శ్రీ విద్యారణ్య స్వామి వారి జయంతి:
దక్షిణాపథ స్టడీ సర్కిల్ వారు సికిందరాబాద్ లోని కాప్రాలో గల తమ కార్యాలయములో ఈ నెల 26 వ తేదీన శ్రీ విద్యారణ్యులవారి జయంతోత్సవమును నిర్వహించినారు.

కార్యక్రమంలో ముందుగా, దక్షిణాపథస్టడీ సర్కిల్ తెలంగాణ ప్రాంత సంయోజకులు శ్రీ కళ్యాణ్ చక్రవర్తి గారు తమ సంస్థ ఆశయాలూ, చేపట్టిన వివిధ కార్యక్రమాల గురించి సభికులకు వివరించారు. నగరంలో వివిధ ప్రాంతాలలో దక్షిణాపథ కార్యాలయాలను ఏర్పాటు చేస్తున్నామనీ, తమ వద్ద భారతదేశ చరిత్ర, ఇతర విషయాలపై అనేక గ్రంథాలూ, సమాచారమూ లభ్యమౌతున్నదనీ, దీనిని పరిశోధకులూ, ఔత్సాహికులూ వినియోగించుకుని మనదేశ వైభవాన్ని సరియగు దృక్కోణంలో చూపేందుకు రచనలు, వ్యాసాలూ అందించే ప్రయత్నము చేయవచ్చని తెలిపారు.


పిమ్మట కార్యక్రమానికి ముఖ్య వక్తగా విచ్చేసిన జాతీయపరిషత్తు సభ్యులూ, ధర్మప్రచారకులూ అయిన శ్రీ కుదుములకుంట రవీంద్రనాథ్ గారు, సంవిత్ ప్రకాశన్ డైరెక్టర్ శ్రీమతి శైలజ గారూ జ్యోతి ప్రజ్వలన కావించడంతో సభ ప్రారంభమైనది.
శ్రీమతి శైలజ గారు తమ అధ్యక్షోపన్యాసంలో దక్షిణాపథ సంస్థ ఆధ్వర్యంలో జరుగుతున్న చారిత్రక పరిశోధనలూ, దీనికై వివిధ విశ్వవిద్యాలయాలతో అనుసంధానమైన తీరూ వివరించారు. దక్షిణాపథ సంస్థ మన సంస్కృతికి చెందిన అనేకమంది మహనీయుల జయంతోత్సవాలను, చారిత్రక దినోత్సవాలనూ నిర్వహిస్తున్నదని తెలిపారు. ఇందులో భాగంగానే శ్రీ విద్యారణ్యులవారి జయంతోత్సవాన్ని జరుపుకుంటున్నామనీ తెలిపారు. విదేశీ ముష్కరుల దండయాత్రలతో కొడిగడుతున్న హైందవ సంస్క్రతి ప్రాభవాన్ని శ్రీ విద్యారణ్యులు తమ తపొశక్తితో, అకుంఠిత దీక్షతో తిరిగి పునర్వైభవస్థితికి చేర్చారనీ, వారు ప్రాతః స్మరణీయులనీ శ్రీమతి శైలజ గారు కొనియాడారు.
అనంతరం ముఖ్యవక్తగా విచ్చేసిన శ్రీ రవీంద్రనాథ్ గారు పదకొండవ శతాబ్దంలో భారతదేశ ఉత్తర భాగంపైన దాడులు, దండయాత్రలూ సలిపిన ముస్లిం దూరాక్రమణదారులు క్రమంగా 14 వ శతాబ్దం వచ్చేసరికి దేశ దక్షిణ ప్రాంతంవైపు తమ దుష్టచూపులను మరల్చారనీ, అంతవరకూ ఎంతో సుభిక్షంగా, సాంస్కృతికంగా పటిష్టంగా ఉన్న ప్రాంతం ఒక్కసారిగా అతలాకుతలమై పోయిందనీ తెలిపారు. ఉద్వేగభరితంగా సాగిన వారి ప్రసంగంలో అనేక గేయాల రూపంలో ముస్లిం పాలకుల దూరాగతాలూ, సాగించిన దామనకాండలూ సవివరంగా తెలుపుతూ, దక్షిణదేశంలో రాజులు, పాలకులే మతమార్పిడికి గురైనారానీ, దీనినిబట్టి నాటి దుర్భర పరిస్థితిని అర్థంచేసుకోవచ్చనీ పేర్కొన్నారు.
