మన దేశ చరిత్రలో సా. శకం 1324 సెప్టెంబర్ 10వ రోజు హింసాత్మక మత ఛాందసవాదానికి, మతోన్మాదానికి మౌన ప్రేక్షకుడిగా నిలుస్తుంది. తూర్పు చాళుక్యులు నిర్మించిన పురాతన వేణుగోపాల స్వామి ఆలయాన్ని ఇస్లామిక్ ఆక్రమణదారులు ఎలా నాశనం చేశారో చెప్పడానికి రాజమహేంద్రవరం చరిత్ర ఒక సజీవ ఉదాహరణ. నేడు రాజమండ్రిలో ఉన్న రాయల్ మసీదు ప్రధాన ద్వారం చూస్తే, ధ్వంసం చేయబడిన పురాతన వేణుగోపాలస్వామి దేవాలయానికి సంబంధించిన స్పష్టమైన ఆనవాళ్ళు కనబడతాయి.
వేణుగోపాల స్వామి ఆలయం (ప్రస్తుత రాయల్ మసీదు లేదా పెద్ద మసీదు)
రాజమహేంద్రవరం రైల్వేస్టేషన్, బస్ స్టేషన్ నుంచి కేవలం 2 కిలోమీటర్ల దూరంలో రాజమహేంద్రవరం ప్రధాన రహదారిలో వేణుగోపాల్ స్వామి ఆలయం ఉంది. ధ్వంసం చేయబడి కట్టబడిన ఈ ‘రాయల్ మసీదు’ ఆంధ్రదేశంలో మొదటి మసీదు. దీనిని పెద్ద మసీదు అని కూడా పిలుస్తారు. ప్రధాన మసీదు/జుమ్మా మసీదు ఒకప్పుడు ఒక గొప్ప హిందూ ఆలయం. తూర్పు చాళుక్య రాజు, రాజరాజ నరేంద్రుడు క్రీ.శ 11 వ శతాబ్దంలో నిర్మించిన శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం. ప్రస్తుతం రాయల్ మసీదు ఉన్న స్వేతగిరి కొండపై ఉన్న స్తంభం లోపల వేణుగోపాల స్వామి ఆలయం నిర్మించబడింది. తూర్పు చాళుక్యుల విలక్షణ శైలిలో నిర్మింపబడిన ఈ దేవాలయ ద్వారం తూర్పు ముఖంగా ఉంది. ధ్వంసం కావించబడిన పిమ్మట దేవాలయ ద్వారాన్నే మసీదు ద్వారంగా మార్చినారు. ప్రధాన ద్వారంపై పర్షియన్ శాసనం ఉంది, ‘ఘియాసుద్దీన్ తుగ్లక్ ఆదేశం మేరకు మహమ్మద్ బిన్ తుగ్లక్ (ఉలుగ్ ఖాన్ అని కూడా పిలుస్తారు) క్రీ.శ 1323 లో కాకతీయ సామ్రాజ్యాన్ని జయించి రాజమండ్రిని ఆక్రమించాడు.” తుగ్లక్, వేణుగోపాల స్వామి ఆలయాన్ని కూల్చివేసి దాని స్థానంలో 32 చాళుక్య నిర్మాణ స్తంభాలతో ఒక మసీదును నిర్మించాడు. తూర్పు చాళుక్యులు నిర్మించిన ఒక పెద్ద పురాతన రాతి బావి ఉత్తరం వైపున ఉంది.
