దేవమణి సత్యనాథన్
~~~~~~
1872 లో తొలి తెలుగు నవల శ్రీరంగరాజ చరిత్ర వెలువడింది. అప్పటికి సగటు సమాజంలో స్త్రీలు అవిద్య, మూఢనమ్మకాలు, వివక్ష, వంటి సామాజిక దురాగాతాల్ని ఎదురుకుంటూ దుర్బరంగా జీవిస్తున్నారు. సమాజం పట్ల సానుభూతి దయ ప్రేమ కలిగిన సంస్కర్తల ఉద్యమాలు , ఆచరణ , యువతను కొంతవరకు మార్చగలిగింది కానీ సమాజం మాత్రం మారలేదు.
1900 తర్వాత కూడా స్త్రీ జీవితం సమస్యల కుంపటిలోనే ఉంది. అనేకానేక సవాళ్లుగా మారి ఉన్న పరిస్థితుల మధ్య తెలుగులో తొలి నవలా రచన చేసిన మహిళ ‘జయంతి సూరమ్మ’ అని సాహిత్యకారుల అభిప్రాయం. జయంతి సూరమ్మ’, రాసిన ‘సుదక్షిణా చరిత్రము’ నవల1906 లో రచించబడింది. ఇది చారిత్రక నవల.కాగా,
1908లో దేవమణి సత్యనాథన్ అనే మహిళా సాంఘిక నవల రచించింది.. ఇది తెలుగు సాహితీ ప్రపంచంలో ఒక గొప్ప పరిణామనికి పునాదులు వేసింది. ఈ నవల 1908 పూర్వమే రచించబడిందని కొందరు విమర్శకులు పేర్కొంటున్నారు.
జయంతి సూరమ్మ కోస్తా ప్రాంతానికి చెందినది.
దేవమణి సత్యనాథన్ రాయలసీమ ప్రాంతానికి చెందినది… ఈ క్రమంలో రాయలసీమ తొలి నవలా రచయిత్రిగా మాత్రం దేవమణి సత్యనాథన్ పేరును నిస్సందేహంగా చెప్పుకోవచ్చు.
▪️వివరాలు :
అనంతపురం జిల్లా ధర్మవరం వీరి స్వగ్రామం. ఈ ప్రకారం తొలి తెలుగు మహిళా నవలా రచయిత్రి రాయలసీమ ప్రాంతం నుండి వచ్చింది..
హనుమమ్మ డేవిడ్ దంపతులు ఈమె తల్లిదండ్రులు. వీరి సొంత ఊరు ధర్మవరం అయినప్పటికీ బతుకుదెరువు రీత్యా మద్రాసులో జీవించారు. ఈ విధంగా దేవమణి మద్రాసులో పెరిగి పెద్దదయ్యింది.సత్యనాథన్ ఆమె జీవిత సహచరుడు అయ్యివుంటాడు అని విమర్శకులు అభిప్రాయపడుతున్నారు.
▪️తొలి నవల ~ లలిత
దేవమణి సత్యనాథన్ సామాజిక పరిస్థితుల నేపథ్యంలో రచించిన తొలి తెలుగు మహిళ నవల ~ ” లలిత ”
ఇది పూర్తిగా సాంఘిక నవల.సంఘ సంస్కరణ దృష్టితో కొనసాగింది.
తల్లిదండ్రులకు అంకితం ఇవ్వబడింది.
పసితనమ్మున నుండి పరమ విద్యలనెల్ల ఘటియింప జేసిన ఘనులు గారె సమయోచితమ్మున సన్మార్గ వృత్తిని
నెలమిమై గఱపిన హితులు గారె
దివ్యాత్మునేసుని భవ్య చారిత్రముల్
కరము బోధించిన గురులు గారె
అన్ని వేళల గడు నాదరమ్మున నన్ను
బెంచిన హితకర ప్రియులు గారె
శాంతి దంపతులగుచు స్వచ్చంద పదము నందితిరిగారె మీరు హన్నమ్మ డేవి
డనెడు తల్లిదండ్రుల సమవిఖ్యాతయశులు
గాన నర్పింతు నిక్కావ్య కన్య గొనుడు.
