-రామకృష్ణ వెల్లంకి
ఈ సంవత్సరం మనము మరాఠా రాణి అహల్యా బాయి హోల్కర్ యొక్క 300 వ జయంతిని జరుపుకుంటున్నాము. ఆమె ఉన్నత ఆధ్యాత్మిక దృష్టి గల గోప్ప పాలకురాలు మరియు దార్శనికురాలు. మహిళా సాధికారత గురించి మాట్లాడేటప్పుడు, మనడైన చరిత్ర లోని వ్యక్తులను, నేడు మనం చూస్తున్న భారతదేశాన్ని నిర్మించడానికి దోహదపడిన ధైర్యవంతులైన కుమార్తెలను తరచుగా విస్మరిస్తాము.
1725 లో ప్రస్తుత మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ జిల్లాలో ఒక గొర్రెల కాపరి (ధంగర్ /గడారియా) కుటుంబంలో జన్మించిన అహల్యా బాయి, ఖండే రావు హోల్కర్ భార్యగానే కాకుండా, భారతదేశ ఆధ్యాత్మిక సమగ్రతను కాపాడటానికి మరియు ప్రోత్సహించడానికి సహాయపడిన పరిపాలనా చాతుర్యం, రాజకీయ నిష్పాక్షికతను ప్రదర్శించిన నాయకురాలిగా గుర్తింపు పొందిన ధీర వనిత. పితృస్వామ్య సంకెళ్లను బద్దలుకొట్టిన ఆమె, భర్త మరణానంతరం చక్రవర్తిగా బాధ్యత చేపట్టారు. ఆమె అసాధారణ నాయకత్వ నైపుణ్యాలు ఆమె పాలించిన 30 సంవత్సరాల పాలన ద్వారా అవగతమౌతాయి. ఆమె రాజ్యంలో శాంతి మరియు ఆర్థిక స్థిరత్వం స్పష్టంగా కనిపిస్తాయి. ఆమె రాష్ట్ర ఆదాయాన్ని, పాలక కుటుంబం యొక్క వ్యక్తిగత వినియోగం నుండి వేరు చేసింది. ఆమె వ్యక్తిగత ఖర్చులు వారసత్వంగా వచ్చిన సంపద మరియు ఆమె వద్ద ఉన్న భూమి నుండి భరించబడ్డాయి.
ఒక మహిళగా, అందులోనూ ఒక వితంతువుగా, ఆనాటి సామాజిక మరియు సాంస్కృతిక నేపథ్యాన్ని బట్టి, కొన్ని పరిపాలనా మరియు రాజకీయ పనులకు ఆమెను అనర్హురాలిగా భావించిందనే వాస్తవం అహల్యా బాయికి తెలియదు.
అహల్యా బాయికి హిందూ మతంపై ఉన్నఅచంచలమైన విశ్వాసం కారణంగా, ఆమె క్రమం తప్పకుండా పురాణ పారాయణాలు మరియు యజ్ఞాలకు హాజరయ్యేది, ఆధ్యాత్మిక విశ్వాసాలు తన సిద్ధాంతాలపై దృఢంగా నిలబడటానికి సహాయపడుతుందని నమ్మింది. శివునికి నివాళిగా అహల్యా బాయి దేశవ్యాప్తంగా జ్యోతిర్లింగాలను పునరుజ్జీవింపజేశారు. సోమనాథ్, వారణాసి, త్రయంబక్, గయ, పుష్కర్, బృందావన్, నాథ్ద్వారా, హరిద్వార్, బద్రీనాథ్, కేదార్నాథ్ మరియు అనేక ఇతర పవిత్ర ప్రదేశాలలో పునరుద్ధరణలు ఆమె పాలనలో జరిగాయి. ముస్లిం ముష్కరుల దాడుల నుంచి రక్షణ పొందేందుకు ఆలయాల కింద ఉన్న రహస్య క్షేత్రాల్లో విగ్రహాలను ప్రతిష్టించి, అదనపు భద్రత కల్పించాలనే ఆలోచన రావడం ఆమె హిందూ ధర్మం పట్ల చూపిన దూరదృష్టికి తార్కాణం. ఈ దేవాలయాలను పునరుద్ధరించడానికి అహల్యా బాయి చేసిన అవిశ్రాంత ప్రయత్నాలు, ఒకవైపు మొఘల్ నిరంకుశత్వానికి వ్యతిరేకంగా ధిక్కార చర్యగా, మరోవైపు, నాటి వారి సామాజిక మత గుర్తింపుతో సంబంధం లేకుండా తన పౌరులను నాగరిక విలువల చట్రంలో బంధించాయి.
కూల్చివేసిన ఆలయ పునర్నిర్మాణంలో ఆహాలయాబై హోల్కర్ పాత్ర
- గంగోత్రి నుండి రామేశ్వరం వరకు, మరియు ద్వారక నుండి గయ వరకు, మొఘల్ పాలనలో ధ్వంసమైన దేవాలయాలను పునర్నిర్మించడానికి ఆమె డబ్బు ఖర్చు చేసింది.