రాజమహేంద్రవరం చరిత్ర:
చాళుక్యుల ప్రసిద్ధ పాలకుడు రెండవ పులకేశి సా. శకం.624 లో విష్ణుకుండినుల నుండి వేంగిని, ఏలూరు సమీపంలో జరిగిన యుద్ధంలో జయించి తన సోదరుడు కుబ్జ విష్ణువర్ధనుడిని (సా. శకం. 624 – 641) పాలకుడిగా నియమించాడు. విష్ణువర్ధనుడు కొంత విరామం తరువాత తనను తాను స్వతంత్ర చక్రవర్తిగా ప్రకటించుకున్నాడు. శక్తివంతమైన సార్వభౌమాధికారుల సుదీర్ఘ వరుసలో ఈయన మొదటివాడు. తూర్పు చాళుక్యులుగా పిలువబడే అతని రాజవంశం ఒక శతాబ్దం పాటు పరిపాలించింది. కుబ్జ విష్ణువర్ధనుడు స్థాపించిన తూర్పు చాళుక్య వంశ పాలకులు మొదట పిఠాపురం నుండి, తరువాత వేంగి నుండి, అటు తరువాత రాజమహేంద్రవరం (రాజమండ్రి) నుండి పరిపాలించారు. ఈ విధంగా అనేక మంది పాలకులు ఈ రాజ్యాన్ని పాలించారు. వారి చరిత్ర అంతా చాలా సందర్భాలలో వారసత్వ వివాదాలతో కూడి ఉంది. చాళుక్యుల ఆక్రమణ వల్లనో, చోళ వంశ వారసులు విఫలం కావడం వల్లనో ఖచ్చితంగా తెలియదు కానీ, సా. శకం. 1070లో తూర్పు చాళుక్య రాజు, రాజేంద్ర చోళుడు సింహాసనాన్ని అధిరోహించి మొదటి కులోత్తుంగ చోళదేవుని పేరును స్వీకరించాడు. ఈ సంఘటన తరువాత చరిత్ర అతడినే చోళుడిగా పరిగణిస్తుంది. సా.శకం.1070 తరువాత ఉమ్మడి దేశాన్ని చోళరాజ్యం అని పిలిచేవారు. వేంగి చోళ రాజ కుటుంబం పాలనలో ఉన్న ప్రాంతానికి రాజధానిగా మారింది. అందువలన తూర్పు చాళుక్యుల కథ ఇక్కడితో ముగుస్తుంది.
కాకతీయులతో యుద్ధం:
మూడవ కులోత్తుంగ చోళుడు తన శాసనాలలో వేంగిని ఉత్తర సర్కారు ప్రాంతాల జాబితాలో జత చేశాడు. ఇది నేటి ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం, పశ్చిమ గోదావరి మరియు తూర్పు గోదావరి జిల్లాలతో కూడిన ప్రాంతం. మూడవ కులోత్తుంగ చోళుడు సా. శకం..1208లో వేంగిని లొంగదీసుకున్నట్లు చెప్పుకుంటూ ఉత్తర దిశగా మరోసారి యుద్ధం చేశాడు. అంతేకాక, మూడవ కులోత్తుంగ చోళుడు, ఆ సమయంలో శక్తివంతమైన గణపతిదేవ చక్రవర్తి పాలించిన కాకతీయ రాజ్య రాజధాని అయిన వరంగల్లో ప్రవేశించాడు అని పేర్కొన్నాడు. మూడవ కులోత్తుంగ చోళుడు వేంగికి ఉత్తరం వైపు ఆక్రమింప సాహసం చేశాడని, తిరుగు ప్రయాణంలో కాకతీయ దళాలతో ఘర్షణ జరిగిందని, ఇది చోళులకు ఎటువంటి ప్రాదేశిక నష్టానికి దారితీయలేదని చెప్పడానికి ఇది ఒక ప్రమాణం. కాకతీయ వంశానికి చెందిన గణపతిదేవుని విజయంతో చాళుక్య-చోళుల కాలం ముగిసింది. కాకతీయ వంశానికి చెందిన గణపతిదేవుడు రాజమహేంద్రవరాన్ని జయించి కాకతీయ రాజ్యంలో విలీనం చేశాడు.
కాకతీయ పాలన (సా. శకం.1218 – 1323)
రుద్రుడి తరువాత, అతని తమ్ముడు మహదేవుడు దేవగిరి యాదవులతో జరిగిన యుద్ధంలో మరణించాడు. అతని కుమారుడు గణపతి కాకతీయ సింహాసనాన్ని అధిష్టించాడు, అతను కృష్ణా జిల్లాలోని దివిని జయించాడు. పిమ్మట కళింగను లొంగదీసుకునేందుకు సైన్యాన్ని పంపి విజయాన్ని పొందాడు. తూర్పు గంగ పాలకుడు మూడవ అమియాంక భీముడు, అతని కుమారుడు మొదటి నరసింహుడు గణపతులతో నిరంతరం ఘర్షణ పడ్డారు. గణపతి గోదావరికి ఉత్తరం వైపు సైన్యాన్ని పంపాడు. అక్కడ గొప్ప యుద్ధం జరిగి శత్రువు హడావుడిగా వెనుదిరగవలసి వచ్చింది. మధురలోని పాండ్యులతో జరిగిన యుద్ధంలో గణపతి వారిని చిత్తుగా ఓడించి, వారి మిత్రుడైన కొప్పెరుంజింగను తన ఆధిపత్యాన్ని అంగీకరించమని బలవంతం చేశాడు. ఈ విజయం ఫలితంగా గణపతి పాలన ముగిసే వరకు గోదావరి లోయలో కాకతీయుల శక్తికి ఎలాంటి ఆటంకం లేకుండా పోయింది.
