శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య, కడప జిల్లాలోని తాళ్ల్లఫాక గ్రామంలో మే 9, 1408 లో జన్మించాడు. పుట్టినప్పటినుండి, “తిరుమలప్పప్రసాదం” అని చెప్పందే ఉగ్గుకూడా త్రాగేవాడు కాదని ప్రతీతి. జోలపాటలలో వెంకటేశ్వరస్వామిపై పాడుతేనే నిదురించెవాడట. చిన్ననాటినుండి ఆడిన మాటలెల్ల అమృత కావ్యంగా , పాడినపాటలెల్ల పరమగానంగా అన్నమయ్య కవితలు అల్లేవాడు. అన్నమయ్యకు 16వ ఏటనే తిరుమల వెంకటేశ్వర స్వామి ప్రత్యక్షమైనట్లు చెప్తారు. స్వామి ఆదేశంతో ఏన్నోకీర్తనలు రచించాడు. అన్నమయ్య సనాతన వేదాలలోని జ్ఞానాన్ని సంకీర్తనల రూపంలో గానం చెసిన పద కవితా పితామహుడు. సుమారు 32 వేలకు పైగా సంకీర్తనలు తెలుగులో స్వయంగా రాసి గానం చెసిన ప్రప్రథమ సంకీర్తనాచార్యుదు అన్నమయ్య.
సాక్షాత్తు శ్రీమహావిష్ణువు ఖడ్గమైన నందకం అంశతో అన్నమయ్య జన్మించాడని శ్రీవైష్ణవసంప్రదాయంలో నమ్మకం ఉన్నది. తిరుమల ప్రధాన మందిరంలోని ఘంట అవతారమని కూడా అంటారు. త్యాగయ్య, క్షేత్రయ్య, రామదాసు వంటి సంకీర్తనాచార్యులకు అన్నమయ్య మార్గదర్శకుడు. “పదకవితా పితామహుడు“, “సంకీర్తనాచార్యుడు“, “పంచమాగమ సార్వభౌముడు“, “ద్రవిడాగమ సార్వభౌముడు” – ఇవి అన్నమయ్యకు సమకాలీనులు సాదరంగా ఇచ్చిన బిరుద నామాలు.
అన్నమయ్య సంకీర్తనా సేవ సంగీత, సాహిత్య, భక్తి పరిపుష్టం. అధికంగా తెలుగులోనే పాడినా అతను సంస్కృత పదాలను ఉచితమైన విధంగా వాడాడు. కొన్ని వందల కీర్తనలను సంస్కృతంలోనే రచించాడు. కొన్నియెడల తమిళ, కన్నడ పదాలు కూడా చోటు చేసుకొన్నాయి. అతని తెలుగు వ్యావహారిక భాష. మార్గ, దేశీ సంగీత విధానాలు రెండూ అతని రచనలలో ఉన్నాయి. అన్నమయ్యకు పూర్వం కృష్ణమాచార్యుల వచనాలవంటివి ఉన్నా, అవి “అంగాంగి విభాగం లేక, అఖండ గద్య ధారగా, గేయగంధులుగా” ఉన్నాయి. శివకవుల పదాలగురించి ప్రస్తావన ఉన్నాకూడా అవి లభించడంలేదు. మనకు లభించేవాటిలో అన్నమయ్యవే తొలిసంకీర్తనలు గనుక అతను “సంకీర్తనాచార్యుడు“, ‘పదకవితా పితామహుడు” అయ్యాడు.
అన్నమయ్య “యోగ వైరాగ్య శృంగార సరణి” మొత్తం 32,000 సంకీర్తనలు రచించాడని అతని మనుమడు చిన్నన్న పేర్కొన్నాడు. అతని పుత్రపౌత్రాదులు వీటిని రాగిరేకులమీద వ్రాయించారు. ఆ రేకులను తిరుమలలో సంకీర్తనా భండాగారంలో పొందుపరచారు. అయితే ప్రస్తుతం 12,000 మాత్రమే లభిస్తున్నవి. రేకులమీది అంకెల ప్రకారం కొన్ని రేకులు లభించడంలేదు.
సంకీర్తనా లక్షణమనే సంస్కృత గ్రంధం కూడా అన్నమయ్య వ్రాశాడట. మంజరీ ద్విపదలో “శృంగార మంజరి” అనే కావ్యాన్ని రచించాడు. అతడు రచించాడని చెప్పబడే 12 శతకాలలో “వేంకటేశ్వర శతకము” ఒక్కటి మాత్రమే లభిస్తున్నది. ఇతర ప్రబంధాలు, వేంకటాచల మహాత్మ్యము, సంకీర్తనలక్షణం, ద్విపద రామాయణం వంటి గ్రంధాలు లభించలేదు.