- ఇందులో వారణాసిలోని ప్రస్తుత కాశీ విశ్వనాథ దేవాలయం చాలా ముఖ్యమైనది.
- జ్ఞానవాపి మసీదును నిర్మించడానికి మొఘల్ పాలకుడు ఔరంగజేబుచే కాశీ విశ్వనాథ ఆలయం ధ్వంసం చేయబడింది, ఈ ఆలయాన్ని ధ్వంసం చేసిన 111 సంవత్సరాల తర్వాత 1780 సంవత్సరంలో అహల్యాబాయి ద్వారా ప్రస్తుత రూపంలో పునరుద్ధరించబడింది.
- శతాబ్దాలుగా అనేక మంది దురాక్రమణదారులచే విధ్వంసానికి సాక్ష్యంగా ఉన్న సోమనాథ్ ఆలయం, 1783లో పునరుద్ధరించబడింది.
- అప్పట్లో నిజాం ఆధీనంలో ఉన్న శ్రీశైలాన్ని ఆమె సందర్శించారు. ఆలయం ధ్వంసమై శిథిలావస్థలో ఉండేది. ఆమె ఆలయాన్ని పునర్నిర్మించింది మరియు పుష్కరిణిని నిర్మించింది. సాధ్యమైన చోట, అహల్యాబాయి స్థానిక సంప్రదాయాన్ని గౌరవించి ప్రాంతీయ శైలి మరియు ఆచారం ప్రకారం ఆలయాన్ని నిర్మించింది.
- కేదార్‌నాథ్, శ్రీశైలం, ఓంకారేశ్వర్ మరియు ఉజ్జయినిలలో దేవాలయాలు మరియు విశ్రాంతి స్థలాలను, జ్యోతిర్లింగాలకు ఆతిథ్యం ఇచ్చే ఇతర పవిత్ర స్థలాలలో సౌకర్యాలను మెరుగుపరచడానికి దోహదపడింది, ర్రని ఆహాలయాబై హోల్కర్.
ఈ రోజు మనం ధరించే అందమైన మహేశ్వరి చీరలు కూడా అహల్యాబాయి రాణి వారసత్వంలో భాగమే. ఆమె సంప్రదాయ నేతను ప్రోత్సహించడమే కాకుండా, మహిళలకు నైపుణ్యం కల్పించడానికి మార్గం సుగమం చేసింది, తద్వారా వారికి సాధికారత కల్పించింది. ఆమె ప్రోత్సాహంతో మహేశ్వరి చీరల తయారీ ఊపందుకుని ప్రజాదరణ పొందింది. నేటికీ వాటి ఉత్పత్తి మహారాష్ట్ర యొక్క సాంప్రదాయ హస్తకళగా సజీవంగా ఉంది. అహల్యా బాయి ఇండోర్ నగరాన్ని అభివృద్ధి చేయడానికి, అడవులను మరియు జంతువులను సంరక్షించడానికి కూడా అనేక ప్రయత్నాలు చేసింది.
నిజమైన రామరాజ్యాన్ని ఏ పాలకుడైనా సాధించగలిగాడూ అంటే అది అహల్యాబాయి పాలనలోనే. రైతులు వర్ధిల్లారు, ధార్మిక విశ్వాసాలు పునరుద్ధరించబడ్డాయి, సమ్మిళితత్వానికి సముచిత స్థానం లభించింది. భిల్, గోండు కులాలను ప్రధాన స్రవంతిలోకి తీసుకురావడంలో ఆమె చేసిన కృషి గురించి పెద్దగా చర్చ జరగలేదు కానీ అది ఆమె సాధించిన ఒక ముఖ్యమైన విజయంగా మిగిలిపోయింది. ఆమె తన సమకాలీనుల నుండి మాత్రమే కాకుండా తరువాతి చరిత్రకారులు మరియు మేధావులైన జాదునాథ్ సర్కార్, అనీబిసెంట్ మరియు జాన్ కీ వంటి వారి నుండి కూడా గౌరవాన్ని పొందింది. అహల్యా బాయి హోల్కర్ కు ప్రాంతీయంగా ఉన్నంత గౌరవం, ఆదరణ జాతీయ స్థాయిలో లేకపోవడం విడ్డూరం. అహల్యాబాయి 1795లో తన 70వ ఏట మరణించింది.
More Stories
యల్లాప్రగడ సుబ్బారావు (జన్మతిథి, జనవరి 12 )
ఆయుర్వేద వ్యాప్తికర్త, వైద్యరత్న పండిత దీవి గోపాలాచార్యులు
Balaji Peshwa: బాలాజీ పీష్వా శివాజీ స్వరాజ్య స్వప్నసాధకుడు