ఇస్లామీయ దండయాత్రలు
సుభిక్ష కాకతీయ రాజ్యం ఢిల్లీ సుల్తానేట్ పాలకుడు అల్లావుద్దీన్ ఖిల్జీ దృష్టిని ఆకర్షించింది. సా. శకం.1303లో కాకతీయ రాజ్యంలో మొదటి సారి ఖిల్జీ సైన్య ప్రవేశం జరిగింది. ఉప్పరపల్లి వద్ద జరిగిన యుద్ధంలో కాకతీయ సైన్యం ప్రతిఘటన కారణంగా విపత్తు తప్పింది. సా. శకం. 1309 లో అల్లావుద్దీన్ తన సేనాని మాలిక్ కాఫూర్ ను పంపి కాకతీయ చక్రవర్తి ప్రతాపరుద్రుడిని ఢిల్లీ సుల్తానేట్ కు లోబడి ఉన్న పదవిని అంగీకరించమని బలవంతం చేసే ప్రయత్నం చేశాడు. కాఫూర్ ఓరుగల్లు ముట్టడిని నెల రోజుల పాటు నిర్వహించాడు. ఇది సా. శకం. ఫిబ్రవరి 1310 లో విజయవంతంగా ముగిసింది. ప్రతాపరుద్రుడు ఖిల్జీకి తాబేదారుగా ఉండడానికి అంగీకరించాల్సి వచ్చింది. బహుశా ఈ సమయంలోనే కోహినూర్ వజ్రం కాకతీయుల యాజమాన్యం నుంచి అల్లావుద్దీన్ చేతికి వెళ్లింది. 20,000 గుర్రాలు, 100 ఏనుగులను ఖిల్జీకి సమర్పించుకోవాల్సి వచ్చింది. కానీ, ఈ అవమానం నుండి బయటపడతానికి ప్రతాపరుద్రునికి ఆట్టే కాలం పట్టలేదు. . ఖిల్జీ రాజవంశంపై తిరిగుబాటు చేసి, గియాసుద్దీన్ తుగ్లక్ ఢిల్లీ సుల్తాన్ గా ప్రకటించుకున్నాడు. ఈ తిరుగుబాటును సద్వినియోగం చేసుకున్న ప్రతాపరుద్రుడు సా. శకం.1320లో మళ్లీ తన స్వాతంత్ర్యాన్ని చాటుకున్నాడు. సా. శకం.1321 లో తనను ధిక్కరించిన కాకతీయ రాజును ఓడించడానికి, తుగ్లక్ తన కుమారుడు ఉలుగ్ ఖాన్ ను పంపాడు. సైన్యంలో ఖిల్జీ, తుగ్లక్ శిబిరాలకు చెందిన వర్గాల సైనికులు ఉండటం వల్ల ఉలుగ్ ఖాన్ సైన్యం అంతర్గత విభేదాలతో రగిలిపోయింది. దాడి చేసిన ఉలుగ్ ఖాన్ బలగాలను కాకతీయ సైన్యం మొదట్లో తిప్పికొట్టినది. ఖాన్ దళాలు దేవగిరిలో తిరిగి సమీకృతం కాసాగాయి. కానీ, విజయం లభించిందన్న ఆనందంతో ప్రతాపరుద్రుడు తన ధాన్యం దుకాణాలను బహిరంగ విందు కోసం ప్రజలకు తెరవడం ద్వారా విజయోత్సవాలు జరుపుకున్నాడు. సా. శకం. 1323 లో, ఉలుగ్ ఖాన్ మరింత బలమైన సైన్యంతో తిరిగి వచ్చాడు. కాకతీయుల వద్ద కొద్దిపాటి సామాగ్రి మాత్రమే మిగిలి ఉండటంతో, ఐదు నెలల ముట్టడి తరువాత ప్రతాపరుద్రుడు లొంగిపోవలసి వచ్చింది. మహమ్మద్ బిన్ తుగ్లక్ (ఉలుగ్ ఖాన్) సా. శకం.1323 లో కాకతీయ సామ్రాజ్యాన్ని జయించి రాజమండ్రి కోటను ఆక్రమించాడు. హుమాయూన్ గుజ్జర్ ఈ ప్రాంతానికి గవర్నరుగా నియమించబడ్డాడు. ఈ కాలంలో తీరప్రాంత జిల్లాలన్నీ ముస్లిం రాజ్యం పాలనలోకి వచ్చాయి. రాజమండ్రి మసీదులోని ఒక శాసనంపై ‘ఘియాసుద్దీన్ తుగ్లక్’ అనే పేరు నేటికీ కనిపిస్తుంది.