అంటూ సీస పద్యంతో తల్లిదండ్రులను కీర్తించింది.
ఇది ఆమె లోని పాండిత్యానికి మచ్చు తునక.
కథాంశం :
కథ మొత్తం ఆనాటి సామాజిక పరిస్థితుల నేపథ్యంలో కొనసాగుతూనే… భవిష్యత్ తరాల్లో మహిళల అభివృద్ధిని ఆశిస్తూ కొనసాగింది.
విజయనగరంలో కథ ప్రారంభం అవుతుంది.బళ్లారి రాజమండ్రి ప్రాంతాల్లో నడుస్తుంది.బళ్లారిలో ముగుస్తుంది.
నవలలో కథానాయిక లలిత. పదనాలుగు సంవత్సరాల బాలిక. ఆనాటి సమాజంలో 14 సంవత్సరాలు అంటే పెళ్లీడు వచ్చినట్టే. కానీ లలితకు ఇంకా పెళ్లి కాలేదు. చదువుకుంటుంది. తల్లిదండ్రులు, అక్క, ఇద్దరు తమ్ముళ్ళతో, అందమైన కుటుంబం. తండ్రి స్వామినాథుడు. పోలీసుగా పనిచేస్తుంటాడు. కానీ తాగుబోతుగా ఉంటాడు. ఇతడి విపరీత ధోరణుల కారణంగా జనాల్లో శత్రువులు పగలు పెరుగుతాయి. ఇటువంటి పరిస్థితుల్లో అదును చూసి లలితను అపహరణకు గురవుతుంది. అదృష్టవశాత్తు హరిదాసుడు అనే యువకుడు లలితను రక్షిస్తాడు.
లలిత, హరిదాసుడు , వరసకు బావా మరదళ్ళు అవుతారు. ఆ విధంగా బంధుత్వం బలపడుతుంది. ఆదర్శమైన యువతకు హరిదాసుడు పాత్ర పెద్ద ఉదాహరణ.
దురదృష్టం కొద్ది లలిత అక్క, తల్లీ, మరణిస్తారు. స్వామినాథుడి తాగుడు ఎక్కువ అవుతుంది.పోలీసు ఉద్యోగం కోల్పోయి ఇల్లు వదిలి ఎక్కడికో వెళ్ళిపోతాడు. ఈ పరిస్థితిలో తమ్ముళ్లు ఇద్దరూ కూడా జీవితం భారమై ఊరు వదులుతారు.
ఒంటరిగా మారిపోయిన లలితకు పోకిరిగాళ్ళ వేధింపులు ఎక్కువవుతాయి. ఈ క్రమంలో ఒక యువకుడు ప్రేమ పెళ్లి పేరుతో బెదిరింపులకు వేధింపులకు పాల్పడతాడు.ఈ వేధింపులు తట్టుకోలేక బావ హరిదాసుడు వుండే బళ్లారి వెళ్ళిపోయి, అతడి సహాయంతో ఒంటరిగానే కొత్త జీవితం ప్రారంభిస్తుంది.అధ్యాపకురాలి వృత్తిలో ప్రవేశిస్తుంది.
ఒక ఒంటరి మహిళ ఉన్నత విద్యలు చదువుకోవడం, తన శక్తిని తాను నిరూపించుకుంటూ ఉద్యోగం సంపాదించుకోవడం, ఆనాడు సమాజంలో నెలకొని ఉన్న అవిద్య అంధాకారాన్ని పారద్రోలే ఉద్దేశమే. అట్లాగే పురుషాధిక్య ప్రపంచంలో హరిదాసులు వంటి ఉన్నత మనస్తత్వం ఉన్న యువత , ప్రతి స్త్రీ ని ముందుకు నడిపించాలనే ఆకాంక్ష కూడా రచయిత్రి లో కనబడింది.
