుక్రవారము నాడు వెలగపూడి సహితముగ మందర గ్రామము దానము చేసెను. విశ్వేశ్వర శివమహాముని ఆ దానమును పరిగ్రహించి యచ్చట నౌక విశ్వేశ్వరాలయము“ను, మఠమును, బ్రాహ్మణుడు మొదలు చండాలుని పర్యంతము వర్ణ విచక్షణ లేకుండ నిరతాన్న ప్రదానము గావించుట కొక సత్రమును కట్టించి బ్రాహ్మణులను రావించి వారికి వృత్తులు, నివేశనములు నిప్పించి యా గ్రామమునకు విశ్వేశ్వర గోళకి యని పేరిడెను. వెలగపూడి సహితమైన మందడ గ్రామమున నఱువది ద్రావిడ బ్రాహ్మణ కుటుంబముల కొక్కొక్క కుటుంబమునకు రెండుపుట్లు భూమి చొప్పున నీయంగా మిగిలిన దానిని మూడు భాగములు చేసి, యందొక భాగము విశ్వేశ్వరునికి, మఱియొక భాగము విద్యార్థులకును, శుద్ధశైవమఠమునకును, మూడవ భాగమును ప్రసూత్యారోగ్యశాలకును (Maternity Hospital), విప్రసత్రమునకు నిచ్చివేసి ఋగ్యజుస్సామవేదములు నేర్పుటకు మూవురధ్యాపకులను, పదవాక్యప్రమాణము (Logic), సాహిత్యము (Literature), ఆగమములు బోధించుట కయిదుగురు వ్యాఖ్యాతలను, వైద్యునొకనిని, కాయస్థునొకనిని (గణకుడు) నియమించెను.
ఈ పైనుడివిన పదిమందికి నొక్కొక్కరికి రెండుపుట్లు భూమి నొసంగెను. పై వారితోపాటు, దేవాలయమున పదిమంది నర్తకులును, ముఖరీద్వయసంయుక్తులగు నెనమండ్రు మార్దంగికులును, ఒక కాశ్మీర దేశపు గాయకుడును, పదునలుగురు గాయినులును, ‘కరడా‘ వాద్యమునందును, నాట్యమునందును నేర్పరులైనవా రాఱుగురును నియమితులైరి. వీరికి వృత్తు లేర్పాటు చేయబడెను. అంతియే కాక చాతుర్వర్ణ్యసముద్భూతులైనట్టియు, జటాధారు లైనట్టియు, గ్రామసంరక్షణము నభిలషించి బీజచ్ఛేద, శిరచ్ఛేద, కుక్షి భేదాదికర్మలం జేసికొనునట్టియు చోళ దేశాగతులైన వీరభద్రులను పేరంబరగు గ్రామ రక్షకులు పదిమందికిని, గ్రామభటులును భక్తులు నగు వీరముష్టు లిరువదిమందికిని, బంగారము, రాగి, కాసె, మేదరి, కమ్మరి, కుమ్మరి, వడ్రంగము, శిల్పము, మంగలి పనులం జేయువారును, వాస్తు శాస్త్రజ్ఞులునగు గ్రామభటులు పదిమందికిని గూడ వృత్తులొసంగబడెను.
ఇట్లు విశ్వేశ్వర గోళకియందు కేవలము విద్యాప్రదానము మాత్రమే కాక ప్రసూత్యారోగ్యశాల కూడ నేర్పాటు చేయబడెను. ఇది యెంతయు ప్రశంసింపదగినది కదా. కన్నడ దేశమునందలి బెళగామిలోని కోదియమఠ నామాంతరమునం బరగు కేదారేశ్వరాలయము సుప్రసిద్ధ విద్యాస్థానము, ఈ విద్యాస్థానమున వేదవేదాంగములు, కుమార, పాణిని, శాకటాయనుల వ్యాకరణ శాస్త్రములు, న్యాయ, వైశేషిక, మీమాంసా, సాంఖ్యాది దర్శనములు, లకులీశ, పాతంజల్యాది యోగశాస్త్రములు, కావ్యనాటక ధర్మ శాస్త్రేతిహాసాదులు బోధింపబడుచుండెడివి. ఆనాడు వైదిక విద్యా ప్రదానము గావించు మఠములలో వైద్యశాలలు కూడ నుండినట్లు శాసనముల వలన దెలియు చున్నది. పూర్వోక్తమగు కోదియమఠము ‘నానానాథరోగిజనరోగ భైషజ్యస్థానము‘ (దిక్కుమాలిన రోగులకు చికిత్స చేయు వైద్యశాల) యని కూడ పేర్వడసినది. ఇట్టి మఠములు శ్రీశైలమున (1) భిక్షావృత్తి మఠము, (2) అరసమఠము, (3) కలుమఠము, (4) సారంగమఠము, (5) గణమఠము అని యైదుండెడివి. వీనిలో భిక్షావృత్తి మఠము విద్యావ్యాపనము చేయుటయే కాక కవిజనముల నాదరించి కూడ కీర్తి కెక్కినది.