అలెగ్జాండర్ రియోస్ అనే పరిశోధకుని కథనం ప్రకారం, ఈ మసీదు, నాటి చాళుక్యుల ఆస్థాన వేణుగోపాల స్వామి ఆలయంపై నిర్మించబడింది. ముందు వసారా స్తంభాలు మరియు లోపలి గోడ కట్టడాలు హిందూ దేవాలయాన్ని పోలి ఉంటాయి. మసీదుగా మార్చబడిన తరువాత కూడా, తన లక్షణాలను నిలుపుకున్న ఒక హిందూ దేవాలయానికి ఇది మంచి ఉదాహరణ అని ఆయన పేర్కొన్నారు (శ్రీ మల్లంపల్లి సోమశేఖర శర్మ రచించిన ‘ఆంధ్ర చరిత్ర యొక్క మరచిపోయిన అధ్యాయం’ చూడండి).
హిందూ ప్రతిఘటన:
సా. శకం.1448 నాటికి రాజమండ్రి ప్రాంతం మొత్తం గజపతి రాజ్యానికి చెందిన కపిలేశ్వరుని పాలనలోకి వచ్చింది. కపిలేశ్వరుడు రాజమండ్రికి చెందిన రెడ్డి రాజులతో నిరంతరం యుద్ధం చేశాడు. అయితే విజయనగర రాజు రెండవ దేవరాయలు రెడ్డి రాజులకు సహాయం చేసాడు. దేవరాయల మరణానంతరం కపిలేశ్వరుడు రాజమండ్రిని జయించగా, రెడ్డి వంశం కనుమరుగైంది. ఈ ప్రాంతం సా. శకం.1448 నుండి 1533 వరకు దాదాపు ఒక శతాబ్దం పాటు గజపతుల పాలనలో ఉంది.
విజయనగర సామ్రాజ్యం (సా. శకం. 1512-1533)
సా. శకం.1470 లో కపిలేశ్వర గజపతి మరణించిన తరువాత, అతని కుమారులు హంవీరుడు మరియు పురుషోత్తముడి మధ్య వారసత్వ యుద్ధం జరిగింది,. హంవీరుడు బహమనీల సహాయంతో సింహాసనాన్ని ఆక్రమించడంలో విజయం సాధించాడు. పురుషోత్తముడు అటు తరువాత అతన్ని జయించాడు. మూడవ ముహమ్మద్ షా రాజమండ్రి యుద్ధం, శాంతి ఒప్పందంతో ముగిసింది. మూడవ ముహమ్మద్ షా మరణానంతరం పురుషోత్తమ గజపతి గోదావరి-కృష్ణా నదీతీరం మొత్తాన్ని ఆక్రమించి దక్షిణాన కొండవీడు వరకు బహమనీ సేనలను తరిమికొట్టాడు. శ్రీకృష్ణదేవరాయలు సా. శకం.1509లో ఉదయగిరి, కొండపల్లి, తెలంగాణ, చివరకు రాజమండ్రి, సింహాచలంలను జయించాడు. కృష్ణదేవరాయలు తాను జయించిన కృష్ణానదికి ఉత్తరాన ఉన్న భూభాగానికి బదులుగా, తన కుమార్తెను కృష్ణదేవరాయలకు ఇచ్చి వివాహం చేసిన ప్రతాపరుద్ర గజపతితో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ ఒప్పందం ప్రకారం కృష్ణానదికి ఉత్తరాన ఉన్న ఆంధ్ర ప్రాంతమంతా గజపతులు పరిపాలించారు, అందువలన రాజమండ్రి మళ్ళీ గజపతుల పాలనలోకి వచ్చింది.