జీవితంలో స్థిరపడ్డ తర్వాత తండ్రిని చేరదీస్తుంది.
కూతురు సాంగత్యంలో తండ్రి స్వామినాథుడు కుదుటపడతాడు. వారసుడు అంటే మగ పిల్లవాడు మాత్రమే అనే అపోహ ఉన్న సమాజంలో, ఆడపిల్లగా ఉన్న లలిత తండ్రిని దగ్గరతీసి మామూలు మనిషిని చేయాలనుకోవడంలో
మహిళల గుండె ధైర్యం…శక్తిసామర్థ్యత… మగవాళ్లకు ఎందుకు తీసుకుపోదు అని చెప్పే ప్రయత్నం బలంగా కనిపించింది.
మద్యపానం అనేది జీవితాలను ఎంత అతలాకుతలం చేస్తుందో, కుటుంబాలు ఏ విధంగా విచ్ఛిన్నమవుతాయో, స్వామినాథుడు పాత్ర ద్వారా చూపెట్టే ప్రయత్నం చేసింది రచయిత్రి. చూపెట్టే అనేకంటే హెచ్చరించే ప్రయత్నం చేసింది అనవచ్చు.
లలిత హరిదాసును పెళ్లి చేసుకోవాలి అనుకుంటుంది. కానీ తండ్రి పెళ్లి విషయంలో తన పెత్తనాన్ని నెగ్గించుకునే ప్రయత్నం చేస్తాడు. కానీ లలిత తనకిష్టమైన వాడినే పెళ్లి చేసుకుంటుంది. తండ్రి కూతురు మీద కేసు వేస్తాడు. చదువుకున్న స్త్రీలు, చదువుకుని ఉద్యోగం చేసుకుంటున్న స్త్రీలు,
ఇటువంటి స్త్రీల మీద పురుషాధిక్య ప్రపంచం చూపిస్తున్న జులుం సరైనది కాదు అని చెప్పడానికి తండ్రి స్వామినాథుడు పాత్ర ద్వారా
రచయిత్రి ప్రయత్నం చేసింది.
స్త్రీలు, వివాహ వ్యవస్థ, ఈ విషయంలో పురుషాధిక్యతను నిలదీసే ప్రయ ప్రయత్నాన్ని రచయిత్రి పోరాటాలు ఉద్యమాలు ద్వారా కాకుండా సున్నితంగా కొనసాగించింది.
▪️మరో నవల ~ శారదావిజయం
ఈ నవల 1930 వ దశకంలో రచించబడింది.
1935 లో ద్వితీయ ముద్రణ జరిగింది. నవరసభరితమగు చారిత్రక నవలగా ప్రకటించబడింది.
1934 జులై ఆంధ్రభూమి పత్రికలో చిరుమామిళ్ల శివరామకృష్ణ ప్రసాద్ బహదూర్ ఈ నవలపై రాసిన అభిప్రాయం ఒకటి ప్రచురితమై ఉన్నది. ఈ నవలకు వెంకటగిరి రాజా వారు ఎస్.కె కృష్ణయాచంద్ర బహదూర్ తొలి పలుకులు వ్రాశారు. వారి కొన్ని ఆశీర్వచన పలుకుల్ని ఒకసారి గమనిస్తే…
” ఇందలి శైలి సుకుమారము. పాకము ద్రాక్షాపాకము, భావము గాంభీర్యము. వర్ణనలు రసవంతములు, వ్రాసినదొక సోదరియని సాదరముగా జదువరులు గ్రహించి గుణగ్రహణ పారీణులై యానందింతురు గాతమని నమ్ముచున్నాను. ఇట్టివే యింకను వనేక సద్గ్రంథములను రచించి యాంద్రభాషాయోషనుకై కవయిత్రిని నాశీర్వదించుచున్నాడను.
– S. K కృష్ణచేంద్ర.”
