రచన – మోదుమూడి సుధాకర్
ఆ మహానుభావుడు గతించి ఈ ఏడాదితో నూట ఎనిమిది సంవత్సరాలు పూర్తి అవుతున్నాయి. ఆయన పరమపదించిన 1917 వ సంవత్సరం నుండీ ఈనాటి వరకూ ఆయన శిష్యవర్గం, ప్రతి ఏడూ క్రమం తప్పక,వారి వర్ధంత్యుత్సవాలు జరుపుతూనే ఉన్నారు. నిజానికి త్యాగరాజస్వామికే దక్కని అదృష్టాన్ని స్వంతం చేసుకున్న ఆయన ఎవరు? ఆయన చేసిన ఘనకార్యమేమిటి?
ఆయనే కృష్ణాజిల్లా పెదకళ్ళేపల్లికి చెందిన సంగీత సద్గురువు #సుసర్ల_దక్షిణామూర్తి_శాస్త్రి గారు…సాక్షాత్తూ త్యాగయ్య గారి ప్రశిష్యులు.
ఆయన తాతగారైన రామమూర్తిశాస్త్రిగారు, గొప్ప సంస్కృత,వేద పండితులు. కడు పేదరికంతో కుటుంబ భారం మోయలేని స్థితిలో ఉన్న ఆయన, ఆ ప్రాంతపు రాజు గారిని ఆశ్రయించగా,వీరి ప్రతిభకు ముగ్ధుడై, రాజు గారు అయిదు గ్రామాలను బహుమానంగా ఇచ్చారు. వాటిలో ఒకటి పెదకళ్ళేపల్లి అగ్రహారం.1860 వ సంవత్సరం,’దక్షిణ కాశీ’ గా ప్రసిద్ధమైన పెదకళ్ళేపల్లిలో జన్మించారు దక్షిణామూర్తి శాస్త్రిగారు. సంగీతం ఆయనకు ఆరోప్రాణం. చిన్నతనంలో ఒకసారి శాస్త్రిగారు బందరులో ఒక తమిళ అయ్యరు గారి కచేరీ వినటం జరిగింది. అయ్యరు గారి పాటలో సంగీతపరమైన దోషాలు కనబడ్డాయి శాస్త్రిగారికి. అయితే, అందరూ ‘శభాషని’ మెచ్చుకుంటుంటే,ఆ దోషాలను విశ్లేషించలేకపోయారు శాస్త్రిగారు. ఆ క్షణానే ఒక ఎలాగైనా సంగీత శాస్త్రం అభ్యసించాలని నిశ్చయానికొచ్చారు.
అయితే..ఆనాడు తెలుగునాట,సంప్రదాయ సంగీతం చెప్పే గురువులు లేరు. మొక్కవోని పట్టుదలతో, కాలినడకన, వందల మైళ్ళు ప్రయాణం చేసి,తంజావూరు చేరుకున్నారు. అక్కడ త్యాగయ్య గారి మేనల్లుడు,ప్రియశిష్యుడు ఆకుమడుల (మానంపూచావడి) వెంకటసుబ్బయ్య గారి గురుకులంలో ప్రవేశించారు. అనేక విధాల పరీక్షించిన పిమ్మట,శాస్త్రి గారికి సంగీత శిక్షణను ప్రారంభించారు సుబ్బయ్యగారు.తెలుగునాట నుండి విద్యార్థియై వచ్చిన అంధులైన ఫ్లూటు శరభ శాస్త్రి గారితో కలిపి రోజూ పాఠం జరిగేది.
కొంతకాలం గడిచింది…సుబ్బయ్యగారు వయోవృద్ధులైనారు. ఒకనాడు వీరిద్దరినీ పిలిచి,’నాయనా! మీ ఊరిని,కన్న వాళ్ళనూ వదలి, ఇంత దూరం సంగీతం కోసం వచ్చిన మిమ్మల్ని చూస్తే నాకెంతో ఆనందం కలుగుతుంది. మీ మీద నాకు అపారమైన నమ్మకముంది. నాకు ఇక ఏ క్షణానైనా భగవంతుడి నుండి పిలుపురావచ్చు. నాకు మీరు ఇరువురూ ఒక ప్రమాణం చేయాలి. నాకు ఎవరూ లేరు, నా తదనంతరం, మీ గురుపత్ని బాధ్యత మీరు తీసుకోవాలి, మీకు నా సంగీత గ్రంథం అప్పగిస్తాను, శ్రద్ధాభక్తులతో నేను చెప్పినట్లు చేయండి. శాస్త్రీ! నీవు ఏకసంథాగ్రాహివి కనుక, పాఠాన్ని వ్రాసుకుంటూ నోటితో వల్లించు. నీకు కంఠస్థమౌతుంది.మరొకసారి, వ్రాసిన పాఠం ఇరువురూ కలసి పాడండి.అంధుడు,ద్విసంథాగ్రాహి అయిన శరభశాస్త్రికి అప్పుడది పట్టుపడుతుంది. ఈ విధంగా ప్రతిరోజూ చేయండి. నా ఆశీస్సులు సదా మీకుంటాయి.’ అలాగే ప్రమాణంచేశారు శిష్యులిద్దరూ. సుబ్బయ్యగారు స్వర్గారోహణం చేశారు. దక్షిణామూర్తిగారు, శరభశాస్త్రిగారు,తమ గురుపత్నిని కన్నతల్లికన్న మిన్నగా చూసుకుంటూ… గురుకటాక్షంతో ప్రాప్తించిన గ్రంథాన్ని త్రికరణశుద్ధిగా అధ్యయనం చేశారు. సంగీత విద్యాపరిపూర్ణులయ్యారు.