తరువాత కులీ కుతుబ్ షా గజపతులపై దండెత్తి రాజమండ్రి, ఏలూరు ప్రాంతాలను ఆక్రమించాడు. ఇతని కాలంలో కుతుబ్షాహీ రాజ్యం కృష్ణా, గోదావరి డెల్టాలకు విస్తరించింది. ఇబ్రహీం కులీ కుతుబ్ షా విజయనగర రాజ్యాన్ని జయించగా, మహమ్మద్ కుతుబ్ షా రాజమండ్రిలో చెలరేగిన తిరుగుబాటులన్నింటినీ నాశనం చేశాడు. బొబ్బిలితో జరిగిన అంతర్యుద్ధాలలో విజయనగరం కొత్త రాజు ఆనందరాజు ఆంగ్లేయులను ఉత్తర సర్కార్లకు ఆహ్వానించాడు. ఫ్రెంచ్ మరియు ఆంగ్లేయుల మధ్య జరిగిన ఘర్షణ, ఉత్తర సర్కార్లలో ఫ్రెంచ్ అన్ని ఆస్తులను కోల్పోవడంతో ముగిసింది. తరువాత సలాబత్ జంగ్ ను అతని సోదరుడు నిజాం అలీఖాన్ పదవీచ్యుతుడిని చేసి రాజమండ్రి, చికాకోల్ (శ్రీకాకుళం) ప్రాంతాలను హసన్ అలీఖాన్ కు లీజుకు ఇచ్చాడు. లార్డ్ క్లైవ్, ఉత్తర సర్కార్ల అప్పగింత కోసం చర్చలు జరిపి, సా. శకం.1765 ఆగస్టులో ఆ మేరకు ఫర్మాన్ ను పొందాడు. సైనిక చర్యలు చేపట్టడానికి జనరల్ సిల్లాడ్ ను మచిలీపట్నానికి పంపారు. నైజాంతో యుద్ధం ముగియడంతో ఒక ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం ఆంగ్లేయులు ఉత్తర సర్కార్లను తమ ఆధీనంలో ఉంచుకోవడానికి కప్పం చెల్లించడానికి అంగీకరించారు. అదే సమయంలో నిజాంకు కొంత సైన్యాన్ని సమకూర్చడానికి కూడా అంగీకరించారు. ఈ ఒప్పందాన్ని సా. శకం.1768 లో మరొక ఒప్పందం ద్వారా ధృవీకరించారు. సా. శకం.1769లో హసన్ అలీఖాన్ లీజు గడువు ముగియడంతో రాజమండ్రి, ఏలూరులు మచిలీపట్నంలో కొత్తగా ఏర్పడిన చీఫ్, కౌన్సిల్ ఆధీనంలోకి వచ్చాయి. జిల్లా ఆంగ్లేయులకు బదిలీ కావడానికి ముందు కాలంలో జమీందార్లు ప్రాముఖ్యత పొందారు. రంప, పెద్దాపురం, పిఠాపురం, కోట, రామచంద్రాపురం జమీందార్లు ఈ ప్రాంతంలో ముఖ్యమైన జమీందార్లు. సా. శకం.1769లో గోదావరి ప్రాంతాన్ని మచిలీపట్నంలో చీఫ్ అండ్ కౌన్సిల్ బ్రిటిష్ పాలనలో ఉంచారు. సా. శకం.1794లో కోవెలకుంట్ల, రాజమహేంద్రవరం, మొగల్తూరులో కలెక్టరేట్లు ఏర్పడ్డాయి. సా. శకం.1823లో కోవెలకుంట్ల (ఇప్పటి కాకినాడ), రాజమండ్రి ప్రధాన కేంద్రంగా రాజమండ్రి జిల్లాను ఏర్పాటు చేశారు.
More Stories
కవి సామ్రాట్ శ్రీ విశ్వనాథ సత్యనారాయణ