ఈ నవల మొత్తం 170 పేజీలతో ఉన్నది. 20 శీర్షికలు ఉన్నాయి. సాధారణంగా నవలకు శీర్షికలు ఉండవు. కానీ కథను , కథలోని ఘట్టాలను అనుసరిస్తూ శీర్షికలుగా నవలలను విభజించి రచయిత్రి కొత్త ప్రయోగం చేసింది. చారిత్రక కథాంశానికి సాంఘిక సంఘటనలను జోడిస్తూ
రాసిన ఈ నవల రచయిత్రి చారిత్రక పరిజ్ఞానానికి మచ్చుతునక అని చెప్పవచ్చు.
బాటసారులు, విజయనగరరాజ్యము, బహుమనీ రాజ్యము, ముద్దగల్లు బాలిక పాఠశాల, ఫిరోజ్ షా గారి యనుకంపము, శారద – జానకి, ఆకస్మికాపాయము, సింహాద్రి ,వెన్నెలరాత్రి, ప్రయత్ననము, విజయనగరము పౌర మహాసభ, చేతి కందిన కబళము నోటికందదయ్యే , రణరంగము, ఖాజీ చెఱ, కపట లేఖ, శ్యామసుందరుడి సాహసము, సంపూర్ణ విజయము, విజయోత్సవము, బట్టబయలు, వివాహము,అనేవి ఈ చారిత్రక నవలలో ఉన్న శీర్షికలు
1406 నుండి 1422 మధ్యకాలం లో ఈ కథ నడుస్తుంది. బహుమని సుల్తాను ఫిరోజ్ షాను హిందూ మతద్వేషిగా చూపెట్టి, మొదటి దేవరాయలు అతడిని అణిచివేయడం హిందూమత ఉద్దారణగా నవల కొనసాగింది . 1422 లో ఫిరోజ్ షా మరణంతో ఈ నవల ముగుస్తుంది. ఫిరోజ్ షా మరణం తర్వాత సుల్తాన్ బిరుదుతో రాజ్య పాలనకు వచ్చిన అహమ్మదు షాను శ్రీదేవరాయలు అణిచివేస్తాడు అని రచయిత్రి పేర్కొన్నది. వీరు మొదటి దేవరాయలు. విజయనగర చక్రవర్తి. సంగమ వంశస్తుడు. వీరి పరిపాలనా కాలం 1406-1422 వరకు. మరీ అహమ్మదుషాను శ్రీదేవరాయలు ఏవిధంగా అణిచివేస్తాడు? 1424-1446 వరకు పాలించిన రెండవ దేవ రాయలు అనుకుందామా?
కథ 1406 నుండి 1422 మధ్య కాలంలో నడుస్తుంది. చరిత్ర పరంగా ఇది కొంత గందరగోళంగా ఉన్నది.
కాపోతే ~ ఇది సాంఘిక అంశంతో ముడిపెడుతూ కొనసాగిన నవల కాబట్టి, నాటక లక్షణాల ప్రకారం ప్రఖ్యాత కథలను కల్పిత పాత్రలకు జోడించి మిశ్రమ రచనగా కొనసాగించడం జరిగింది అనుకుంటే మాత్రం ఎటువంటి గందరగోళానికి తావులేదు.
ఇందులో ఉన్న కల్పిత సాంఘిక పాత్రలు
శారదా, జానకి, సింహాద్రి.ముద్దగల్లు దుర్గంలో బాలికా పాఠశాల విద్యార్థి శారద. బహుమని యువరాజు అహమ్మద్షా ఆప్రాంతం పర్యటనకు వచ్చి పాఠశాలను సందర్శించి శారదను చూసి మనసు పడుతాడు.