హైందవ సంస్కృతిపై అటువంటి దామనకాండ జరుగుతున్న సమయంలో నేటి వరంగల్ ప్రాంతంలో ఒక సామాన్య సంప్రదాయ కుటుంబంలో జన్మించిన మాధవాచార్యుడనే కుర్రవాడు దైవానుగ్రహంతో శృంగేరీ పీఠాధిపతుల చెంత చేరడం, వారు ఆ కుర్రవాడికి దీక్షాధారణ చేయించడం, ఆ పిమ్మట పరివ్రాజకుడై, ఆ యువకుడు కాశీ చేరడం, అక్కడ స్వయంగా శ్రీ వేదవ్యాసులవారే అతనికి సన్యాస దీక్ష ఇప్పించి విద్యారణ్యుడిగా కరుణించడం వెనుక బలీయమైన దైవ నిర్ణయం ఉందని తెలిపారు. విద్యారణ్యులు అపార జ్ఞాన సముపార్జన చేసి అనేక గ్రంధాలూ, భాష్యాలూ రాసినారని, కాలక్రమంలో శృంగేరీ పీఠాన్ని అధిరోహించడం జరిగిందనీ చెప్పారు. శృంగేరీ పీఠాధిపతులుగా వారు, నాడు జరుగుతున్న ముస్లిం దండయాత్రలూ, దూరాగతాలకు కలత చెంది, హిందూ ధర్మ పునః ప్రతిష్టకై కంకణ బద్ధులైనారు. అదే సమయంలో మహమ్మద్ బిన్ తుగ్లక్ వద్ద ఇస్లాం లోకి మతాంతరీకరణ చేయబడిన ఇరువురు వీరులు, హరిహర రాయలు బుక్కరాయలు అను వారిని చేరదీసి, వారిని తిరిగి హిందూ మతంలోకి తీసుకువచ్చి, హంపీ నగర కేంద్రంగా విజయనగర రాజ్యాన్ని నిర్మింపచేశారు. కాలక్రమంలో ఈ విజయనగర రాజ్యమే ఒక మాహాసామ్రాజ్యమై, హిందూ మత పునర్వైభవాన్ని నాలుదిక్కులా చాటిచెప్పిందని శ్రీ రవీంద్రనాథ్ గారు తెలిపారు. ఈ విధంగా దక్షిణ భారతదేశంలో మహ్మదీయుల దండయాత్రలను నిలువరించి, హిందూ మహాసామ్రాజ్య స్థాపనలో శ్రీ విద్యారణ్యులు తమ తపోశక్తినంతా ధారపోసారని తెలిపారు. శ్రీ విద్యారణయులవారు రచించిన అనేక గ్రంధాలూ, సృష్టించిన వాఙ్మయ సంపదనూ వీవరించిన శ్రీ రవీంద్రనాథ్ గారు, వాటిలోని కొన్ని శ్లోకాలను ధారాళంగా చదవడం సభికులను మంత్రముగ్ధులను చేసింది.
ఆద్యంతం ఎంతో ఉద్వేగభరితంగా సాగిన శ్రీ విధ్యారణ్యుల వారి జయంతోత్సవ సభ లో జాతీయ సాహిత్య పరిషత్తు కార్యదర్శి శ్రీ మావుడూరు సూర్యనారాయణ గారు, కుంటి సురేందర్ గారు వంటి పెద్దలు పాల్గొన్నారు కళ్యాణ్ చక్రవర్తిగారి వందన సమర్పణతో కార్యక్రమం ముగిసింది.
అనంతరం సభికులకు ప్రసాద వితరణ చేయడమైనది.
A great scholar of Bharat from south,. sri vidyaranya swami was The first saint to protect our Hindu Dharma and stopped conversions. Every Indian specially hindu must be grateful to this great patriotic sage.very inspiring personality every one should know about him.