వైష్ణవ మఠములు
వైష్ణవమతోద్ధరణమునకై శ్రీమద్రామానుజాచార్యులకు పూర్వమే నాథముని, పుండరీకాక్షులు, యామునాచార్యులు మొదలగువారు పనిచేయుచుండినను రామానుజాచార్యులు మతరంగమున కవతరించుటతో గాని శ్రీవైష్ణవమునకు బలము కలుగలేదు. ఆచార్యులవా రామతమును సరియైన మార్గమునకు దెచ్చి దక్షిణాపథ రాజన్యులను కొందఱిని వశపఱుచుకొని వారికి వైష్ణవమత మిప్పించిన పిదప నుండి క్రమక్రమముగా నామతము పురికొని తీగెసాగెను. శ్రీరామానుజాచార్యులకు దరువాత వేదాంత దేశికులు, మనవాళమహాముని మొదలగువా రాదుకొని వైష్ణవమత వ్యాపనము గావించి చరితార్థులైరి. అయినను కర్ణాటాధీశుడైన శ్రీకృష్ణదేవరాయల
కాలము నుండి కాని యాంధ్రదేశమున వైష్ణవ మతము బాగుగ విజృంభింపలేదు.కృష్ణదేవరాయల మొదలు కర్ణాటాధీశులైన అచ్యుతదేవరాయలు, సదాశివరాయలు, వేంకటపతిరాయలు, శ్రీరంగదేవరాయలు మొదలగు వారి యాదర ప్రోత్సాహముల వలన నది దక్షిణ దేశమున నుఱుకులు వైచుచు నభివృద్ధి గాంచెను. శైవమతము క్రీస్తుశకము పదనొకండు, పండ్రెండు, పదుమూడు శతాబ్దులం దెట్లు చోళ, చాళుక్య, కాకతీయాది రాజవంశముల యాశ్రయమున విజృంభించెనో యట్లే వైష్ణవ మతమును పదునాఱు పదునేడు శతాబ్దులందు విజయనగరము కర్ణాటాధీశుల కాలమున రాజమతమై జనాదరము నొందెను. కందాళము వారు, తాళ్లపాకము వారు మొదలగు సుప్రసిద్ధ వైష్ణవాచార్యుల కుటుంబములు ప్రముఖత వహించి వైష్ణవ మతోద్ధారమునకై నడుము కట్టి పనిచేసినవి. శ్రీతిరుమల తాతాచార్యుల వారు, తిరుమల శ్రీనివాసాచార్యులవారు, కందాళం అప్పలాచార్యులవారు, కందాళం భావనాచార్యుల వారు, కందాళం దొడ్డయాచార్యుల వారు, తాళ్లపాకం తిరుమలా చార్యులవారు, పరవస్తు ముమ్మడి వరదాచార్యులవారు, కోటికన్యాదానం తాతాచార్యుల వారనబడు ఏటూరి తిరుమల కుమార తాతాచార్యుల వారు, పరాంకుశం వన్ శఠగోపజీయం గారు – ఈ మొదలైన విద్వద్వరేణ్యులు వేదమార్గ ప్రతిష్ఠాపనా చార్యులును, ఉభయవేదాంత ప్రవర్తకులునై విజయనగర కర్ణాటాధీశుల కాలమున ప్రసిద్ధులైరి. గాఢమైన వీరి మతాభిమానము వలనను, కార్యదీక్ష వలననే వైష్ణవ మతము రాజమతమై పెంపు చెందగలిగెను. శ్రీకృష్ణదేవరాయల నాడు విజృంభింప–మొదలిడిన యీ మతము వీరప్రతాప శ్రీరంగదేవరాయల కాలము నాటి కత్యుచ్ఛదశకు వచ్చెను. ఆ కాలమున కర్ణాటాధీశులే కాక వారికి సామంతులు గను సేనాపతులుగను నుండినవారు కూడ నీ మతము నవలంబించి యాదరించిరి. మన యాంధ్రదేశము నందలి జమీందారులెల్లరు శ్రీవైష్ణవ మతమును నవలంబించిన దీకాలముననే. తన్మతాచార్యుల గాఢదీక్షయు, మతాభిమానమును అప్పటి నుండి యిప్పటి వఱకు తెలుగుదేశముపై చెక్కుచెదరక యుండునట్లు తమముద్రల నచ్చొత్తినవి.