కొంతకాలానికి గురుపత్ని కాలంచేశారు. ఇక,దక్షిణామూర్తి,శరభశాస్త్రులిరువురూ కావేరీతీరాన తాము నేర్చిన ‘త్యాగరాజ సంప్రదాయ సంగీతం’తో స్వస్థలమైన కృష్ణాతీరానికి తిరిగి వచ్చారు.శరభశాస్త్రిగారు వేణుగాన ప్రదర్శనలు చేసి, గొప్ప విద్వాంసునిగా కీర్తి సంపాదించారు.
దక్షిణామూర్తిశాస్త్రిగారు తెలుగునాట సత్సంప్రదాయ సంగీత ప్రచార రథసారథి అయ్యారు.అగ్రహారీకులైన ఆయన,కులమత వివక్ష చూపక, భోజనం పెట్టి,విద్యార్థులెందరికో గురుకుల పద్ధతిలో విద్యాదానం చేశారు. వాగ్గేయకారులు,నైష్ఠికులైన ఆయన ఏనాడూ తన విద్యను వేదికపై ప్రదర్శించలేదు! ధనం ఆశించలేదు!!
ఈనాడు తెలుగునాట శాస్త్రీయ సంగీతం పరిఢవిల్లటానికి దక్షిణామూర్తి శాస్త్రులవారే ప్రధాన కారకులు. ‘గాయకసార్వభౌమ’ పారుపల్లిరామకృష్ణయ్య పంతులుగారు,వారి శిష్యులలో ముఖ్యులు.గురువుగారి మరణానంతరం,వారి అడుగుజాడలలో నడచి,బెజవాడ కేంద్రంగా గురుకులం స్థాపించి, బాలమురళీకృష్ణ, అన్నవరపు రామస్వామి,ఎన్.సి.హెచ్.కృష్ణమాచార్యులు గార్ల వంటి విద్వాంసులను లోకానికందించారాయన. పంతులుగారు,త్యాగరాజ ఆరాధనోత్సవాలను, తమ గురువుగారితో కలసి నిర్వహించేవారు.1917 లో గురువుగారు అస్తమించడంతో,సుసర్ల వారి వర్ధంత్యుత్సవాలను కూడా,త్యాగరాజ ఉత్సవాలతో జతచేసి,నిర్వహించేవారు.అదే ఉత్సవాల సమయంలో పంతులుగారు 1951 లో అనూహ్యంగా మరణించడంతో,వారి శిష్యులు,ప్రధానంగా అన్నవరపువారు ఆ ఉత్సవాల నిర్వహణ భారాన్ని తన భుజస్కందాలపై వేసుకొని,నేటివరకూ నిరాటంకంగా ‘సద్గురువుల వర్ధంత్యుత్సవాల’ పేరిట జరుపుతున్నారు.1941 నుండీ ఈ ఉత్సవాలకు సజీవసాక్షిగా నిలచి….ఈయేడు, సుసర్లవారి 108వ, మరియు పారుపల్లివారి 74వ వర్ధంత్యుత్సవాలు బెజవాడలో అన్నవరపు రామస్వామి గురువుగారు నిర్వహిస్తున్నారు.
మరి…ఆ గురుపరంపరతో 84 సంవత్సరాల అనుబంధం వారిది!!
ఇంతకాలంగా నిరాటంకంగా సాగుతున్న ఈ సద్గురు ఆరాధనలో 50 సంవత్సరాలుగా పాల్గొనటం,పనిచేయటం,నిజంగా నా పూర్వజన్మ సుకృతమే…
More Stories
నీ గురించి నీకు తెలిస్తే నువ్వు జ్ఞానివే…భగవాన్ శ్రీరమణుల పుణ్యతిథి (ఏప్రియల్ 14)
రాంజీ గోండు (పుణ్యతిథి, ఏప్రిల్ 9)
యల్లాప్రగడ సుబ్బారావు (జన్మతిథి, జనవరి 12 )