భగవంతుడ్ని ధ్యానించే విషయంలో, మానవాళిని ప్రేమించడం గురించి తెలియజేస్తూ మానవతా విలువలతో జీవితాన్ని ఎలా సంతోషంగా ఉంచుకొవచ్చో అన్నమయ్య తన కీర్తనల ద్వారా తెలియబరిచాడు. పండితుడికి, పామరుడికి సమంగా అర్దమయ్యె రీతిలో సంస్కృతం, తెలుగు, జానపదాలలో ఆద్యాత్మిక, శృంగార సంకీర్తనలు రాశారు.
మానవులందరూ ఒక్కటే అని చాటి చెప్పుతూ “బ్రహ్మమొక్కటే, పరబ్రహ్మమొక్కటే” అనిగానం చేశాడాయన.
“చక్రవర్తి అయినా – నిరుపేదైనా, నిద్రలో పొందే సుఖం ఒక్కటే అని, బ్రహ్మణుడైనా, దళితుడైనా మట్టిలో కలిసేది ఒక్కచొటేనని – అన్నమయ్య అంటాడు. అలాంటప్పుడు ఏందుకీ వివక్షత? ఏందుకీ తారతమ్యాలు? అని ఆయన ప్రశ్నిస్తాడు. నైతిక విలువలు పాటిస్తే, ఎటువంటి కష్టాలు రావని అన్నమయ్య సుమారు ఐదు శతబ్దాల క్రితమే తెలియజేసాడు.
“ఏమికలదిందు ఎంతకాలంబైన” అంటూ,
భగవంతుడు ఒక్కడే శాశ్వత నిజం అని ఆయన అంటాడు. అలాగే, ప్రతి ఒక్కరూ ఏదో ఒక పనిలో నిమగ్నమవ్వాలని ఒంటరిగా పనిలేనివాడు సాధించేది ఏమి ఉండదని సంభొదిస్తాడాయన. ప్రస్తుత పరిస్థితుల్లో అన్నమయ్య పదవికవితలు ఎంతో అవసరం. తన రచనలు, సంకీర్తనలను ఆనాటి రాజుల కోరిక మేరకు, వారిపై సంకీర్తనలు రాయడానికి అంగీకరించలేదు. తన సంకీర్తనలను తిరుమల ఏడుకొండల వెంకటేశ్వరస్వామికే అన్నమయ్య అంకితమిఛ్చాడు. నారసింహుడి మీద, రాముడి మీద కూడా కొన్ని కీర్తనలు రాశాడు.
అన్నమయ్య కీర్తనలలో తాత్విక సత్యాలు, సాంఘీక విమర్శలు, నీతి నియమాలు, లాలిపాటలు, ఉన్నాయి. ఇలా అనేక గీతాలను ఆయన రచించాడు. ప్రముక కవి పండితులు రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ మాటలలో అన్నమయ్య రచనలు “ఒక సారస్వత క్షీర సముద్రం. కావ్యముల ధర్మమైన బావార్జవంలో, శైలిలో, భావవైవిధ్యంలో, రాశిలో అన్నమాచార్యుని రచనను మించినది ఆంధ్ర వాఙ్మయంలో మరొక్కటి లేదు. నగుబాట్లైన ద్విపద, పద కవితలను ఉద్ధరించి ఉన్నత స్థానం కలిగించిన ప్రతిష్ఠ అన్నమాచార్యునిదే” అన్నారు.
అలమేలుమంగ, శ్రీనివాసుల కీర్తనలకు తన జీవితాన్ని అంకితం చేసిన పరమభక్తుడు అన్నమయ్య. అతని రచనలలో భక్తి, సంగీతము, సాహిత్యము, శృంగారము, వేదాంతము అత్యంత మనోహరంగా, వినసొంపుగా చెప్పబడ్డాయి. సరళమైన మాటలలో ఆధ్యాత్మ సత్యాలను, వేంకటపతి తత్వాన్ని, జీవాత్మ పరమాత్మల తాదాత్మ్యాన్ని వినిపించాడు. లోకనీతిని, ధర్మాన్ని, విష్ణుతత్వాన్ని కీర్తించాడు. దక్షిణాపధంలో భజన సంప్రదాయానికి అన్నమయ్యే ఆద్యుడు.
More Stories
యల్లాప్రగడ సుబ్బారావు (జన్మతిథి, జనవరి 12 )
ఆయుర్వేద వ్యాప్తికర్త, వైద్యరత్న పండిత దీవి గోపాలాచార్యులు
Balaji Peshwa: బాలాజీ పీష్వా శివాజీ స్వరాజ్య స్వప్నసాధకుడు