శ్రీరామానుజాచార్యులు మేలుకోటలో1 స్థాపించిన యతిరాజ మఠము, మన్నారు కోవెల యందలి వైష్ణవ మఠమైన శెండలంగారమాముని, అహోబిల మఠము, పుష్పగిరి మఠము1 – ఇవి యన్నియు వైష్ణవ మఠములు. ఇవి గాక వ్యాసరాయ మఠము, శృంగేరీ మఠము మొదలగు మాధ్వాద్వైతాది మఠములును కలవు కాని వీనిని గుఱించిన వివరములు శైవ మఠములకు వలె శాసనముల ననుసరించి బాగుగ దెలియవచ్చుట లేదు. కాని యివి యన్నియు నాయా మతములను దేశమున సుస్థిరముగ పాదుకొలుపుటకు మాత్రమేగాక వైదిక విద్యా ప్రదానము గావించి గొప్ప గొప్ప విద్వాంసులను తయారు చేయుటకు గూడ నెక్కువగ దోడ్పడియుండినవి.
పూర్వోక్తములయిన మన ప్రాచీన విద్యాసంస్థలను గుణించియు, విద్యాపద్ధతిని గుణించియు గాఢముగ యోజించినచో పల్లెటూరి జీవనమెంత నిరాడంబరముగ నుండెడివని స్పష్టము కాగలదు. పెద్ద పెద్ద కళాశాల లక్కఱలేదు. కూర్చుండుటకు పెద్ద పెద్ద కుర్చీలు కాని, బల్లలు కాని యక్కఱలేదు. పవిత్రమై, భక్తిభావముల తోడన, త్యాగదీక్షతోడను నిండి నిబిడీకృతమై యుండు దేవాలయములును, మఠములును, విద్యాస్థానములు. చక్కని పంట పైరులతోను, తోటలతోను ప్రకృతికి కంఠాభరణము వలె నుండు అగ్రహారములే గొప్ప విద్యాపీఠములు. అందు నిత్యము విద్యార్ధులకు గురుజన పూజనము; పరమేశ్వరారాధనము; సజ్జన సాంగత్యము, గురువుని శిష్యుడు ఛాయ వలె ననుసరింపవలసినదే; తండ్రి వలె శుశ్రూష చేయవలసినదే; దైవమువలె పూజింపవలసినదే; అచ్చట పారలౌకిక జ్ఞానము నొసంగి గురువు ఆచార్యుడగుచున్నాడు; విద్యార్థిని కన్నకొడుకు వలె నాదరించి తండ్రి యగుచున్నాడు; ఐహిక జీవితము నెట్లు గడపవలెనో తెలిపి దేశికుడగుచున్నాడు; భక్తి ప్రేమములే వారికి గల యనుబంధములు; గురువృద్ధ జనమార్గానుసరణమె వారి రాచబాట; స్వధర్మ నిర్వహణమే వారి నిరంతర కృషి, పడిపోయినది ఎప్పుడో రాజమార్గము. విజ్ఞానజ్యోతి దేశమున వెలిగించి త్రోవ చూపినవారు ఆర్య మహర్షులు. అంతే. నిరాతంకముగ, నిరాడంబరముగ అంతము లేని కాలవాహిని వలె విద్యాతంతువు భంగము రాకుండ సాగిపోవలసినదే. గురువు నుండి శిష్యుడు, శిష్యుని నుండి గురువు. గురువులో శిష్యుడు, శిష్యునిలో గురువు తయారైన కాలమది. భావికాలము యొక్క బీజములు భూతకాలమునందుండెను. భూతకాలపు ప్రతిభావిభూతులు భావికాలమున ఇనుమడించిన కాంతితో తెఱలి తేజరిల్లుచు వచ్చినవి; ఒక్కటే మార్గము; ఒక్కటే చుట్టు; బింబమునకు ప్రతిబింబము; అంతే, మార్పులేదు; క్రొత్త కూర్పు లేదు. యాకాలము వేఱు; ఈ కాలము వేఱు; కాని ఇదికూడ ఆగత కాలపు పరిణామమే కదా !
(ఆంధ్రపత్రిక, అక్షయ ఉగాది సంచిక, 1926)
More Stories
12 నవంబరును జాతీయ దేవాలయ ప్రవేశ ఉత్సవంగా నిర్వహించుకుందాం!
టిప్పు ను మట్టి కరిపించి ఓడించి, మరుగునపడిన హిందూ వీరుడి గాథ: తుకోజీరావు హోల్కర్
వీరాంగన ” నీరా ఆర్య” మొదటి మహిళా గూఢాచారి