స్వాభిమానం ఉన్న శారద అహమ్మద్షాను తిరస్కరిస్తుంది. ఎదురిస్తుంది. ఈ క్రమంలో దేశభక్తి నిరూపించబడుతుంది. బహుమని సుల్తానుకు శారదను గెలవడం ఒక ఛాలెంజ్ అవుతుంది. మరోవైపు విజయనగరంపై ఆధిపత్యం కోసం ఆరాటం పెరుగుతుంది. ఇటువంటి పరిస్థితతుల్లో శారదా,ఆమె స్నేహితురాలు జానకి, ఆమె ప్రేమికుడు సింహాద్రి మారు వేషాలు ధరించి బహుమని సైన్యంలో సైన్యంలో చేరి రాజకీయ ఎత్తుగడలతో సాధించిన విజయమే ‘శారదావిజయం’ నవల.
రచయిత్రి విజయనగర రాజులకు సానుకూలమైన ఇతివృత్తాన్ని ఎంచుకోవడం , వెంకటగిరి రాజావారు ఈ పుస్తకానికి తొలి పలుకులు రాయడం, ఈ రెండింటి మధ్య సంబంధాన్ని ఒకసారి అవలోకిస్తే….
వెంకటగిరి సంస్థానాన్ని వెలుగోటి వంశానికి చెందిన వెలుగోటి రాయుడప్ప నాయని 1600లో స్థాపించాడు.రాయుడప్ప తర్వాతి వాడు యాచమనాయుడు. ఇతడు 1614లో విజయనగర సామ్రాజ్యానికి చెందిన అరవీటి వంశస్థుడు రెండవ తిరుమల దేవరాయలు వారసుడు శ్రీరంగరాయల తరుపున పోరాటం చేసాడు. ఈ విధంగా వెంకటగిరి రాజులకు విజయనగర సామ్రాజ్యాధిపతులకు రాజకీయ సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి. ఈ పరిస్థితుల నేపథ్యంలోనే ఈ ఇతివృత్తాన్ని తీసుకున్నదా అని ఆలోచిస్తే…..
” శారదా విజయం ” కథ ప్రకారం విజయనగర సామ్రాజ్యం సంగమ వంశంతో ముడి పడి ఉన్నది. ఆ తర్వాత సాళువ తుళువ వంశాల తరువాత అరవీటి వంశం పాలనకు వచ్చింది. ఈ ప్రకారం రచయిత్రి శారద విజయం కథని 17వ శతాబ్దంలో నడిపించి ఉండవచ్చు. కానీ వెంకటగిరి రాజులు హిందూ మతాభిమానులు. కాబట్టి హిందూ మత ఉద్దారణ నేపథ్యంలో , బహుమని సుల్తానులు పాలనా విధానాన్ని ఆధారం చేసుకుని , వారి కోరిక మేరకు బహుశా ఈ చారిత్రక నవల రచించి ఉండవచ్చును. ఇది నిర్ధారణ కాదు ఒక ప్రాథమిక ఆలోచన మాత్రమే.
కాకతీయుల పతనం తరువాత ముస్లింల దండయాత్రపై తిరుగుబాటు చేసి స్వతంత్ర రాజ్యాలు ఏర్పాటుచేసిన హిందూ రాజులకు కొనసాగింపుగా కూడా ఈ కథను తీసుకోవచ్చు.

వ్యాసకర్త : తంగెళ్ళశ్రీదేవిరెడ్డి
~~~~~~~~~
ఆధారం :
1 ) నారీ సారించిన నవల
ఆచార్య కాత్యాయని విద్మహే
2.పొదిలి నాగరాజు
పరిశోధక విద్యార్థి
యోగి వేమన విశ్వవిద్యాలయం, కడప
3) శారద విజయం
దేవమణి సత్యనాథన్
More Stories
ఆయుర్వేద వ్యాప్తికర్త, వైద్యరత్న పండిత దీవి గోపాలాచార్యులు
Balaji Peshwa: బాలాజీ పీష్వా శివాజీ స్వరాజ్య స్వప్నసాధకుడు
బహుభాషా చక్రవర్తి డాక్టర్ పుట్టపర్తి నారాయణాచార్యులు జీవిత చరిత్ర